గమనిక : 2018 జూన్ 26 రాత్రి నుంచి అక్టోబర్ 25 వరకు 121 రోజులు కుజగ్రహం వక్రంతో సంచారం చేయనున్నది. కనుక కుజ దోషం అనేది లేకున్ననూ, ఉన్నదని భయపడేవారు, ఋణ శత్రు శరీర పీడల నుంచి ఉపశమనానికి ప్రత్యేక అరుదైన విశేష రోజులలో కుజ గ్రహ దోష నివారణకు అద్భుత పరిహారములను ప్రణతి టెలివిజన్ యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి.- శ్రీనివాస గార్గేయ

Sunday, August 21, 2016

శని, కుజ సంఘర్షణ ఉపశాంతికై శ్రీ లలితా సహస్రంలోని షోడశ "రకార" నామాలు

వ్యాస మునీంద్రులు రచించిన 18 పురాణాలలో మార్కండేయ మహా పురాణం ఒకటి. దీనిలోని 13 అధ్యాయాలలో 700 శ్లోకాలు ఉన్నాయి. శ్రీ దేవి మహాత్య్మము గురించి ఈ పురాణంలో సవివరంగా తెలియచేయబడింది.  మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకంలో..
"సావర్ణిః సూర్యతనయో యో మనుః కథ్యతే అష్టమః" అనగా 8వ మనువుగా చెప్పబడే సూర్య భగవానుడి పుత్రుడైన సావర్ణి గురించి అని భావము. కానీ మంత్రం శాస్త్ర ప్రకారం పై పదాలకు అర్ధం ఏమనగా..  ఈంకార, రకార, హకారములతో కలిసిన హ్రీం కారమనే బీజాక్షరము మొదటి శ్లోకంలో వస్తుంది. ఈ విధంగా దుర్గా సప్తశతిలో 700 శ్లోకాలకు, శ్రీదేవికి సంబందించిన బీజములు మంత్రశాస్త్ర ప్రకారం ఉండును. ఈ హ్రీం అనే బీజములో రకారము అగ్ని బీజము. ఈ బీజాక్షరము చాలా విశేషవంతమైనది. కనుకనే ఈ రకారముతో కలిసిన నామాలు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో మనం గమనించవచ్చు.

71వ శ్లోకం - రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా
రంజనీ రమణీ రస్యా రణత్కింకిణిమేఖలా ||

72 వ శ్లోకం - రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా
రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణలంపటా ||


పై రెండూ శ్లోకాలలో మొత్తం 16 నామాలు ఉన్నాయి. ఈ 16 నామాలకి ప్రధమాక్షరము ర. మంత్రం శాస్త్రం ప్రకారం "ర" అనేది అగ్ని బీజము. ఈ ర కారముతో మొదలైన షోడశ నామాలు మహా తేజోవాచకములు. శని గ్రహ, కుజ గ్రహ సంఘర్షణ అగ్నితోనే ప్రారంభమవుతుంది. అంతేకాక ఖగోళంలో సెప్టెంబర్ 1 నాడు సంభవించే సంపూర్ణ సూర్య గ్రహణంపైన శని దృష్టి ఏర్పడింది. అక్కడ గ్రహణం ఏర్పడేది కూడా అగ్ని సంబంధిత సూర్యునికే .

305వ నామం - ఓం రాజరాజార్చితాయై నమః
306వ నామం - ఓం రాఙ్ఞై నమః
307వ నామం - ఓం రమ్యాయై నమః
308వ నామం - ఓం రాజీవలోచనాయై నమః
309వ నామం - ఓం రంజన్యై నమః
310వ నామం - ఓం రమణ్యై నమః
311వ నామం -  ఓం రస్యాయై నమః
312వ నామం -  ఓం రణత్కింకిణిమేఖలాయై నమః
313వ నామం - ఓం రమాయై నమః
314వ నామం -  ఓం రాకేందువదనాయై నమః
315వ నామం - ఓం రతిరూపాయై నమః
316వ నామం - ఓం రతిప్రియాయై నమః
317వ నామం - ఓం రక్షాకర్యై నమః
318వ నామం - ఓం రాక్షసఘ్న్యై నమః
319వ నామం - ఓం రామాయై నమః
320వ నామం - ఓం రమణలంపటాయై నమః

