Monday, October 31, 2016

1 నవంబర్ 2016 మహతీ యోగానికి భగమాలినీ దేవతార్చన

శ్రీ లలితా సహస్ర నామాలలో 240 నామాలు అతి రహస్యములైనవి. ఈ నామాలను 15 మంది దేవతలకు విభజించగా, ఒక్కో దేవతకు 16 నామాలు వచ్చినవి. అనగా ఒక్కొక్క తిథి రోజున ఈ 16 నామాలతో లలితా పరమేశ్వరిలో నిత్య తిధి దేవతను వీక్షిస్తూ భక్తి విశ్వాసాలతో పారాయణ చేయాలి. మరింత అధిక  సమాచారం తెలుసుకొనవచ్చుననే ఉద్దేశ్యంతోనే దేవతా నామాలకు ముందుగా కొంత ఉపొద్ఘాతాన్ని కూడా అందిస్తున్నాను. అయితే అధిక భాగం నెటిజన్స్ కు ఈ ఉపోద్ఘాతం ఏమైనా ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే... నేరుగా తేదీల ప్రకారం నిర్ణయించి దేవతా నామాలను ఇకపైన అందిస్తాను. ఉపోద్ఘాతాన్ని ఏదో ఒక సమయంలో ఈ నామాలతో కాకుండా ప్రత్యేక శీర్షికల ద్వారా అందచేయగలను.

కనుక ఈ రోజు నుంచి తేదీల ప్రకారంగా నామాలను, వారాన్ని, తిథిని, దేవతా స్వరూపాన్ని మరియు దేవత అనుగ్రహించే అంశాలను ఒకే ఇమేజ్ లో చేసి పోస్టింగ్ చేస్తున్నాను. అయితే తిధి విషయంలో సాయంత్ర సమయంలో ఇండియా, అమెరికా, లండన్ లలో తిధి ఒకే సమయంలో ఉంటే ఒకే ఇమేజ్ గా ఇస్తాను. అలా కాక సాయంత్ర సమయంలో తిధి మారి ఉంటే, ఆయా దేశాలకు విడివిడిగా ఇమేజ్ లు అందించగలను. కనుక ఈ మార్పును గమనించగలరు. ఈ క్రింద ఉన్న ఇమేజ్ లో దేవతా స్వరూప చిత్రం కూడా ఉంటుంది. ఆ చిత్రాన్ని పలుమార్లు వీక్షించినచో, మీ మనసులో ఓ చెరగని ముద్రగా దేవత ఉంటుంది. కనుక ఒక్కొక్క తిధికి దేవతా స్వరూపం ఎలా ఉంటుంది అనేది మీకు స్పష్టంగా అవగతమవుతుంది.

నా సారథ్యంలోనే గార్గేయ టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా "ప్రణతి" అనే పేరుతో ఆధ్యాత్మిక, జ్యోతిష టీవీ ఛానల్ ను మీ అందరికీ అందించాలనే ఉద్దేశ్యంతోనే ప్రస్తుతం ప్రయోగాత్మకంగా యూట్యూబ్ లో Pranati Television అని టైప్ చేసి వీక్షించవచ్చు. పూర్తి స్థాయి కార్యక్రమాలతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంటింటికి ప్రణతి టెలివిజన్ రావటానికి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాను. కనుక ఇతర దేశాలలో ఉన్నవారు ప్రణతి టీవీని యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రాంతాలలో ఉన్నవారికి ఈ టీవీ ప్రసారాలను త్వరిత గతిలో అందించటానికి ప్రయత్నాలు చేస్తున్నాను. కనుక నా సారధ్యంలో ప్రణతి టీవీ రానున్నదని, భారతీయ సంస్కృతీ సాంప్రదాయ స్రవంతిని అందించుననే విషయాన్ని మీ మీ బంధు మిత్రాదులందరికీ సోషల్ మీడియా ద్వారా తప్పక తెలియచేయగలరని మనఃస్ఫూర్తిగా కోరుతున్నాను.

