Sunday, June 13, 2010

భూకంప తేదిని సంవత్సరం ముందుగానే తెలియచేశాం

సముద్రంలో ఏర్పడే అల్పపీడనాలు, వాయుగుండాలు తద్వారా తుఫానుల వివరాలను వాతావరణశాఖ వారు ఒక వారం రోజుల ముందుగా తెలియచేస్తుంటారు. కాని భూకంపములను మాత్రం ఒక సెకను ముందుగా కూడా తెలియచేయలేదు. ఇటువంటి ప్రకృతి వైపరీత్యములను జ్యోతిష్యరీత్యా తెలుసుకోవచ్చు.

ఈ విషయంలో మా కాలచక్ర పంచాంగం మరియు గ్రహభుమి పంచాంగాలలో ప్రకృతి వైపరీత్యములను ప్రకటించటం జరిగింది. హైదరాబాద్ లో పలు టీవీ చానల్స్ లో హేతువాదులతో భూకంప సమయాలను తెలపటం జరిగింది. వికృతి నామ సంవత్సర కాలచక్ర పంచాంగంలో 41 పేజిలో 2 పేరాలో ఈ రోజు సంభవించిన వివరాలను ఇచ్చాము. అలాగే గ్రహభూమి బ్లాగ్ లో కూడా 2010 మార్చ్ నెల 19 నాటి శ్రీ వికృతి నామ సంవత్సర లఘు ఫలితాలు - 2లో 8వ పేరాలో ముందుగానే తెలియచేయటం జరిగింది. ఇప్పటికైనా హేతువాదులు సిగ్గుతో తలవంచుకొనవలసిన అవసరం వుందని తెలియచేస్తున్నాను. - శ్రీనివాస గార్గేయ

Friday, June 11, 2010

2013 లో భయంకర సౌర తుఫాను రానుందా ?

ఇప్పటివరకు 2012 డిసెంబర్ .21 వ తేది ప్రపంచం అంతా వినాశానమవుతుందని, యుగాన్తమవుతుందని కల్ల బొల్లి కబుర్లు ఇంటర్నెట్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరినీ భయబ్రాంతులను చేసాయి. ఇప్పుడు 2013 లో భారీ సౌర తుఫానుతో భూమి స్తంభించి కొత్త ఉపద్రవం ముందుకు రాబోతుందని నాసా వారి తాజా నివేదిక వెల్లడించింది. సూర్యుడిలో భారి ఎత్తున ఎగిసిపడే ఈ సౌర తుఫాను, వినాశకరమైన రేడియో ధార్మికతను, విద్యుత్తుతో నిండిన శకలాలను భారీ మొత్తంలో అంతరిక్షంలోకి వెదజల్లుతుందని, ఇవి అయస్కాంత క్షేత్రాలతో అనుసంధానమై పని చేసే ఉపగ్రహాలకు అంతరిక్ష కేంద్రాలకు అడ్డంకులు సృష్టించనున్నవని నాసా తెలిపింది. గతంలో 1859 లో భూమి మీద కల్లోలమే సృష్టించింది. ఈ ఊహే ప్రస్తుతం శాస్త్రవేత్తలను కలవరపరుస్తోంది.

శాస్త్రవేత్తలు చెప్పినట్లు అలా జరిగితే ప్రపంచ వ్యాప్తంగా సెల్ ఫోన్లు, ఇంటర్నెట్, జీపీఎస్ వ్యవస్థ వంటి అధునాతన సమాచార వ్యవస్థ అంతా చిన్నాభిన్నం కానుంది. ఉపగ్రహాల సమాచార వ్యవస్థతో ముడిపడే సకలమైన అధునాతన సౌకర్యాలన్నీ మట్టికొట్టుకుపోతాయని, దీనితో బ్యాంకు సేవలు, విమాన ప్రయాణాలు, అత్యవసర రేడియో సమాచార వ్యవస్థ సకలం దెబ్బతింటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒక్కసారిగా ఇలాంటి సమాచార వ్యవస్థ అంతా ఉలుకు పలుకు లేకుండా పోతే ఎలా ? .. 2013 లో భారీ సౌర జ్వాల మూలంగా భూమయస్కాంత తుఫాను అల్లకల్లోలం చేయబోతోందా ? అగ్ని పర్వతాల పగుళ్లతో వినాశకరమా ? భూతాపంతో ప్రపంచ విద్వంసమా ? ఇవన్ని మన ముందు వున్న ప్రశ్నలు.

