Saturday, August 26, 2017

తులారాశిలో 395 రోజుల సంచారానికి విచ్చేస్తున్న దేవగురువు

శ్రీ హేమలంబ నామ సంవత్సర భాద్రపదమాసం బహుళ సప్తమి మంగళవారం సరియగు తేదీ 12 సెప్టెంబర్ 2017 న భారత కాలమానప్రకారం ఉదయం 6 గంటల 51 నిముషాలకు గురుగ్రహం చిత్రా నక్షత్ర మూడవ పాదమైన తులా రాశిలోకి ప్రవేశం జరుగును. గురు గ్రహం తులా రాశి ప్రవేశంతో సార్థ త్రికోటి తీర్థ సహిత  కావేరినదికి పుష్కరాలు ప్రారంభమై, సెప్టెంబర్ 28వ తేదీతో ముగియును. కావేరి నదినే దక్షిణ గంగగా పిలుస్తారు. కావేరీ నదీ తీర పుణ్య క్షేత్రాలలో తమిళనాడులో చిదంబరం, శ్రీరంగం, తంజావూరు, కుంభకోణాలు పేరెన్నిక గన్నవి. సెప్టెంబర్ 29 వరకు తర్పణ పిండప్రదానాదులు ఆచరించవచ్చును.

ఇక వివరాలలోకి వెళితే తులా రాశిలో 395 రోజులపాటు గురు గ్రహం సంచారం చేయబోతున్నాడు. ఈ సమయంలో కొద్దిరోజులు మౌఢ్యమితోను, మరికొద్దిరోజులు వక్రంతోను ఉంటూ, ఈసారి రెండు పర్యాయములు నీచ స్థితిలో ఉన్న రవి చెంతన ఉండబోతున్నాడు. ఈ 395 రోజులలో ఆయన ఏయే రోజులలో ఏయే నక్షత్రాలలో ప్రవేశం చేయబోతున్నాడో తెలుసుకుందాం.

2017 సెప్టెంబర్ 28 చిత్రా నక్షత్ర 4వ పాదంలోకి, అక్టోబర్ 14న స్వాతి 1వ పాదంలోకి, అక్టోబర్ 29న స్వాతి రెండవ పాదంలోకి, నవంబర్ 13న స్వాతి 3వ పాదంలోకి, నవంబర్ 29 న స్వాతి 4వ పాదంలోకి సంచార నిమిత్తమై బయలుదేరతారు. డిసెంబర్ 15వ తేదీ ధనుర్మాస ప్రారంభం కాగానే రెండవ రోజున అంటే డిసెంబర్ 16న తన స్వనక్షత్రమైన విశాఖ నక్షత్ర 1వ పాదంలోకి ప్రవేశం జరగటం, తిరిగి 2018 జనవరి 4 విశాఖ 2వ పాదంలోకి జనవరి 27న విశాఖ 3వ పాదంలోకి ప్రవేశ నిమిత్తమై సిద్దమవుతుంటాడు. ఇంతలో 2018 మార్చి 9 ఉదయం 10 గంటల 19 నిముషాలకి గురువుకి వక్రారంభం మొదలుకావటం, అక్కడ నుంచి వెనుకకు నడవటం ప్రారంభమై తిరిగి 2018 ఆగష్టు 2న రుజు మార్గంతో విశాఖ 1వ పాదంలోకి ప్రవేశిస్తాడు. 2018 సెప్టెంబర్ 3 న విశాఖ 2వ పాదంలోనికి, 2018 సెప్టెంబర్ 23న విశాఖ 3వ పాదంలోనికి ప్రవేశిస్తూ.. ఆ పిమ్మట 2018 అక్టోబర్ 11 శ్రీ విళంబి నామ సంవత్సర ఆశ్వయిజ శుక్ల తదియ గురువారం రాత్రి 7గంటల 20నిముషాలకి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. .

