Pranati Television Youtube Channel

Monday, March 27, 2017

మార్చి 28 మంగళవారమే శ్రీ హేమలంబ ఉగాది

స్వస్తిశ్రీ హేమలంబ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని మార్చి 28 ఏ ఆచరించుకోవాలి. 29 బుధవారం ఆచరించటం శాస్త్రీయం కానీ కాదు. నాచే రచింపబడిన కాలచక్ర పంచాంగంతో పాటు, కంచి కామకోటి పీఠ పంచాంగం (లక్కావజ్జల సిద్ధాంతి గారు), పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, కుప్పం ద్రవిడ యూనివర్సిటీ, సంస్కృత విద్యా పీఠ్ (ఢిల్లీ, వారణాసి, తిరుపతి), శ్రీ కాళహస్తి దేవస్థాన పంచాంగం (ములుగు సిద్ధాంతి గారు), ఆంధ్రజ్యోతి పంచాంగ, ఆంధ్రభూమి పంచాంగం, పిడపర్తి వారి పంచాంగం, హనుమంత వజ్జల సుబ్రమణ్య శర్మ గారి పంచాంగం, ద్విభాష్యం సుబ్రమణ్య శర్మగారి పంచాంగం, ముక్తేవి శశికాంత్ గారి పంచాంగం, అనపర్తి కృష్ణశర్మ గారి భాస్కర పంచాంగం, చిత్రాల గురుమూర్తి గుప్త గారి పంచాంగం, గొర్తి పట్టాభి శాస్త్రి గారు, ఉపద్రష్ట కృష్ణమూర్తి గారు, బిజుమల్ల బింధుమాధవ శర్మ గారు , కారుపర్తి కోటేశ్వర రావు గారు , కాలెపు భీమేశ్వర రావు గారు ,  పిచుక గిరిరాజు సిద్ధాంతి  గారు, పల్లావజ్జల రామకృష్ణ శర్మ గార్ల పంచాంగాలు...వీరు కాక మరో 40 మంది దృగ్గణిత పంచాంగ కర్తలు మరియు కేంద్ర ప్రభుత్వంచే ప్రతి సంవత్సరము విడుదలయ్యే రాష్ట్రీయ పంచాంగాలలో మార్చి 28న ఉగాది గా ప్రకటించారు. 

వీరు కాక గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు మార్చి 28 మంగళవారమే ఉగాదిగా ప్రకటించాయి. 2016 ఆగష్టు నెలలో కంచి పీఠం వారు నిర్వహించిన సదస్సులో తిరుమల సిద్ధాంతి తంగిరాల వారు పాల్గొని మార్చి 28న ఉగాది ఒప్పుకొని సంతకం చేసి సన్మానించుకొని, బయటకు వెళ్లిన తదుపరి పండిత ధిక్కారంతో మార్చి 29 శ్రీ హేమలంబి ఉగాదిగా ప్రకటించటంతోనే అయోమయం ప్రారంభమైనది. 

కనుక తెలుగు ప్రజలందరూ శాస్త్రీయమైన, ప్రామాణికమైన కంటికి ప్రత్యక్షంగా రుజువునకు సిద్ధపడే దృక్ పంచాంగాన్నే పాటించి మార్చి 28 మంగళవారం ఉగాదిగా ఆచరించేది. - పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 

Sunday, March 12, 2017

శ్రీ హేమలంబ ఉగాది 2017 మార్చి 28నా లేక 29?

శ్రీ హేమలంబ ఉగాది 2017 మార్చి 28 ? మార్చి 29.. ఏ రోజు ఆచరించాలి. కంచి పీఠం వారు మార్చి 28 శ్రీ హేమలంబ గా ప్రకటించారు. శృంగేరి వారు మార్చి 29 శ్రీ హేమలంబగా ప్రకటించారు. తిరుమల తిరుపతి వారు శృంగేరి గణితమే మా పంచాంగం అంటూ మార్చి 29 ఉగాది అంటూనే పేరు మాత్రం శ్రీ హేమలంబి అన్నారు. అలాగే తెలంగాణలో ఉండే పలువురు పండితులు శృంగేరి వారి నిర్ణయమే శిరోధార్యం అంటూనే, వారి పంచాంగాలలో మార్చి 29 ఉగాదిగా తెలియచేస్తూ, సంవత్సర పేరు మాత్రం శ్రీ హేవిళంబి అన్నారు. ఎవరిని నమ్మాలి ? ఏమిటీ అయోమయం.. ఈ అయోమయానికి కారణమే టీటీడీ. 

