Pranati Television Youtube Channel

Sunday, November 29, 2015

రవి, శనుల సంఘర్షణలో బుధ గ్రహం చేతనే చంద్రునికి అడ్డుకట్ట

ఆయుర్దాయము అంటే ఆయుష్యు. దీనినే ఆంగ్లంలో లైఫ్ స్పాన్ అంటారు. ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని సంవత్సరాలు జీవిస్తాడు. అని జ్యోతిష శాస్త్ర రీత్యా చెప్తారు. అయితే ఆయుష్యును నిర్ధారించే స్థానము జ్యోతిష శాస్త్రంలో అష్టమ స్థానము. ఇక్కడ ఒక విషయాన్నీ బాగా గమనించాలి. ఒక వ్యక్తి యొక్క ఆయుర్దాయము కేవలం 8వ స్థానం గురించి మాత్రమే చెప్పటం అతి కష్టము. ఎందుకంటే వ్యక్తి యొక్క మానసిక, శారీరక స్థితి గతులను చెప్పే లగ్న స్థానము, ఆరోగ్యాన్ని విశ్లేషించే చతుర్థ స్థానము, ప్రమాదాలు, అనారోగ్యము తెల్పే ఆరవ స్థానముల గురించి పూర్తిగా పరిశీలించి ఆతర్వాతనే జాతకుని యొక్క ఆయుర్దాయం ఎన్ని సంవత్సరాలో చెప్పాలి. ఇది నా పరిశోధనలో తెలుసుకున్న నగ్న సత్యం.

ఆయుష్కారకుడు శనిగ్రహం. ప్రతి వారికి శని గ్రహం అనగానే విపరీతమైన భయాలు, ఆందోళనలు ఉంటుంటాయి. ఇది కేవలం వారి భ్రమ మాత్రమే. ఒక వ్యక్తి యొక్క ఆయుర్దాయం గాని లేక ఒక వస్తువు యొక్క జీవిత స్థితి గాని లేక ఓ వాహనం యొక్క జీవన కాల పరిమితి గాని నిర్ణయించాలంటే... మన మనస్సు మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అప్పులు చేసి, తీర్చలేక ఆత్మహత్యలు చేసుకొనే వారు చాలా మంది ఉంటారు. అంటే ఇక్కడ ఆయుర్దాయమనేది మనిషి ఆలోచన పైన ఆధారపడి ఉంది.

ఆయుర్దాయం రెండు భాగాలతో నడుస్తుంది. ఎలాగంటే ఆయుర్దాయంలోని మొదటి సగభాగంలో, మనిషి నేర్చుకొనే దురలవాట్లే మిగిలిన 50 శాతం ఆయుర్దాయాన్ని కబళిస్తాయి. మంచి అలవాట్లు ఉంటే ఆయుర్దాయం పెరుగుతుంది. దురలవాట్లు ఉంటే ఆయు క్షీణమవుతుంది. కాని మంచి అలవాట్లు ఉండి కూడా ప్రమాదాలలో మరణించే వారు ఎందరెందరో ఉంటారు. మరి ఈ ప్రమాదం ఎక్కడ నుంచి వచ్చింది... అదే ఆరవస్థానం నుంచి తెలుసుకోవాలి. ఈ ఆరవ స్థానమే ప్రమాదాలు, దురలవాట్లు, రుగ్మతలు, శత్రుత్వాలు, శతృత్వ పోకడలు మొదలైనవి.  మొదటి దశలో మంచి అలవాట్లు నేర్చుకుంటే ఆయుష్యు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

చాలా మంది వ్యసనాలకు లోబడి ఆయుష్యును కోల్పోతుంటారు. వ్యసనమన్నది మనిషిని గతం తాలూకూ ఊబిలోనే సమాధి చేసే ఓ మార్గం లాంటిది. చాలా మంది జిహ్వ చాపల్యాన్ని అదుపులో ఉంచుకోలేక, అతిగా తినటం వలన ఊబకాయం వచ్చి కదలలేని పరిస్థితిలో ఉంటుంటారు. దీనినే స్వయంకృతాపరాధం అంటారు. అంటే తమ నాలుకను అదుపులో ఉంచుకోలేని కారణంగానే ఊబకాయం వచ్చింది. జాతకంలో షష్ఠ స్థానంలో అనారోగ్య స్థితి ఉంటే కూడా అలవాట్లు లేకున్నా ఊబకాయం వస్తుంది. అంటే ఆయుర్దాయం అనేది షష్ఠ స్థాన ఫలితాల మీద కూడా ఉండి తీరుతుందన్నమాట. ఆల్కాహాల్, మాదక ద్రవ్యాలు, దుష్ప్రవర్తన,జూదం వంటి పలు స్వీయ విధ్వంసకర అలవాట్లకు చిక్కి, వాటి నుంచి బయట పడలేక పోతున్న అభాగ్యులు ఎందరెందరో.

వ్యక్తిగతమైన అలవాట్లన్నీ చెడ్డవి కానక్కర్లేదు. అలవాటును వదులుకోవటం అన్నది, చెడు నడవడికను మార్చాలన్నదానిపై దృష్టి ఉంచటం ద్వారా జరగదు. తగిన ప్రత్యామ్నాయ ప్రవర్తన గురించి స్పష్టమైన అవగాహన పెంచుకున్న ద్వారానే సాధ్యపడుతుంది.

పొగ త్రాగటం మానాలని నిర్ణయించుకొని, చుట్ట, బీడీ, సిగిరేట్లను కాలికింద నలపటం ద్వారా ప్రయోజనం ఉండదు. కాని స్వచ్చమైన గాలిని శ్వాసించటం ద్వారా మాత్రమే అది వీలవుతుంది. అనివార్యమైన అలవాట్లను ఆదిలోనే కనిపెట్టి నివారించకపోతే, అవి జీవితంలో పెను విధ్వంసాలకే దారి తీస్తాయి. అలవాట్లను మార్చుకోవటం మీదే దృష్టి అంతటిని కేంద్రీకరించే బదులుగా, ముఖ్య అవసరమైన క్రొత్త అలవాట్ల జాబితాను తయారు చేసుకొని త్వరిత గతిన నిర్ణయాలని తీసుకోవటమనే విధానాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే, నిశ్చయంగా వ్యక్తులు అదృష్టవంతులవుతారు.

దురలవాట్లను మానుకోవట మన్నది బాహ్యపరమైన సంస్కరణల కన్నా, అంతః పరమైన పరిణితి ద్వారానే మొదలవుతుంది. ప్రతి వ్యక్తి యొక్క శారీరక, భౌతిక, మానసిక, భావోద్వేగ స్థితిగతులు ఆరోగ్యానికి అద్దం పడతాయని పేర్కొంటారు. వ్యక్తి ఎన్నో ఆదర్శ లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ, ఒకే ఒక దురలవాటుకు లోబడితే అది వైరస్ లాగా మిగిలిన మంచి లక్షణాలను హరించి వేసి.. వ్యక్తి యొక్క శారీరక, మానసిక వ్యవస్థలపై దుష్ప్రభావాన్ని చూపి సమతుల్యంలేని జీవితానికి దారి తీస్తుంది.