ఇక నవంబర్ 1 మంగళవారం శుక్ల విదియ రోజున భగమాలినీ దేవతార్చనకు అవసరమైన షోడశ నామావళి ఇమేజ్ ను దిగువ ఇస్తున్నాను. గమనించేది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 


Saturday, October 29, 2016

దీపావళిన మహతీ యోగ సిద్ధికి శ్రీ లలితా షోడశ నామాలతో కామేశ్వరీ దేవతార్చన

శ్రీ - అంటే పరాశక్తి. మహాకాళి, మహాలక్ష్మి , మహా సరస్వతి. వీరు ముగ్గురూ  రూపాలే. చక్రం ఆమె నివాసం. శ్రీచక్రం అంటే పరాశక్తి సామ్రాజ్యమని భావము. ఈ తల్లి సృష్టించిన మానవ దేహంలో ఆమె సామ్రాజ్య లక్షణాలు ఉంటాయి. శ్రీచక్రంలో 5 చక్రాలు శక్తిని, 4 చక్రాలు శివునివి. ఈ విధంగా నవ చక్రాలు శక్తి, శివమయాలు. మానవదేహం నవ ధాతువులచే సృష్టింపబడింది. వీటిలో చర్మము, రక్తము, మాంసము, మెదడు, ఎముకలు అను ఐదు శక్తి ధాతువులు. ఇక మజ్జ, శుక్లము, ప్రాణము, జీవము అను నాలుగూ శివ ధాతువులు. ఇలా మానవ దేహంలోని 9 ధాతువులకు శ్రీచక్రంలోని నవ చక్రాలు (నవ యోనులు) ప్రతీకలు. శ్రీచక్ర నవ ఆవరణాలకి, మానవదేహానికి సంబంధం ఉన్నది.

నవ ఆవరణలతో ఉన్న శ్రీచక్రంలో.. 8వ ఆవరణ త్రిభుజాకారంగా ఉంటుంది. దీనిని సర్వసిద్ధిప్రద చక్రము అంటారు. ఈ త్రిభుజంలోని బిందువును 9వ ఆవరణగా పిలుస్తారు. ఈ బిందువునే సర్వానందమయ చక్రము అంటారు. ఈ బిందువులోనే కామేశ్వరీ, కామేశ్వరులు ఉంటారు.

ఇక 8వ ఆవరణగా చెప్పిన సర్వసిద్ధిప్రద చక్రము అనే త్రిభుజంలోని 3 భుజాలలో ఒక్కో భుజం వైపు 5 మంది దేవతల చొప్పున, 3 భుజాలకు 15 మంది దేవతలు ఉంటారు. ఈ 15 మందినే నిత్య తిధి దేవతలు అంటారు.


ఈ త్రిభుజానికి ఉన్న 3 కోణాలలో ఓ కోణాన్ని జలంధర పీఠంగాను, రెండవ కోణాన్ని పుష్పగిరి పీఠం గాను, మూడవ కోణాన్ని కామగిరి పీఠం గాను పేర్కొంటారు. ఇంక మరీ లోతులకు వెళ్లకుండా 15 మంది దేవతలలో ప్రధమ దేవతే కామేశ్వరీ. ఈ దేవత శుక్ల పక్ష పాడ్యమికి, కృష్ణ పక్ష అమావాశ్యకు నిత్య తిధి దేవతగా (చంద్రకళగా ) ఉండును.. వాస్తవానికి శుక్ల పాడ్యమి రోజున చంద్రుని చూడలేము. అలాగే అమావాస్య రోజున కూడా చంద్రుని చూడలేము.

