గమనిక : 2018 జూన్ 26 రాత్రి నుంచి అక్టోబర్ 25 వరకు 121 రోజులు కుజగ్రహం వక్రంతో సంచారం చేయనున్నది. కనుక కుజ దోషం అనేది లేకున్ననూ, ఉన్నదని భయపడేవారు, ఋణ శత్రు శరీర పీడల నుంచి ఉపశమనానికి ప్రత్యేక అరుదైన విశేష రోజులలో కుజ గ్రహ దోష నివారణకు అద్భుత పరిహారములను ప్రణతి టెలివిజన్ యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి.- శ్రీనివాస గార్గేయ

Sunday, August 6, 2017

ధనిష్ఠలో కేతువు ఉండి, శ్రవణంలో చంద్రునికి పాక్షిక గ్రహణం

శ్రీ హేమలంబ శ్రావణ పూర్ణిమ 7 ఆగష్టు 2017 సోమవారం రాత్రి 10 గంటల 53 నిముషాలకు చంద్రునికి వాయువ్య భాగంలో గ్రహణం స్పర్శించి రాత్రి 12 గంటల 48 నిముషాలకు పాక్షిక గ్రహణంగా ముగియును. అంటే 115 నిముషాల పాటు పుణ్యకాలం ఉన్నదని భావము. ఇది రాత్రి నిద్రించే సమయం కనుక సహజంగా ఎవరూ దీనిని వీక్షించాలని కుతూహల పడరు. గర్భవతులు మాత్రం గ్రహణానికి ముందు 1 గంట, గ్రహణం తదుపరి 1 గంట పాటు తమ తమ గృహాలలోనే ఉండవలెను. అంటే ప్రతి ఛాయలో రాత్రి 9 గంటల 53 నిముషాలకు చంద్రుని కాంతి హీనదశకు చేరటాన్ని ప్రతి ఛాయా అంటారు. 10 గంటల 53 నిముషాలకి కేతు ఛాయ ఏర్పడి గ్రహణం ప్రారంభమవుతుంది. అర్థరాత్రి తదుపరి 12.48 నిముషాలకు గ్రహణం పూర్తి కాగానే, ప్రతి ఛాయలో తేజోహీనంగా ఉన్న చంద్రుడు తేజస్సు రూపంలోకి 1 గంట 48 నిముషాలకు వచ్చును. కనుక గర్భవతులు తేజస్సు తగ్గటం ప్రారంభమైన దగ్గర నుంచి తిరిగి తేజస్సు వచ్చేంతవరకు గృహాలలోనే ఉండటం శ్రేయోదాయకం. గ్రహణ సమయంలో గర్భవతులు మల, మూత్ర విసర్జనకు కూడా వెళ్లకూడదని.. కదలకుండా ఒకే చోటనే పరుండాలని చెప్పే అంశాలన్నీ అసత్యములు. కనుక వారు నిర్వర్తించవలసిన కార్యక్రమములన్నీ చక్కగా అటు ఇటు తిరుగుతూ చేసుకోవచ్చును. భౌతికంగా మాత్రం గ్రహణాన్ని చూడవద్దు. ఆ సమయంలో టీవీలలో ప్రసారమయ్యే గ్రహణ దృశ్యాలను చూసిననూ తప్పు లేదు.

ఇక భారతీయ సనాతన సంప్రదాయాల ప్రకారం గ్రహణ సమయంలో ఆహారం లేకుండా ఖాళీ కడుపుతో ఉండటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకోసమే గ్రహణ ప్రారంభ సమయానికి 3 గంటల ముందే ఆహారాన్ని స్వీకరిస్తే గ్రహణ సమయానికి పూర్తిగా జీర్ణమైపోతుందని భావన. అయితే ఈ విషయంలో కొంత ఆలోచన అవసరము. ఏమిటంటే కొంతమందికి తిన్న ఆహారం జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పట్టవచ్చు, మరికొంత మందికి వెంటనే జీర్ణం అయిపోయే పరిస్థితి ఉండవచ్చు. అందుకోసంగా ఎవరికి  వారు వారి వారి శరీర తత్వాలకు తగినట్లుగా ముందే ఆహారాన్ని స్వీకరించి గ్రహణ సమయానికల్లా ఖాళీ కడుపుతో ఉండటం అనేది శాస్త్రీయము.