కనుక ప్రేమ, ఔదర్యా లే ఆరోగ్యకర భౌతిక జీవనానికి విత్తనాలు. ఏ అంశాలు స్వచ్చమైనవో, ఏవి కావో, ఏవి ప్రేమానురాగమైనవో, ఏవి కావో.. ఏవి అనుకూలమో, ఏవి  ప్రతికూలమో మొదలైన అంశాలన్నింటిని క్షుణ్ణంగా చెప్పగలిగే శక్తి బుద్ధి కారకుడైన బుధ గ్రహానికి మాత్రమే ఉంటాయి. చంద్రుడు మనసుకు కారకుడు. బుధుడు బుద్ధికి కారకుడు. అనుకూలంగా లేక వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొనే శక్తి చంద్రుడికి మాత్రమే ఉంది. కాని ఖచ్చిత నిర్ణయాలని తీసుకోలేడు. అందుకోసమే బుద్ధిబలంతో మానసిక స్థితి గతులను అంచనా వేసుకుంటూ చక్కని నిర్ణయాలను తీసుకోవాలి. ప్రస్తుతం వృశ్చిక రాశిలో రవి గ్రహ, శని గ్రహ కలయిక సందర్భంగా ప్రతివారు బుద్ది బలంతో నిర్ణయాలు తీసుకుంటే, వ్యక్తే కాకుండా సమాజమే కాకుండా దేశం యావత్తూ శాంతి ఏర్పడటానికి అవకాశం తప్పక ఉంటుంది. కనుక మనస్సు చేసే వ్యతిరేక నిర్ణయాలను బుద్ధిబలంతో కట్టడి చేయటానికి ప్రయత్నం చేయండి.

రాబోయే 2016లో ఇంతకంటే అధికంగా వ్యతిరేక గ్రహసంచార స్థితిగతులు రానున్నవి. కనుక సంయమనం పాటిస్తూ నేను చెప్పే విశ్లేషణలకు పెద్ద పీట వేస్తూ ముందుకు వెళ్ళగలిగితే, ప్రతివారికి శుభత్వమ్ ఆపాదిస్తుంది. - పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Friday, November 20, 2015

రవి, శనుల కలయికతో మానస సరోవరం మహా సాగరం కానున్నదా?

ఆధ్యాత్మికపరంగా వ్యక్తికున్న సప్త శరీరాలలో చతుర్థ శరీరమే మానసిక శరీరం. ఈ మనస్సును ఎల్లప్పుడూ ప్రసన్నంగానే ఉంచాలి. రాగ ద్వేషాలను పోషించకుండా  సంహరిస్తుండాలి. చిత్తం యొక్క మలినమే మనస్సు యొక్క దోషం. చిత్తముకు గల ప్రసన్నతే సద్గుణము. ఈ సద్గుణమును హడావిడిగా ప్రతివారు పొందలేకపోవచ్చు. కాని నవవిధ వ్యక్తులతో సన్నిహితంగా ఉండేవారు ప్రప్రధమంగా ఈ దిగువ చెప్పిన అంశాలలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి.

1. ఆయుధాలు కల్గి ఉన్నవారితో ఆయుధాలు లేని వారు శత్రుత్వాన్ని కల్గి ఉండరాదు.
2. తన రహస్యాలను వారితో తప్పు చేసిన వ్యక్తి (దోషి) పగ, ప్రతీకారాలతో మెలగరాదు.
3. ఓ యజమాని దగ్గర పని చేసే నౌకరు శత్రుత్వంతో అసలు ఉండకూడదు.
4. దుష్ట  స్వభావులతో... సాత్విక స్వభావ సిద్ధి గల మంచివారు శత్రుత్వం లేకుండానే మెలగాలి.
5. సంపన్న వర్గీయుడితో పేదరికం ఉన్న వ్యక్తి శత్రుత్వం కలిగి ఉండరాదు.
6. శూర, వీరులతో స్తుతించే వారు శత్రు లక్షణాలకు దూరంగా ఉండాలి.
7. ఓ కవి శత్రు పోకడలతో ఉన్న కవిత్వాన్ని మహారాజుకు వినిపించకూడదు.
8. వైద్యులతో రోగులు మిత్రత్వాన్నే కోరుకోవాలి.
9. నిత్యం కడుపు నింపే అన్నదాతతో శత్రుత్వంతో సంభాషించరాదు.

పై నవవిధ వ్యక్తులతో ఎవరైతే శత్రు విరోధ లక్షణాలు లేకుండా ఉంటారో వారు సుఖంగా ఉంటారు. ఈ శత్రు విరోధ లక్షణాలను అనుకోకుండా తెరపైకి తెచ్చే గ్రహ స్థితులు ఉన్నప్పుడు ప్రతివారు అతి జాగరూకులై అప్రమత్తతతో వ్యవహరించాలి. కనుక భావోద్రేకాలు సంయమనం పాటిస్తూ... సమయస్పూర్తితో, సమయానుకూలంగా మనస్సనే వానరాన్ని అధిక అప్రమత్తతతో నడిపించాల్సిన అవసరం ప్రతి వారి విషయంలో ఎంతైనా ఉన్నది. హడావుడి పడితే మొదటికే మోసం వస్తుంది. కేవలం తమకు తాముగా పరిధిని దాటకుండా ప్రేక్షకులుగా వ్యవహరిస్తూ జీవన సమరంలో విధి నిర్వహణ చేయాలి.

పట్టుదల, శ్రమ, మేధస్సు వల్లనే అద్భుతాలు జరుగుతాయి. ఈ మూడింటి సమాహారమే పురాణం, ఇతిహాసాలలో మనం చెప్పుకొనే మహిమలు, మహత్తులు. ఓ సరియైన జ్ఞానాన్ని మానవాళికి అందించేందుకు ఋషులు, యోగులు శ్రమించారు. సృష్టి రహస్యాలను అద్భుత రచనల ద్వారా మనకందించారు. అటు ఆధ్యాత్మికము, ఇటు విజ్ఞానము కలబోతగా ఉండి యుగాలు మారినా, జగాలు మారినా దివ్య ప్రభోదాలుగా, మార్గదర్శకాలుగా నిలిచాయి. మానవుడిని మాధవుడిగా చేసేవిగా పవిత్రంగా పురాణ ఇతిహాసాలు భాసిల్లుతున్నాయి. దేవతలను బలోపేతుడుగా చేసేందుకు అమృతాన్ని సాధించేటందుకు, మంథర పర్వతాన్ని కవ్వంగా మలుచుకొని, వాసుకిని తాడుగా చేసుకొని పాలకడలిని మధించమని దేవ దానవులతో చెప్తాడు శ్రీ మహావిష్ణువు. స్థితి, గతి స్వరూపమే ఆయన. స్థితిని బట్టే, గతి ఉంటుంది, గతిని బట్టే స్థితి ఉంటుంది. ఈ స్థితి గతులను నిర్ణయించేదే మహా సాగరమనే మనస్సు. కనుక కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు. కారణమేమిటంటే ఆ కృషి వెనుక సరియైన సారధ్యం వహించేది మనస్సు మాత్రమే.

మరి రవి శనుల కలయిక వలన నవంబర్ 30 నుంచి ప్రతి వారి విధి నిర్వహణలో ఎదురయ్యే ఆటుపోట్లు, అస్థిరతలు, ఆటంకాలు ఎలా ఉంటాయో, దానికి తగ్గ కృషి ఎలా చేస్తే గ్రహస్థితి వ్యతిరేక పంథా నుంచి విజయం చేకూరుతూ మన మనో సాగరం రాజహంసలు  విహరించే మానససరోవరం కావాలంటే తదుపరి పోస్టింగ్లో తెలుసుకుందాం. - శ్రీనివాస గార్గేయ

నవంబర్ 30 రవి, శనుల కలయికతో తీవ్ర పరిణామాలా?

