గమనిక : 2018 జూన్ 26 రాత్రి నుంచి అక్టోబర్ 25 వరకు 121 రోజులు కుజగ్రహం వక్రంతో సంచారం చేయనున్నది. కనుక కుజ దోషం అనేది లేకున్ననూ, ఉన్నదని భయపడేవారు, ఋణ శత్రు శరీర పీడల నుంచి ఉపశమనానికి ప్రత్యేక అరుదైన విశేష రోజులలో కుజ గ్రహ దోష నివారణకు అద్భుత పరిహారములను ప్రణతి టెలివిజన్ యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి.- శ్రీనివాస గార్గేయ

Monday, June 22, 2009

ముక్కంటీశ్వరుడు ముందే జాగ్రత్త పడుతున్నాడా?


శివుడంతటివాడే పోయి చెట్టు తొర్రలో కూర్చున్నాడట....... మనం తరచుగా వింటూ వుంటాము ఈ వాక్యాన్ని. తిరుమల మూడునామాల వెంకన్న స్వామిది శ్రవణా నక్షత్రం...మకర రాశి. పాపం.... ఆ స్వామి అష్టమశని వేదనతో 2007 జూలై నుంచి బాధపడుతున్నాడు.అందుకే ఏదో ఒక కారణంతో నిత్యం తిరుమలేశుడు మీడియాలోకి ఎక్కుతున్నాడు. ఒకసారి గొలుసు తెగిందని.....వస్త్రం అంటుకున్నదని, జ్యోతులు కొండెక్కాయని, ఊరేగింపులో వాహనానికి తల లేదని, ఎన్నో....ఎన్నెన్నో అపచారాలతోను.....అర్చకుల కుమ్ములాటతోను....వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల అష్టకష్టాలతోనూ.... అబ్బబ్బ... స్వామిని అష్టమశని ఇబ్బంది పెడుతున్నాడు. మరి ఈ స్వామి 2009 సెప్టెంబర్ 9 వ తేదీతో అష్టమశని బారి నుంచి విముక్తి కానున్నాడు. అంతవరకు వెంకన్న స్వామికి తిప్పలు తప్పవు.

కనీసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ఈ సంగతిని అర్ధం చేసుకోనరు. అక్కడ యాగాలు.... ఇక్కడ యాగాలు అంటుంటారు తప్ప. స్వామివారికి శని వేదన నుంచి రక్షించే యాగానికి సన్నద్ధం కారు. నా లాంటివాడు నా పంచాంగం "కాలచక్రం", "గ్రహభుమి" లో ముందుగా చెప్పినా, ఆలకించిన వారూ లేరు...

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..... ఆ ప్రక్కనే వున్న శ్రీకాళహస్తి ముక్కంటిస్వామీ మీడియా గోలలో ఎక్కడ ఇరుక్కుంటానని అనుకున్నాడేమో! ఎందుకో తెలుసా? వెంకన్న స్వామీ తరువాత తన వంతు అవుతుంది....... ఎందుకని ?........ తనది ఆర్ద్ర నక్షత్రం... మిధున రాశి... 9 సెప్టెంబర్ 2009 నుంచి తనకు అర్ధాష్టమ శని పట్టుకుంటాడు. ఇక నిత్యం మీడియాలో నానాలి. పైగా ఆంధ్రరాష్టంలో పాతికపైగా ఛానళ్ళు వున్నాయి. కెమెరాలు, గొట్టాలు పట్టుకొని గుడికి వస్తారు....నిమిషాల మీద లైవ్ ప్రోగ్రాములు ఏర్పాటు చేస్తారు.....అమ్మో..... ఇంత దారుణం నుంచి గాలిస్వామి బయట పడాలనుకున్నాడెమో!...... ఇక తనకు తిప్పలు తప్పవు...... ఈ తిప్పలు తప్పుకోవాలంటే ..... ఓ రక్షక కవచం తనకు కావాలనుకున్నాడు.

అసలే వాయులింగేశ్వరుడు...... ఇంకేముంది!.. గాలిలో ఎస్.ఎం.ఎస్ పంపాడు. ఎవరికీ? కర్ణాటకలోని గాలి కరుణాకర రెడ్డి కి ....కరుణాకర! నీ సోదరుడు మూడు నామాల స్వామికి కిరీటం చేయించాడు. మరి ఈ మూడు నేత్రాల స్వామికి తక్షణం నవగ్రహ కవచం చేయించు. జ్యోతిష్య పండితులు అర్ధాష్టమ శని వస్తుందని అంటున్నారు.....తక్షణమే సిద్ధం చేయ్ అని హుకుం జారి అయింది కరుణాకర్ కి .

పంచభూత లింగాల్లో వాయులింగేశ్వరుడుగా ప్రశిద్ధినొందిన శ్రీకాళహస్తీశ్వరుడు ఇకపై నవరత్నాలు, వజ్రాలు పొదిగిన బంగారు నవగ్రహ కవచంతో భక్తులకు దర్శన భాగ్యం ఇవ్వనున్నాడు. స్వర్ణ శోభితమైన నవరత్న మయమైన నవగ్రహ అలంకార కవచాన్ని 60 లక్షల రూపాయలతో వాయు లింగ ( గాలి ) స్వామికి బహుకరించారు కర్నాటక రాష్ట్ర రెవిన్యు మంత్రివర్యులు గాలి కరుణాకర రెడ్డి మరియు కుటుంబ సభ్యులు.

ఈ నవగ్రహ కవచంలో 27 నక్షత్రాలు, నవగ్రహాలు మలిచారు. ఒక్కో నక్షత్రానికి 27 వజ్రాల ప్రకారం 729 వజ్రాలను పొదిగారు. జ్యేష్టమాస సోమ అమావాస్య ముందు రోజు ఆదివారం 21 జూన్ 2009 న శ్రీకాళహస్తి లోని స్థానిక త్రినేత్ర అతిధి గృహం నుంచి వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో నవగ్రహ కవచాన్ని ఊరేగింపు చేసి ఆలయంలోకి తీసుకొని వచ్చారు గాలి కుటుంబ సభ్యులు.

ఈ గాలి స్వామికి గాలి సోదరుల వితరణ చేసిన నవగ్రహ కవచంతో.....
తాను అర్ధాష్టమ శని బారి నుంచి తట్టుకొని......
తన చెంతకు వచ్చే భక్తులను చల్లగా అనుగ్రహిస్తాడని ఆశిద్దాం................శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.