Wednesday, April 24, 2013

చైత్రపూర్ణిమకు పాక్షిక చంద్రగ్రహణం

శ్రీ విజయ నామ సంవత్సర చైత్ర మాసం పూర్ణిమ గురువారం అర్ధరాత్రి 25/26 ఏప్రిల్ 2013 తులారాశిలో స్వాతి నక్షత్రమందు రాహుగ్రస్తంగా పాక్షిక చంద్రగ్రహణం సంభవించును. ఈ గ్రహణం నైరుతిదిశలో స్పర్శించి ఆగ్నేయదిశలో మోక్షముండును. యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా ఖండములందు గోచరించును. 

నైరుతిదిశన పాక్షిక చంద్రగ్రహణ ప్రారంభం రాత్రి 1గంట 24 నిముషాలు
దక్షిణదిశన చంద్రగ్రహణ మధ్యకాలం రాత్రి 1గంట 37నిముషాలు
ఆగ్నేయాన గ్రహణ మోక్షకాలం రాత్రి 1గంట 51 నిముషం
చంద్రగ్రహణ పుణ్యకాలం కేవలం 27 నిముషాలు మాత్రమే

 

చంద్రగ్రహణ ప్రారంభానికి ముందు, గ్రహణ మోక్షం తదుపరి కొంత సమయం పాటు చంద్రుని యొక్క కాంతి క్షీణించి ఉంటుంది. కనుక గ్రహణ ముందు మరియు చివరలో ఏర్పడే క్షీణించిన కాంతికి ఓ పేరుంది. దానినే ప్రచ్చాయ గ్రహణము అంటారు. సహజంగా మనకు కనపడే గ్రహణాన్ని ఛాయా గ్రహణము అంటారు. తేజోహీన కాంతి చంద్రుడిని ప్రచ్చాయ గ్రహణం అంటారు.
 

పాక్షిక చంద్ర గ్రహణానికి ముందు 110 నిముషాలు గ్రహణ మోక్షం తదుపరి 110 నిముషాలు చంద్రుడు కాంతి విహీనంతోనే ఉంటాడు. 110 నిముషాలకు ముందు పూర్ణ తేజస్సుతో ఉంటాడు. తిరిగి 110 నిముషాల తర్వాత పూర్ణ తేజస్సులోకి వస్తాడు.
 

మరి ఈ పరంపరలో చైత్ర పూర్ణిమకు పాక్షిక గ్రహణము రాత్రి 1గంట 24నిముషాలకు  ఏర్పడును. దీనికి 110 నిముషాలు ముందు నుంచి తేజోహీన కాంతి ప్రారంభమగును. అనగా రాత్రి 11 గంటల 34 నిముషాలు. అలాగే గ్రహణ మోక్షం రాత్రి 1 గంట 51 నిముషం. దాని తదుపరి 110 నిముషాల వరకు చంద్రుడు తేజోహీన కాంతితోనే ఉంటాడు. అనగా రాత్రి 3గంటల 41 నిముషం వరకు హీన కాంతి ఉండును .
 

కనుక గర్భవతులు రాత్రి 11 గంటల 34 నిముషాల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటల 41 నిముషం వరకు తమ శరీరానికి కాంతి సోకకుండా జాగ్రత్తలు తీసుకునేది. గర్భవతులు మల, మూత్ర విసర్జన చేయవచ్చును. ఆ సమయంలో మేల్కొని ఉన్నప్పటికీ తమ పనులను నిరభ్యంతరంగా చేసుకోవచ్చును. ఒకవేళ టీవీలలో గ్రహణ దృశ్యాలు చూపించినచో చక్కగా చూడ వచ్చును. భయపడవలసిన అవసరం లేదు. ఈ గ్రహణ ప్రభావము ద్వాదశ రాశులపై ఏమి ప్రభావము చూపదు. ఎందుకంటే చంద్రుడు మరో కొన్ని గంటల తదుపరి తన నీచ స్థానమైన వృశ్చిక రాశిలోకి వెళ్ళబోతున్నాడు. కనుక గ్రహణ ప్రభావం శూన్యం.