Sunday, September 27, 2015

భారతంలో చంద్ర గ్రహణం లేదు, అరిష్టానికి పరిహారం

భారత కాలమాన ప్రకారం 28 సెప్టెంబర్ 2015 సోమవారం ఉదయం 6 గంటల 37 నిముషాలకు ఖగోళంలో మీనరాశిలో చంద్రునికి గ్రహణం ప్రారంభమగును. ఉదయం 7గంటల 41 నిముషాలకు సంపూర్ణ గ్రహణ స్థాయి లోనికి చంద్రుడు వెళ్ళును. 72 నిముషాల పాటు సంపూర్ణ గ్రహణ బింబము నిలబడును. ఉదయం 8 గంటల 53 నిముషాలకు సంపూర్ణ గ్రహణము నుంచి విడుపు ప్రారంభమగును. ఉదయం 9 గంటల 57 నిముషాలకు చంద్ర గ్రహణం ముగియును. ఈ సమయములు భారత దేశములో పగటి యందు ఉన్నందున చంద్ర గ్రహణము భారతదేశములో కనపడదు.

ఇతర దేశాలలోనే కనపడును. 106 రోజుల అరిష్ట గ్రహ సంచారాలలో ఈ గ్రహణము కూడా ఉన్నది. దీని ప్రభావము, భూకంపాలపైననూ, జల సంబందిత సముద్ర అలలపైననూ, ద్వాదశ రాశులపైననూ ఉండును. అయితే ద్వాదశ రాశుల వారు ఆచరించవలసిన పరిహారములలొ భాగంగా 10 ముద్రలతో మంగళ, గురు, ఆదివారాలలో గ్రహణం తదుపరి నుంచి పరిహారాలు పాటిస్తే అనుకూలతలు ఉండును.

కనుక పఠించవలసిన శ్లోకాన్ని దిగువ ఇమేజ్ లో ఇవ్వబడినది. జగన్మాతను ప్రార్ధించుకుంటూ శ్లోకాలను ముద్రలు వేస్తూ పఠించేది. గత పోస్టింగ్ లలో ముద్రల వివరాలు ఇవ్వటం జరిగింది. కనుక ఆచరించేది.



Tuesday, September 22, 2015

గర్భవతులకు సూచనలు

ఇతర దేశాలలో ఉన్న గర్భవతులు,  గ్రహణ సమయంలో వారి వారి పనులను గృహంలోనే ఉండి చక్కగా చేసుకొనవచ్చును. మల మూత్ర విసర్జనలకు కూడా వెళ్ళకూడదు అని కొందరు అనుకుంటుంటారు. ఇది సరియైనది కాదు. చక్కగా అన్నీ పనులు ఇంటిలోనే ఉండి చేసుకొనేది. గ్రహణం మాత్రం చూడకుండా ఉంటే చాలు. టీవీ లలో గ్రహణ దృశ్యాలను కూడా చూడవచ్చును. తప్పులేదు. అటు ఇటు కదలకుండా ఒకే స్థానంలోనే పడుకొని ఉండాలి అని చెప్పే విషయాలను దయచేసి నమ్మకండి.

106 రోజుల అరిష్ట గ్రహస్థితుల వలన ద్వాదశ రాశుల వారికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అనుకూల పరిస్థితులు రావటానికి వారు ఆచరించాల్సిన విధి, విధానములు వారానికి మూడు రోజులే అని చెప్పటం జరిగింది. ఇందుకోసం పఠించవలసిన మంత్రం వీడియోను అప్లోడ్ చేయగలను. దానిని చూసి తెలుసుకొనేది. అలాగే 10వ ముద్రను కూడా తెలియచేస్తాను.

ముద్రల విషయంలో అనేక సంప్రదాయములు ఉన్నవి. ఉదాహరణకు వేద సంబంధ పురుష సూక్తము, శ్రీ సూక్తము, మన్యు సూక్తము మొదలైనవి దక్షిణ భారత దేశములో పఠించే స్వరానికి, ఉత్తరభారతంలో పఠించే స్వరానికి ఎంతో వ్యత్యాసమున్నది. అదే విధంగా ముద్రల విషయంలో కూడా అనేక ప్రాంతీయతలు చోటు చేసుకొని పలు మార్పులతో ముద్రలు కనపడుతుంటాయి.