పట్టు స్నానం, విడుపు స్నానం అందరూ ఆచరించాలనే నియమమేమి లేదు. కేవలం జపానుష్టానం చేసే వారు మాత్రమే ఈ స్నానాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వృద్ధులను అనారోగ్యంగా ఉండే వారిని ఈ స్నానాల వంకతో ఇబ్బందులకు గురి చేయడం తగదు. ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి. చంటి పిల్లలు ఉన్నవారు పాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటుంటారు. కొంతమంది ఒకేసారి తాగకుండా తరచుగా కొద్ది కొద్దిగా త్రాగే అలవాటు ఉండే చిన్నారులు ఉండటం కూడా సహజం. ఈ నేపథ్యంలో గ్రహణ సమయంలో పాల కోసం ఏడిస్తే, గ్రహణం జరుగుచున్నదని, పాలు త్రాగకూడదని అనుకోవద్దు. అట్టి వారలకు పాలను ఇవ్వటానికి తక్షణం ప్రయత్నించండి. గర్భవతులు గ్రహణ కిరణాలు సోకకుండా ఉండేలాగా గృహాలలో ఉంటారు. ఎందుకని? జన్మించే పిల్లలకు గ్రహణ మొర్రి లాంటిది వస్తుందని. అయితే ఇలాంటి కిరణాలు సోకకుండా ఉండే చిన్నారులు కూడా గృహాలలోనే ఉంటారు కాబట్టి వారికి ఆకలైతే గ్రహణ సమయంలో పాలను తీసుకోవటంలో తప్పేమి కాదు. గ్రహణం జరిగే సమయంలో బయట ఎంతోమంది తిరుగుతూ ఉంటారు. వారి శరీరాలపై గ్రహణ కిరణాలు పడుతుంటాయి. అలాంటి వారు తప్పకుండా ఖాళీ కడుపుతోనే ఉండి తీరాలి. దీనిని శాస్త్రీయంగా అర్ధం చేసుకోవాలంటే కిరణాలు సోకకుండా ఏ వయసులో వారైనా పురుషుడైనా, స్త్రీలైనా గృహాలలోనే బయటికి రాకుండా ఉండేట్లైతే.. చక్కగా భోజనము ఆచరించవచ్చు. కిరణాలు సోకుతాయనే ఉద్దేశ్యంతోనే ఈ నియమం ఉంచారే తప్ప మరొకటి కాదని అర్థం చేసుకోవాలి.

చంద్ర గ్రహణానికి శ్రావణ పూర్ణిమ నాటి రక్షా బంధనానికి సంబంధం లేనే లేదు. కనుక శ్రావణ పూర్ణిమ ఉదయం నుంచే రక్షా బంధనాలు కట్టవచ్చును. అయితే మరింత శాస్త్రీయమైన సమయం కావాలనుకునే వారు 7 సోమవారం మధ్యాహ్నం 11 గంటల 4 నిముషాల నుంచి సాయంత్రం 4 గంటల 1 నిముషం వరకు రక్షా బంధనాన్ని కట్టవచ్చును. ఇక నూతన యజ్ఞోపవీత ధారణమునకు మాత్రం శ్రావణ పూర్ణిమ రోజు నిషిద్ధము.

అన్నిటికంటే ముఖ్యంగా పాఠకులు గమనించాల్సింది మరొకటి ఉన్నది. జపానుష్టానం గ్రహణ సమయంలో చేయటమనేది ఆనవాయితీ. అయితే ఈ గ్రహణము సంపూర్ణ గ్రహణమైతే మరింత శ్రేష్టకరమని, అది కూడా సంపూర్ణ గ్రహణ బింబము అత్యధిక కాలం పాటు నిలబడి ఉంటే, మరింత శ్రేయస్కరమని గమనించాలి. అయితే ఈ గ్రహణానికి అనుకూలమైన విశిష్టతలు లేవు. ఎందుకంటే ఇది పాక్షికము. పైగా గ్రహణము జరిగే చంద్రుడు శ్రవణా నక్షత్రంలో ఉంటే కేతువు తదుపరి నక్షత్రమైన ధనిష్ఠలో .. అది కూడా 3 వ పాదమైన కుంభరాశిలో ఉండటం జరిగింది. కనుక ఆగష్టు నెలలో జరిగే ఇతర గ్రహ సంచారాలను బట్టి, విరుద్ధ గ్రహణాల జంట జరుగుతున్నది కనుక దీనికి అంత ప్రాముఖ్యం వచ్చింది. కనుకనే పరిహార నిమిత్తమై దర్భ కంకణాన్ని ధరించండి అని చెప్పటం జరిగింది. ప్రతి గ్రహణానికి సహజంగా ఆహార పదార్ధాలపైనా  ఏ విధంగా దర్భలను ఉంచుతారో అదేవిధంగానే ఉంచండి. ప్రత్యేక ఆందోళనలకు లోను కావద్దు. గ్రహణ సమయంలో ప్రశాంతమైన చిత్తంతోనే ఉంటూ తమ ఇష్ట దైవాలను మనసారా భక్తితో ప్రార్ధించుకోవటం శ్రేయస్కరం. అంతేతప్ప ఫలానా స్తోత్రమే చదవాలి అనుకోవటం పొరపాటు. పాఠకులు ఈ విశేషాలను దృష్టిలో ఉంచుకొని తగినట్లుగా అనుసరించగలని ఆశిస్తాను.  - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.