Sunday, February 28, 2016

2016లో రాహువుచే నాగబంధనం జరగనుందా?

కలియుగంలో ధర్మం ఒక పాదంపైన, అధర్మం మూడు పాదాలపైనా నడుస్తున్నదని పురాణాలు చెప్తాయి. ఈ మూడు పాదాల అధర్మ నడకకు పెద్దపీట వేసే గ్రహమే రాహువు. చంద్రునికి ఉత్తర ధృవ బిందువుగా రాహువుంటే, దక్షిణ ధృవ బిందువుగా కేతువుంటాడు. నవగ్రహాలలో రాహు కేతువులు మినహా మిగిలిన ఏడూ గ్రహాలూ గడియారంలో ముళ్ళువలె సవ్య దిశలో సంచారంలో ఉంటాయి. కాని రాహు కేతువులు అపసవ్య సంచారంలో ఉంటాయి. రాహువు ఉన్న రాశికి, ఏడవరాశిలో కేతువు ఉంటాడు.

ప్రపంచ రాజకీయ రంగాన్ని పరోక్షంగా శాసించే వాడే రాహువు. దీనికి తోడు నూతన అంశాలపై దృష్టి ఉంచి విశేష విజ్ఞానానికి బాటలను వేసేవాడు కూడా రాహువే. ప్రపంచంలో ఆధునిక విజ్ఞాన శాస్త్రం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతున్నదంటే, కేవలం రాహు అనుగ్రహమని చెప్పటంలో  అతిశయోక్తి లేదు. లోక కల్యాణానికి పునాదులు వేసే విజ్ఞాన శాస్త్రానికి సారధిగా రాహువు ఉండటం నాణేనికి ఒకవైపు అంశం. అదేవిధంగా నాణేనికి రెండవ వైపున విజ్ఞాన శాస్త్రంలోనుంచే విశ్వ వినాశనానికి  ప్రేరణ కారకత్వాన్ని ఇచ్చేవాడు కూడా ఛాయా గ్రహమైన రాహువే.

మానసిక, శారీరక, ఆర్ధిక, కుటుంబ, నేత్ర, దంత, సోదర, సోదరీ, వృత్తి, వ్యాపార, ఆరోగ్య, వాహన, గృహ, మాతృ, సంతాన, దాంపత్య, పితృ, ఆయు స్థాన అంశాలన్నిటిలోను అనుకూలంగా, ప్రతికూలంగా ఫలితాలను తనికిష్టమైన రీతిలో ఇచ్చే ఏకైక గ్రహమే రాహువు. ఉగ్రవాద, తీవ్రవాద చర్యలు, ఆకాశ మార్గంలో విమాన ప్రమాదాలు, దానితో పాటు రిమోట్ తో పేల్చే ప్రమాదాలు,  ఎత్తైన ప్రాంతం నుంచి దిగువకు పడిపోయే ఘోర ప్రమాదాలు, నూతన వైరస్ క్రిముల ఉత్పత్తితో పాటు అనేకానేక అంశాలన్నీ రాహు ప్రాబల్యం వలెనే జరుగుతుంటాయి.  ఇతర గ్రహాలు రాజయోగం ఇచ్చినా, ఇవ్వకపోయినా రాహువు తన ఇష్టానుసారంగా ఫలితాలను తారుమారు చేయగలడు. అందలం ఎక్కించగలడు. భూస్థాపితం చేయగలడు.

గ్రహస్థితి  బలహీనమైనప్పుడు మానవుడు ఎంత ప్రతిభాశాలి అయిననూ విధి వంచితుడు కాక తప్పదు. రాజకీయ రంగంలోనే ఇలాంటివి తరచుగా కనపడుతుంటాయి. వ్యక్తికి అంగబలం, అర్ధబలంతో పాటు ప్రజలందరూ కూడా జేజేలు పలికిననూ రాహు, కేతువుల అనుగ్రహం లేని కారణంగానే నామినేషన్ల తదుపరి చేసే స్క్రూట్నీతో  పేరు గల్లంతవుతుంది.  స్వల్ప అవయోగాలవలెనే విశేష రాజయోగాలు ఉన్ననూ దెబ్బతినేవారు అనేకమంది ఉన్నారు. ముక్కు మొహం తెలియని వారు ఒక్కోసారి అనుకోకుండా ఎన్నికలలో గెలవటము, ఉన్నత పదవులు అలంకరించటము జరుగుతుంది. ఇలాంటి యోగాలని అనుకోకుండా అందించేవాడే రాహువు.