ఈ తేజోవాచకములైన రకారము ద్వారా పరాశక్తి యొక్క ఆవిష్కరణ జరుగును. హ్రీం కారములో కూడా అగ్ని బీజమైన అట్టి "ర" కారమున్నది. ఆ చైతన్యమే చిదగ్ని అని చెప్పబడింది. దానికి సంకేతమే ఈ రకారము. రాజరాజార్చితా అనగా రాజులచేత అర్చింపబడినదని భావము. రాజులకు కూడా రాజులు అనగా ఆ పాలకులకు కూడా పాలకులైన వారిచే పూజింపబడినదని భావము. "శ్రీ మంత్రరాజా రాజ్ఞీ చ శ్రీవిద్యా క్షేమకారిణీ, హ్రీంబీజ జపసంతుష్టా" అంటూ పరాశక్తిని స్తుతించారు.

"రమతే యోగినో లలితే సత్యానంద చిదాత్మని ఇతి రామపదేనాసౌ పరబ్రహ్మా విధీయతే"  అనునది ఉపనిషత్ వాక్యము. అనగా యోగులందరుకు పరమ యోగ్యమైన కైవల్యము ద్వారా ఆనందమును ప్రసాదించుచున్న పరమాత్మయే రామచంద్ర వాక్యము. అదే మంత్రం స్వరూపముగా 319వ నామమైన రామా అయినది. సర్వ స్త్రీ శక్తి అమ్మ యొక్క స్వరూపమని తెలుసుకోవాలి. ఇది మన భారతీయ సంస్కృతీ. శాక్తేయం పేరుతో మాతృ స్వరూపముగా అత్యుత్తమముగా ఆరాధించు పరబ్రహ్మ చైతన్యమే స్త్రీ శక్తిగా చెప్పబడింది.  కనుక ఇట్టి చిదగ్ని మయమైన అమ్మవారి తత్వమును పై రెండు శ్లోకములలో షోడశ "రకార" నామ పరంపరలో చెప్పబడినది.

దివ్యమైన, నిర్మలమైన, నిరంజనమైన, నిర్వికారమైన, సత్య శివ సచ్చితానంద సౌందర్యమే తల్లి స్వరూపము. కనుక శాశ్వతమైన సుఖమునిచ్చే ఈ రకారముతో కూడిన 16 నామములను ఆపత్కల్పము అంటారు. సమస్త ఆపదలను, విపత్తులను తొలగించి శక్తి కల్గిన కల్ప శాస్త్రము. కనుక నామములుగా గానీ లేక శ్లోకములు గాని భక్తి విశ్వాసాలతో ఉచ్ఛరించు వారలు ఖగోళంలో ఏర్పడే శని గ్రహ, కుజ గ్రహ సంఘర్షణ పూరిత ఆపత్తుల నుంచి విముక్తులగుటకు అవకాశములు ఏర్పడును.

కనుక ద్వాదశ రాశుల వారు ఖాళీ సమయాలలో పై రెండు శ్లోకములు కానీ లేదా లలితా సహస్ర నామావళిలోని 305 నుంచి 320 వరకు గల 16 నామాలను అక్టోబర్ 11 వరకు మననం చేస్తుండేది.

గమనిక 1 - పైన చెప్పిన 50 రోజులలో ద్వాదశ రాశుల వారు ఏయే సమయాలలో ఏయే అంశాలలో తగు తగు జాగ్రత్తలు తీసుకొనవలయునో తదుపరి పోస్టింగ్ లో చెప్పబడును.
గమనిక 2 - జాతకాలలో శని, కుజుల సంఘర్షణ ఉన్నటువంటి వారు కూడా ప్రతి మంగళ, శుక్ర శని వారాలలో అవకాశమున్నప్పుడల్లా మానసికంగా పై పదహారు నామాలను విశ్వాసంతో మననం చేసుకొనటం సర్వ విధాలా శుభకరం.

- దైవజ్ఞ శ్రీనివాస గార్గేయ

Thursday, August 18, 2016

ద్వాదశ రాశులపై శని కుజుల సంఘర్షణ ప్రభావం

ఈ 2016వ సంవత్సరం వృశ్చికరాశిలో శని గ్రహం ప్రారంభం నుంచే ఉన్నాడు. జ్యోతిష రీత్యా వృశ్చికరాశి అనేది కుజుని యొక్క సొంత ఇల్లు. కుజ గ్రహము తన స్వక్షేత్రమైన వృశ్చిక రాశిలోకి 2016 ఫిబ్రవరి 20 శనివారం సాయంత్రం 4 గం.42 నిముషాలకు ప్రవేశించాడు. అనగా వృశ్చిక రాశిలో శని, కుజులు ఇరువురు ఉన్నారని భావము.