ఇక జ్యోతిశ్శాస్త్రరీత్యా పరిశీలిస్తే రాబోయే 2013 లో శ్రీ విజయ నామ సంవత్సర చైత్ర మాసం 11 ఏప్రిల్ 2013 న ఉగాది తో ప్రారంభం కానుంది. ఈ చైత్రమాసంలో పూర్ణిమకు పాక్షిక సూర్య గ్రహణము, అమావాస్యకు కంకణ సూర్యగ్రహణము సంభవించనుంది. ఇందులో మొదటగా ఏప్రిల్ 25 పూర్ణిమ రోజున రాత్రి భారత కాలమానం ప్రకారం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలకు చంద్ర గ్రహణం ప్రారంభమై, కేవలం ఇరవై ఏడు నిమిషాలతో ఒంటి గంట యాబై ఒక్క నిమిషాలకు పాక్షిక గ్రహణంగా ముగియనుంది. తిరిగి మే 10 చైత్ర అమావాశ్య శుక్రవారం నాడు ఆరు నిమిషాల మూడు సెకన్లపాటు స్థిరంగా వుండే కంకణ సూర్యగ్రహణం ఏర్పడనుంది.

ఈ రెండు గ్రహణాల మధ్యలో 29 ఏప్రిల్ 2013 విజయ నామ సంవత్సర చైత్ర బహుళ చవితి సోమవారం నాడు కేతు గ్రహ నక్షత్రమైన మూల నుంచి విజయ నామ సంవత్సర బహుళ దశమి శనివారం రాహు గ్రహ నక్షత్రమైన శతభిషం వరకు ఆరు రోజులపాటు మేష రాశిలో సూర్యుడు ఉచ్చ స్థానంలో ఉంటూ.. అదే రాశిలో మరో నాలుగు గ్రహాలతో పంచ గ్రహ కూటమి ఏర్పడటం, ఈ గ్రహ కూటమికి ఖచ్చిత ఎదురు స్థానంలో ఉచ్చ స్థితితో తులారాశిలో శని గ్రహం రాహువుతో కలసి ఉండుట ఓ ప్రపంచారిష్టం.

రాహుగ్రస్త చంద్ర గ్రహణము ఉచ్చ శనితో వుండి..... కేతు గ్రస్త కంకణ గ్రహణం ఉచ్చ సూర్యునికి సంభవించటం... కేతు నక్షత్రమైన మూల నుంచి రాహు నక్షత్రమైన శతభిషం వరకు పంచ గ్రహ కూటమి రెండు గ్రహణాల మధ్య ఏర్పడటం, ఉచ్చ శని దృష్టి , ఉచ్చ స్థానంలో వున్న సూర్యునిపై స్వక్షేత్ర గ్రహమైన కుజునిపై ఉండటము .... పరస్పర తీక్షణ వీక్షనలతో గ్రహ స్థితులు ఉండటము ఒక అరిష్టాన్ని తెలియజేస్తున్నాయి.

Wednesday, June 9, 2010

వరుసగా కూలుతున్న ధ్వజ స్తంభాలు అరిష్టానికి సంకేతాలా ?

మే ఇరవై ఆరవ తేదీన శ్రీ కాళహస్తి గాలి గోపురం కూలిపోవటం తదుపరి ఆంద్ర రాష్ట్రానికి అరిష్టాలుగా ధ్వజ స్తంభాలు శివాలయాలలో నేలకొరిగిపోతున్నాయి. లయకారకుడైన ముక్కంటికి కోపం వచ్చిందా ? ఆంద్ర రాష్ట్రానికి రాబోయే రోజులలో సమస్యలు ఎదురుకానున్నాయా? కేవలం శివాలయాలలోనే ధ్వజాలు ఎందుకు పడిపోతున్నాయి ? గుంటూరు జిల్లా ఎడ్లపాడు గ్రామంలో శివాలయంలోని నంది స్పష్టంగా కంట తడిపెట్టడం రెండు రోజుల క్రితం మీడియాలో విసువల్స్ చూసిన వారికి బాగా తెలిసి వుంటుంది.