మొత్తం 395 రోజుల కాలగమనంలో కొన్ని రాశుల వారికి మంచి అవకాశాలను ఇవ్వటానికి సిద్ధపడతాడు. కొన్ని రాశుల వారికి సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చి వెళ్ళిపోతాడు. కొందరకు ఇస్తానని చెప్పలేడు.. ఇవ్వనని అనలేడు, మౌనంతోనే ముందుకు వెళ్ళిపోతాడు. ఇంకొందరకు అడగకముందే అన్ని వివరాలను తెలుసుకుని, ఏదో అందించినట్లుగా భ్రాంతి కనపరుస్తూ ఏమి లేకుండానే ప్రక్క రాశిలోకి వెళ్ళిపోతాడు. ఇది సౌర మండలంలో ఉన్న గురు గ్రహ తులా రాశి గమన చరిత్ర. ఇంతకీ తులా రాశి విషయానికి వస్తే గురు గ్రహానికి కించిత్ వైరమున్న స్థానము. ఈ స్థానంలో తన ప్రతిభను చూపిస్తాడా? చూపడా ? అనే ఆలోచనలు ప్రతి వారికీ ఉదయిస్తుంటాయి. ఒకటీ రెండు రోజులు కాకపోయే 395 రోజులు ఆ రాశిలో సంచారం చేయాలి... మరి ఎవరెవరికి ఏమి అందిస్తాడు? ఏమి అందించడు? ఏమి అడుగుతాడు? ఏమి అడగడు? ఎవరెవరికి మౌనంతోనే ముడిపెడతాడు.. కను సైగలతో ఇస్తానని ఆశ చూపిస్తాడు? తన వీక్షణాలతో ఏ విధంగా శుభాశుభాలను అందిస్తాడో చాలా వివరాతి వివరంగా తదుపరి పోస్టింగ్ లలో రాశుల వారీగా గ్రహభూమి బ్లాగ్ లో
(grahabhumi.blogspot.com) తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Sunday, August 20, 2017

2017 ఆగష్టు 21 సోమవారం ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం

ఈ సూర్యగ్రహణం మఖ నక్షత్ర రాహు గ్రస్తంగా సంభవిస్తున్నప్పటికీ రాహువు మాత్రం సింహరాశిలో కాకుండా కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో ఉండటం ఈ గ్రహణ ప్రత్యేకత. ఈ సంపూర్ణ సూర్య గ్రహణం భారతదేశంలో కనపడదు. భారత దేశంలో కనపడని కారణంగా ఇక్కడ గర్భవతులు హాయిగా గాలి పీల్చుకోవచ్చును. సంపూర్ణ సూర్య గ్రహణం జరిగే సమయంలో భారతదేశంలో రాత్రి సమయంలో ఉంటుంది. ఇక సంపూర్ణ సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని కాలమాన ప్రకారంగా వివిధ ప్రాంతాలలో పాక్షిక గ్రహణంగాను, కొలంబియా మరియు కెంచుకి ప్రాంతాలలో అను రెండు ప్రాంతాలలో సంపూర్ణ సూర్యగ్రహణం గాను కనపడును. సూర్యునికి వాయువ్య భాగంలో గ్రహణం ప్రారంభమై, తూర్పు దిశలో మోక్షం కల్గును.

ఉత్తర అమెరికాలోని కెంచుకి కాలమాన ప్రకారం గ్రహణ సమయాలు
వాయువ్యాన గ్రహణ స్పర్శ - మధ్యాహ్నం 11 గం.56 ని.లు 
సంపూర్ణ స్థితికి గ్రహణ రాక - మధ్యాహ్నం 1 గం.25 ని.లు 
గ్రహణ మధ్య కాలం - మధ్యాహ్నం 1 గం.26 ని.లు 
సంపూర్ణం నుంచి విడుపు ప్రారంభం - మధ్యాహ్నం 1 గం.27 ని.లు
గ్రహణ మోక్షకాలం - మధ్యాహ్నం 2 గం.52 ని.లు   
ఆద్యంతం పుణ్యకాలం - 176 నిముషాలు
సంపూర్ణ గ్రహణ బింబదర్శన సమయం - 2 నిముషాలు మాత్రమే.