ముఖ్యంగా రాజకీయ రంగము, విజ్ఞాన శాస్త్ర రంగములపై అనుకూల స్థితి ఏ స్థాయిలో ఉంటుందో, దానికంటే రెట్టింపుగా ప్రతికూల పంజాలు ఇవ్వటంలో రాహువుకి సాటి ఎవ్వరూ రారు. ఇంకా ఈ రెండు రంగాలను గురించి కొంత లోతుగా చర్చించుకుందాం.

బీహార్ ముఖ్య మంత్రిగా ఉన్న నితీష్ కుమార్ గారి జాతకంలో గురు, రాహు చండాల యోగం జరిగింది. కానీ ఈ చండాల యోగాన్ని త్రిప్పి కొట్టే రీతిలో అనేక పరిహారములు చేసుకుంటూ రాహు ప్రీతిని పొందినందునే బీహార్ ముఖ్యమంత్రిగా హాట్రిక్ సాధించగలిగారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారు రాజకీయంలో ఎంతో చతురతతో  ఉన్న మహా నాయకుడు. కానీ విధి వంచితంచే, రాహు ప్రాబల్యం వలన హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ గగన తలంలోనే ప్రేలిపోయి ఘోర దుర్మరణం పాలుకావటం, శరీర అంగాలు చెల్లా చెదురుగా విసిరి వేయబడటానికి కారకుడు రాహువే.

అదే విధంగా రాజశేఖర రెడ్డిగారి కుమారుడైన శ్రీ జగన్మోహన రెడ్డిగారు కూడా ఎంతో తెలివి గల మేధావి కాని, ఆరుద్రా నక్షత్రంలో జన్మించిన శ్రీ జగన్ గారు, జన్మ లగ్నం నుంచి నాల్గవ స్థానంలో గురు రాహు కలయిక వచ్చిన కారణంగా విధి వంచితుడై అనుకోని కారణాలచే బంధన యోగానికి చేరువయ్యాడు.

సప్త గ్రహాలూ అనుకూలించకపోయినప్పటికీ రాహు, కేతువుల యోగాల వలన అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. రాహు, కేతువులు ఇచ్చే యోగాలు శాశ్వతం కావు. అశాశ్వతాలే. కనుక ఈ అశాశ్వత రాజ యోగాలను పట్టుకొని, మన వ్యక్తిత్వాన్ని సరియైన స్థితిలో నియంత్రించుకుంటూ ఉంటుంటే... రాహు, కేతువులిచ్చే అశాశ్వత యోగాన్ని శాశ్వతం చేసుకోవచ్చు. లేకుంటే మహారాజ సమానుడై భోగ భాగ్యాలతో జీవితం గడుపుతూ చివరకు ఆకాశ వీధులలో మరణం జరిగి అన్నీ అవయవాలు లేకుండా  అంత్య క్రియలు జరగటం కూడా ఈ ఛాయా గ్రహాల ప్రభావమేనని గుర్తించాలి.

రాజకీయ అధికారానికి రాహువు కారకుడు. అంతేకాక అనువంశిక రాజకీయ వారసత్వానికి కూడా రాహువే కారకుడు. పొడవైన, అందమైన శిరోజాలు కావాలంటే రాహు ప్రీతి అవసరం. బంధన కారకత్వం కూడా రాహువు వలెనే జరుగును. బాంబు ప్రేలుడు, ఇతర విస్ఫోటనాలచే మరణానికి రాహువు కారకుడవుతాడు.  కఠిన కారాగార యోగము, దీర్ఘకాల కారాగార వాసము, న్యాయ స్థానాలచే సమస్యలు, ఉగ్రవాదుల, తీవ్రవాదుల వలన వాటిల్లే సమస్యలు రాహువు యొక్క దుర్యోగములే.