శని గ్రహము మార్చి 25 శుక్రవారం మధ్యాహ్నం 3 గం. 45 నిముషాలకి వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్ర 2వ పాదం నుంచి వక్రం ప్రారంభించాడు. అప్పటికే కుజుడు అనురాధ నక్షత్ర 3వ పాదంలో సంచారంలో ఉన్నాడు. శని గ్రహ వక్రం ప్రారంభమైన తదుపరి 2016 ఏప్రిల్ 17వ తేదీ సాయంత్రం 5 గం.47 నిముషాలకు కుజుడు కూడా వక్ర స్థితిలోనికి రావటం మొదలైనది. శని, కుజులిరువురు బద్ధ శత్రువులై వృశ్చిక రాశిలోనే వెనుకకు నడవటం జరుగుతున్నది.

ఈ వక్ర నడకతో జూన్ 17 శుక్రవారం రాత్రి 11గం. 45 నిముషాలకు తులారాశిలోనికి కుజుడు రావటం జరిగింది. అంటే 2 గ్రహాలూ వక్రంతో ఉన్నప్పటికీ వేరు వేరు రాశులలో ఉండటం జూన్ 17 నుంచి జరిగిందని భావము. జూన్ 29 బుధవారం రాత్రి 10 గం. 57 నిముషాలకు కుజగ్రహం వక్ర స్థితి నుంచి ఋజు మార్గంలోకి ప్రవేశించాడు.

జూలై  12 వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2గం. 19 నిముషాలకి తిరిగి వృశ్చికరాశిలోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న శని గ్రహం ఆ సమయానికి అనురాధ నక్షత్రంలో సంచారం చేస్తూ ఆగష్టు 2వ తేదీ మధ్యాహ్నం 11 గం.10 నిముషాలకి వక్ర స్థితి నుంచి బయటకి వచ్చాడు. ఆ సమయానికి అనూరాధ నక్షత్రంలోనే కుజ గ్రహం ఉండటం జరిగింది. అంటే శని మరియు కుజ గ్రహాలూ రెండూను అనురాధ నక్షత్రంలోనే కలిసి ప్రయాణం చేస్తున్నాయి.

వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, అనూరాధ నక్షత్రానికి అధిపతి శని. కనుక ఈ ఇరువురూ కలిసి ప్రయాణం చేస్తూ ఆగష్టు 24 వ తేదీన ఒకే బిందువులో కలవటం జరిగింది. ఈ కలయికనే కుజ, శనుల సంఘర్షణ అంటారు. దీని ప్రభావం కలయిక ముందు కంటే కూడా కలయిక జరిగిన తదుపరి దాదాపు 4 మాసాల వరకు వ్యతిరేక ఫలితాలు ఉంటాయని జ్యోతిష శాస్త్రం తెలియచేస్తుంది.

ప్రతి సంవత్సరం ఎదో ఒక రాశిలో ఈ రెండు గ్రహాలూ కలుస్తుంటాయి. కలిసే స్థితిని బట్టి, ఆ సమయానికి ఉన్న ఇతర గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు ఒక్కోసారి అనుకూలంగాను, ఒక్కోసారి ప్రతికూలంగాను ఉంటుంటాయి. తులా, వృశ్చిక రాశులలో ఈ రెండు గ్రహాలూ కలిసిన సందర్భాలలో ప్రభావం దేశం మీదే కాకుండా ప్రపంచం మీద కూడా వ్యతిరేక ఫలితాలు చూపటానికి అవకాశములుండును.