చంద్రుడు కనపడని ఈ రెండు తిధులకు అధిష్టానంగా ఉన్న కామేశ్వరీ దేవతా స్వరూపాన్ని ముందు తెలుసుకుందాం. కామేశ్వరీ దేవత ఎరుపు మాణిక్యం పొదిగిన కిరీటాన్ని ధరించి ఎరుపు వస్త్రాలతో, కుడి కాలు మడిచి.. ఎడమకాలు క్రిందకి జారవిడిచి పీఠంపై ఆశీనురాలై ఉంటుంది. కోటి మంది సూర్యులు ఒక్కసారిగా సూర్యోదయంలో ఉంటే... అప్పుడు కనపడే అరుణవర్ణ కాంతి ఎలా ఉంటుందో.. అట్టి కాంతితో ఈ నిత్య తిధి దేవత విరాజిల్లుతుంటుంది . మూడు కన్నులు, 6 చేతులు, శిరస్సుపై చంద్రవంకను కలిగి, చిరు మందహాసంతో కామేశ్వరీ దేవత  ఉంటుంది.
ఈ దేవతకున్న 6 చేతులలో 1. చెరకు విల్లు, 2. పుష్పబాణాలు 3. పాశము 4. అంకుశము 5. తేనెతో నింపిన బంగారుపాత్ర 6. వరముద్రను కల్గి ఉండి...  ముంజేతికి, మెడకు, నడుముకు విశేష రీతిలో స్వర్ణాభరణాలని ధరించి భక్తులకు అనుగ్రహం ఇచ్చే రీతిలో సిద్ధంగా ఉంటుంది కామేశ్వరీ మాత.
ఖగోళంలో సూర్యుడు, చంద్రుడు ఒకే డిగ్రీలోనికి వచ్చినప్పుడు ఏర్పడే తిథిని అమావాస్య అంటారు. భూ చలనం వలన సూర్య చంద్రుల మధ్య దూరం పెరుగుతున్న కారణంగా, సూర్య కాంతి చంద్రునిపై పడి నెలవంకతో ప్రారంభమై, దిన దిన ప్రవర్ధమానంగా చంద్రుడు ప్రకాశిస్తూ పూర్ణిమ రోజున సూర్యునికి ఎదురుగా చంద్రుడు ఉంటాడు. ఈ పూర్ణిమ వరకు 15 తిధులు జరగాలి. ఈ 15 తిధులకు ఉన్న నిత్య దేవతల చేతుల సంఖ్యను కలిపితే 108 వచ్చును. ఈ 108 కిరణాలతో (చేతులతో ) త్రిభుజంలో ఉన్న శ్రీ శివ శక్తుల వైభవం బ్రహ్మాండ రీతిలో ఉంటుంది.

కాబట్టి ప్రతి నెలలో వచ్ఛే ఈ తిధి సమయాలలో సాయంత్ర సమయంలో శ్రీలలితా పరమేశ్వరిని ధ్యానిస్తూ, ఆ పరమేశ్వరిలోనే పైన చెప్పిన కామేశ్వరీ రూపు రేఖలను భావించుకుంటూ... 8 అక్షరాలతో ఉన్న శ్రీ లలితా సహస్రంలోని 16 నామాలను పఠిస్తూ .. 16 ఉపచారాలుగా అందించటం శ్రేయస్కరం. ఇక సహజంగానే సంకల్పం చెప్పుకోవటం అనేది పూజ కార్యక్రమంలో ప్రధమంగా ఉండే అంశము. మనమెవరో, మన గోత్రమేమిటో అన్నీ ఆ తల్లికి తెలుసు. ఇట్టి స్థితిలో తిరిగి సంకల్పము అనవసరం.  మనకు బదులుగా, మనకొరకుగా మరొక వ్యక్తి దేవిని ప్రార్ధించే సమయంలోనే సంకల్పం అవసరము.
సంకల్పం చెప్పుకోవాలని ఉత్సాహం ఉన్నవారు చెప్పుకొనవచ్చును.  అంతేగాని ఎవరికి  వారు సంకల్పాలపైనా, అంగన్యాస కరన్యాసాల పైన దృష్టి ఉంచకుండా ఒక్కొక్క నామాన్ని పఠిస్తూ 16 ఉపచారాలను చేయటానికి ప్రయత్నించండి. ఉపచారాలు చేయలేకపోయిననూ కనీసం 16 నామాలను మానసిక పూజతో భక్తి విశ్వాసాలతో పఠించండి.