దాదాపు దశాబ్దాల నుంచి వస్తున్న ఈ వివాదానికి అడ్డుకట్ట వేసి తగిన పరిష్కారం చేయాలనే ఒక ఉద్దేశ్యంతో 1955లో ఆనాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రు గారు ఒక పంచాంగ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వారు దేశవ్యాప్తంగా సిద్దాంతులందరినీ ఆహ్వానించి ఆరు మాసాలపాటు పండిత చర్చలు చేయించారు. 

ఈ చర్చల అనంతరం ప్రత్యక్ష ఋజువునకు ప్రామాణికంగా నిలిచేది దృగ్గణితమని పూర్వగణితం కాదని తీర్మానించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కేంద్రప్రభుత్వం వారు అనేక భాషలలో రాష్ట్రీయ పంచాంగము అను పేరుతో ప్రతి సంవత్సరం పంచాంగాన్ని ముద్రిస్తున్నారు. ఈ పంచాంగంలో ఇచ్చిన సమయాలకు, ఖగోళ గ్రహ సంచారాలకు ఖచ్చితంగా సరిపోవును. దీనినే దృగ్గణితము అంటారు.

వాస్తవానికి పంచాంగం గణితం చేయటానికి మూల గ్రంధము సూర్యసిద్ధాంతము. కానీ సిద్ధాంతము ఒక్కటైనప్పటికీ వ్యక్తుల మధ్య ఉన్న భేదాభిప్రాయాల వలన రెండు విధాలుగా గణితం చేస్తున్నారు. ఈ రెండు విధాల గణితం వలనే సమస్యలు వస్తున్నాయి. 

సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉండే దూరాన్ని తిధి అంటారు. చంద్రుని యొక్క సంచార స్థితిని నక్షత్రముగా నిర్వచిస్తారు. అమావాస్య అనగా సూర్యుడు చంద్రుడు ఒకే బిందువులో కలిసిపోవటము. పూర్ణిమ అనగా సూర్యునికెదురుగా  చంద్రుడు ఉండటం. ఈ నేపథ్యంలో అమావాస్య పూర్తి కాగానే చంద్రుడు ప్రక్కకు రావటంతో పాడ్యమి తిధి మొదలవుతుంది. అంటే అంతటితో అమావాస్య పూర్తయిందని భావము. ఈ శుక్ల పాడ్యమి తిథి ప్రారంభం దగ్గరే రెండు గణితాల వారికి వివాదముంది. 

2017 మార్చి 28 మంగళవారం ఉదయం అమావాస్య తిధి 8గంటల 26నిముషాల వరకు ఉండి తదుపరి చైత్ర శుక్ల పాడ్యమి తిధి ప్రారంభమైనది. ఈ తిధి మరునాడు 29 బుధవారం  సూర్యోదయానికి పూర్వము 5 గంటల 44 నిముషాల తో వెళ్ళిపోతుంది. సూర్యోదయం వరకు తిధి ఉండదు. ఇది ఖచ్చితంగా ఖగోళంలో చంద్ర సూర్యుల సంచారానికి జరిగే సమయం. దీనినే దృగ్గణితము అంటారు. ఈ గణితం ప్రకారంగా మార్చి 28 ఉగాదిగా ప్రకటించారు. 

కానీ రెండవ గణితమైన పూర్వపద్ధతి ప్రకారం 29వ తేదీ ఉదయం దాదాపు 6గంటల 50 నిముషాల వరకు పాడ్యమి తిధి ఉన్నందున, వారు 29 ఉగాది అని తెలియచేశారు. ఇక ధర్మ శాస్త్ర విషయాన్ని ప్రక్కన పెట్టి సూర్యోదయంలో తిధి ఉన్నది గనుక 29 ఉగాది అని అడ్డంగా వాదించటం మొదలుపెట్టారు పూర్వగణితం వారు. ఒక్కసారి వారి మాటలు వారికే అప్పచెబితే.. గతంలో జీయర్ పీఠం మరియు యాద్రాది దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి గారు మరియు పుష్పగిరి పీఠం ఆస్థాన సిద్ధాంతి గారు 2007 మార్చి 20వ తేదీన సూర్యోదయం తర్వాత దాదాపు అరగంట వరకు పాడ్యమి తిధి ఉన్నప్పటికీ, ఆరోజు ఉగాదిగా ప్రకటించకుండా 2007 మార్చి 19 శ్రీ సర్వజిత్ ఉగాదిగా ప్రకటించారు ఇదే పూర్వగణితం వారు. అంటే రెండు నాల్కల ధోరణిలో మాట్లాడుతున్నారన్నమాట. 