ఆధ్యాత్మికపరంగా ఓ వ్యక్తి సప్తవిధ శరీరాలతో ఉంటాడు. ఇందులో మొదటిది భౌతికమైనది. బాహాటంగా అందరికీ కనపడేది. రెండవది భావ శరీరము. ఇక మూడవది సూక్ష్మ శరీరము. నాల్గవది మానసిక శరీరము. పంచమ శరీరమే ఆధ్యాత్మిక శరీరం. విశ్వ శరీరమనేది ఆరవభాగంగా ఉంటుంది. చిట్ట చివరిది నిర్వాణ (మరణం) శరీరం.

పై సప్త శరీరాలలో నాల్గవదైన మానసిక శరీరానికి ఈ నెలలో ఓ సమస్య రావటానికి అవకాశాలను అందిస్తున్నాయి గ్రహస్థితులు. భారత కాలమాన ప్రకారం 2015 నవంబర్ 30 ఉదయం 5 గం.49 నిముషాల నుంచి ప్రతి వ్యక్తీ ఆలోచించే ప్రతి అంశంలోనూ ఓ వ్యతిరేకత ఉండి తీరుతుంది. శతాబ్దాల తర్వాత వస్తున్న ఓ గ్రహస్థితి ప్రతి వ్యక్తీ ఆలోచనా తరంగాలపై సమ్మెట పోటు వేయనున్నది.

ప్రతి మనిషిలో ఓ ఆలోచన ధోరణి ఉంటుంది. అది అనుకూలం కావచ్చు. ప్రతికూలం కావచ్చు. కానీ గ్రహచార స్థితిగతుల ప్రకారం 2015 నవంబర్ 30 సోమవారం నాడు వృశ్చిక రాశిలో ఉదయం 5 గం.49నిముషాలకు ఖగోళంలో రవి గ్రహ, శని గ్రహ కలయికలు జరుగుతున్నాయి.

మనః కారకుడైన చంద్రుని యొక్క వారమైన సోమవారం నాడు పుష్యమి నక్షత్రంలో ఈ అరిష్ట గ్రహస్థితి చోటు చేసుకోబోతున్నది. వ్యక్తి బడుగు జీవి కావచ్చు, లేదా ప్రధాని కావచ్చు. ఎవరు ఎవరైనప్పటికీ భారతదేశంతో పాటు, భారతదేశంతో పాటు పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యునైటెడ్ కింగ్డమ్ మరియు తూర్పు మధ్య దేశాలపై ప్రభావం వ్యతిరేకంగా ఉండనుంది. 

సెప్టెంబర్ మాసం నుంచి ప్రారంభమైన  106 రోజుల వ్యతిరేక అరిష్ట గ్రహస్థితుల ప్రభావం వాతావరణ, ప్రాకృతిక (భూకంప ఇత్యాదులు), రాజకీయ, వాణిజ్య, ఆధ్యాత్మిక, సంగీత, సినిమా, రోడ్డు రైలు విమానయానములతో పాటు ద్వాదశ రాశులపై ప్రభావము ఉండునని గతంలోనే చెప్పటం జరిగింది. అయితే ఇది కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అతి ముఖ్య రంగములపైన ప్రభావముండునని చెప్పటం జరిగింది. సెప్టెంబర్ నుంచి ఇంతవరకు భూకంప అంశాలను తీసుకుంటే దిన పత్రికలు, టీవీలలో తెల్పినవి కూడా పరిశీలిస్తే, మొన్నటి నెల్లూరులో జరిగిన ప్రకంపనలు, నిన్న 5.3 గా నేపాల్ లో వచ్చిన భూకంపము,ఈరోజు జపాన్లో 6.3గా వచ్చిన భూకంపం వరకు విశ్లేసిస్తే ఈ పోస్టింగ్ పెట్టే సమయానికి  106 రోజుల వ్యతిరేక స్థితులలో ప్రాకృతిక భూకంప తీవ్రతలు ఇంతవరకు 6.3 కంటే అధికంగా 23 ప్రాంతాలలోను, 5.0 కంటే తక్కువగా అనేక ప్రాంతాలలోను (ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది) వచ్చినవి.  అలాగే ఘోర విమాన ప్రమాదాలు, జల ప్రమాదాలతో పాటు అనేక వ్యతిరేకతలు కూడా ద్వాదశ రాశులలో ఉన్న వ్యక్తులకు ఆపాదిస్తున్నాయి.

ఈ 106 రోజుల వ్యతిరేక అరిష్ట గ్రహస్థితులలో భాగంగా నవంబర్ 30 న భారత కాలమాన ప్రకారం 5గం.49 నిముషాలకు ఖగోళంలో శని గ్రహం మరియు సూర్యుడు ఒకే బిందువులో కలవనున్నారు. ఆనాడు చంద్రుడు పుష్యమి నక్షత్రంలో కర్కాటక రాశిలో ఉంటాడు. ఈ గ్రహ సంచారాలను విశ్లేషిస్తే దీని ప్రభావాలు ముఖ్యంగా రాజకీయ రంగంపైన, పరిపాలనా రంగాలపైన వ్యతిరేక ప్రభావాలు ఉంటుంటాయి. ప్రతివారి మనస్సు వ్యతిరేకంగా ఆలోచన చేయటము, నిర్ణయాలు తీసుకొనటానికి ప్రయత్నించటం జరుగును.

ప్రతి రాశిలోను మధ్య నక్షత్రంపై 50 శాతం ప్రభావం చూపును. మధ్య నక్షత్రానికి అటువైపు ఇటువైపు ఉండే నక్షత్రాలపై 25 శాతం వ్యతిరేక ప్రభావాలను చూపును. ఉదాహరణకు మేష రాశిలో మధ్య నక్షత్రమైన భరణి జాతకులకు 50 శాతం వ్యతిరేకంగాను, అశ్విని కృత్తిక జాతకులకు 25 శాతం చొప్పున వ్యతిరేకంగా మనోభావాలు ఉండును.  ఈ ప్రకారంగా భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, పూర్వాషాడ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర జాతకులకు రవి, శనుల కలయిక ప్రభావంచే మనస్సు 50 శాతం అధికంగా వ్యతిరేక భావాలవైపు లాగుచుండును. అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్ర, విశాఖ, జ్యేష్ట, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, పూర్వాభాద్ర, రేవతి జాతకులకు 25 శాతం అధికంగా వ్యతిరేక నిర్ణయాలవైపు, ఆలోచనలవైపు మనస్సు మొగ్గుచూపుచుండును.