ఈ పరంపరలో పురాతన గ్రంధాలు మరియు తాళపత్ర గ్రంధాల నుంచి సారాంశాన్ని క్రోడీకరించి ఇచ్చిన ముద్రలే మీకు తెలియచేస్తున్నవి. కనుక కొంతమందికి ఈ ముద్రలలో మార్పులు ఉన్నాయేమో అనే భావన రావచ్చు. అందుకొరకై ఈ వివరం ఇస్తున్నాను.   - శ్రీనివాస గార్గేయ

Friday, September 18, 2015

అరిష్ట గ్రహస్థితులకు పరిహార క్రమము



పరిహారక్రమ వివరాన్నంతటినీ పూర్తిగా విశదీకరిస్తున్నాను. వీనితో పాటు నేను చూపే ఒక వీడియోను కూడా లింక్ చేస్తున్నాను. 


ఇందులో 9 ముద్రలే ఉంటాయి. పదవ ముద్ర పరిహారక్రమ చివరలో తెలియచేస్తాను. జూలై 24వ తేదిన తిరుపతిలో ఈ ముద్రలకు సంబంధించిన సమాచారాన్నంతా ఓ యజ్ఞ రూపంలో అందరికీ తెలియచేసాను. మీరు కూడా మూడు రోజుల లోపలే పరిపూర్ణంగా వివరాలను తెలుసుకుంటారు. వీడియోని గమనించి ప్రాక్టీసు చేయండి. తదుపరి పోస్టింగ్లో మిగిలిన వివరాలు అందచేస్తాను. మీ బంధు, మిత్రులందరికీ ఫేస్బుక్ లింక్ లను, గ్రహభూమి లింక్ లను పంపగలరని ఆశిస్తాను.  - శ్రీనివాస గార్గేయ 


Wednesday, September 16, 2015

శ్రీ గణేశ చతుర్థి పూజా సమయాలు

స్వస్తిశ్రీ మన్మధ నామ సంవత్సర భాద్రపద శుక్ల చవితి శ్రీ గణేశ చతుర్థి పర్వదినాన శ్రీ మహాగణపతిని పూజించవలసిన శాస్త్రీయ సమయాలు ఈ క్రింది విధముగా ఉండును.

భారతదేశంలో వారందరూ శ్రీ గణేశ చతుర్థి పర్వదినాన ఉదయం 10 గంటల 49నిముషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 14నిముషాల మధ్య కాలంలో భక్తి, విశ్వాసాలతో గణపతి పూజ ఆచరించండి. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ లతో పాటు ఇతర దేశాలలో ఉన్నవారందరూ శ్రీ మహా గణపతిని ఉదయం 11గంటల 36నిముషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యకాలంలో పూజించి ఆరాధించండి.

ఇతర దేశాలలో ఈ పర్వదినాన వృత్తి రీత్యా, ఉద్యోగ నిర్వహణలో ఉన్న వారందరూ సూర్యోదయం తదుపరి తొలి 1గంట 36 నిముషాలలో పూజ కార్యక్రమాన్ని ప్రారంభించండి. అయితే మధ్యాహ్నం 11.36 నిముషాల నుంచి 2గంటల వరకు ఉన్న సమయంలో... వారు విధి నిర్వహణలో ఉన్నప్పటికీ మనఃస్పూర్తిగా శ్రీ మహా గణపతిని మనసులోనే మరొక్కసారి ధ్యానించుకోండి.


106 రోజులలో ఉన్న వ్యతిరేక అరిష్ట గ్రహస్థితుల ప్రభావం వాతావరణ, ప్రాకృతిక (భూకంప ఇత్యాదులు), రాజకీయ, వాణిజ్య, ఆధ్యాత్మిక, సంగీత, సినిమా, రోడ్డు రైలు విమానయానములతో పాటు ద్వాదశ రాశులపై ప్రభావము ఉండును. అయితే ఇది కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అతి ముఖ్య రంగములపైన ప్రభావముండును. ఇందుకు గాను ద్వాదశ రాశులవారు ఆచరించాల్సిన పరిహార వివరాలను సెప్టెంబర్ 18 శుక్రవారం ఋషిపంచమి పర్వదినాన పోస్టింగ్ చేయబడును. 