పదవులు, అత్యున్నత రాజకీయ జీవితం, రాజ్యాధికారము మొదలగు యోగములు పొందాలంటే జాతకునికి రాహు స్థితి ప్రధానంగా అనుకూలమై ఉండాలి. ఇట్టి రాహు అనుగ్రహానికి పరోక్షంగా గోధుమపిండి దీపారాధన ఎంతో తోడ్పడుతుంది. 


అయితే 2016 లో రాహువుచే గురువు సింహరాశిలో ఓ కేంద్ర బిందువులో కబళించబోతున్నాడు. అంటే గురు రాహు కలయిక సింహరాశిలో జరుగుతున్నదన్నమాట. 2016 జనవరి 29 సింహరాశిలోకి రాహువు ప్రవేశించాడు. అంతకు ముందే సింహరాశిలో గురుగ్రహ సంచారం జరుగుతున్నది. అనగా గురు రాహువుల కలయిక త్వరలో ఆసన్నం కాబోతున్నదని, ఈ చండాల యోగం స్పష్టపరుస్తున్నది.

2016 జనవరి 29 నుంచి ఆగస్ట్ 11 వరకు సింహరాశిలోనే గురు చండాల యోగం జరుగుతున్నది. ఈ తేది దాటిన తర్వాత చండాల యోగం జరిగిపోయింది అని మనం పేర్కొంటాం. దీనినే పరోక్షంగా నాగదోషమేర్పడిందని చెప్పుకుంటాం. 12 రాశులలో... ఏదో ఒక రాశిలో ప్రతి ఆరున్నర సంవత్సరాలకు ఓసారి గురుగ్రహానికి రాహువు చేరువై చండాల యోగాన్ని ఇస్తాడు. ఎక్కడైతే చండాల యోగం జరుగుతుందో ఆ జరిగిన రోజులలో ఓ ప్రధానమైన రోజున నాగబంధనం జరుగుతుందని అర్థం. ఈ నాగబంధనం ఏరోజు జరగబోతున్నది ? దీని ప్రభావం మానవాళిపై ఏ విధంగా వుంటుంది ? నివారణ క్రమంలో విధి విధానాలు ఏమిటి అనే అంశాలతో పాటు పూర్తి నాగ బంధన రహస్యాలను తదుపరి పోస్టింగ్లో చూడగలరు.

Tuesday, February 2, 2016

రాహు అనుగ్రహానికి గోధుమపిండి దీపారాధన 5

నవగ్రహ ఆధిపత్యాలన్ని మన శరీరంలోనే ఉన్నాయి. ఇందులో  మూలాధార చక్రానికి ఆధిపత్య గ్రహం కుజుడు. స్వాదిష్టాన చక్రానికి ఆధిపత్య గ్రహం శుక్రుడు. మణిపూరక చక్రానికి ఆధిపత్య గ్రహం రవి. అనాహత చక్రానికి ఆధిపత్య గ్రహం బుధుడు. విశుద్ది చక్రానికి ఆధిపత్య గ్రహం గురువు. ఆజ్ఞా చక్రానికి ఆధిపత్య గ్రహం శని. ఈ ఆరు చక్రాల పైన తలమానికగా ఉంటూ పాలించేది, నియంత్రించేది మరొకటి బ్రహ్మ రంధ్రంలో ఉండును. దానినే సహస్రార చక్రము అంటారు. దీని ఆధిపత్య గ్రహం చంద్రుడు. కనుక నవగ్రహాలలో ఏడు గ్రహాలు ఈ చక్రాలకు ఆదిపత్యంగా నిలుస్తున్నాయి.  మూలాధార చక్రంలోని సర్పాకారంలో ఉన్న కుండలినే రాహు కేతువులుగా తీసుకోవాలి. తల భాగాన్ని రాహువని, తోక భాగాన్ని కేతువని పిలుస్తారు.

మానవాళికి సమస్యలుంటుంటాయి, సంతోషాలు వస్తుంటాయి. ఈ రెండింటికీ ప్రధాన కేంద్ర బిందువులు రాహు, కేతువులే అన్న నగ్న సత్యం నూటికి 90 మందికి తెలియదు. కనుక ఈ రాహు, కేతువులు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను తృప్తి కల్గించటానికి ఎన్నెనో పద్ధతులున్నాయి. ఈ పద్దతులలో తాంత్రిక మార్గంలో ఆచరించేది గోధుమపిండి దీపారాధన.