1984లో ఈ రెండు గ్రహాలూ తులా రాశిలో కలిసినప్పుడు ఆనాడు ఉన్న ఇతర గ్రహ స్థితులను బట్టి విశ్లేషిస్తే ప్రపంచ వ్యాప్తంగా దాని ప్రభావం అధికంగా కనిపించింది. 1984 లో కలవటానికి కొద్దిరోజుల ముందు పంజాబ్ బంగారు దేవాలయంలో ఉగ్రవాదుల కాల్పులు, కలిసిన తదుపరి ఆనాటి ప్రధాని శ్రీమతి  ఇందిరాగాంధీపై  సెక్యూరిటీ గార్డ్ లే  కాల్పులు జరపటం, ఆ తర్వాత భోపాల్ గ్యాస్ పేలుడు జరగటం, దీనితో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలలో యుద్ధ వాతావరణం అలుముకోవటం జరిగింది.

శని, కుజ గ్రహాల కలయిక జరిగితే ప్రభావం ఎక్కువగా మారణకాండ, కాల్పులు, యుద్ధ భయ వాతావరణం, హింసాత్మక చర్యలు, అగ్ని సంబంధిత ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, రాజకీయ నేతలపై హత్యా ప్రయత్నాలే కాక ఇతర ప్రకృతి సంబంధమైన అగ్ని పర్వతాలు ప్రేలి లావా రావటము, పిడుగు పాట్లు  మొదలైనవి జరుగుతుండును. వ్యక్తుల మధ్య హింసాత్మక దుశ్చర్యలు అధికంగా ఉండే అవకాశాలు ఉండును.

ఈ పరంపరలో 2016 ఆగష్టు 24న జరిగే కుజ గ్రహ, శని గ్రహ ప్రభావం, అప్పటినుంచి తదుపరి నాలుగు మాసాల వరకు ఉన్నప్పటికీ అధికప్రభావం ఆగష్టు 23 నుంచి 50 రోజుల పాటు మాత్రం కొంత ఎక్కువగా ఉండును. ఎందుకంటే కుజ, శనుల సంఘర్షణ జరిగిన 250 గంటలలోపే సూర్య గ్రహణ బిందువుపై శని యొక్క దృష్టి కూడా పడుతున్నది. అందుచేతనే శని, కుజుల సంఘర్షణ ప్రభావం ఆగష్టు 23 నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు (50 రోజుల పాటు) అల్జీరియా, మొరాకో, బ్రెజిల్, వాషింగ్టన్, దుబాయ్, ఇండోనేషియా, సూరత్, మధ్యప్రదేశ్, మలేసియా, పోలాండ్, ఐర్లాండ్, ఇరాన్, నార్త్ కొరియా, సౌదీ అరేబియా, ఉక్రెయిన్, చైనా, కాలిఫోర్నియా, జపాన్, జార్జియా, టాంజానియా, హిందూకుష్ పర్వతాలు మొదలైన చోట్ల భారీ భూకంప సూచనలతో పాటు హిందూ మహా సముద్రం మరియు సుమత్రా దీవులలో సునామీ అవకాశాలు ఉన్నవి. ఇవి ప్రకృతి సంబంధితములు.

అంతేకాక ఇజ్రాయిల్, పారిస్, రష్యా, టర్కీ, ఉక్రెయిన్, సిరియా, నార్త్ కొరియా, చైనా, యు.యస్.ఏ, సౌదీ అరేబియా, పాలస్తీనా దేశాలలో అధిక తీవ్రవాద చర్యలతో పాటు కొన్ని ప్రాంతాలలో యుద్ధాలకు కాలు దువ్వే విధంగా ప్రభుత్వాలు మరియు రాజకీయ సంక్షోభాలు ఉండును. అలాగే భారతదేశంలో కాశ్మీర్ మరియు ఇతర కొన్ని రాష్ట్రాలలో ఉగ్రవాద, తీవ్రవాద చర్యలతో పాటు కొన్ని చోట్ల రాజకీయ సంక్షోభాలతో పాటు కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులకు సమస్యలున్నవని జ్యోతిష శాస్త్ర రీత్యా చెప్పవచ్చును.