సెప్టెంబర్ 10 నుంచి ఇంతవరకు ప్రాకృతిక భూకంపాలు  వచ్చిన తీవ్రతను, ప్రాంతాలను, గ్రహస్తితులను దృష్టి లో ఉంచుకొని విశ్లేషిస్తే వృశ్చిక రాశిలో జరిగే రవి, శని గ్రహాల కలయిక ప్రభావం ఒక్క రోజు మాత్రమే ఉండదు. కనీసం 11 మాసాలపాటు వ్యతిరేకంగా ఉండును. రవి, శనుల ప్రభావంచే మనస్సు వివిధములైన వ్యతిరేక నిర్ణయాలను చేయును. కనుక పాఠకులు కొంత అప్రమత్తతతో ఆలోచనలు చేయాలి. ముఖ్యంగా తొమ్మిది విధములైన వ్యక్తులతో శతృత్వము, విరోధము కలిగి ఉండరాదు. ఈ నవవిధ వ్యక్తుల వివరాలు మరియు రవి శనుల కలయిక తీవ్ర ప్రభావాలు తదుపరి పోస్టింగ్లో. 

- శ్రీనివాస గార్గేయ

Thursday, November 12, 2015

2016 కాలచక్రం క్యాలెండర్ యాప్ మరియు పంచాంగం ఉచిత డౌన్లోడ్

నాచే రచింపబడిన రాబోయే 2016 కాలచక్రం క్యాలెండర్ యాప్ మరియు రాబోయే 2016-2017 శ్రీ దుర్ముఖి నామ సంవత్సర కాలచక్రం సంపూర్ణ పంచాంగం ఫ్రీ డౌన్లోడ్ చేసుకొనుటకు సిద్ధంగా ఉన్నవి.   

కాలచక్రం క్యాలెండర్లో 24 పేజీలతో ఉండి తిధి, నక్షత్ర సమయాలతో పాటు శుభముహుర్త సమయాలు, ద్వాదశ రాశులకు క్లుప్తంగా ఫలితాలు మరియు అనేక నూతన పరిహారాల వివరాలతో... యాప్ సిద్దంగా ఉన్నది. 2016 జనవరి 9న శని శుక్రుల దివ్య దర్శనం, మార్చి 9న సంపూర్ణ సూర్య గ్రహణ వివరాలతో పాటు ఉసిరిక భస్మ ధారణతో అన్యోన్య దాంపత్యము,రాహు నక్షత్రాల మధ్య వచ్చే పూర్ణిమన సంతానభివృద్ది పరిహారము, ప్రేమానుబంధం పరిఢవిల్లుటకు, విద్యలో వెనుకంజలో ఉన్నవారికి, అష్టమ అర్దాష్టమ ఏలినాటి శని దోష పరిహారము, నక్షత్రం ప్రకారం నామ నిర్ణయాలు, 20 సంవత్సరాల లోపు వయసు వారికి బుద్ది బలం పెరుగుటకు, కృష్ణా పుష్కరాలపై సోదాహరణ వివరణ, గృహ వాస్తు దోష నివృత్తికి ఓ పరిహారము, మొదలైన అనేక అంశాలతో పాటు ద్వాదశ రాశులకు క్లుప్త రాశిఫలితాలు, ఇతర శుభ ముహూర్త నిర్ణయాలు ఎన్నెన్నో ఉన్నాయి.  కనుక ఆసక్తి ఉన్నవారు యాప్ ను డౌన్లోడ్ చేసుకొని క్యాలెండర్ను వీక్షించవచ్చును. 
క్యాలెండర్ యాప్ లింక్ :
https://play.google.com/store/apps/details?id=com.mohan.kalachakramకాలచక్రం పంచాంగం లింక్ :
http://kinige.com/book/Sri+Durmukhi+Nama+Samvatsara+Kalachakram+Panchangam


భారత ప్రభుత్వ ఆమోదిత గణితమైన దృగ్గణితమ్ ప్రకారమే తిధి, నక్షత్ర సమయాలు ఉండును. ఇవి ఖచ్చితమైనవి, ప్రామాణికమైనవి, శాస్త్రీయమైనవి. నాసా వారి అంతరిక్ష కేంద్రంతో మా గణిత సమయాలు సరిపోవును. మీరు ఆచరించే ముఖ్య కార్యాలకు, ఇతర విశేష శుభ కార్యాలకు దృగ్గణిత పంచాంగాన్నే వినియోగించండి. పూర్వగణిత పంచాంగాలతో చెప్పే జాతక, ముహూర్తాలు తేడాలు వచ్చునని గమనించండి. ఈ క్యాలెండర్ యాప్ మరియు పంచాంగ ఫ్రీ డౌన్లోడ్ వివరాలను గురించి మీ బంధు, మిత్రాదులందరికి తెలియచేయండి. - శ్రీనివాస గార్గేయ

Wednesday, November 11, 2015

దీపావళి రోజున స్తోత్రాలు పఠిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందా ? - 2వ భాగం

 భారతీయుల పర్వదినాలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆచార వ్యవహారాల కలబోతగా ఉంటాయి. పండుగలలో భక్తి భావం వెళ్లి విరుస్తుంది. ఆనందోత్సవాలు ప్రతి ఇంటా తాండవిస్తాయి. ఘనమైన మన సంప్రదాయాలకు ప్రతీక దీపావళి వేడుక. పంచమ వేదమైన శ్రీ మహా భారతం అను శాసనిక పర్వంలో "దీపప్రదః స్వర్గలోకే దీపమాలేవ రాజతే" అనే శ్లోకాన్ని బట్టి మహా భారత కాలానికే దీపావళి విశేష ప్రాచుర్యం పొందినట్లుగా తెలుస్తున్నది. ధర్మ శాస్త్రాలలో పురాణ ఇతిహాసాలలో, ప్రాచీన గ్రంధాలలో దీపావళి పర్వదిన విశేషాలు ఎన్నెన్నో ఉన్నాయి. 
 
అమావాస్య తిధి ఎప్పుడు వచ్చినా అది, పితృ సంబంధమైన తిధి. ఒక దీపావళి అమవాస్యకే వేదాంత పరిభాషలో ప్రేత అమావాస్య అంటారు. ఈ ప్రేత అమావాస్య నాడు మధ్యాహ్నం 12 గంటల నుంచి పితృ దేవతలంతా ఆకాశ మార్గంలో వచ్చి నిలబడుతుంటారు. తమ సంతతి ఎలా ఉన్నారో చూడటానికే వారు వస్తారని పురాణాల కథనం. దీపావళి నాటి సాయంత్రం ప్రదోష వేళన అన్నీ పూజల కన్నా ముందుగా ఆచరించాల్సింది దివిటీలు కొట్టటం. దివిటీలు స్త్రీలు కొట్టరు. కుటుంబంలో ఉన్న మగవారిలో పెద్దవారు అనగా తండ్రి లేనటువంటి వారు గోవు కర్ర (ఎండిన గోంగూర చెట్టు కొమ్మలు) మీద వెలుగుతున్న కాగడాన్ని ఉంచి దక్షిణపు దిక్కుగా ఎత్తి చూపించాలి. ఇలా చూపిస్తూ ఆ వ్యక్తి ఏమని తలచాలంటే "నేను వేద ధర్మాన్ని తెలుసుకున్నాను. ఈ రోజు మధ్యాహ్నం భోజన సమయానికి ముందు పితృ దేవతలను స్మరించుకున్నాను. అవకాశమున్నవారు తిధి జరుపుకుంటారు లేదా ఓ ముద్ద కాకికి పెడతారు." ప్రస్తుతం చీకటిగా ఉంది. ఆకాశ మార్గం నుంచి మీరు బయల్దేరి కిందకి రండి. నేను వెలుతురు చూపిస్తున్నాను అని దివిటీ ఎత్తి చూపించాలి. దివిటీ ఎత్తి పితృ దేవతలకు చూపించే పర్వదినమే దీపావళి అమావాస్య. మనకు శరీరాన్నిచ్చి, తమ శరీరాలను విడిచిపెట్టిన పితృ దేవతలు ఆశ్వీజ మాస చిట్ట చివరి రోజున జ్యోతి స్వరూపులై అంతరిక్షంలో ప్రయాణం చేస్తుంటారు. వారిని గౌరవించాల్సిన అవసరం వారి వారి సంతతికి ఉంటుంది. ఇది చేయలేక పోయినా కనీసం తండ్రి లేని మగవారు ఇంటిలో దక్షిణపు దిక్కుగా రెండు వత్తులతో సాయంత్ర సమయంలో జ్యోతి ప్రజ్వలన చేయటం కనీస సంప్రదాయం. ఆ తర్వాతనే పితృ దేవతలకు దివిటీలతో స్వాగతాంజలి పలికిన తర్వాత దైవీ దేవతలకు పూజలు ఆచరిస్తాం.