ఏడు వారాలలో రాహు కాలము ఒక్కోరోజున ఒక్కో సమయంలో ఉంటుంది. ఆరుగంటలకి సూర్యోదయం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటలకి సూర్యుడు అస్తమించాడు అనుకుందాం ఈ సమయాన్ని ఎనిమిది భాగాలుగా విభజిస్తే ఒక్కో భాగానికి గంటన్నర సమయం ఉంటుంది. అనగా తొంబై నిముషాలు. ఈ ఎనిమిది భాగాలలో మొదటి భాగం అనగా ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిముషాల వరకు రాహుకాలం ఉండదు.

మిగిలిన సమయాలను పరిశీలిస్తే ఉదయం 7.30 నుంచి 9.00 గంటలు సోమవారానికి,  9.00 నుంచి 10.30 గంటలు శనివారానికి, 10.30 నుంచి 12.00 గంటల వరకు శుక్రవారానికి, మధ్యాహ్నం 12.00 గంటల నుంచి 1.30 వరకు బుధవారానికి,  1.30 నుంచి 3.00 గంటల వరకు గురువారానికి, 3.00 నుంచి 4.30 గంటల వరకు మంగళవారానికి, సాయంత్రం 4.30 నుంచి 6.00 వరకు ఆదివారానికి రాహుకాలం కేటాయించబడింది. ఒకటవ భాగ సమయం ఏ వారంలోనూ కేటాయించబడలేదు. ఈ సమయంలో రాహు, కేతువులను ప్రత్యక్షంగా ప్రార్ధించాలంటే ఉన్న ఏకైక మార్గం గోధుమ పిండి దీపారాధన.

గ్రహ రాజు సూర్యుడు. సూర్యుని యొక్క క్షేత్రమే సింహ రాశి. సూర్యుని యొక్క వారమే ఆదివారం. కనుక ఈ ఆదివారం ఉదయం 6.00 నుంచి 7.30 వరకు ఉన్న సమయంలోనే, రాహు కేతు ప్రభావం మానవాళిపై ఉండకుండా ఉండుటకై ప్రతివారు ప్రయత్నం చేయవచ్చు. అగ్ని తత్వంతో ఉండే చక్రమే మణిపూరక చక్రము. దీనికి అధిపతి సూర్యుడు. అగ్ని తత్త్వం కనుక ఆహారాన్ని మండించి దాని నుంచి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ చక్రం నాభి స్థానంలో ఉంటుంది. ఆహారాన్ని జీర్ణింప చేసి, జీర్ణింపబడిన ఆహారం నుంచి శక్తిని నిల్వచేయటం, శారీరక అవసరాలకు తగిన విధంగా శక్తిని అందించటం ఈ చక్రం యొక్క విధి. అంతేకాక మానసిక పరమైన అధికారాన్ని కూడా నియంత్రిస్తుంది.

గ్రహరాజైన సూర్యుని యొక్క తేజస్సే సమస్త మానవాళి బ్రతుకుటకు అవసరమైన ఆహారాన్ని ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అందించి, సకల జీవకోటికి జీవనాధారంగా నిలిచిన దేవతా మూర్తే శ్రీ సూర్య నారాయణుడు. జ్యోతిషపరంగా సూర్యుని యొక్క ధాన్యము గోధుమ, వారము ఆదివారము. కనుక రాహుకాలము లేనటువంటి ఉదయం 6.00 నుంచి 7.30 సమయాన్ని ఆదివారము నాడు కేటాయించుకోవాలి. ఈ సమయంలోనే ఓ 50 గ్రాముల పొట్టు తీయని గోధుమపిండిని తీసుకొని, అందులో ఆవుపాలు లేక బర్రెపాలు అవకాశం లేకపోతే జలంతోనైనా చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి. (మార్కెట్లో దొరికే గోధుమ పిండిలో పొట్టు ఉండదు. కనుక ఒక కేజీ గోధుమలను కొని, వాటిని పిండి పట్టిస్తే అందులో పొట్టు కలిసి ఉంటుంది. పొట్టు తీయని గోధుమపిండితో స్వీకరించిన ఆహారం వలన ప్రయోజనాలు చాలా మెండు. కానీ ప్రస్తుత రోజులలో పొట్టు పూర్తిగా తీసిన గోధుమ పిండినే మార్కెట్లో విక్రయిస్తుంటారు. కనుక ఈ పూజకు పొట్టుతో ఉన్నది అవసరం కనుక... ఎవరికి వారు ముందుగా గోధుమలను కొని పిండి పట్టించుకొనేది. శనివారం నాడు మాత్రం గోధుమలను కొనవద్దు. ఇది ముఖ్య గమనికగా తెలుసుకోండి. మిగిలిన వారాలలోనే గోధుమలను కొని పిండి పట్టించి నిల్వ చేసుకోండి.)

