Friday, April 4, 2014

ఆదివారం ఆరుద్రా నక్షత్రంలో గురు చంద్రుల సయ్యాట

ద్వాదశాదిత్యులలో 11 వ ఆదిత్యుడైన అయిన పూషుడు మాఘ మాసానికి అదిదేవత. ఈ పూష దేవత ప్రజలందరికీ జయమును చేకూర్చుటకు, ఒక చేతిలో శంఖమును, ఒక చేతిలో చక్రమును కలిగి 'జయ' అనే నామధేయము కలిగిన శ్రీ సూర్య నారాయణుడైన... శ్రీమహా విష్ణువు అధిపతిగా ఉన్న సంవత్సరమే శ్రీ జయ. మాఘమాసానికి అధిపతిగా ఉన్న సూర్యునిపేరే పూష. ద్వాదశాదిత్యులలో 11వ దేవతా స్వరూపం. 

ఆదివారం సప్తమి తిథి వస్తే దానిని భాను సప్తమి అంటారు. అయితే ఆదివారం నాడు శుక్ల సప్తమి వసంతఋతువులో వస్తే దానిని విజయ సప్తమి అని కూడా అంటారు. ఇట్టి విజయసప్తమి 2014 ఏప్రిల్ 6వ తేది ఆదివారం రావటం జరిగింది. వసంత నవరాత్రులలో భాగంగా ఈనాడు సూర్య దమన పూజ చేయటం ఆనవాయితీ. మరొక ముఖ్య విశేషం ఏమిటంటే ఏప్రిల్ 6వ తేది ఆరుద్రా నక్షత్రం రావటం మహా విశేషం. ఇట్టి ఆరుద్రతో కూడిన శుక్ల సప్తమి గల ఆదివారం నాడు భక్తి విశ్వాసాలతో సూర్య వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. అవకాశాన్నిబట్టి గోమూత్రం, గోమయం, ఆవుపాలు, పెరుగు, నెయ్యి, కుశజలమ్, తెల్లని మట్టి, నువ్వులు, ఆవాలతో అభ్యంగన స్నానం ఆచరించి సూర్యారాధన చేసేవారు ఉంటారు. ప్రస్తుత రోజులలో ఇవన్నీ ఆచరించే వారు అరుదుగా ఉంటారు. కేవలం ఆదిత్య హృదయం పారాయణం చేస్తూ... సూర్యారాధన చేసేవారే అధికం. 

ఏది ఏమైనప్పటికీ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పవిత్రమైన విజయ సప్తమి రోజున నీల వస్త్రాన్ని ధరించరాదు. ఉసిరిక కాయ పచ్చడిని తినరాదు. ఉసిరికతో చేసిన తైలాన్ని (ఆమ్లా ఆయిల్ )కూడా కేశాలకు పూసుకొనవద్దు. జమ్మి చెట్టును స్పర్శించవద్దు. నువ్వుల నూనెను విసర్జించండి. 

సరదాకైనా అబద్దాలాడటం, ఈరోజు పగటి సమయంలో నిద్రించటం, వ్యర్ధంగా నవ్వటం, వీణాదులను వాయించటం, నాట్యం ఆడటం, జూదమాడటం మొదలైనవి ఆదివారం ఉదయం సూర్యోదయం నుంచి రాత్రి నిదురించే వరకు  విసర్జించాలి. 

అత్యంత అరుదుగా వచ్చే మరొక అద్భుత గ్రహస్థితి కూడా ఈరోజే ఆకాశంలో దర్శనం కాబోతున్నది. జయ నామ సంవత్సరానికి రాజైన చంద్రుడు మరియు ఎట్టి ఆధిపత్యము రాని శుభగ్రహమైన గురువు ఆదివారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు ప్రక్క ప్రక్కనే ఉండి ప్రజలందరికీ దివ్యాశీస్సులను అందించటానికి సిద్ధం కాబోతున్నారు. 

వసంత ఋతువు నందలి చైత్ర, వైశాఖ మాసాలలో... సంచారంలో ఉన్న సూర్య రధంలో ధాత, అర్యముడు అనే ఆదిత్యులు... పులస్త్య, పులహ అనే ఋషులు... ఖండక, వాసుకిలను నాగులు... నారద, తుంబురులనే గంధర్వులు... క్రతుస్థల, పుంజిక స్థల అనే అప్సరసలు మొదలైన వారందరికీ ఆరుద్రా నక్షత్ర సమయంలో గురు చంద్రులు కలిసి సాదర స్వాగతాలు సప్తమి తిధిలో అందిస్తున్నారు. 

ఇటువంటి విశిష్టమైన శుభవేళలో మనమందరమూ కూడా 6వ తేది ఆదివారం రాత్రి కనపడే చంద్రుడు మరియు నక్షత్ర రూపంలో ఉండే శుభ గ్రహ గురువును భక్తి విశ్వాసాలతో నమస్కరించుకుంటూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్నిలేక శ్రీ విష్ణు ధ్యాన శ్లోకాన్నిపారాయణ చేయండి. ఆత్మ విశ్వాసంతో ముందుకు కదలండి.