కనుక పరిహారములు చాలా సరళంగా ఉండటమే కాక అనవసర వ్యయముతో ఉండనే ఉండవు. ఈ పరిహారములలో భాగంగా కొంత భాగాన్ని ఎవరిపాటికి వారు ఆచరించుకుంటారు. కొంత భాగాన్ని మాత్రం ఎటువంటి రుసుము లేకుండానే మీ అందరి తరఫున మా పీఠంలో నేనే సంథాన కర్తగా ఉంటూ ప్రజాశ్రేయస్సుకై ఆచరించాల్సిన వైదిక క్రియను నిర్వహిస్తాను. 

ఇందు నిమిత్తమై మీ అందరి జన్మ నక్షత్ర వివరాలతో పాటు, పేరు, గోత్ర వివరాలను కూడా తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. పూర్తి వీడియోను మీరు చక్కగా చూడగలరు. అభిమానులందరి పూర్తి వివరాలను తెలుసుకొనుటకై 18వ తేదిన ఈమెయిలు ఐడిని ఇవ్వగలను. దానికి మీ వివరాలను మెయిల్ చేయవచ్చు. 

ముఖ్య గమనిక ఏమిటంటే ఈ కార్యక్రమం నిర్వహణ కొరకై ఎవ్వరూ ఎలాంటి రుసుములు చెల్లించనవసరం లేదని మరీ మరీ తెలియచేస్తున్నాను. - గార్గేయ సిద్ధాంతి

Sunday, September 13, 2015

ద్వాదశ రాశులపై అరిష్ట గ్రహస్థితుల ప్రభావాలు

2015 సెప్టెంబర్ లో వచ్చే భాద్రపదమాస పూర్ణిమకు కనపడే పెద్ద జాబిలి చూపరులకు ఎంతో మానసిక ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేలా కనపడినప్పటికీ...
అదే రోజున 72  నిముషాల పాటు కనపడే సంపూర్ణ చంద్రగ్రహణ బింబము 106 రోజుల గ్రహ స్థితిలో ప్రధాన కేంద్ర బిందువు కానున్నది.

ఇక భారత కాలమాన ప్రకారం సెప్టెంబర్ 15 మంగళవారం రాత్రి 9.29 ని.ల నుంచి కుజ గ్రహము సింహరాశి ప్రవేశం జరుగును. కుజుడు సింహరాశి ప్రవేశంతో సమస్యలకు మూలాధారమవుతాడు.

మూలాధార చక్రానికి అధిపతిగా ఉన్న గణపతి యొక్క జన్మదినం రోజే ప్రకృతి రాశిలోనికి సూర్య ప్రవేశం జరగటం, ఆపైన ఇటు సింహరాశిలో మూడు గ్రహాల కలయిక, తదుపరి నవంబర్ 3 నుంచి కన్యారాశిలో రాహువుతో కుజుడు, నీచ శుక్రుడు కలయిక జరుగును.

సింహ, కన్యా రాశులలో కుజ గ్రహ సంచారంతో త్రిగ్రహ కూటములు జరగనున్నవి. వీటి ప్రభావం ప్రకృతి రీత్యానే కాక వివిధ రాష్ట్రాల దేశ రాజకీయ స్థితి గతులమీద, క్రీడా, వాణిజ్య, సంగీత, సినీ, న్యాయ, మరియు మరికొన్ని ఇతర రంగాలపైననే కాక.. ద్వాదశ రాశుల వారి వ్యక్తిగత, మానసిక, ఆర్ధిక, శారీరక, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, వైవాహిక, సంతాన సంబంధిత అంశాలన్నిటిపై పరి పరి విధాలుగా వ్యతిరేక ఫలితాలు రాగల సూచనలు ఉన్నాయి. కనుక జాగ్రత్తగా మనసును అదుపు చేసుకుంటూ... ఈ 106 రోజులలో ఏర్పడే అరిష్ట గ్రహస్థితికి చెప్పే పరిహారాలను పాటిస్తూ ఉంటే కొంత ఉపశాంతి మార్గం తప్పక కల్గును.

భారతదేశంలో చంద్రగ్రహణం కనపడకపోయినప్పటికీ దీర్ఘ కాల గ్రహణ బింబ ప్రభావము ప్రపంచ వ్యాప్తంగా ద్వాదశ రాశులపై అరిష్ట గ్రహ స్థితులకు తోడుగా ఉండును. కనుక మేషరాశి నుంచి మీన రాశి వరకు గల 12 రాశుల వారికి ఏయే అంశాలలో వ్యతిరేకతలు వస్తాయో నా ఫేస్ బుక్ పేజి లింక్ ను  క్లిక్ చేసి తెలుసుకొనగలరు. 


https://www.facebook.com/Sreenivasa-Gargeya-Ponnaluri-293928097457427/

Wednesday, September 9, 2015

పెద్ద జాబిలికి 72 నిముషాల సంపూర్ణ గ్రహణం అరిష్టం కానున్నదా?