నివేదనగా మీకు నచ్చిన ఏ పదార్ధమైన సమర్పించండి. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ 16 నామాలను పఠించే సమయంలో కామేశ్వరీ రూపాన్ని మనసులో ధ్యానించండి.

సంపద, సంతోషాల కొరకు, మానసిక శాంతికొరకు, కుటుంబ సఖ్యత అభివృద్ధి దిశలో ఉండుటకు, సమంజసమైన కోరికలను తీర్చుటకు కామేశ్వరి దేవత వరముద్రతో అనుగ్రహించటానికి ప్రతి పాడ్యమి, ప్రతి అమావాస్య తిధి సమయాలలో సిద్ధంగా ఉంటుంది.

చివరగా మహతీ యోగం ఏర్పడుతున్న కారణంగా దీపావళి అమావాస్య సాయంత్రం సూర్యుడు అస్తమించిన తదుపరి నుంచి తొలి 2 గంటలలోనే దీపారాధనతో ధ్యానించండి. (వత్తుల సంఖ్య, వెలిగించటానికి తోడ్పడే తైలాల గురించి అనసవసర సందేహాలకు వెళ్ళవద్దు). ఈ కామేశ్వరీ తల్లి చంద్ర కళలతో  కూడిన  నిత్య తిధి దేవత. చంద్రుడు మనసుకు కారకుడు. ఈ మనస్సుతో  ప్రధానంగా చేసే పూజా కార్యక్రమమే ఇది.

ఈ దిగువ ఇచ్చిన వీడియోలో కామేశ్వరీ దేవతను దర్శించి నామాలను తెలుసుకొని ప్రయత్నించండి.
దీపావళి తర్వాత రోజు శుక్ల పాడ్యమి కనుక ఆనాటి దేవత కూడా కామేశ్వరే. కనుక ఇవే నామాలు తరువాత రోజుకి కూడా వర్తిస్తాయి.   




గమనిక -
మహతీ యోగం రోజులలోనే కాకుండా, భవిష్య కాలంలో వచ్చే పాడ్యమి, అమావాస్య తిథులలో కూడా ఆరాధించవచ్చును. అంతేకాదండోయ్ సూర్యోదయం తర్వాత మొదటి రెండు గంటలలో కనపడే శ్రీ సూర్యనారాయణ మూర్తిని కనులు మూసుకొని వీక్షిస్తూ, ఈ కామేశ్వరీ దేవతా రూపాన్ని తలుచుకుంటూ ఆ 16 నామాలను పఠించటం సర్వదా శ్రేయస్కరం. (నామాలు కంఠస్థం వచ్చినప్పుడు మాత్రమే ఈ పని చేయండి. )

తదుపరి పోస్టింగ్లో శుక్ల విదియకు సంబంధించిన భగమాలిని దేవత గురించి తెలుసుకుందాం. - దైవజ్ఞ పొన్నలూరి  శ్రీనివాస గార్గేయ

మహతీ యోగ సిద్ధికి లలితా సహస్ర అతి రహస్యనామాలు

శ్రీ లలితా సహస్రనామాలలో 8 అక్షరాలతో వచ్చే నామాలు 240 ఉన్నాయి. ఇవి అతి రహస్య నామాలు. ఈ 8 సంఖ్యకు చాలా విశేష ప్రాధాన్యం ఉన్నది. ఈ  ప్రాధాన్యత చెప్పుకునేముందు తిధి దేవతలను గురించి చర్చించుకుందాం. శుక్ల పక్ష పాడ్యమి నుంచి దేవి కళ ప్రారంభమై కామేశ్వరీ, భగమాలినీ, నిత్యక్లిన్నా, భేరుండా, వహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, శివదూతీ, త్వరితా, కులసుందరీ, నిత్యా, నీలాపతాకా, విజయా, సర్వమంగళా, జ్వాలామాలినీ, చిత్రా అనే 15 నిత్యదేవతలు పూర్ణిమ వరకు ఆరాధించబడుదురు. 