మేషరాశివారు సంతాన విషయాలలోనూ, ప్రయాణ విషయాలలోనూ... వృషభ రాశివారు వృత్తి, ఆరోగ్య, వ్యాపార, విద్య, ఉద్యోగ, వాహన, గృహ, దాంపత్య విషయాలలోనూ ... మిధున రాశివారు సోదర, సోదరి, రుణ, అనారోగ్య, శత్రు అంశాలలోను... కర్కాటక రాశివారు సంతాన మరియు ధన, కుటుంబ, వాక్ స్థాన విషయాలపైనా అధికంగా దృష్టి ఉంచుతూ సమయానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

సింహరాశి వారు ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, వాహన, తల్లి, గృహ, మానసిక, శారీరక అంశాలపైననూ.. కన్యా రాశివారు సోదర, సోదరీ మరియు ఖర్చు విషయాల పైనను జాగ్రత్తగా దృష్టిని పెట్టాలి... తులారాశి జాతకులు లాభ సంబంధిత అంశాల పైన జాగ్రత్తలు తీసుకుంటూ, ఆర్ధిక వాక్ స్థాన, కుటుంబ వ్యవహారాలలో అధిక దృష్టిని ఉంచాలి.. వృశ్చిక రాశి జాతకులు తమ మానసిక, శారీరక, అంశాల పైన అధిక దృష్టిని ఉంచుతూ తాము ఆలోచన చేసే అంశాలను సరియైనవా కాదా అనే భావంతో ఉంటూ తమ తమ నిత్యా జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ప్రతి అంశం పైన సునిశితమైన దృష్టిని ఉంచి ప్రణాళికా బద్ధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

ధనూ రాశి జాతకులు అనవసర ఖర్చు విషయంలోనూ మరియు పితృ సంబంధ విషయాలపైనా దృష్టి ఉంచి సమస్యలు రాకుండా పావులు కదుపుకోవాలి .... అలాగే మకరరాశి జాతకులు లాభ సంబంధ వ్యవహారాలన్నిటిపై తగిన శ్రద్ధను ఉంచుతూ వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులతో దురుసుగా వ్యవహరించకూడదు.

ఇక కుంభ రాశి జాతకుల విషయంలో నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి అంశంలోనూ అత్యధిక శ్రద్ధను చూపుతూ ఉండాలి. దీనితో పాటు భార్య భర్తల మధ్య ఏదైనా చాప క్రింద నీరులా ప్రవేశించకుండా ఆలోచన చేస్తూ ఉండాలి... చివరగా ఉన్న మీనరాశి జాతకుల విషయంలో అనారోగ్య, శత్రు, వాహన చోదక మరియు ప్రయాణ విషయాలతో పాటు, పితృ సంబంధమైన అంశాల మీద కూడా దృష్టిని కేంద్రీకరించాలి .

మొత్తం మీద శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని  ఏ భాగం ద్వారా ద్వాదశ రాశుల వారు ఉపశాంతి మార్గం పొందగలరో తెలియచేసే అంశాలను తదుపరి పోస్టింగ్లో ఉంచగలను.

Monday, August 15, 2016

గ్రహ సంఘర్షణ ప్రభావాలు 50 రోజులా?

ఖగోళంలో పరస్పర వైరమున్న కుజ గ్రహము మరియు శని గ్రహము 2016 ఆగష్టు 24వ తేదీన ఒకే డిగ్రీలోకి రావటం జరగనుంది. దీని ప్రభావం వలన ఆగష్టు 23 నుంచి అక్టోబర్ 10 వరకు 50 రోజుల పాటు కుజ, శని గ్రహాల సంఘర్షణ ప్రభావం ఉండును. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీనే కుజుడు శని ఉన్న వృశ్చికరాశిలోనికి ప్రవేశించినప్పటకీ వక్ర గమనం వలన తిరిగి వెనుకకు తులా రాశిలోకి రావటం జరిగింది. జ్యోతిష శాస్త్ర రీత్యా ఈ రెండు గ్రహాల సంఘర్షణకి ముందు రోజులలోను, వెనుక రోజులలోను ప్రభావాలు ఉండునని చెప్పవచ్ఛును. 1984లో శని, కుజులు ఇరువురు తులా రాశిలో కలవటం, దాని ప్రభావముచే కలయిక ముందు వెనుకలలో భారతదేశంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి.  పంజాబ్ లో గోల్డెన్ టెంపుల్ యందు ఆపరేషన్ బ్లూస్టార్ ద్వారా కాల్పులు, భోపాల్ లో గ్యాస్ పేలుడు, ఆనాటి ప్రధానమంత్రి  అంగరక్షకులు కాల్పులు చేయటం వంటివాటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా అక్కడక్కడా పలు పరిణామాలు చోటు చేసుకున్నట్లు చరిత్ర దాఖలాలు ఉన్నాయి. మరి ఈ 2016లోని శని, కుజుల సంఘర్షణ ప్రభావం ఆగష్టు 23 నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు (50 రోజుల పాటు) ఉంటుంది.