ఈ పరంపరలోనే జ్ఞానానికి చిహ్నంగా, సమస్యలనే చీకట్లలో వెలుగు చూపించటానికి దేవతా మూర్తులకు ప్రార్ధనా పూర్వకంగా వెలిగించేవి దీపాలు. మనచుట్టూ ఉన్న చీకట్లను పారద్రోలినట్లుగానే అజ్ఞానాన్ని తరిమికొట్టే జ్ఞాన దీపాన్ని వెలిగించాలి. ఈ జ్ఞాన దీపమే అసలు సిసలైన లక్ష్మీ ఆరాధనగా పేర్కొనాలి. సాయంత్రం నుంచి ఎన్నో దీపాలను వెలిగించినప్పటికీ, జ్ఞాన దీపాన్ని మాత్రం అమావాస్య తిధి నాటి అర్ధరాత్రి (నిశీధి) సమయంలోనే వెలిగించాలి. ఈ 2015లో నిశీధిలో అమావాస్య తిధి లేదు . అందుకోసం భారత దేశంలో సాయంత్రం 5గం.49నిముషాల నుంచి 7గం.49 నిముషాల మధ్య కాలంలో నువ్వుల నూనెతోనే 8 వత్తులు లేక 5 వత్తులు లేక 2 వత్తులతో దీప ప్రజ్వలన చేయాలి.

పంచేంద్రియాలలో మొదటిదైన మన నేత్రాలతో జ్ఞాన దీప జ్యోతులను తదేకంగా కొద్దిసేపు చూస్తూ, మానసికంగా భక్తి భావంతో లక్ష్మి దేవిని స్మరించాలి. ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందీ ఆ జ్యోతి దర్శనాన్ని చేయాల్సిందే. నువ్వుల నూనెతో వెలిగే జ్యోతినుంచి వెలువడే కాంతి కిరణాలు, గుర్తించటానికి వీలులేని విధంగా వచ్చే వాయువు, మన నేత్రాలకు సోకటంతో... ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి బుద్ది సక్రమంగా పని చేయటంతో కొన్ని కొన్ని సౌశీల్య లక్షణాలు ఏర్పడుతుంటాయి. ఈ విధంగా సౌశీల్య లక్షణాలు (ద్రోహబుద్ది లేకుండటం, క్షమా గుణాన్ని కలిగి ఉండటం, దురభిమానాన్ని విడనాడటం మొదలైనవి) ఒక అమావాస్య తోనే పొందలేము. ప్రతి అమావాస్య రోజున ఇలా ఆచరిస్తూ దీపావళి అమావాస్యన విశేషంగా జ్ఞాన జ్యోతులను వీక్షిస్తుంటే అసలైన దైవీ సంపదను పొందవచ్చు. ఇట్టి దైవీ సంపదను ఎవరైతే పొంది ఉంటారో వారికి మాత్రమే మహాలక్ష్మి అనుగ్రహం, కటాక్షం లభిస్తుందని శాస్త్ర వచనం.

అంతేతప్ప సౌశీల్య లక్షణాలు లేకుండా లక్ష్మీ స్తోత్రాలన్నింటినీ పఠిస్తు ఇంటి నిండా దీపాలను వెలిగించి అనేకానేక నివేదనలు సమర్పించినప్పటికీ అనుగ్రహం ఉండనే ఉండదు. ఇది అక్షర సత్యము. అటు భగద్గీత, ఇటు మహా భారతం ఈ అంశాలను స్పష్టం చేస్తున్నాయి.

కనుకనే సౌశీల్య లక్షణాలను ఒక్క రోజులో పొందటం అసాధ్యమైన విషయం. అందుకోసం ప్రతి అమావాస్య తిధిని ఆధారంగా చేసుకుంటూ భక్తి విస్వాశాలతో పూజ మందిరంలో లక్ష్మీ దేవి చెంతన జ్ఞాన దీపాన్ని వెలిగించి... జ్యోతి పైననే దృష్టి ఉంచి, మనసును ప్రక్క దార్లకు మళ్ళించ కుండా చేతనైన రీతిలో లక్ష్మీ దేవిని ప్రార్ధించండి. (ఇలానే ప్రార్ధించాలి అనే నియమం ఏమి లేదు) మీకు నచ్చిన, మీకు మెచ్చిన ఓ తీపి పదార్ధాన్ని లక్ష్మి దేవి ముందున్న జ్ఞాన జ్యోతికి నివేదించండి. ఇంటిల్లపాది... ఒక్కొక్కరు కనీసం ఒక్కో నిముషమైనా తదేకంగా జ్ఞాన జ్యోతిని దర్శిస్తే, అనుగ్రహం  లభిస్తుంది. తెలుగు నిఘంటువులో లక్ష్మీ అనే పదానికి ఒక్కసారి అర్ధం ఏముందో గమనించారనుకోండి, బుద్ది అనేది గంధ ద్రవ్యము అని ఉంటుంది. అంటే మన బుద్ధిని సరియైన రీతిలో తీసుకొని వెళ్లి సౌశీల్య లక్షణాలను పొందుటకు తగు రీతిలో బుద్ధిని ప్రేరేపించే విధి విధానమే ఈ జ్ఞాన జ్యోతి వీక్షణ. అంతే తప్ప ఏదో పూజ మందిరంలో, ఓ పటం పెట్టి, పూలు పెట్టి నాలుగు స్తోత్రాలు చదివినంత మాత్రాన అనుగ్రహం కలగదని పాఠకులు తెలుసుకోవాలి.

చివరగా... అమావాస్య తిధికి, ఆ తర్వాత వచ్చే శుక్ల పాడ్యమి తిధులకు నిత్య తిధి దేవత పేరే కామేశ్వరి. మొత్తం 15 మంది నిత్య తిధి దేవతలు ఉంటారు. అట్టి దేవతలలో ఈ రెండు తిధుల దేవి కళగా కామేశ్వరి ఉంటుంది. కోటి సూర్యులు ఉదయించే సమయంలో ఎంత అరుణ కాంతి భాసిల్లునో అంత కాంతితో ఈ తల్లి వెలుగొందుతుంటుంది. దేవి ఖడ్గమాలలో ఈ నామాలు చెప్పబడతాయి. ఏతా వాతా పాఠకులకు తెలియచేసేది ఏమిటంటే కేవలం టపాసులు విపరీతంగా కాల్చి, వాటి ద్వారా వచ్చే విషవాయువులచే ఇతరులు ఎంతో మంది భాదపడతారేమో అనే విషయాన్ని గ్రహించి భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలకు సరియైన రీతిలోనే పర్వదినాన్ని ఆచరిస్తారని మనసార కోరుకుంటూ... ఓపికగా చదివి ఆకళింపు చేసుకున్న ప్రియ పాఠకులందరికి హృదయ పూర్వక దీపావళి పర్వదిన శుభాకాంక్షలతో.... మీ శ్రీనివాస గార్గేయ

Tuesday, November 10, 2015

దీపావళి రోజున స్తోత్రాలు పఠిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందా ?