ఖగోళంలో చంద్రుడికి 72 నిముషాల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును. దీనిని అమెరికా రాష్ట్రాలలో చూస్తారు. అదే రోజున పూర్ణ చంద్రుడు మామూలు పరిమాణం కంటే అధిక పరిమాణంలో పూర్ణిమ నాటి చంద్రుడు కనపడతాడు.

సెప్టెంబర్ 27 ఆదివారం రాత్రికి ఖగోళంలో ఉత్తరాభాద్ర నక్షత్ర మీనరాశిలో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును. ఈ సంపూర్ణ గ్రహణం 72 నిముషాల పాటు దీర్ఘకాలం ఉంటుంది. భారతదేశంలో ఇది కనపడదు. భారతంలో కనపడక పోయినప్పటికీ ద్వాదశ రాశులపై దాని ప్రభావం పరోక్షంగా ఉంటూనే ఉంటుంది. అమెరికా, యూరప్, ఆఫ్రికా, పశ్చిమ ఆసియా ఖండాలలో కనపడును.

అమెరికాలోని 9 నగరాలలో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కనపడును.
అట్లాంటా, బోస్టన్, డెట్రాయిట్, ఫిలడెల్ఫియా, పిట్స్ బర్గ్, జాక్సన్ విల్లె, రిచ్మండ్, వాషింగ్టన్ డిసి, న్యూయార్క్ నగరాలలో సెప్టెంబర్ 27 రాత్రి 8.07 లకి చంద్రగ్రహణ స్పర్శ మొదలగును. సంపూర్ణ స్థితికి గ్రహణ రాక రా 9గం.11ని.లు, సంపూర్ణ స్థితి నుంచి విడుపు ప్రారంభం రా 10గం.23ని.లు, మోక్షం (గ్రహణ పూర్తి విడుపు) రా 11గం.27ని.లు.


సెప్టెంబర్ 13 శ్రావణ అమావాస్య ఆదివారం సింహరాశిలో పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుంది.  దక్షిణ హిందూ మహా సముద్రం పైననూ, దక్షిణాఫ్రికా, అంటార్కిటికా ఖండాలలో గోచరించును. ఇది భారత్ అమెరికాలలో కనపడదు. కాని దీని అధిక ప్రభావం హిందూ మహాసముద్రంపై ఉంటుంది.


చూపరులకు ఎంతో మానసిక ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేలా కనపడినప్పటికీ... సెప్టెంబర్ 10 నుంచి డిసెంబర్ 24 వరకు ఉన్న 106 రోజుల వ్యతిరేక స్థితిగతులకు 72 నిముషాల గ్రహణం నాటి పెద్ద జాబిలి హేతువవుతున్నది.

వివరాలు తదుపరి పోస్టింగ్ లో ...

Monday, September 7, 2015

మూల నక్షత్రంలో వర వర్షిని 3, 4

ఈ భూమి మీద ఏ వస్తువు కైనా చలనం కావాలంటే శక్తి అంటూ అవసరం. సకలమైన జీవరాశులకు ఇట్టి శక్తిని సూర్య భగవానుడే ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అందిస్తున్నాడు. ఈ సమస్త ప్రకృతి అంటా శక్తిమయమే. పంచభూతాలైనటువంటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం... ఇవన్నీ వివిధ శక్తి స్వరూపాలే.

ఓ చిన్న విత్తనం భూమిలోనుంచి మొలకెత్తాలంటే దానికి పృథ్వి శక్తి అవసరము. జల శక్తిని తోడుగా చేసుకొని భూమిలోనుంచి మొలకెత్తుతుంది. ఆపైన రెపరెపలాడాలంటే వాయు శక్తి అవసరం. తదుపరి నుంచి మొక్క ఎదుగుదలకు తోడ్పడేది అగ్ని, ఆకాశములు. అంటే సూర్యరశ్మి మరియు ఆకాశ తత్వము. అదే విధంగానే ఈ మనుడికి కూడా అద్భుతమైన మేధాశక్తి ఉన్నప్పటికీ అది సక్రమంగా పని చేయాలంటే... తన శరీరంలో ఉన్న శక్తి కేంద్రాలన్నీ సహకారం అందించాలి. అందుకే మానవ శరీరంలో కొన్ని సున్నితమైన కేంద్రాలు ఉన్నాయి. శరీరములోని ఈ కేంద్రాలన్నీ ఉత్తేజితమైతే, శరీరంలో అవిరామంగా మహా శక్తి ఉత్పన్నమవుతుందని పతంజలి మహర్షే యోగ సూత్రాలలో తెలియచేశాడు.