ఈ ప్రభావముచే అల్జీరియా, మొరాకో, బ్రెజిల్, వాషింగ్టన్, దుబాయ్, ఇండోనేషియా, సూరత్, మధ్యప్రదేశ్, మలేసియా, పోలాండ్, ఐర్లాండ్, ఇరాన్, నార్త్ కొరియా, సౌదీ అరేబియా, ఉక్రెయిన్, చైనా, కాలిఫోర్నియా, జపాన్, జార్జియా, టాంజానియా, హిందూకుష్ పర్వతాలు మొదలైన చోట్ల భారీ భూకంప సూచనలతో పాటు హిందూ మహా సముద్రం మరియు సుమత్రా దీవులలో సునామీ అవకాశాలు ఉన్నవి. ఇవి ప్రకృతి సంబంధితములు.

అంతేకాక ఇజ్రాయిల్, పారిస్, రష్యా, టర్కీ, ఉక్రెయిన్, సిరియా, నార్త్ కొరియా, చైనా, యు.యస్.ఏ, సౌదీ అరేబియా, పాలస్తీనా దేశాలలో అధిక తీవ్రవాద చర్యలతో పాటు కొన్ని ప్రాంతాలలో యుద్ధాలకు కాలు దువ్వే విధంగా ప్రభుత్వాలు మరియు రాజకీయ సంక్షోభాలు ఉండును. అలాగే భారతదేశంలో కాశ్మీర్ మరియు ఇతర కొన్ని రాష్ట్రాలలో ఉగ్రవాద, తీవ్రవాద చర్యలతో పాటు కొన్ని చోట్ల రాజకీయ సంక్షోభాలతో పాటు కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులకు సమస్యలున్నవని జ్యోతిష శాస్త్ర రీత్యా చెప్పవచ్చును.

గమనిక: పై వివరములు ఓ జ్యోతిష శాస్త్ర విశ్లేషణగా తెలియచేస్తున్నాను. ఇది ఒక జ్యోతిష అంచనా మాత్రమే. కొన్నిసార్లు రుజువు కాక పోవచ్చును కూడా. ఇది ప్రత్యేక వ్యక్తులను ఉద్దేశించి చెప్పినవి కానే కాదు, అలాగే భయం చెందే విధంగా చెప్పినవి అంతకంటే కాదు. ఉగ్రవాదం మితిమీరుతున్న ఈ రోజులలో ప్రతివారు తగు జాగ్రత్తలతో ఉండాలని చెప్పే ఒక సూచనగా మాత్రమే భావించాలని మనవి. చాప క్రింద నీరులా పాకుతున్న ఉగ్రవాదుల ఆచూకీలు ఎక్కడైనా ప్రజలు గమనించినా, అనుమానం వచ్చినా  తక్షణమే సమీప పోలీస్ శాఖ వారికి తెలియచేయవలసినదిగా మనవి.

పూర్తి వివరాలు రేపటి నుంచి grahabhumi.blogspot.com లో అందిస్తుంటాను. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Sunday, August 14, 2016

నీటిలో మునిగితే చేసిన పాపం పోయి పుణ్యం వస్తుందా ?

కశ్యప మహర్షికి ఇరువురు భార్యలు ఒకరు అదితి రెండవ వారు దితి. దితి గర్భాన్ని అదితి 7 ముక్కలు చేయించింది. (ఒక వస్తువును 7 ముక్కలు చేయాలంటే 6 సార్లు చేస్తే 7 ముక్కలవుతాయి. ఒక కర్రను 3 పర్యాయాలు నరికితే 4 ముక్కలవుతాయి.) అట్టి అదితి తదుపరి జన్మలో వసుదేవుని భార్య దేవకిగా జన్మించింది. దేవకికి గల్గిన మొదటి ఆరుగురు శిశువులను కంసుడు హతమార్చటం జరిగింది. పూర్వ జన్మలో అదితిగా ఉండి 7 ముక్కలుగా చేసినందున (6 సార్లు ఖండించినందున), తదుపరి జన్మలో తన గర్భాన జన్మించిన తొలి ఆరుగురు హతం కావటమే కర్మ సిద్ధాంతం. 