అయితే ధర్మ శాస్త్రాలు చెప్పిన వివరాల ప్రకారంగా పరిశీలిస్తే (గణితం ఏదైనా) రెండవ రోజు సూర్యోదయం తర్వాత 3 ముహూర్తాల ప్రమాణం శుక్ల పాడ్యమి తిధి వ్యాప్తి ఉంటేనే రెండవ రోజు ఉగాది చేయాలని ధర్మశాస్త్ర నిర్ణయం. ఒక ముహూర్తం అంటే 48 నిముషాలు. మూడు ముహుర్తాలు అంటే 144 నిముషాలు లేదా 2 గంటల 24 నిముషాలన్నమాట. కనుక ఇంతసేపు తిథి రెండవ రోజు ఉంటేనే భారత దేశ వ్యాప్తంగా అన్నీ ప్రాంతాలవారికి, వారి వారి సూర్యోదయాల తర్వాత తిధి ఉంటుందని అర్ధము. ఈ విషయం పూర్వగణిత పంచాంగ కర్తలకి తెలుసు.. కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటారు. 

2007 మార్చి 19 శ్రీ సర్వజిత్ ఉగాది గా దృక్ పద్ధతి ప్రకారం వచ్చింది. మార్చి 20గా పూర్వపద్ధతి ప్రకారం వచ్చింది. ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఈ పంచాంగ వివాదం తేల్చటానికి నలుగురు ఐ.ఏ.యస్ అధికారులు కమిటీగా ఏర్పరిచారు. వారే 1. శ్రీ సుందరకుమార్ గారు, 2. శ్రీ కె.వి.రమణాచారి గారు  3. శ్రీ ఐ.వి.సుబ్బారావు గారు  4. పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు ఈ నలుగురు అధికారుల ముందు నాతో పాటు మరికొంతమంది దృగ్గణిత పంచాంగ కర్తలు, ఆనాటి తిరుమల దేవస్థాన సిద్ధాంతి తంగిరాల ప్రభాకర పూర్ణయ్య (ప్రస్తుతం కీర్తి శేషులయ్యారు) గారు చర్చలలో పాల్గొన్నాము. 

దాదాపు ఒకరోజు జరిగిన ఈ చర్చల అనంతరం దృగ్గణిత ప్రకారంగా మార్చి 19వ తేదీగా ప్రభుత్వం ప్రకటించి ఒకరోజు ముందుకు ఉగాదిని మార్చటం జరిగింది. కానీ ఈ సంవత్సరం మేము ప్రభుత్వానికి ఈ విషయంపై విన్నవించుకోదల్చుకోలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖలో ఉన్న తిరుమల దేవస్థాన పంచాంగం ఎప్పుడైతే పూర్వపద్ధతి నుంచి దృక్ పద్ధతిలోకి మారుతుందో, ఆనాడే తెలుగు పండగలకి వ్యత్యాసాలు రావు.  ఇంతకాలానికి ప్రజలు చైతన్యవంతులైనారు. చక్కని అవగాహనతోటి ఉన్నారు. ప్రతివారి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటున్న ఈ  తరుణంలో, తిధి ఎంతవరకు ఉందని స్పష్టంగా తెలుసుకోవచ్చు. నిదానంగా కాలమే నిర్ణయించబోతున్నది. ఈ పూర్వగణితము నుంచి రచయితలు.. వారంతట వారే నిదానంగా నిష్క్రమించబోయే రోజులు సమీపిస్తున్నాయి. 

తిరుమల, శ్రీశైల దేవస్థానాల పంచాంగాలు రెండూను పూర్వపద్ధతివే, ఈ రెండింటిలో తిధి సమయాలు, నక్షత్ర సమయాలు ఒక్కటిగా ఉంటాయి. కానీ పుష్కర ప్రారంభాలు మాత్రం వారం రోజులు తేడా ఉంటాయి. మరి ఇలా ఎందుకు అని అడిగేవారే లేరు. అసలు విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా పుష్కరాలు జరిగే సమయం కేంద్రప్రభుత్వం నిర్ణయించిన రాష్ట్రీయ పంచాంగం ప్రకారం ఉంటాయి. ఇదే తేదీని తిరుమల సిద్ధాంతి తమ పంచాంగంలో ఇస్తారు. కానీ శ్రీశైల సిద్ధాంతి వారి గణితం ప్రకారం వచ్చిన వేరే తేదీని ఇస్తారు. ఈ తేదీని తిరుమల వారు ఎందుకు ఇవ్వరంటే... దేశం అంతా పుష్కరాల తేదీ ఒకటిగా ఉండి తిరుమల పంచాంగంలో మరొక తేదీగా ఉంటే వారి పదవికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని గ్రహించి గుట్టుచప్పుడు కాకుండా కేంద్రప్రభుత్వ నిర్ణయం తేదీని తమ పంచాంగంలో ఇస్తారు.  