అలాగే కృష్ణ పక్షంలో వెనుకనుంచి వరుసగా చిత్రా, జ్వాలామాలినీ, సర్వమంగళా, విజయా, నీలాపతాకా, నిత్యా, కులసుందరీ, త్వరితా, శివదూతీ, మహావజ్రేశ్వరీ, వహ్నివాసినీ, భేరుండా, నిత్యక్లిన్నా, భగమాలినీ, కామేశ్వరీ అనే విధంగా చంద్రకళలు నిత్య తిధి దేవతలుగా ఉంటారు. శుక్ల పక్షంలో వచ్చే 15 దేవతలలో 8వ (శుక్ల అష్టమికి) నిత్యా దేవత త్వరితా. అలాగే కృష్ణ పక్షంలో 8వ (బహుళ అష్టమికి) నిత్యా దేవత కూడా త్వరితే. మిగిలిన అన్ని తిధులకు వేరు వేరు నిత్యా దేవతలు ఉంటారు. కానీ శుక్ల అష్టమి, బహుళ అష్టమి తిథులలో మాత్రం త్వరితా అనే నిత్యా దేవత మాత్రమే ఉండును. అనగా అష్టమి తిధి నాడు తిధి దేవత మారదు. 

అందుకే "అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా" అను శ్రీ లలితా సహస్ర నామావళిలోని 15వ నామంలో 8 వ తిధి అయిన అష్టమినాడు ప్రకాశించు చంద్రుని కళవలె ప్రకాశించు తల్లి అని భావము. శుక్ల పక్షము లోని పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు నిత్యం చంద్రుడు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాడు. కృష్ణ పక్షంలోని బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు క్రమ క్రమంగా చంద్రుడు క్షీణిస్తూ ఉండటం అందరికీ తెలిసిందే. శుక్ల అష్టమి, బహుళ అష్టమి రోజులలో మాత్రం చంద్రుడు ఒకే సైజు లోనే ఉండటం విశేషం. ఈ 8వ చంద్రకళకు విశేష ప్రాధాన్యత ఉన్నది . 

ఎనిమిది (అష్టమి అంటే ) అనగానే చాలా మంది భయపడతారు. మత్స్య పురాణంలో "లక్ష్మీర్మేధా ధరా పుష్టిః గౌరీ తుష్టిః ప్రభా ధృతిః ఏతాభిః పాహి తనుభి రష్ఠాభిర్మాం సరస్వతీ" అని సరస్వతి 8 విధములైన ప్రాణస్వరూపిణిగా చెప్పబడింది. "ప్రాణశక్తి సరస్వతి" అని వేదం చెప్పింది. ఈ ప్రాణశక్తి ప్రపంచమంతా వ్యాపించి 8 విధాలుగా మనల్ని రక్షిస్తున్నది.

సరస్వతి శబ్దానికి ప్రవాహము కలది అని కూడా అర్ధము కలదు .శరీరంలో ఈ ప్రవాహ లక్షణము ప్రతి అణువు నందు ప్రసరిస్తుంటుంది. ఇట్టి ప్రాణ స్వరూపిణిగా ఉన్న అష్టమూర్తిత్వములో లక్ష్మీ అనగా ఐశ్వర్యము, సంపద.. మేధా అనగా బుద్ధి.. ధరా అంటే ధరించునది అనగా భూమి.. పుష్టి అంటే ఇంద్రియాలకు కావలసిన శక్తి.. గౌరీ అనగా వాక్స్వరూపిణి, తుష్టి అంటే తృప్తి, ప్రభా అనగా వెలుగు, ధృతి అనగా ధైర్యమని అర్ధము. ఈ 8 శక్తులు మానవులకు సహకరించి రక్షిస్తుంటాయి.