మానవుని జోతిర్మయ జీవనానికి సంకేతం దీపావళి. జ్యోతిస్సాక్షాత్కారం కోసం ఇహ పర సౌఖ్యాలు పొందటానికి మానవుడు జరుపుకొనే పర్వదినమే దీపావళి. మరి నరకాసుర వధకు సంతోష ప్రయత్నంగా బాణసంచా కాల్చారని పురాణం కథనం. మహా విష్ణువు వామన రూపంలో బలి చక్రవర్తిని పాతాళానికి అణగద్రొక్కినందునే దీపాలను వెలిగించి ఉత్సవం జరుపుకున్నారని మరో పురాణం కథనం. శ్రీ రాముడు రావణ సంహారం చేసి, చతుర్దశి రోజున పట్టాభిషేకం జరుపుకున్నాడని, అందుకే దేవతలు, మునులు మానవులు దీపాలను వెలిగించి సంతోషంతో పండగ చేసుకున్నారని, అదే దీపావళి అని మరో పురాణ కథనం. కాళికా మాత దీపావళి నాడే రాక్షస సంహారం చేసి ప్రళయ భావావేశంలో జీవరాశులన్నిటినీ నాశనం చేయటానికి ఉపక్రమించగా.. పరమేశ్వరుడు ఆ శక్తి ఎదుట నిలబడి ఆమె కోపోద్రేకాన్ని తగ్గించి, ఆమెని శాంతపరిచెనని మరో పురాణ గాధ. ఈ గాధ శత్రు సంహార కాలమున భయంకరమైన వారిపై సంహారం చేయాలని విశ్వశాంతికి భంగం వాటిల్లకూడదని ఓ సందేశాన్ని బోధిస్తుంది.

పై పురాణ గాధలు ఎన్ని ఉన్నప్పటికీ మనలోని అజ్ఞామనే అంధకారాన్ని జ్ఞానకాంతులు పెంపొందేలా  దీపాలను వెలిగించాలని మనం చెప్పుకుంటున్నాం. ఇంతవరకు బావుంది. బాణసంచా కాలుస్తున్నాం. దీపాలను వెలిగిస్తున్నాం. మరి లక్ష్మీ పూజ ఎందుకు?

దీపావళి పండుగకి, లక్ష్మీ పూజకు అసలు సంబంధం ఏమిటి? అసలు దీపావళి రోజున దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చటానికి వైజ్ఞానిక పరంగా ఓ అంతరార్ధం ఉంది. అదేమంటే ఆశ్వీజ, కార్తిక మాసాలు శరదృతువులో వస్తాయి. దీనికి ముందు వచ్చే శ్రావణ, భాద్రపదాలు వర్షఋతువుకి  చెందినవి. భారీ వర్షాల వలన క్రిమి, కీటకాదులు, దోమలు అధికమవుతుంటాయి. శరదృతువులో సూర్యుడు తులా రాశిలోకి వచ్చి భూమికి దూరమవుతుంటాడు. ఈ కారణంగా అంటువ్యాధులు, ఇతర సంబంధిత రుగ్మతలు నిర్మూలించటానికై పూర్వపు రోజులలో బాణసంచా కాల్చినందు వలన వెలువడే విష వాయువులచే క్రిములు నశిస్తాయని, దీపావళి నుంచి కార్తీకం చివరివరకు నిత్యం దీపాలు వెలిగించినందున... ఆ దీప కాంతులకు కొన్ని కీటకాలు ఆకర్షింపబడి... అగ్ని ప్రభావంచే చనిపోతుంటాయి. ఇది పూర్వీకుల ఆలోచన.

కాలం మారింది, ఋతు ధర్మాలే మారిపోతున్నాయి. ప్రతి ఇంతా దోమలు రాకుండానే కట్టుదిట్టంగా దోమతెరలతో పాటు రాత్రి సమయాలలో దోమలను సంహరించే మస్కిటో లిక్విడ్స్ విపరీతంగా వాడుతున్నారు. కేవలం నరకాసుర వధ జరిగిందనే ఆనందోత్సవాలతో బాణసంచా కాల్చాలనే ఓ ఆచారం ప్రస్తుతం వెర్రితలలు వేయటం విచారకరం. 70 అడుగుల నరకాసుర బొమ్మలను తయారుచేసి లక్షల రూపాయల ఖరీదుతో ఉన్న బాణసంచా కాల్చటం చేత వాటినుంచి వెలువడే విష వాయువులు ప్రజలకు, చిన్నారులకు, వృద్ధులకు ఎటువంటి సమస్యలు వస్తున్నాయో  ఎవరూ ఊహించటం లేదు. అసలే పొల్యుషన్ పిశాచి నగరాలలో స్వైర విహారం చేస్తుంటే దీనికి తోడు మూకుమ్మడిగా చేసే నరకాసుర వధ అనే కోలాహలంతో వెలువడే విష వాయువులు, ఇంటింటా వేలాదిగా డబ్బు ఖర్చుపెడుతూ రణగన ధ్వనులు వచ్చే బాణసంచాలను కాల్చటం ఎంత వరకు సమంజసం.

విజ్ఞాన శాస్త్రాన్ని మానవ కల్యాణానికి దోహదపడేలా చూసుకోవాలె తప్ప మానవ వినాశనానికి నాంది కాకూడదు. భారీ నగరాలలో ఈ పర్వదినాన కాల్చిన బాణసంచా వ్యర్ధాలను వేలాది లారీలలో తరలించి, తిరిగి వాటిని ప్రభుత్వాల వారు కాలుస్తారు. వాటినుంచి వచ్చే పొగ, విషవాయువులు ఎంతటి ప్రమాదకరమైనవో ఎవరూ ఊహించరు.

అసలు ఎవడీ నరకాసురుడు ? ఈరోజుకి, లక్ష్మీ పూజకు సంబంధం ఏమిటి అనే అంశాలను కొంత తెలియచేయటానికి ప్రయత్నిస్తాను. సూర్యుడు, చంద్రుడు ఎదురెదురుగా అంటే 180 డిగ్రీల కోణంలో ఉంటే పూర్ణిమ తిధి వస్తుంది. అలా కాక ఈరెండూ గ్రహాలూ కలిసిపోతే అమావాస్య వస్తుంది. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు. అమావాస్య తిధిన సూర్యుడు నుంచి వచ్చే కాంతి కిరణాల స్థితి మరియు అమావాస్య నాటి రాత్రి అంధకార స్థితిని సమన్వయము చేసుకుంటూ వెలిగించే జ్యోతులను పంచేద్రియాలలో ఒకటైన మన కనుల ద్వారా తదేక దృష్టితో వీక్షించటమే నిజమైన లక్ష్మీ పూజ.

