Pranati Television Youtube Channel

Friday, June 22, 2012

రాజయోగ పరిహార పట్టిక - 1 వ భాగం


ఇంతవరకు ఏ ఇతర జ్యోతిష పండితులు, మేధావులు అందించనటువంటి అద్భుత సమాచారాన్ని సగర్వంగా అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. కలశపూజలు రెండవ భాగ రచన, కాలచక్రం, గ్రహభుమి రాబోవు సంవత్సరాల పంచాంగ గణన మరియు గార్గేయం పరిహారాల పరంపర మొదలైనవన్నీ అందించాలంటే ఎంతో సమయం పడుతుంటుంది. అందుచే సమయాభావం వలన uploading కొంత ఆలస్యమవుతున్నను పాఠకులు కూడా సహనంతో ఉంటున్నందుకు మనసారా ధన్యవాదములు. 

జననం నుంచి మరణం వరకు ఎన్నో సమస్యలు మానవులను పట్టి పీడిస్తుంటాయి. ఒక్కోసారి చాల సునాయాసంగా ఈ సమస్యలను అధిగమించి బయటపడగలుగుదురు. మరి కొన్ని సార్లు సమస్యల తోరణంతోనే జీవితాలు గడిచిపోతాయి. ఈ పరంపరలో ప్రతి వ్యక్తికి తమకు తాముగా కొన్ని కొన్ని ముఖ్య సమస్యలకు పరిహారాలను తెలుసుకోవటానికి అనువైన ఒక పద్దతి ఉన్నది. అదే రాజయోగ పరిహార పట్టిక. కేవలం ఈ పట్టిక చూసినంత మాత్రాన సమస్యలు తగ్గిపోతాయా అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. అది సరి కాదు. ఈ పట్టికలో మొత్తం 81 గడులు ఉన్నాయి. అంటే నిలువుగా పది గీతలు, అడ్డంగా పది గీతలు... గీయగా... కనపడేదే... ఓ పట్టిక.  ఈ పట్టికలో మధ్య భాగంలో ఓ బిందువు ఉంటుంది. ఈ బిందువుకి సంబంధించిన పూర్తి వివరాలు తరువాయి భాగాలలో తెలుసుకుందాం.

ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు కదా పెద్దలు, కనుక అట్టి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం. చాలా మంది ఎన్నో రుగ్మతలతో బాధపడుతూ.... వైద్యుల నిర్ణయాలను సక్రమంగా పాటించి, పూర్తి ఫలితాలను అనుకూలంగా పొందేవారున్నారు. మరికొంతమంది వైద్యుల నిర్ణయాలను... తూ. చ. తప్పకుండా పాటించినప్పటికీ, ఏదో తెలియని బాధ, వెలితి, ఆందోళన ఉంటుంటాయి. మరి ఇలాంటి సమస్యలు వారికి ఎందుకు వస్తున్నట్లు ? వైద్య నిర్ణయాలను పాటించినప్పటికీ సమస్యలు వస్తున్నాయి. ఇంకొంతమంది వైద్యుల వద్దకు వెళ్ళినప్పటికీ... ఆ వైద్యులు... ఎలాంటి వ్యాధి లేదని, ఘంటాపదంగా బల్ల గుద్ది చెప్పినప్పటికీ, వీరికి మానసికంగా, శారీరకంగా సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. కనుక వైద్య నిర్ణయాలకు ప్రప్రధమ ప్రాధాన్యత ప్రతి ఒక్కరూ ఇచ్చి తీరాలి. వారు చెప్పిన నిర్ణయాలను తూ. చ. తప్పకుండా పాటించి  ఇచ్చిన మందులను సక్రమంగా వాడుతుండాలి.