కొలంబియాలోని సౌత్ కెరొలినా కాలమాన ప్రకారం గ్రహణ సమయాలు
వాయువ్యాన గ్రహణ స్పర్శ - మధ్యాహ్నం 1 గం.13 ని.లు 
సంపూర్ణ స్థితికి గ్రహణ రాక - మధ్యాహ్నం 2 గం.42 ని.లు 
గ్రహణ మధ్య కాలం - మధ్యాహ్నం 2 గం.43 ని.లు 
సంపూర్ణం నుంచి విడుపు ప్రారంభం - మధ్యాహ్నం 2గం.44 ని.లు
గ్రహణ మోక్షకాలం - సాయంత్రం 4 గం.06 ని.లు   
ఆద్యంతం పుణ్యకాలం - 173 నిముషాలు
సంపూర్ణ గ్రహణ బింబదర్శన సమయం - 2 నిముషాలు మాత్రమే.

ఉత్తర అమెరికాలోని వివిధ ప్రాంతాలలో పాక్షిక గ్రహణ సమయాలు
అట్లాంటా - మ 1.06 - సా 4.02
ఆస్టిన్ - మ 11.41 - 2.39
బర్మింగ్ హమ్ - మ12.01 - 2.58
బోస్టన్ - మ 1.29 - 3.59
చికాగో - మ 11.54 - 2.43
డల్లాస్ - మ 11.40 - 2.39
డెన్వర్ - ఉ 10.23 - మ 1.15
డెట్రాయిట్ - మ 1.04 - మ 3.48
హౌస్టన్ - మ 11.47 - 2.46
జాక్సన్విల్లే - మ 1.16 - సా 4.12
న్యూజెర్సీ - మ 1.23 - సా 4.01
లాస్ వేగాస్ - ఉ 9.09- మ 11.53
లాస్ ఏంజెల్స్ - ఉ 9.06 - 11.45
లూయిస్ విల్లే - మ 12.59- 3.52
మెల్బోర్న్ - మ 1.22 - సా 4.17
మియామి - మ 1.28 - సా 4.21
న్యూయార్క్ - మ 1.23 - సా 4.01
ఓక్లాండ్ - ఉ 9.02- మ 11.37
ఫిలడెల్ఫియా -  మ 1.21 - సా 4.01
ఫోనిక్స్ -  ఉ 9.14- మ 12.00
పిట్స్ బర్గ్ - మ 1.11 - 3.55
పోర్ట్ ల్యాండ్ - ఉ 9.06- మ 11.38
రిచ్ మాండ్ - మ 1.18 - సా 4.04
శాన్ఫ్రాన్సిస్కో -  ఉ 9.02- మ 11.37
స్ప్రింగ్ ఫీల్డ్ - మ 11.51 - 2.43
సెయింట్ లూయిస్ - మ 11.50 - 2.44
వాషింగ్టన్ - మ 11.51 - 2.42
వాషింగ్టన్ డి. సి - మ 1.18 - సా 4.02


గతంలో శ్రీ సిద్ధార్ది నామ సంవత్సరం శ్రావణ మాసం అమావాస్య బుధవారం సరియగు తేదీ 22 ఆగష్టు 1979 న సింహరాశిలోనే మఖ నక్షత్రంలోనే సంపూర్ణ సూర్యగ్రహణం రాహు గ్రస్తంగా జరగటం ఆ గ్రహణంతోపాటే శని, శుక్రులు ఉండటం, పైగా ఆ సంపూర్ణ గ్రహణం చివరికి కంకణ గ్రహణంగా రూపాంతరం చెందింది. ఆ గ్రహణం తరువాత, దాదాపు 38 సంవత్సరాలకు అదే శ్రావణమాస అమావాస్యను సింహరాశిలో రాహు గ్రస్తంగా మఖ నక్షత్రంలో గ్రహణం సంభవిస్తున్నది. ఈ గ్రహణం గత గ్రహణంతో పోలిస్తే అతి పెద్ద గ్రహణంగా భావించాలి. ఇందుకోసంగా ప్రజలెవ్వరూ ఆందోళనలు చెందవలసిన అవసరం లేదు.