అలాకాకుండా లక్ష్మీ దేవికి చెందిన అష్టోత్తరాలు, సహస్రనామాలు, శ్రీసూక్తము ఇత్యాదులు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిని పఠించిన వారికే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందా ? ఎలాంటి పాండిత్యం లేని విద్యాబుద్ధులు లేని పూజ ఎలా చేయాలో తెలియని వారికి లక్ష్మీ దేవి అనుగ్రహం లభించదా? అసలు ఈ పర్వదినాన లక్ష్మీ అంటే అర్థం ఏమిటి ? కేవలం డబ్బే ప్రధానంగా భావించి చేసే పూజనా ? కాదు.. కాదు.. కాదు... కానే కాదు. మరి ఏమిటి ?

ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వి అనే పంచ భూతాలతో ఏర్పడినదే ప్రపంచం. ఈ పంచభూత ప్రకృతే సూక్ష్మాంశంగా మారి 25 తత్వాలతో స్థూలదేహం ఏర్పాటు కాబడింది. పంచ భూతాలలోని ఆకాశం వల్ల కలిగిన జ్ఞానం, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే 5 తత్వాలను అంతఃకరణాలు అంటారు. వీటికి భిన్నమైన కార్యాచరణ ఉంది. ఇవి గుణ ప్రకృతులు. వాయువు, అగ్ని, జలం, పృథ్వి అనే నాలుగు భూతాలలోని సూక్ష్మాంశాలను జడ ప్రకృతులు అంటారు.

ఈ 25 తత్వాలతో పంచ భూతల సమిష్టితో స్థూలదేహం... సూక్ష్మ దేహంగా మారి దేహాన్ని, దేహిని నడిపిస్తుంటాయి. అందులో అంతర్గతంగా ఉన్న దివ్యమైన శక్తే ఆత్మ. అంతఃకరణాల కార్యాచరణ పరిశీలిస్తే జ్ఞానం సర్వాన్ని గుర్తిస్తుంది. మనసు దానిని సంగ్రహిస్తుంది. బుద్ధి అనేది అందులోని మంచి చెడులను నిర్ణయించి చిత్తానికి అప్పగిస్తుంది. చిత్తంలో ఏర్పడిన ధృడ భావం స్థిర సంకల్పంగా ఉండి... ఎన్నటికీ చెదిరిపోదు.

మనలో ఉన్న జ్ఞాన శక్తి ఒక విషయాన్ని గుర్తిస్తుందే తప్ప దానిలో ఉండే వాస్తవాన్ని గ్రహించలేదు. అందుకోసం ఆ విషయాన్నీ మనసుకు అందిస్తుంది. ఈ మనసు విషయానికి వస్తే ఇదో చంచలమైనది. దీనికో రెండు దోషాలున్నాయి. ఒక్కోసారి మంచివైపు, ఒక్కోసారి చెడువైపు లాగుతుంటుంది. నిర్ణయించే శక్తి మనసుకు లేనే లేదు. అలాంటప్పుడే బుద్ధికి పని తగులుతుంది. ఆ విషయాన్ని సక్రమంగా విశ్లేషణ చేసి మంచి ఏది ? చెడు ఏది ? సమ్మతమా ? అసమ్మతమా ? అంగీకరించాలా? త్రోసిపుచ్చాలా? ఈ విధంగా బుద్ది ఆలోచన చేసి ఓ చక్కని నిర్ణయాధికారంతో చిత్తానికి తేల్చి చెబుతుంది. చిత్తంలో ఏర్పడిన ధృడమైనటువంటి భావమే నేను అనేటువంటి వ్యక్తి నిర్వహించి కార్యరూపం చేస్తాడు. కనుక అంతఃకరణాల మధనంలో బుద్ది పాత్ర చాలా కీలకమైనది. బుద్ధిని సానబట్టి మెరుగులు దిద్దితేనే బుద్దిమంతుడవుతాడు.

మంచి చెడులకు బుద్దే కారణమని గీతాచార్యులు చెబుతారు. కర్ణుడు విశేషమైన శక్తి సంపన్నుడైనప్పటికీ చెడ్డ బుద్దులవారితో సహవాసం చేసి చెడిపోయాడు. కైకేయి మంధర చెప్పిన మాటలు విని తన స్వబుద్ధిని కోల్పోయి రామ పట్టాభిషేకాన్ని చెడగొట్టింది. రావణుడు దుర్భుద్ది  వల్లే నేలకొరిగాడు. కనుక బుద్ధిని నియంత్రించుకుంటూ సంస్కారమనే కొలమానికలను రాబట్టాలి.

ప్రతి మనిషి సంపాదించాల్సిన అసలైన సంస్కారమనే సంపద ఒకటి ఉంది. ఆ సంపదే లక్ష్మీ దేవి. ఇక్కడ లక్ష్మీ అంటే డబ్బు అని అర్ధం కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ సంపద పేరు శీలం. మనిషిని జ్ఞాన పథం వైపు నడిపిస్తూ జ్ఞాన కాంతులు నింపే  శీలం చేతనే శోభిస్తుంది. ఇటువంటి ఉత్తమ సంపదను పొందటానికి కొన్ని అర్హతలు ఉన్నాయని భగవద్గీతలోని 'దైవాసుర సంపద్విభాగ యోగమనే' 16వ అధ్యాయంలో కృష్ణ పరమాత్ముడు ఓ శ్లోకం చెప్పాడు... ఏమంటే... తేజస్సు, క్షమా, ధైర్యం, బాహ్య, ఆంతరంగిక శుద్ది, ద్రోహబుద్ది లేకుండా ఉండటం, దురభిమానాన్ని విడిచిపెట్టటం అనే గుణాలు దైవీ సంపదగా పేర్కొన్నాడు. ఉత్తమమైన శీలవంతుడు ఈ శ్లోకంలో చెప్పిన సంపదలన్నింటినీ (లక్ష్మీ) సంపాదించుకుంటే సమాజంలో అందరి చేత శభాష్ అనిపించుకోవటంలో సందేహం ఉండబోదు.