అలాగే పూర్వాపద్ధతి ప్రకారంగా సూర్య చంద్ర గ్రహణాలు రానే రావు. దృక్పద్దతి ప్రకారమే గ్రహణ సమయాలు ఖచ్చితంగా వస్తాయి. తిరుమల సిద్ధాంతి వారి పూర్వ పద్ధతి ప్రకారంగా గ్రహణాలు ఇస్తే, ఆ సమయానికి కనపడవు గనుక, అందరూ ప్రశ్నిస్తారనే భయంతో తిధి, నక్షత్రాలను పూర్వ పద్ధతి అని, గ్రహణ గ్రహ ప్రవేశాలను దృక్పద్దతి అని సూర్యసిద్ధాంతంలో లేని కొత్త దానిని తీసుకొచ్చారు. కొసమెరుపు ఏమిటంటే తిధి అనగా సూర్య చంద్రుల మధ్య దూరము. సూర్య చంద్రులిద్దరూ గ్రహాలే కదా! తిరుమల పంచాంగ కర్తకు ఈ విషయం తెలియదేమో. గ్రహ ప్రవేశాలు దృక్పద్దతి ప్రకారం అన్నప్పుడు, ఈ రెండింటి మధ్యగల దూరము తిధి కూడా ఖచ్చితంగా ఉండాలి. కానీ వారి దానిలో అలా ఉండదు. చెప్పుకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో. 

ఇంత జరిగినా అసలు సిసలైన శాస్త్రీయమైన ప్రామాణికమైన దృక్పద్దతి ప్రకారం పంచాంగం వేయటం వారికి కష్టసాధ్యమేమి కాదు.. కానీ వేయరు. ఎందుకంటే ఇంతవరకు వేసిన పంచాంగములు తప్పని పరోక్షంగా ఒప్పుకున్నట్లేగా. అది అసలు కధ. కనుకనే వారి వారి గృహాలలో అధునాతన పరికరాలతో జాతకాలు చెబుతుంటారు. కానీ తప్పు గణితాలతో పంచాంగాలు ముద్రించి ప్రజలను గందరగోళంలోకి నెట్టేస్తారు. ప్రజలు బాగా తెలుసుకున్నారు. పంచాంగ ప్రతుల అమ్మకం ఎప్పుడైతే పూర్తిగా పడిపోతూ వస్తుందో ముద్రించే పబ్లిషర్స్ కూడా లేకుండా పోతారో ఆనాడే తమ తప్పులను తెలుసుకొంటారు. ఆరోజులు సమీపంలోనే ఉన్నాయి.

రాజమండ్రిలో పంచాంగాలను అచ్చు వేసే మోహన్ పబ్లికేషన్స్ రెండు రకాల పంచాంగాలను మొదటినుంచి ముద్రిస్తున్నారు. తర్వాత రోజులలో పూర్వగణిత పంచాంగం సరికాదని తెలుసుకొని, ఈ తప్పు పంచాంగాల వలన ప్రజలకు నష్టం వాటిల్లుతున్నదని గ్రహించిన మోహన్ పబ్లికేషన్స్ వారు గత నాలుగు సంవత్సరాల నుంచి తమకు ఆదాయం తగ్గినా ఫర్వాలేదు అనుకొని పూర్వగణిత పంచాంగ ముద్రణకు స్వస్తి పలికిన ధన్య జీవులు. ఇప్పుడు కేవలం మోహన్ పబ్లికేషన్స్ వారు శాస్త్రీయమైన ప్రామాణికమైన ప్రత్యక్ష రుజువుకు నిలబడే పంచాంగాలను ముద్రిస్తున్నారు. వీరి బాటలోనే మిగిలిన పబ్లిషర్స్ కూడా అచిరకాలంలోనే రాబోతున్నట్లుగా వినికిడి. ఎందుకంటే ప్రజలకు జరిగే కష్ట నష్టాలను తెలుసుకొని ఆ కష్ట నష్టాలు తమవిగా భావించుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. 

చివరగా చెప్పేది ఏమిటంటే శాస్త్రీయమైన ఉగాది మార్చి 28 మాత్రమే. కేంద్రప్రభుత్వం మార్చి 28 నే సెలవుదినంగా ప్రకటించారు కూడా. తెలుగు రాష్ట్రాలలో మాత్రం మార్చి  29 గా సెలవుంది. కనుక తెలుగు ప్రజలు శాస్త్రీయమైన ఉగాదిని మార్చి 28నే జరుపుకోవాలని తెలియచేస్తున్నాను.