Tuesday, May 3, 2011

అత్యంత అరుదైన పవిత్రమైన శుభకర గురువారము.

పుష్కరమంటే తీర్థమని, సరస్సుఅని అర్థము. పుష్కరుడు అంటే వారున దేవుడని, మహా పుణ్యపురుషుడని భారతీయ పురాణాలు వర్ణించాయి. పుష్కరుడిని బ్రహ్మ దేవుడు సృష్టించినట్లుగా, బ్రహ్మ శివుని కోసం తపస్సు చేసినట్లుగా పురాణ కధనం. పుష్కరుడినే తీర్థరాజు అని కూడా పిలుస్తారు. ఈ లోకంలో ఉన్న నదులన్నీ తమలో స్నానం చేసిన వారి వద్ద నుంచి వివిధములైన పాపములను స్వీకరించిన కారణంగా వాటి యొక్క పవిత్రత క్షీణించుచున్నదని పుష్కరుడు ఆవేదనతో చింతించేవాడు. అప్పుడు పుష్కరుడు పరమశివుడు కోసం తపస్సు చేసి నదులలో ఏర్పడిన పాపమంతటిని ప్రక్షాళన చేసే మార్గం కోసం అర్ధించాడు. అంతేకాక శివుని గల అష్ట మూర్తిత్వములలో, ఒకటైనటువంటి జలరూపమైన దేహాన్ని తనకు అనుగ్రహించమని పుష్కరుడు కోరాడు. పరమ శివుడు ఆ విధంగానే వరమిచ్చాడు. అట్టి వర ప్రభావంచే పుష్కరుడికి అనంతమైన శక్తి ప్రాప్తించి తద్వారా నదులలో ఏర్పడే పాపా ప్రక్షాళనను తొలగించే ప్రభావాన్ని పుష్కరుడు పొందగలిగాడు.

ఆపైన నదులన్నీ పుష్కరుడిని ఆహ్వానించి తమలో నివసించవలసిందిగా అభ్యర్థించ సాగాయి. ఆ పిమ్మట పన్నెండు పుణ్య నదులలో పుష్కరుడు ఉండేలా ఏర్పాటు జరిగింది. ఈ ఏర్పాటును దేవతల గురువైన బృహస్పతి అనగా ఖగోళంలోని గురుగ్రహ సంచారాన్ని అనుసరించి నిర్ణయమవుతుంది. ఈ ప్రకారంగా మేషరాశి మొదలు మీనరాశి వరకు గల పన్నెండు రాశులలో గురుగ్రహం ద్వాదశరాశి సంచారం ప్రకారం పుష్కరుడు కూడా ఆయా నదులలో నివసించేలా ఈర్పాటు అయినది.

ప్రతి నదికి పన్నెండు సంవత్సరములకొకసారి పుష్కరుని యొక్క ఆగమనం సంభవించిన కారణంగా ఆయా నదులకు పుష్కరాలు వస్తాయి. ఈ పరంపరలో గురుగ్రహము పన్నెండు రాశులలో సంచారం చేస్తున్నపుడు, ధను రాశి మరియు మీనా రాశి గురుగ్రహానికి జ్యోతిష శాస్త్ర ప్రకారం స్వక్షేత్రాలు అగును. ఈ స్వక్షేత్రాలలో మీనరాశి అనేది జల రాశి. కనుక గురుగ్రహము, తన స్వగృహంగా భావించే జలరాశిగా ఉన్న మీనరాశి లోనికి 2010 డిసెంబర్ 6 అనగా వికృతి నామ సంవత్సర శుద్ద పాడ్యమి సోమవారం మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిముషాలకి జలరాశి ఐన మీనరాశి లోనికి ప్రవేశించాడు. తిరిగి 2011 మే 8 శ్రీ ఖర నామ సంవత్సర వైశాఖ శుద్ద పంచమి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల పద్నాలుగు నిముషాలకి తన స్వగృహ జల రాశి ఐన మీనరాశిని విడిచి, మేష రాశి లోకి ప్రవేశించటంతో గంగానదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి.

పుష్కర రాజే గురుడు. గురుగ్రహ వారము గురువారము. గురుగ్రహము జలరాశి ఐన మీనరాశిలో విడిది చేసిన మొత్తం.. రోజులలో కేవలం 22 గురువారాలు మాత్రమే వచ్చాయి. అందులో మొదటి గురువారము 2010 డిసెంబర్ 9 ఉత్తరాషాడ నక్షత్రంలో వచ్చింది. అలాగే చివరి గురువారం 2011 మే 5 రోహిణి నక్షత్రంలో వచ్చింది. అతి తక్కువ గురువారాలతో మీనరాశి సంచారంతో గురువు ఉండటము, సూర్య నక్షత్రమైన ఉత్తరాషాడతో మొదటి గురువారము రావటము, చంద్ర నక్షత్రమైన రోహిణితో చివరి గురువారము రావటము అత్యంత అరుదుగా వచ్చే ఖగోళ సంఘటనలు.

ఇంత వివరణకు కారణమేమిటని ఆలోచిస్తున్నారా ? 2011 మే 5 గురువారం నాడు రోహిణి నక్షత్రంలో చివరి గురువారంతో గురువు జలరాశి మీనంలో వుండగా శుభ ముహూర్తాలు జరుగనున్నాయి. ఆ రోజున ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు మిధున, కర్కాటక, ధను, మకర, కుంభ లగ్నాలలో ముహూర్తాలు వున్నవి. కుంభ లగ్నము చివరి లగ్నం కావటము విశేషం.

కనుక పుష్కర రాజు, శుభ గ్రహమైన గురువు, జలరాశి లో వుండగా చివరి గురువారం, చివరి లగ్నం కావటం మరింత విశేషం కాగా తిరిగి ఈ గురుగ్రహమే మరల 2022 ఏప్రిల్ 13 శుభకృత్ నామ సంవత్సర చైత్ర శుద్ద ద్వాదశి, బుధవారం రోజున తిరిగి జల రాశి ఐన మీనరాశి లోకి గురుగ్రహం ప్రవేశిస్తాడు.

ఇటువంటి మహా పవిత్రమైన గురువారం రోజున గురు మహాదశ జరిగే జాతకులు, పునర్వసు, విశాఖ, పూర్వాషాడ నక్షత్ర జాతకులతో పాటు మిగిలిన అందరు కూడా తమ తమ ఇష్ట దైవాలను స్మరించటమే కాక గురుగ్రహ స్తోత్ర పారాయణ కూడా చేసి, గురుగ్రహ అనుగ్రహానికి పాత్రులు కండి.