ముఖ్యంగా పైన పేర్కొన్న ప్రాంతాలలో ఉన్న ఎంతో మంది తెలుగువారు ఉన్నారు. వారిలో గర్భవతులు కూడా ఉండవచ్చును. కనుక వారి జాగ్రత్త కొరకై సమయాలతో ఇవ్వటం జరిగింది. అయితే హైద్రాబాద్లో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పరోక్షంగా నన్ను కామెంట్ చేస్తూ, ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తున్నానని ఏదేదో అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఇతర దేశాలలో గ్రహణం పడితే మనకు ప్రభావం ఉండదని అనుకోవటం కేవలం వారి అజ్ఞానానికి పరాకాష్ట.


కొన్ని కొన్ని సంవత్సరాలలో మకర రాశిలోకి సూర్య ప్రవేశం అనేది రాత్రి సమయాలలో జరుగుతుంటుంది. అంటే ఆ సమయంలో భారత దేశంలో సూర్యుడు కనపడడు. కానీ రెండవ రోజున మకర సంక్రమణ పుణ్య కాలంగా భావించి తర్పణ, పిండ ప్రదానాదులు పితృదేవతలకు అందిస్తుంటారు. ఇది వైదిక వృత్తిలో ఉన్న ప్రతివారికి తెలుసు. అలాగే గురు గ్రహము రాత్రి సమయంలో ఒకరాశి నుంచి మరొక రాశికి ప్రవేశం జరిగినప్పుడు, భారత దేశంలో పుష్కరాలు రెండవ రోజు సూర్యోదయం నుంచే ప్రారంభమవుతాయి. ఇలాంటి అంశాలు జ్యోతిష శాస్త్రంలో ఎన్నో ఉంటాయి. రవి మహర్దశలు, రవి అంతర్దశలు జరిగే వారు ఉంటారు. గోచార స్థితిలో గ్రహణం వ్యాప్తి చెందినప్పుడు దాని ప్రభావం మరికొంత కాలం విశ్వంపై ఉంటుందనే ఆలోచన అజ్ఞాన సిద్ధాంతులు తెలుసుకుంటే మంచిది. కేవలం నాలుగు ముక్కలు నేర్చుకుని యూటుబ్లో పుంఖాను పుంఖాలుగా వీడియోలు పెట్టటం అనేది ఒక గొప్ప విషయం కానీ కాదు. ధైర్యముండి, జ్ఞానముండి , గణితం మీద పట్టు ఉంటే నా ఎదురుగా కూర్చుని గ్రహణం చేయమను. ఇలాంటి వాటికి బహు దూరంగా ఉంటారు. నా గ్రహభూమి  అంతర్జాతీయ  పంచాంగంలో గ్రహణ సమయాలను దాదాపు ఎప్పుడో ఇవ్వటం జరిగింది. కనీసం మన తెలుగువారు ఇతర దేశాలలో ఉన్నారని, వారికి గ్రహణ సమయాలకు కనీసం తెలియచేస్తే మంచిదనే ఆలోచన  లేకపోవటం శోచనీయం. కనుక పాఠక మహాశయులు సోషల్ మీడియాలో వచ్చే చెత్త అంశాలను నమ్మి మీ మీ సమయాలను వృధా చేసుకోవద్దు.

మా కాలచక్రం పంచాంగంలో పేజీ నంబర్ 28 మరియు 30 పేజీలలో, గ్రహభూమి పంచాంగం 15వ పేజీలో (grahabhumi panchangam) భూకంప వివరాలను తేదీలలో సంవత్సరం క్రితమే ఇవ్వటం జరిగింది. అలాగే గత 2016 మార్చి 1న విజయవాడ ప్రెస్ మీట్ లో ఇండోనేషియా లో భూకంపం రిక్టర్ స్కేల్ పై 7.8 గా వస్తుందని తీవ్రతతో తేదీని ప్రకటించగా విజయవాడలోని స్థానిక వార్త  పత్రికలన్నీ ప్రకటించాయి. (http://grahabhumi.blogspot.in/2016/04/blog-post.html) వాటిని చూసి రెండవ రోజున ప్రజలను నేనేదో భయ భ్రాంతులకు గురి చేస్తానని టీవీ 9 మరియు యన్ టీవీ వారు కెమెరాలు పట్టుకుని దాదాపుగా 30 నిముషాల పాటు రికార్డ్ చేసి, ఆ వివరాలను రాత్రికి ప్రసారం చేస్తామని వెళ్లారు. వారు వెళ్లిన అరగంటలోనే ఇండోనేషియా లో భారీ భూకంపం రిక్టర్ స్కేల్ పై 7.8 గా నమోదు కావటం, వీరు రికార్డ్ చేసిన కార్యక్రమాన్ని ప్రసారం చేయకుండా ఆపటం జరిగింది. ఇది ఎందుకు చెబుతున్నాను అంటే 40 సంవత్సరాల జ్యోతిష శాస్త్ర అనుభవంతో పరిశోధనలు చేసి చెబుతున్న అంశాలు  అనేకం ఉన్నాయి. కానీ కొన్నింటిని మాత్రమే నేను తెలియచేస్తున్నాను.