పై విధంగా ముద్ద చేసిన గోధుమల పిండిని చిన్న ప్రమిదలాగా చేసుకొని రెండు వత్తులను కలిపి ఒక మధ్య వత్తిగా (కుండ వత్తి ) వేసుకోండి. దీనిలో ఆవునెయ్యి లేదా కొబ్బరి నూనెను వినియోగించండి. ఇది కేవలం ఆదివారం ఉదయం 6.00 నుంచి 7.30 లోపలనే కుటుంబ సభ్యులలోని ఎవరో ఒకరు తయారుచేసి వెలిగించండి. వెలిగించిన జ్యోతిని గదిలో బాహాటంగా ఒక ప్రదేశంలో ఉంచితే దాని కాంతిని పూర్తి స్థాయిలో చూడలేము. అందుకని తక్కువ వైశాల్యం ఉన్న ప్రదేశంలో ఈ జ్యోతిని ఉంచినప్పుడు ఆ కాంతి, తక్కువ వైశాల్యమున్న ప్రాంతానికి బాగా ప్రసరిస్తుంది.

కనుకనే ఓ పెద్ద ఖాళీ గిన్నెలో కాని లేక మీకు అందుబాటులో ఉన్న తత్సమానమైన దానిలో... అడుగున స్వల్పంగా పసుపు, కుంకుమను చల్లి దానిపై గోధుమ పిండి జ్యోతిని ఉంచండి. గిన్నె వైశాల్యము తక్కువగా ఉంటుంది కనుక కాంతి అధికంగా గిన్నె లోపల ప్రసరిస్తుంది. ఈ గిన్నెను గృహంలో ఎక్కడైనా ఉంచండి. ఫలాని ప్రాంతంలోనే ఉంచాలనే నియమం ఏమి లేదు.

ఆదివారం ఉదయం 6.00 నుంచి 7.30 లోపల మాత్రమే జ్యోతి వీక్షణం జరగాలి. అనగా కుటుంబంలోని అందరు వ్యక్తులు అవకాశమున్నంత సేపు ( ఒక్కో  నిముషానికి తక్కువ కాకుండా... రెప్పవేసినా ఫర్వాలేదు ) జ్యోతి దర్శనం భక్తితో విశ్వాసంతో చేసుకోండి. 7.30 తర్వాత జ్యోతి వీక్షణం చేసిననూ ప్రయోజనముండదు. కనుక ఈ సమయంలోనే మిగిలిన పనులు ఎన్ని ఉన్నప్పటికీ... రాహువు యొక్క అనుగ్రహం పొందటానికి  చేసే అద్భుత పరిహార ప్రక్రియ కోసం కొన్ని నిముషాలు కేటాయించుకోండి.

ఇక ఈ జ్యోతికి ఆ సమయంలో నైవేద్యం ఇవ్వాలా? వద్దా ? అనే మీమాంశ చాలా మందికి ఉంటుంది. ఇక్కడ ఒక్క విషయాన్నీ గమనించండి. గత పోస్టింగ్ లో తెల్పిన కట్టె పొంగలిని ఆదివారం నాడు తయారు చేసుకొనండి. ఈ పొంగలిని జ్యోతి వద్దనే నివేదించాలనే నియమం ఏమి లేదు. మీ పనులు పూర్తి చేసుకుంటూ... పూజ మందిరంలో ఎటు తిరిగి దీపారాధన చేసుకుంటారు కనుక... అక్కడ మీకు అనువైన సమయంలో... ఆ మందిరంలో ఉండే ఏ దేవతా మూర్తులకైనా ఈ పొంగలిని నివేదించండి. కట్టె పొంగలి నైవేద్యాన్ని చేసినప్పటి నుంచి సూర్యాస్తమయం లోపల ఎప్పుడైననూ ప్రసాదంగా స్వీకరించండి. 