అదే విషయాన్ని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో మానవ శక్తి కేంద్రాలైన షట్చక్రాల రూపంలో, మానవ శరీరంలో ఆవరించి ఉన్న పరాశక్తి  స్వరూపాన్నే అనేక శ్లోకాలలో స్తుతించటం జరిగింది. ఈ ఆరు చక్రాలకు మహా సామ్రాజ్ఞిగా పరిపాలించే ఏడవ చక్రమే సహస్రారము. కనుక మన శరీరంలో మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము ఉంటాయి. ఈ చక్రాలు భౌతికంగా మానవ శరీరంలో అనేక జీవ ప్రక్రియలను నిర్దేశిస్తాయి. శరీరంలోని పలు అవయవాల విధులను ఈ షట్చక్రాలు నియంత్రిస్తుంటాయి.

ఈ పరంపరలో ప్రతి శక్తి కేంద్రము మెదడులోని ప్రత్యేక అవయవాలకు సంబంధించిన భాగాలతో అనుసంధానం గావించబడుతుంది. ఈ విధంగా ప్రతి చక్రంలో స్రవాలు ద్రవిస్తుంటాయి. కొందరికి సక్రమంగాను, ఇంకొందరికి అధికంగాను, మరికొందరికి అల్పంగాను ద్రవిస్తుంటాయి. ఈ స్రవించే ద్రవాల క్రమ పద్ధతి ద్వారా ఆరోగ్యకర వాతావరణం కనపడుతుంది. అల్పంగా స్రవించినందున పరిస్థితులు అనుకూలంగా ఉండవు. అలాగే అధికంగా ద్రవాలు స్రవించినందున విపరీత వ్యతిరేకంగా ఫలితాలు వస్తుంటాయి. కనుక మనలో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ, అవి ఏ శక్తి కేంద్రానికి సంబంధించినవో గమనిస్తూ, ఆ శక్తి కేంద్రాన్ని సక్రమమైన రీతిలో ఉత్తేజం చేయగల్గినప్పుడు విశేషమైన వస్తుంటాయి. కనుకనే ఆ శక్తి కేంద్రాల కథా కమామీషుతో పాటు, మానవ జీవనక్రమంలో సరియైన సమయంలో ఎలాంటి ఆహారాలను దైవీ, దేవతలకు నివేదించి, ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలో చెప్పే ఓ చిన్ని ప్రయత్నమే ఈ దిగువ ఉన్న వీడియోలు.

కనుక లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ చక్రాలకు సంబంధించిన దేవతలకు ఏ నివేదన అందించాలి స్పష్టంగా ఉంది. ఈ చక్రాల ఆదిస్థాన గ్రహ వారాలలో... ఆ నివేదించిన ప్రసాదాలను మనం స్వీకరిస్తే పరోక్షంగా విశేష లబ్ధి కల్గుతుంది. అంతే కాదు ఒక్కో నక్షత్రం రోజున ఎలాంటి ఆహారం తీసుకోవాలి... నక్షత్ర  అధిపతి, వారాధిపతి, ఆనాడు ఏర్పడిన తిథిని బట్టి మానవాళి ఆస్వాదించాల్సిన ఆహార విహార వివరాలను పురాతన జ్యోతిష శాస్త్రం స్పష్టం చేసింది. కనుక రాబోయే రోజులలో తిథి, నక్షత్ర, వారాలతో పాటు భుజించవలసిన వివరాలను తెలుసుకుంటే రుగ్మతలకు దూరంగా ఉండటమే కాకుండా, ఉపయుక్తమైన విజ్ఞాన పరంపరను పొందగలమని చెప్పుటలో అతిశయోక్తి ఎంత మాత్రము లేదు. - శ్రీనివాస గార్గేయ