కనుక దాదాపుగా వేయి అంశాలకు ఎక్కడో ఒక అంశం పొరపాటుగా దారి తప్పటం మానవ సహజం, దానిని పట్టుకుని హేతువాదులు మాట్లాడటం విడ్డూరం. ప్రతి మీడియా ఛానల్ జ్యోతిష అంశాలతోనే వారి వారి రేటింగ్లను పెంచుకుంటుంటారు. జ్యోతిష కార్యక్రమాలతో వచ్చే డబ్బుతో జీతాలను ఉద్యోగులకి ఇస్తుంటారు. కానీ ఇంత చేస్తూ కూడా హేతువాదులు కూర్చోపెట్టి వెకిలిగా ప్రశ్నలను వేయటం సహించరాని తప్పు. మెరుగైన సమాజం కోసం అంటూ చెప్పుకునే కొంతమంది రత్నాన్ని ధరించటం అవివేకం అంటారు. కానీ రాత్రి 11 గంటల సమయంలో ఆ రత్నాల కంపెనీ వారిచ్చే సొమ్ముతో పబ్బం గడుపుకుంటారు. ఇది అందరికి తెలిసిన నగ్న సత్యమే. అందుకే కొన్ని కొన్ని విలువలకు లోబడి దూరంగా ఉండాలనే కోరుకుంటున్నాను. అయితే పుంఖాను పుంఖాలుగా వచ్చే ఈ అజ్ఞానులు సోషల్ మీడియాలో పెట్టె విషపు బీజాలను నమ్మి జీవితాలను నాశనం చేసుకోవద్దని మనః పూర్వకంగా కోరుతున్నాను.

ఈ గ్రహణం కోసంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అంతేతప్ప ఏదో వచ్చి పడిపోతుందని అనుకోవద్దు. మంచి పనులు చేయాలన్న మన మనస్సే, చెడు పనులు చేయాలన్న మన మనస్సే. ఈ మనః కారకుడే చంద్రుడు. ఈ చంద్రుడే గ్రహణ సమయంలో సూర్యుడితో ఆలింగనంలో ఉంటాడు. అంటే సూర్యుని డిస్క్ తో చంద్రుని డిస్క్ కలిసిపోతుంది. అందువలన దాని ప్రభావం విశ్వ వ్యాప్తంగా ఉంటుందని గమనించాలి. కేవలం నా మీద అక్కసుగా వీడియోలు పెడుతున్నందుకు నేనేమి బాధపడటం లేదు. వాస్తవాలు తెలియచేస్తున్నాను. ఈ క్రింది వీడియోలను వీక్షించండి.
  - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ


Sunday, August 6, 2017

ధనిష్ఠలో కేతువు ఉండి, శ్రవణంలో చంద్రునికి పాక్షిక గ్రహణం

శ్రీ హేమలంబ శ్రావణ పూర్ణిమ 7 ఆగష్టు 2017 సోమవారం రాత్రి 10 గంటల 53 నిముషాలకు చంద్రునికి వాయువ్య భాగంలో గ్రహణం స్పర్శించి రాత్రి 12 గంటల 48 నిముషాలకు పాక్షిక గ్రహణంగా ముగియును. అంటే 115 నిముషాల పాటు పుణ్యకాలం ఉన్నదని భావము. ఇది రాత్రి నిద్రించే సమయం కనుక సహజంగా ఎవరూ దీనిని వీక్షించాలని కుతూహల పడరు. గర్భవతులు మాత్రం గ్రహణానికి ముందు 1 గంట, గ్రహణం తదుపరి 1 గంట పాటు తమ తమ గృహాలలోనే ఉండవలెను. అంటే ప్రతి ఛాయలో రాత్రి 9 గంటల 53 నిముషాలకు చంద్రుని కాంతి హీనదశకు చేరటాన్ని ప్రతి ఛాయా అంటారు. 10 గంటల 53 నిముషాలకి కేతు ఛాయ ఏర్పడి గ్రహణం ప్రారంభమవుతుంది. అర్థరాత్రి తదుపరి 12.48 నిముషాలకు గ్రహణం పూర్తి కాగానే, ప్రతి ఛాయలో తేజోహీనంగా ఉన్న చంద్రుడు తేజస్సు రూపంలోకి 1 గంట 48 నిముషాలకు వచ్చును. కనుక గర్భవతులు తేజస్సు తగ్గటం ప్రారంభమైన దగ్గర నుంచి తిరిగి తేజస్సు వచ్చేంతవరకు గృహాలలోనే ఉండటం శ్రేయోదాయకం. గ్రహణ సమయంలో గర్భవతులు మల, మూత్ర విసర్జనకు కూడా వెళ్లకూడదని.. కదలకుండా ఒకే చోటనే పరుండాలని చెప్పే అంశాలన్నీ అసత్యములు. కనుక వారు నిర్వర్తించవలసిన కార్యక్రమములన్నీ చక్కగా అటు ఇటు తిరుగుతూ చేసుకోవచ్చును. భౌతికంగా మాత్రం గ్రహణాన్ని చూడవద్దు. ఆ సమయంలో టీవీలలో ప్రసారమయ్యే గ్రహణ దృశ్యాలను చూసిననూ తప్పు లేదు.

ఇక భారతీయ సనాతన సంప్రదాయాల ప్రకారం గ్రహణ సమయంలో ఆహారం లేకుండా ఖాళీ కడుపుతో ఉండటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకోసమే గ్రహణ ప్రారంభ సమయానికి 3 గంటల ముందే ఆహారాన్ని స్వీకరిస్తే గ్రహణ సమయానికి పూర్తిగా జీర్ణమైపోతుందని భావన. అయితే ఈ విషయంలో కొంత ఆలోచన అవసరము. ఏమిటంటే కొంతమందికి తిన్న ఆహారం జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పట్టవచ్చు, మరికొంత మందికి వెంటనే జీర్ణం అయిపోయే పరిస్థితి ఉండవచ్చు. అందుకోసంగా ఎవరికి  వారు వారి వారి శరీర తత్వాలకు తగినట్లుగా ముందే ఆహారాన్ని స్వీకరించి గ్రహణ సమయానికల్లా ఖాళీ కడుపుతో ఉండటం అనేది శాస్త్రీయము.

పట్టు స్నానం, విడుపు స్నానం అందరూ ఆచరించాలనే నియమమేమి లేదు. కేవలం జపానుష్టానం చేసే వారు మాత్రమే ఈ స్నానాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వృద్ధులను అనారోగ్యంగా ఉండే వారిని ఈ స్నానాల వంకతో ఇబ్బందులకు గురి చేయడం తగదు. ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి. చంటి పిల్లలు ఉన్నవారు పాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటుంటారు. కొంతమంది ఒకేసారి తాగకుండా తరచుగా కొద్ది కొద్దిగా త్రాగే అలవాటు ఉండే చిన్నారులు ఉండటం కూడా సహజం. ఈ నేపథ్యంలో గ్రహణ సమయంలో పాల కోసం ఏడిస్తే, గ్రహణం జరుగుచున్నదని, పాలు త్రాగకూడదని అనుకోవద్దు. అట్టి వారలకు పాలను ఇవ్వటానికి తక్షణం ప్రయత్నించండి. గర్భవతులు గ్రహణ కిరణాలు సోకకుండా ఉండేలాగా గృహాలలో ఉంటారు. ఎందుకని? జన్మించే పిల్లలకు గ్రహణ మొర్రి లాంటిది వస్తుందని. అయితే ఇలాంటి కిరణాలు సోకకుండా ఉండే చిన్నారులు కూడా గృహాలలోనే ఉంటారు కాబట్టి వారికి ఆకలైతే గ్రహణ సమయంలో పాలను తీసుకోవటంలో తప్పేమి కాదు. గ్రహణం జరిగే సమయంలో బయట ఎంతోమంది తిరుగుతూ ఉంటారు. వారి శరీరాలపై గ్రహణ కిరణాలు పడుతుంటాయి. అలాంటి వారు తప్పకుండా ఖాళీ కడుపుతోనే ఉండి తీరాలి. దీనిని శాస్త్రీయంగా అర్ధం చేసుకోవాలంటే కిరణాలు సోకకుండా ఏ వయసులో వారైనా పురుషుడైనా, స్త్రీలైనా గృహాలలోనే బయటికి రాకుండా ఉండేట్లైతే.. చక్కగా భోజనము ఆచరించవచ్చు. కిరణాలు సోకుతాయనే ఉద్దేశ్యంతోనే ఈ నియమం ఉంచారే తప్ప మరొకటి కాదని అర్థం చేసుకోవాలి.