అలాగే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, మహాలక్ష్మి అనబడే అష్టమాతృక దేవతలు కూడా ఉన్నారు. కామాక్షి దేవిని కూడా ధరణీమయీ, భరణీమయీ, పవనమయీ, గగనమయీ, దహనమయీ, హవనమయీ, అంబుమయీ, ఇందుమయీ అనే 8 రూపాలలో ప్రార్దిస్తుంటాము. 


ఇక ఆదిశంకరులు దక్షిణామూర్తి స్తోత్రంలో భవ, శర్వ, ఈశాన, పశుపతి, రుద్ర, ఉగ్ర, భీమ, మహాదేవ అనే 8 పేర్లను అష్టమూర్తులుగా తెలియచేశారు. ఇక ఈ అష్టమూర్తులకు చెందిన శక్తి అమ్మవారులే భవాని, శర్వాణి, ఈశాని, పశుపాశవిమోచనీ, రుద్రాణీ, ఉగ్రాణి, మహాదేవీ అను 8 శివుని యొక్క శక్తులు. కనుక ఈ 8 అంకెలో ఉన్నదంతా శక్తి స్వరూపిణి అయినా జగన్మాతే.
కాబట్టి 8 అంకెలో ఉన్న జగన్మాత శక్తి స్వరూప అతి రహస్య నామాలు శ్రీ లలితా సహస్రనామావళిలో 240 ఉన్నాయి. ఈ 240 నామాలు ఒక్కొక్కటి 8 అక్షరాలతోనే ఉంటాయి. ఒక పక్షానికి 15 తిధులు. మొత్తం 240 నామాలను 15 తిధులకు విభజించగా, ఒక్కొక్క తిధికి 16 నామాలు వస్తాయి. ఈ పరంపరలో శ్రీ చక్ర 8వ ఆవరణను సర్వసిద్ధిప్రదా చక్రము అంటారు. ఇది త్రిభుజాకారాంలో  ఉంటుంది. ఒక్కోభుజానికి 5మంది దేవతలు (తిధి దేవతలు) చొప్పున మూడు భుజాలకి 15 మంది నిత్య తిధి దేవతలు ఉంటారు.

ఒక్కో దేవతకు 16 నామాలు చొప్పున పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 240 నామాలు సరిపోతాయి. అలాగే బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు తిరిగి ఇవే నామాలు పునరావృతం అవుతాయి. అయితే శ్రీ లలితా సహస్రంలోని 240 నామాలు ఏ ఏ తిధి దేవతలకు ఏ విధంగా వుంటాయో తెలుసుకుందాం.

కామేశ్వరీ - శుక్ల పాడ్యమి , అమావాస్య తిధులకు దేవత
భగమాలినీ - శుక్ల విదియ, బహుళ చతుర్దశి తిధులకు దేవత
నిత్యక్లిన్నా - శుక్ల తదియ, బహుళ త్రయోదశి తిధులకు దేవత
భేరుండా - శుక్ల చవితి, బహుళ ద్వాదశి తిధులకు దేవత
వహ్నివాసినీ - శుక్ల పంచమి, బహుళ ఏకాదశి  తిధులకు దేవత
మహావజ్రేశ్వరీ - శుక్ల షష్టి, బహుళ దశమి తిధులకు దేవత
శివదూతీ - శుక్ల సప్తమి, బహుళ నవమి తిధులకు దేవత
త్వరితా - శుక్ల అష్టమి, బహుళ అష్టమి తిధులకు దేవత
కులసుందరీ - శుక్ల నవమి, బహుళ సప్తమి తిధులకు దేవత
నిత్యా - శుక్ల దశమి, బహుళ షష్టి తిధులకు దేవత
నీలాపతాకా - శుక్ల ఏకాదశి, బహుళ పంచమి తిధులకు దేవత
విజయా - శుక్ల ద్వాదశి, బహుళ చవితి తిధులకు దేవత
సర్వమంగళా - శుక్ల త్రయోదశి, బహుళ తదియ తిధులకు దేవత
జ్వాలామాలినీ - శుక్ల చతుర్దశి, బహుళ విదియ తిధులకు దేవత
చిత్రా - పూర్ణిమ, బహుళ పాడ్యమి తిధులకు దేవత

