Friday, November 5, 2010

అర్దరాత్రి లక్ష్మీ పూజ ఉత్తమోత్తమం

శ్రీ వికృతి నామ సంవత్సర ఆశ్వీయుజ అమావాశ్య 5 డిసెంబర్ 2010 శుక్రవారం నాడు జరుపుకుంటున్నాం. చిత్త, స్వాతి నక్షత్రాలలోనే దీపావళి పర్వదినం వస్తూ వుంటుంది. స్వాతి కార్తెలో, స్వాతి నక్షత్రంలో, శుక్రవారం నాడు అరుదుగా దీపావళి వస్తూ వుంటుంది. కొంతమంది 6 వ తేదీ దీపావళి అనుకుంటున్నారు. ధర్మశాస్త్రాల నిర్ణయానుసారం 5 వ తేదే దీపావళి.

ఈరోజున జరిగే లక్షీ పూజ సమయం విషయంలో కొంతమంది ప్రసార మాధ్యమాలలో అర్దరాత్రి సమయం చేయకూడదని, సాయంకాలమే చేయవలెనని తెలియచేస్తున్నారు. వర్షక్రియా కౌముది, నిర్ణయ సింధు, భవిష్య పురాణం మొదలైన గ్రంధాల ప్రకారం సాయంకాల సమయంలో లక్ష్మీ పూజ ఆచరించిననూ తప్పు కాదు. కానీ అర్దరాత్రి సమయంలో లక్ష్మీ పూజ ఆచరించినచో ఉత్తమోత్తమం అని శాస్త్ర వచనం. ఈ రోజు రాత్రి కర్కాటక లగ్న సమయంలో 11 .30 నిమిషాల నుంచి 12 గంటల వరకు లక్ష్మీ పూజను ఆచరించి, జ్యేష్టా దేవినీ తరిమికొట్టండి. భవిష్య పురాణం ప్రకారం చేట మీద చప్పుల్లతోనూ, డక్కా వాయుద్యంతోనూ దరిద్ర దేవతను తరమాలని వచనం. లక్ష్మీ దేవి చంచల మనస్కురాలు. చంచలత్వానికి కారకుడు చంద్రుడు. కనుకనే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆశ్వీయుజ అమావాశ్య కర్కాటక లగ్నమే అర్దరాత్రి అవుతుంది. ఈ లగ్నానికి చతుర్ధం అనే తులా రాశి గృహస్థానం అవుతుంది. అలాగే ఏకాదశమైన తులారాశి లాభ స్థానమవుతుంది. ఈ రెండు రాశులకు అధిపతి శుక్రగ్రహము. బంగారు ఆభరణాలకు, అష్టైశ్వర్యములకు ప్రతీక శుక్రుడు. కనుక ఆ శుక్రుని అనుగ్రహం కూడా కలగటానికి కర్కాటక లగ్నాన్ని మనం స్వీకరించాలి.

నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నివాసమని శాస్త్ర వచనం. కనుక ఈ రోజు నువ్వుల నూనె వెలిగించిన జ్యోతితో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ, మధుర పదార్ధాన్నిఆ తల్లికి నివేదించాలి. ఈ మధుర పదార్ధాలలో ముఖ్యంగా తెల్ల నువ్వులు, బెల్లము, పాలు, నెయ్యి, బియ్యం అను వాటితో పొంగలిని (శ్వేత తిల ఘ్రుత పాయసాన్నం) నివేదన చేయండి. అర్దరాత్రి లక్ష్మీ దేవినీ ఆరాధించకూడదు అని చెప్పే శాస్త్ర వచనాలు లేవు. తెలిసీ తెలియని వారు ప్రసార మాధ్యమాల ద్వారా చెప్పటంతో చాలా మంది అయోమయంలో పడుతున్నారు.

కేదార వ్రతాన్ని నూతనంగా ఆచరించేవారు స్వాతి కార్తె స్వాతి నక్షత్ర అమావాశ్య రోజున వ్రతాన్ని ఆచరించాలి. ఈ విధంగా 3 లేక 4 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే స్వాతి కార్తె స్వాతి నక్షత్ర అమావాశ్య వస్తుంటుంది. ఎప్పటినుంచో కేదార వ్రతాన్ని ఆచరించేవాళ్ళు ఈరోజూ చేయవచ్చు అలాగే రేపూ ఆచరించవచ్చు. నిబంధన లేదు. దీపావళి రోజున మాష పాత్ర భక్షణము చేయవలెనని శాస్త్ర నిర్దేశము. మాష పత్రమనగా మినప ఆకు. నవధాన్యాలలో రాహు గ్రహ సంబంధిత ధాన్యమే మినుములు. దీపావళి రాహు నక్షత్రమైన స్వాతిలో వచ్చిన రోజున మినప ఆకులను తింటే శుక్ర లోపములు పూర్తిగా పోగలవని శాస్త్ర వచనం.

ఉగాదికి వేప పూవు పచ్చడి, శ్రీరామనవమి ముందు రోజు ఆశోకాష్టమికి ఆశోక చెట్టు మొగ్గలు, ఆషాడ మాసంలో మునగాకు కూర, ఏకాదశి వెళ్ళిన ద్వాదశి పారణంలో అవిశాకు కూర, అలాగే దీపావళిన మినపాకు సేవించవలెనని శాస్త్ర వచనాలు ఉన్నవి.