చంద్ర గ్రహణానికి శ్రావణ పూర్ణిమ నాటి రక్షా బంధనానికి సంబంధం లేనే లేదు. కనుక శ్రావణ పూర్ణిమ ఉదయం నుంచే రక్షా బంధనాలు కట్టవచ్చును. అయితే మరింత శాస్త్రీయమైన సమయం కావాలనుకునే వారు 7 సోమవారం మధ్యాహ్నం 11 గంటల 4 నిముషాల నుంచి సాయంత్రం 4 గంటల 1 నిముషం వరకు రక్షా బంధనాన్ని కట్టవచ్చును. ఇక నూతన యజ్ఞోపవీత ధారణమునకు మాత్రం శ్రావణ పూర్ణిమ రోజు నిషిద్ధము.

అన్నిటికంటే ముఖ్యంగా పాఠకులు గమనించాల్సింది మరొకటి ఉన్నది. జపానుష్టానం గ్రహణ సమయంలో చేయటమనేది ఆనవాయితీ. అయితే ఈ గ్రహణము సంపూర్ణ గ్రహణమైతే మరింత శ్రేష్టకరమని, అది కూడా సంపూర్ణ గ్రహణ బింబము అత్యధిక కాలం పాటు నిలబడి ఉంటే, మరింత శ్రేయస్కరమని గమనించాలి. అయితే ఈ గ్రహణానికి అనుకూలమైన విశిష్టతలు లేవు. ఎందుకంటే ఇది పాక్షికము. పైగా గ్రహణము జరిగే చంద్రుడు శ్రవణా నక్షత్రంలో ఉంటే కేతువు తదుపరి నక్షత్రమైన ధనిష్ఠలో .. అది కూడా 3 వ పాదమైన కుంభరాశిలో ఉండటం జరిగింది. కనుక ఆగష్టు నెలలో జరిగే ఇతర గ్రహ సంచారాలను బట్టి, విరుద్ధ గ్రహణాల జంట జరుగుతున్నది కనుక దీనికి అంత ప్రాముఖ్యం వచ్చింది. కనుకనే పరిహార నిమిత్తమై దర్భ కంకణాన్ని ధరించండి అని చెప్పటం జరిగింది. ప్రతి గ్రహణానికి సహజంగా ఆహార పదార్ధాలపైనా  ఏ విధంగా దర్భలను ఉంచుతారో అదేవిధంగానే ఉంచండి. ప్రత్యేక ఆందోళనలకు లోను కావద్దు. గ్రహణ సమయంలో ప్రశాంతమైన చిత్తంతోనే ఉంటూ తమ ఇష్ట దైవాలను మనసారా భక్తితో ప్రార్ధించుకోవటం శ్రేయస్కరం. అంతేతప్ప ఫలానా స్తోత్రమే చదవాలి అనుకోవటం పొరపాటు. పాఠకులు ఈ విశేషాలను దృష్టిలో ఉంచుకొని తగినట్లుగా అనుసరించగలని ఆశిస్తాను.  - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