జూన్ మూడవ తేది వరంగల్ జ్కిల్లాలో ఓ ధ్వజ స్థంభం ఒరిగిపోవటం, ఆపై రెండు రోజుల్లకు విశాఖ జిల్లాలో మరో ధ్వజం పడిపోవటం, ఈరోజు ఏకంగా మూడు ధ్వజాలు నేలకొరగటం జరిగింది. ఆశ్చర్యమేమిటంటే ప్రకాశం జిల్లాలో ఈరోజే ప్రతిష్ట చేస్తున్న ఓ రాతి ధ్వజ స్థంభం అనుకోకుండానే రెండు ముక్కలు కావటం ప్రజల మనసులను కలవర పెడుతున్నాయి. మే ఇరవై ఆరు నుంచి పదిహేను రోజుల వ్యవధిలో ఇలా ధ్వజాలు పడిపోవటం ఆంద్ర రాష్ట్రానికి మహా అరిష్టమనేది మరో రకంగా చెప్పనవసరం లేదు.

మే తొమ్మిది 2010 పూర్వాభాద్ర అనే గురు నక్షత్రంతో మొదలై మే ఇరవై ఆరు విశాఖ అనే గురు నక్షత్రం వరకు మీనం అనే జల రాశి నుంచి కర్కాటకం అనే జల రాశి వరకు అయిదు రాశులలో అయుదు గ్రహాలూ వుండి, డిగ్రీలలో చూసినప్పుడు కుజును యొక్క ఆచ్చాదన గురువుపై వుండటం ఓ అరిష్టమనే సంగతి భక్తి టీవీలో ఇరవై అయుదు రోజుల క్రితమే చెప్పటం జరిగినది. ఇకపై రాబోయే రోజులలో ఎలాంటి విపత్తులు రాకుండా ప్రజలందరూ శుభిక్షంగా ఉండటానికి, లయకారకుడైన శుభంకరుడైన ఆ శంభోశంకరుడిని ఆనంద తాండవ మొనర్చే విధంగా ఉండాలంటే ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖవారు శివాలయాలలో జరిగే స్వామివారికి అపచారాలు జరగకుండా ఉపచారాలు జరిగేవిధంగా తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేనిచో ఈ అరిష్టాలు పెరిగి మొదటికే మోసం రాగలదు. తస్మాత్ జాగ్రత్త

Monday, June 7, 2010

భద్రాద్రి రాముడు జల సమాధి కానున్నాడా ?

ఆంద్ర రాష్ట్రంలో భద్రాచలంలో నాలుగు శతాబ్దాల క్రితం రామదాసుచే నిర్మితమైన సీతారామ స్వామి ఆలయం భారతదేశంలోనే గుర్తుంపుపొంది చరిత్ర ప్రసిద్ధినొందింది. భద్రాచల చరిత్ర భవిష్య కాలంలో కాల గర్భంలో కలిసే అవకాశాలు అత్యధికంగా వున్నాయి. గోదావరి నదిపై నిర్మితమయ్యే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకుంటే భద్రాచల రామాలయం పూర్తిగా జల సమాధి కానున్నది. రాబోయే రోజులలో చైత్ర మాసంలో సీతారామ కళ్యాణాలు ఇక జరగవేమో అనే భయం అందరియందు ఉత్పన్నమవుతున్నది. ఖమ్మం జిల్లాలో మూడు వందల గ్రామాలు నీటి ముంపునకు గురికాబోతున్నాయి. లక్ష మంది ప్రజలు నిర్వాసితులు కాబోతున్నారు.