పై విధంగా ఆచరిస్తూ రెండవ ప్రాధాన్యత మాత్రమే ఇట్టి పట్టికల వైపు ఉండాలి. అంతే తప్ప వైద్య నిర్ణయాలను ఖాతరు చేయకూడదు.పై పట్టికలో 25 వ గడి ఆరోగ్యానికి సంబంధించినది. అయితే ఈ గడికి నాల్గు మూలలలో గడులు ఉన్నాయి. కొన్ని గడులకి నాల్గు మూలలలో ఉండవు. కనుక ఈ 25 వ గడికి నాల్గు మూలలలో ఉన్న గడుల సంఖ్య 15 , 17 , 33 , 35 . అనగా ఆరోగ్య నియమాలను పాటిస్తూ ఈ 25 వ గడి ఏం చెప్పబోతోందో, అలాగే దానికి మూలలలో ఉన్న 15 , 17 , 33 , 35 గడుల వివరాలను తెలుసుకోవాలి. ఆంటే మొత్తం 5 గదులపై ఈ పంచ ప్రాణాలు ఆధారపడి ఉంటాయి.


ఇక లలిత సహస్రనామ స్తోత్రంలో 98 వ శ్లోకం నుంచి 110 వ శ్లోకం వరకు ఉన్న 13 శ్లోకాలను గుర్తు చేస్తుంది ఈ 25 వ గడి. ఈ 13 శ్లోకాలలో షట్చక్ర వివరాలను, ఆ షట్చక్రాలలో నివసించే పరదేవత వివరాలను, ఆ దేవతలు ప్రీతి నొందే నైవేద్య వివరాలు మొదలైనవి ఉన్నాయి. ముఖ్యంగా 110 వ శ్లోకంలోని రెండవ పంక్తిలో 7 నామాలతో కలిసి ఉంటుంది.


స్వాహా స్వధామతిర్మేథా శ్రుతి స్మృతిరనుత్తమా
 
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో 7 నామాలతో ఉన్న ఏకైక పంక్తి ఇది ఒక్కటి మాత్రమే. ఈ 7 నామాలు ప్రత్యేకంగా షట్చక్రాలు మరియు సహస్రార చక్ర దేవతలు. కనుక 25 వ గడిలో చెప్పబోతున్న ఆరోగ్య అంశాలు, పరిహారాలు, ఆచరణ విధి విధానాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. ఇవన్ని పూసగుచ్చినట్లు చెప్పుకుంటూ వెళ్ళాలంటే .... టీవీలో అయితే దాదాపు 100 ఎపిసోడ్స్ అవుతాయి. పుస్తక రూపంలో అయితే కనీసం 300 నుంచి 400 పేజీలు  పడతాయి. అందుకే 25 వ గడిని గురించి వీలైనంత సమాచారాన్ని... మా పాఠకుల కోసం ఇవ్వబోతున్నాము. టీవిలో చెప్పిన వివరాలతో పాటు, మరి కొంత అధిక సమాచారాన్ని కూడా పాఠకులకు అందించబోతున్నాము.

ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన పరిహారాలను పాటించటానికి అనువైన వారాలు కేవలం నాలుగే నాల్గు. అవి 1 . శనివారం 2 . 
ఆదివారం 3 . సోమవారం 4 . మంగళవారం . ఈ నాల్గు వారాలలోనే పరిహారాన్ని పాటించాలి. 25 వ గడికి నాల్గు మూలలలో ఉన్న గడులను గురించి, ఆ పైన షట్చక్రాలలో నివసించే దేవతలు... వారి నైవేద్యాలు, ఎట్టి అనారోగ్యాలకు ఏ చక్ర దేవతల అనుగ్రహం అవసరమో అనే అంశాలన్నీ రెండవ భాగంలో తెలుసుకుందాం. 

- పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 

Tuesday, June 12, 2012

5 జూన్ 2012 న జరిగిన కలశపూజల ఫోటో గ్యాలరీ

గార్గేయ సిద్దాంతి గారి ఆధ్వర్యంలో 5 జూన్ 2012 న జరిగిన కలశపూజల ఫోటో గ్యాలరీ కోసం ఈ దిగువన ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయండి.

7 గంటలపాటు జరిగిన కలశపూజ వీడియోను కూడా మరికొన్ని రోజులలో అప్లోడ్ చేయటం జరుగుతుంది.