పై విధంగా ఒక్కోదేవతకు రెండు తిధులు ఉంటాయి. ఈ నేపథ్యంలో మహతీ యోగ సందర్భంగా ఈ ఆశ్వయిజ అమావాస్య దీపావళి రోజున మరియు రెండవ రోజు శుక్ల పాడ్యమి రోజున కామేశ్వరీ దేవతే ఉంటుంది. కనుక ఈ కామేశ్వరీ దేవతకు సంబంధించిన 16 అతిరహస్య నామాలను దిగువున ఇవ్వటమైనది. ప్రతి నామానికి ముందు ఓం అని, చివరన నమః అని కలుపుకోవాలి. ఇలా కలిపే సందర్భాలలో నామము 8 అక్షరాలు అయినప్పటికీ సంధితో ఉన్నందున 9 అక్షరాలుగా ఒక్కోసారి కనపడతాయి. కానీ అవి 8 అక్షరాలే అని గమనించాలి.



కనుక దీపావళి అమావాస్య సాయంత్ర సమయంలో కామేశ్వరీ దేవతను 16 నామాలతో ఎలా ప్రార్ధించాలి, కామేశ్వరీ దేవతా స్వరూపం ఎలా ఉంటుంది అనే వివరాలను మరికొద్ది గంటలలో వుంచబోయే తదుపరి పోస్టింగ్లో తెలియచేస్తాను. మీ బంధు, మిత్రాదులందరికీ ఈ మహతీ యోగ వివరాలను గురించి తెలియచేయండి. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Friday, October 28, 2016

కార్తీక పూర్ణిమన విజయాలను అందించే మహతీ యోగాన పెద్దజాబిలి

నారదుడి వీణ పేరు మహతి. దేవలోకంలో సంగీత విద్వాంసులుగా తుంబుర నారదులు సుప్రసిద్ధులు. ఒక గానామృత పరీక్షలో తుంబురుడి వీణాగానంతో దేవతలు మంత్రముగ్ధులై చేష్టలుడిగి సంగీతంలో లీనమయ్యారు.  తుంబుర గానం తదుపరి నారదుడు తన మహతి వీణని  మీటుతూ గానాన్ని సాగించాడు.
నారదుడి గమకాల గారడీలకు ప్రకృతిలో చలనం మొదలైంది.
తుంబురుడి గానంతో గడ్డకట్టిన సముద్రాలన్నీ తిరిగి కెరటాల హోరుతో సహజత్వాన్ని సంతరించుకున్నాయి.
నింగిలో నిలిచిపోయిన విహంగాలన్నీ స్వేచ్ఛగా ఎగరసాగాయి.
ప్రకృతి అంతా జీవకళతో ఉట్టిపడసాగింది.
దేవతలందరూ తన్మయత్వంతో తలలూపసాగారు. ఇది మహతి యొక్క ప్రత్యేకత. మహతి అంటే గొప్పది అని అర్థం. స్త్రీవాచక శబ్దంగా పిలుస్తారు. అంటే చేష్టలుడిగిన స్థితి నుంచి సహజ స్థితిలోకి తీసుకురావటానికి, గడ్డకట్టిన సముద్రాలని సైతం కరిగించగల స్థితి మహతికి ఉన్నదంటే... మహతి యొక్క ప్రాధాన్యత ఏమిటో గోచరమవుతుంది.