అందుకే మహాభారతంలోని శాంతి పర్వం మూడవ అధ్యాయంలో మనకి ఒక  కథ కనపడుతుంది. ధర్మరాజు సంపాదించిన సంపదలతో సమానమైన సంపద పొందాలంటే... మొట్ట మొదట సౌశీల్యాన్నీ సంపాదించాలని ధృతరాష్ట్రుడు దుర్యోధనుడకు ఆ కథ వివరిస్తాడు. పూర్వం ప్రహ్లాదుడు సౌశీల్యంతోనే ఇంద్రుడి  రాజ్యాన్ని జయించాడు. పదవి పోయిన ఇంద్రుడు దేవ గురువు దగ్గరికి వెళ్లి తన బాధను చెప్పి ఉపాయం చెప్పమంటాడు. తన దగ్గర ఉపాయం లేదని శుక్రాచార్యుల దగ్గరకు వెళ్ళమని దేవ గురువు సలహా ఇస్తాడు. శుక్రుడు కూడా తన వాళ్ళ కానే కాదని ప్రహ్లాదుడి దగ్గరకే పొమ్మని ఇంద్రునికి సూచిస్తాడు. ఈ సూచన మేరకు ఇంద్రుడు ఓ సాధారణ వేద పండితుడి రూపంలో ప్రహ్లాదుడి దగ్గరకు వెళ్ళాడు. ఆ సాధారణ పండితుని చూసి ప్రహ్లాదుడు భక్తితో నమస్కరించి ప్రస్తుతం తనకు తీరిక లేదని చెప్పాడు. అయినప్పటికీ పండితుని రూపంలో ఉన్న ఇంద్రుడు నిరీక్షిస్తూ ప్రహ్లాదుడి ముందే నిల్చున్నాడు. ఆ పండితుని సహనానికి మెచ్చుకొన్న ప్రహ్లాదుడు... వరం కోరుకోమన్నాడు. నీ శీలాన్ని నాకు అనుగ్రహించమని మారు వేషంలో ఉన్న ఇంద్రుడు అడిగాడు. ప్రహ్లాదుడు మొదట సందేహించినా, వేద పండితుని రూపంలో ఉన్న ఇంద్రుడి అసమాన తేజస్సును చూసి మాట తప్పితే మంచిది కాదని అనుకొని... వెంటనే తన శీలాన్ని ధారాదత్తం చేశాడు. మారువేషంలో ఉన్న ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ప్రహ్లాదుడు శీలాన్ని ఇంద్రుడు గ్రహించిన వెనువెంటనే... ప్రహ్లాదుడి శరీరం నుంచి ఓ ఛాయ రూపంలో ఓ ఆకారం వెలుపలికి వచ్చింది. దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న  ఆ ఆకృతిని (ఛాయా) చూసి  ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు ప్రహ్లాదుడు. నేను నీ శీలాన్ని.. ఆ పండితునికి దానం చేశావు. కనుక అతని దగ్గరకు వెళ్తున్నాని చెప్పి వెళ్ళిపోయింది. మరుక్షణంలోనే లక్ష్మీ దేవి ప్రహ్లాదుడి ముందు ప్రత్యక్షమై.. ఓ రాజా ఇంతకాలం నీవు శీలం కలిగి ఉన్నందునే  నిన్ను ఆశ్రయించి ఉన్నాను. ప్రస్తుతం నీవు శీల రహితుడివి. నీ దగ్గర నేనిక నిలవలేను అంటూ లక్ష్మీ దేవి వెళ్ళిపోయింది.

కనుక ఈ ఆధునిక సమాజంలో ప్రతి వ్యక్తి  అజ్ఞానాన్ని వీడి  జ్ఞానకాంతులు నింపే శీలం అనే లక్ష్మీ సంపదను పొందినప్పుడే  కీర్తి ప్రతిష్టలతో తులతూగుతారు. మరి ఈ దీపావళి పర్వదినాన జ్ఞాన కాంతులు నింపే శీల సంపదను పొందటానికే లక్ష్మీ పూజను ఆచరించాలని పెద్దల మాట. ఇట్టి శీల సంపదను పొందటానికి లక్ష్మీ దేవి ఫోటో ముందు కూర్చొని స్తోత్రాలు చదివినంత మాత్రాన ఈ దైవీ సంపదను పొందగలమా? ఎలా పొందాలో తదుపరి పోస్టింగ్లో చూడండి.

Wednesday, November 4, 2015

నవంబర్ 7 మహా వజ్రేశ్వరి దేవి చెంతన గురుగ్రహం

దేవి ఖడ్గమాలలో కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నా, భేరుండా, వహ్నివాసిని, మహా వజ్రేశ్వరి, శివదూతి, త్వరితా, కులసుందరి, నిత్య, నీలపతాకా, విజయా, సర్వమంగళా, జ్వాలమాలిని, విచిత్రా అను 15 మంది నిత్య దేవతలు ఉంటారు. వీరు శుక్ల పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు ప్రతి రోజు కనపడే చంద్రుని యొక్క దేవి కళగా ఉందురు. బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న తిదులకు ఈ దేవతలే వెనుక నుంచి ముందుకు లెక్కించాలి. ఈ పరంపరలో 8వ తిధి దేవత త్వరితా. ఈమె శుక్ల పక్షంలోను, కృష్ణ పక్షంలోను ఒకరే. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అష్టమిచంద్రవిభ్రాజా అని ఉండును.
 

అయితే మహా వజ్రేశ్వరి అను దేవతా నామము  లలితా సహస్రనామ స్త్రోత్రంలో 468 గా ఉండును. ఈ దేవత శ్రీమన్నగరంలో 12వ ప్రాకారంపై జలంధర పీఠంపై పరివేష్టితురాలై ఉంటుంది. ఈ దేవత శుక్లపక్ష షష్టికి, బహుళ దశమికి దేవి కళగా విరాజిల్లుతుంటుంది. 

నవంబర్ 6 శుక్రవారం నాడు గురుగ్రహం చెంతకు ఆశ్వీజ బహుళ దశమి చంద్రుడు వస్తాడు. ఈ చంద్రుడిని మహా వజ్రేశ్వరి దేవికళ అని పిలుస్తారు. 6 శుక్రవారం ఉదయం సూర్యోదయాని కంటే ముందు తూర్పు దిశన గురుగ్రహం పక్కనే దశమి చంద్రుడు కనపడతాడు. చంద్రున్ని దర్శిస్తూ, చంద్రునిలో మహా వజ్రేస్వరీ దేవి రూపాన్ని దర్శించుకొనండి. ఈమె కెంపులతో పొదిగిన కిరీటాన్ని ధరించి రక్తవర్ణంగా ఉంటూ ఎర్రని వస్త్రాలను ధరించి 4 భుజాలతో ఉంటుంది. కుడివైపున ఒక చేతిలో దానిమ్మ పండు, ఎడమవైపు ఒక చేతిలో చెరకు గడలు ఉంటాయి. మిగిలిన చేతులలో పాశము, అంకుశాలు ఉండును. ప్రత్యేకంగా ఆనాడు  సూర్యోదయం కంటే ముందే మీరు కూడా అవకాశం ఉంటే భక్తితో దానిమ్మ పండును చేత పట్టుకొని గురుగ్రహం చెంతనున్న మహావజ్రేశ్వరి దేవిని వీక్షించండి. ఆ పండును కుటుంబ సభ్యులందరూ విశ్వాసంతో ప్రసాదంగా స్వీకరించండి. వాస్తవానికి గురు గ్రహం చెంతకు తరచుగా చంద్రుడు వస్తున్నప్పటికీ దశమి నాటి చంద్రుడు సూర్యోదయ శుభవేళలో ఆశ్వీజ మాసంలో కనపడటం అరుదైన సంఘటన. కనుక మహా వజ్రేశ్వరి దేవి అనుగ్రహానికి పాత్రులు కండి. కనపడేది చంద్రుడైనప్పటికీ ఆ చంద్రునిలో పైన చెప్పిన దేవి రూపకళను ఊహిస్తూ ధ్యానించండి, ప్రార్ధించండి, కీర్తించండి.

నవంబర్ 7 శనివారం రమా ఏకాదశి పర్వదినాన శుభగ్రహమైన శుక్రుని చెంతకు ఏకాదశి చంద్రుడు (వహ్నివాసిని దేవికళ) ఉండటం చూడగలం. కనుక ఈ అద్భుత గ్రహదర్శనాలని సూర్యోదయం కంటే ముందే మనం వీక్షించే అవకాశం కల్గనుంది.  - శ్రీనివాస గార్గేయ