ప్రభుత్వం తరఫున ప్రాజెక్ట్ కి సంబంధించిన నిపుణులు ఇచ్చిన నివేదికల ప్రకారం, భద్రాచల రామాలయం పూర్తిగా జల సమాధి కాబోతున్నది అనే వార్త విని ప్రజలేవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఈ పోలవరం ప్రాజెక్ట్ అవసరమా, బద్రాద్రి రామాలయం ముఖ్యమా అనే చర్చలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ వలన ఆంద్రప్రదేశ్లో నాలుగు జిల్లాలకు పూర్తిగా మంచి నీటి సౌకర్యం ఏర్పడటమే కాకుండా, ఏడు లక్షల ఎకరాలకు నీరు అందనుంది. మరి బద్రాద్రి రాముడు ముంపునకు గురి కాకుండా వుంటే... నాలుగు జిల్లాలకు నీటి సౌకర్యంతో పాటు ఏడు లక్షల ఎకరాలకు.. ఆయన కరుణతో నీరు అందించాగలడా అని వితండ వాదం చేసే వారు కూడా వున్నారు.

ఇంతకీ బద్రాద్రి రామాలయానికి ఈ ముప్పు తప్పుతుందా ? ఎంతో మంది న్యాయవాదులు సర్వోన్నుత న్యాయస్థానానికి వెళ్లి భద్రాద్రి రామున్ని ముంచుకోస్తోన్న ముప్పు నుంచి తప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.... వేచి చూడాలి మరి... ధర్మ ప్రభువుగా వున్న బద్రాచల రామునికి 1999 నుంచి అధర్మంగా వివాదంతో కళ్యాణాలు చేయటం మొదలుపెట్టారు ఆలయ అధికారులు మరియు పండితులు. ఈ విధమైన కళ్యాణాలే 26 మార్చ్ 1999 న మొదటిసారి, రెండవసారి 13.4.2000 న, మూడవసారి 4.4.2009 న ధర్మ శాస్త్రాలకు వ్యతిరేకంగా స్వామివారికి అధర్మంగా జరిగాయి. ఇప్పటికైనా కొంతమంది పీటాదిపతులు, ఆలయ అర్చకులు ఉన్నతాధికారులు మేల్కొనాలి.

*గమనిక : బద్రాచలంలో పాంచరాత్ర ఆగమ పండితుల నిర్వాకమే, ఆ స్వామి అరిష్టానికి హేతువు అవుతున్నది. ఈ విషయంలో పూర్తి నగ్న సత్యాలతో తదుపరి పోస్టింగ్ లో చుడండి.