ఇక అసలు వివరాలలోకి వద్దాం. అతి గొప్పదైన, విశేషమైన విజయాలను అందించే దేవతలను అనుగ్రహించే విధంగా చేయగల అద్భుత యోగం ఒకటి నవంబర్ నెలలో రానున్నది. అదే మహతి యోగం.  ఇది  2016 నవంబర్ 14 కార్తీక పూర్ణిమ సోమవారం నాడు మహతి యోగ సమయంలో సాధారణ స్థాయి కంటే అత్యధిక స్థాయిలో పున్నమి చంద్రుడు దర్శనం ఇవ్వనున్నాడు. విశాఖ నక్షత్రంలో సూర్యుడు ఉండి, కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉన్న సమయంలో కార్తీక పూర్ణిమని మహతి యోగం అంటారు. 

అయితే ఈ మహతి యోగంలో కనపడే అతి పెద్ద జాబిలి ప్రభావముచే... సరియైన పద్దతిలో స్త్రీ దేవతామూర్తుల మనస్సులను కరిగించి, విజయమనే అనుగ్రహం పొందుటకు తోడ్పడేదే మహతి యోగ  సమయము. కనుక ఇట్టి యోగాన్ని పొందాలంటే దీపావళి అమావాస్య నుంచి కార్తీక అమావాస్య వరకు నిత్యం రాత్రి సమయాలలో దీపారాధనతో పొందవచ్చుఁ . అవకాశం లేనివారు నవంబర్ 11 నుంచి 17వ తేదీ వరకు వారం రోజులు సాయంత్ర సమయాలలో దీపారాధనతో జగన్మాత అనుగ్రహానికి పాత్రులుకండి.

ఈ పరంపరలో దీపావళి రోజు (అక్టోబర్ 30) నుంచి ప్రారంభిస్తే 16వ రోజే మహతి యోగ పెద్ద జాబిలి (సూపర్ మూన్) దర్శనం. తిరిగి కార్తీక పున్నమి (నవంబర్ 14) నుంచి మొదలుపెడితే 16వ రోజు కార్తీక అమావాస్య (నవంబర్ 29) వస్తుంది. దీపావళి నుంచి మొదలుపెట్టి  కార్తీక అమావాస్య వరకు , రోజుకి 16 నామాల చొప్పున లలితా సహస్రనామాలతో  ప్రదోషకాలంలో దీపారాధన చేసి ప్రార్ధించి ప్రక్రియను ఆచరించేది. ఇక ఈ ప్రక్రియ ఎలా ఆచరించాలి, ఏ సమయంలో ఆచరించాలి మొదలైన విషయాలను అన్నింటిని వెంట వెంటనే ఇచ్చే పోస్టింగులలో తెలియచేస్తాను . దీనితో పాటు యూట్యూబ్ లింక్ లను కూడా ఇస్తాను. కనుక వాటిని చదివి మీ బంధు మిత్రాదులకు తెలియచేయండి.

ఇక ముఖ్యంగా దీపావళి పర్వదినాన లక్ష్మీ పూజను ఏ ఏ సమయాలలో ఆచరించాలో తెలుసుకుందాం. భారతదేశంతో పాటు అమెరికా, లండన్, సిడ్నీ, సింగపూర్ ప్రాంతాలలో లక్ష్మీ పూజ ఆచరించుటకు శాస్త్రీయమైన సమయాలను క్రింది వీడియో ద్వారా తెలుసుకోవచ్చును.

గమనిక - ఈ వీడియోలోని స్క్రోలింగ్ మ్యాటర్లో... దీపావళి, ధన త్రయోదశి పర్వదిన ఆచరణ తేదీలలో, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, ఫ్లోరిడా, టెక్సాస్, డల్లాస్, అట్లాంటా, చికాగో, వర్జీనియాలకు 29 శనివారం అని టైపింగ్ బదులుగా, 29 ఆదివారము అని పొరపాటున స్క్రోలింగ్లో ఉన్నది. కనుక 29 శనివారంగా సరిచూసుకొనవలసినదిగా కోరుతున్నాను. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