ఉదయం 7.30 తదుపరి నుంచి గోధుమ పిండి జ్యోతిలో నేతిని లేక కొబ్బరి నూనెను వేయవద్దు. అలాగే కొండెక్కును. ఈ జ్యోతిని వెలిగించుటకు లేక వీక్షించుటకు ప్రత్యేక శిరః స్నానములు అవసరం లేదు. మనః శుద్ధి ముఖ్యము. గృహంలో కదలలేని వృద్దులేవరైన ఉన్నచో, వారి చెంతకు గిన్నెను తీసుకొని వెళ్లి జ్యోతి దర్శనం చేయించండి చాలు. ఇక్కడ శరీర శుద్ధి కంటే మనః శుద్ధికే ప్రాధాన్యత అధికము.

జ్యోతి దర్శనం తదుపది మీ మీ నిత్య కార్యక్రమాలను ఆచరించుకొనండి. నివేదనను జ్యోతికే వద్దనే ఇవ్వవలసిన అవసరం లేదని మరీ మరీ గుర్తుంచుకొనండి. ఆదివారం నాడు కట్టె పొంగలిని ప్రసాదంగా గాని లేక ఆహారంగా గాని స్వీకరిస్తే... మూలాధార చక్రంలో పరివేష్టితురాలైనా సాకిన్యంబా అనుగ్రహం లభించటమే కాక జ్యోతి దర్శనం ద్వారా కుండలిలో ఉన్న రాహుగ్రహ అనుగ్రహం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉంటుందనేది పురాతన గ్రంధ సారాంశం.

జ్యోతి కొండెక్కిన తదుపరి ఈ ముద్దను ఎక్కడంటే అక్కడ విసర్జించవద్ధు. పాలతో కలిపి ఉంటారు కనుక దానిని ఎండలో ఉంచితే గట్టి పడుతుంది. చెడు వాసన రాకుండా ఉంటుంది. తిరిగి దానిని  గృహంలోనే ఓ ముఖ్య స్థలంలో భద్రంగా ఉంచుకొనండి. తదుపరి ఆదివారం రోజున మరొక జ్యోతిని పిండితో చేసుకున్నంత వరకు ఈ ఎండిన పిండి ముద్దను విసర్జించకూడదు. పొరపాటున కనపడకపోయిననూ లేక ఏదైనా ఇతరత్రా జరిగిననూ దిగులు చెందవద్దు. తదుపరి ఆదివారం నాడు ఓ మగ్గులో కొద్ది గంటలు ఎండిన జ్యోతిని నానబెట్టి , ఆనాటి రాత్రి లోగా గృహంలో ఉండే వృక్షాల మొదట్లో నీటితో సహా ముద్దని విసర్జించండి.

రెండవ వారం ఏదేని కారణాలచే వెలిగిన్చలేదనుకుందాం. వెలిగించే వారం వరకు ఎండిన ముద్దను అలాగే ఉంచండి. దీనిని ఒక కాగితంలో గాని, ఒక కవర్ లో గాని కట్టి ఉంచండి. ఈ ప్రకారంగా ప్రతి ఆదివారం గోధుమపిండి జ్యోతి వీక్షణను దర్శి స్తుంటే రాహు అనుగ్రహాన్ని పొందవచ్చు. కనుక కేవలం గురు చండాల యోగానికి మాత్రమే కాకుండా మానవాళి శ్రేయస్సుకై ఆచరించే తాంత్రికారాధనే  గోధుమపిండి దీపారాధన.

2016 జనవరి 29 రాత్రి సింహరాశిలో రాహువు ప్రవేశించాడు. త్వరలోనే గురువును సమీపిస్తున్నాడు. రాహు చాయతో కలిగే ప్రయోజనాలు ఇతర అంశాలను తదుపరి పోస్టింగ్లో తెలుసుకుందాం.  - శ్రీనివాస గార్గేయ