Sunday, June 6, 2010

శ్రీ కాళహస్తి మహారిష్టానికి మహా శాంతి

శ్రీకాళహస్తి కి వందల ఏళ్ళ పాటు చిహ్నంగా అలరారిన గాలి గోపురం 2010 26 మే రాత్రి 7గంటల 50నిమిషాలకు శిధిల రాశిగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా భక్తులను కలచి వేస్తోంది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం లేదంటూ దేవదయ ధర్మదయ శాఖా మంత్రి గాదె వెంకట రెడ్డి తన అసమర్ధత చాటుకొన్నారు.
గాలి గోపురం క్రింద దాదాపు 270కోతులు, మరో ఇద్దరు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఓ చిన్న కోతి పిల్ల మాత్రం బతికి బయట పడగలిగింది. గాలి గోపురం కూలడం ఒక అరిష్టానికి ఓ అంచనా. దాని క్రింద కోతులు మృతి చెందటం మరో అరిష్టం. కోతుల మృత కళేబరాలు, మానవ మృతదేహాలు శిధిలాల క్రింద వుండగా, గర్భాలయంలో స్వామి వారికి పూజలు చేయటం మహా అరిష్టం. దీనిపై ప్రభుత్వం గానీ, ఆలయ పాలక మండలి గానీ పెదవి విప్పకపోవడం శోచనీయం.
2009 సంవత్సరం జూన్ 22న ముక్కంటి ఈశ్వరుడు ముందే జాగ్రత్త పడుతున్నాడా ? అనే పోస్టింగ్ లో శ్రీ కాలహస్తీశ్వరునికి అర్ధాష్టమ శని ప్రారంభమైనదని, 2009 జూలై 20న గ్రహణం రోజున దైవ దర్శనమా ? అనే ఆశక్తికరమైన విషయాలు గ్రహభూమి బ్లాగులో వుంచటం జరిగింది.
వాయులింగేశ్వరుడిగా ప్రసిద్ధికెక్కిన శ్రీ కాళహస్తి రాజగోపురం క్రింద వాయు పుత్ర అంశకు చెందిన వానరాలు మృతి చెందడం మహా తప్పిదం. ఈశ్వరుని వీర్యాన్ని వాయుదేవుడు అంజనీదేవి గర్భంలో ఉంచినందున, జననమే వాయుపుత్రుడైన ఆంజనేయ స్వామి. పరోక్షంగా ఈశ్వర పుత్రుడే ఆంజనేయ స్వామి. వాయులింగేశ్వరుడికి ఈ క్షేత్రంలో మహా అరిష్టం ఏర్పడినందుకు, దీనికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ మహా శాంతి జరపవలసి వుంది. శ్రీ కాళహస్తికి వెళ్ళిన భక్తులందరికీ అక్కడ స్వామిని ఈశ్వరుడిగా భావించరు. రాహు కేతువులుగా దర్శించుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం గత 2దశాభ్దాలుగా దేవస్థాన ఆదాయం కోసం రాహు కేతువుల పూజలు చేయటం, ఇవి కూడా తప్పుల తడికగా చేస్తున్నందున స్వామి వారికి ఈ పూజలు మహా అరిష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి.
2010 జూన్ 7 సోమవారం హనుమజ్జయంతి పర్వదినం. అలాగే జూన్ 13వ తేది ఆదివారం ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఆరుద్ర శివుని జన్మనక్షత్రం అందుకే 7వ తేది సోమవారం హనుమజ్జయంతి నుంచి 13వ తేది ఆరుద్ర నక్షత్రం ఆదివారం వరకు ప్రతిరోజు రాహు కాల సమయంలో భక్తులందరూ భక్తి ప్రపత్తులతో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ప్రపంచ వ్యాప్తంగా రాహుకాల సమయాలు మారుతూ వుంటాయి.
ఇంతకీ ఏ సమయంలో రాహుకాలం పాటించాలి అంటే..... సూర్యుడు 6గంటలకు ఉదయించి సాయంత్రం 6గంటలకు అస్తమిస్తే, దినప్రమానం 12గంటలు వుంటుంది. దీనిని 8 సమభాగాలు చేయగా, ఒక్కో భాగమునకు ఒకటిన్నర గంట వచ్చును. ఈ 8 సమభాగాలలో మొదటి గంటన్నర భాగాన్ని ఏ వారమునకు కేటాయించలేదు. రెండవ భాగాన్ని సోమవారానికి, మూడవదాన్ని శనివారానికి, నాల్గవదాన్ని శుక్రవారానికి, అయిదవ భాగాన్ని బుధవారానికి, ఆరవదాన్ని గురువారానికి, ఏడవభాగాన్ని మంగళవారానికి, ఎనిమిదవ భాగాన్ని ఆదివారానికి కేటాయించటమైనది. ఇది సూర్యోదయ, సూర్యాస్తమయములు ఉదయం 6గంటలు సాయంత్రం 6గంటలు అయినచో రాహుకాలం ఏ విధంగా వుంటుంది అనే చెప్పే ఓ ఉదాహరణ మాత్రమే.
పై ఉదాహరణ ప్రకారం 7వ తేది సోమవారం నుంచి 13వ తేది ఆదివారం వరకు ప్రతిరోజూ రాహుకాల సమయాలను గణించుకొని.... భక్తులు వ్యక్తిగతంగా గాని సామూహికంగా గాని హనుమాన్ చాలీసా పారాయణ చేసి, శ్రీ కాళహస్తి మహా పుణ్య క్షేత్రానికి ఆపాదింపబడిన మహా అరిష్టానికి తగ్గ మహా శాంతి పారాయణ క్రతువులో పరోక్షంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని విశ్వసిస్తున్నాను..... శ్రీనివాస గార్గేయ.