కర్మ సిద్ధాంతం ప్రకారం అనుభవించి తీరాలి. కశ్యపుడి భార్య చేసిన పాపం తదుపరి జన్మలో దేవకీ ఆరుసార్లు శిక్ష అనుభవించింది. వసుదేవుని భార్య పైగా శ్రీ కృష్ణుని తల్లి అయిన దేవకికే గత జన్మ పాపం తొలగలేదు. కేవలం పాపాలు చేసి నీటిలో మునిగితే పుణ్యాలు వస్తాయనుకోవటం పొరపాటు. ఈమాట ఎందుకు చెబుతున్నానంటే 24 సంవత్సరాల క్రితం వచ్చిన గోదావరి, కృష్ణ పుష్కరాలలో మునకలు వేసిన వారు వేల సంఖ్యలో లేరు. మరి ఈ ఒక్క కృష్ణా పుష్కరాలకు 5 కోట్ల మంది మునకలేస్తారని అంచనా. మరి రాబోయే 12 సంవత్సరాలకు ఎన్ని కోట్ల మంది మునకలు వేస్తారు ? ఎన్ని వేలాది కోట్లు ప్రభుత్వాలు ఖర్చు పెట్టాలి ? కనీసం టెలివిజన్ కార్యక్రమాలలో చెప్పే పండితులందరూ పురాణాలు చెప్పిన విషయాల అర్ధాన్ని, పరమార్ధాన్ని విడమర్చి చెప్పాలి. అంతేతప్ప నదిలో మునిగితే చేసిన పాపం పోతుందని చెప్పటం హాస్యాస్పదం . పుష్కర స్నానం అంటే సరియైన అర్ధం చెప్పకుండా, పుణ్యం వస్తుందని ఊదర గొట్టటం సమంజసం కాదు. 

రాబోయే 12 సంవత్సరాలకు ప్రభుత్వ ఖజానా అంతా పుష్కరాలకు వెచ్చించాలి. ఇప్పటికైనా పండితులు గమనించండి. ప్రజలని చైతన్య వంతులుగా చేయటానికి కృషి చేయండి. అంతేతప్ప చేసిన పాపాలు పోతాయని చెప్పకండి. కలుషితమయ్యే నదులను ప్రక్షాళన చేయటానికే తుందిలుడు శివుని యొక్క అష్టమూర్తిత్వములో ఒకటైన జల రూప దేహాన్ని బ్రహ్మ ద్వారా స్వీకరించి పుష్కరుడుగా నీటి యందు ప్రవేశించి... జీవ నదులను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతోటే బృహస్పతి రాశి ప్రవేశంతో నదులకు పుష్కరాలు వస్తుంటాయి. జీవావరణ పరిరక్షణార్థం ప్రతివారు ముందుండాలి. అంతేకాని ఇంటిల్లిపాది వెళ్లి ఆటపాటలతో మునకలు వేస్తున్నందున నది ప్రక్షాళన కాకపోగా మరింత కలుషితం అవుతూ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఇప్పటికైనా ప్రజలు గమనించండి. టీవీలలో చెప్పే పండితులు ఆలకించండి. చేసిన పాపం ఈ జన్మలో లేక మరు జన్మలో అనుభవించి తీరాలి. అంతేతప్ప నీటిలో మునిగినా, దీపం వెలిగించినా పోనే పోదు. ఇదే కర్మ సిద్ధాంతం. 

పై అంశాన్ని ఫేస్ బుక్ ద్వారా మరియు వాట్సాప్ ద్వారా తెలియచేశాను. ఒకరు ఇది చదివి ఏమని స్పందించారంటే... పాపం పోనిమాట యదార్ధమే... తీర్ధ విధి, పుష్కర స్నానం పుణ్యప్రదమే కదా. ఈ పుణ్య ప్రదం అనటం ఆర్ష దృష్టే కదా అని వాట్సాప్ ద్వారా మెసెజ్ పంపారు. దానికి సమాధానంగా ... 

భారతీయ సనాతన ధర్మాలు చాలా  గొప్పవి. ఆర్ష సంస్కృతిని గౌరవించవలసిన బాధ్యత ప్రతి భారతీయుడి యందు ఉన్నది. కానీ చేసే కార్యక్రమాలు వెర్రితలలు వేయకుండా చూడవలసిన బాధ్యత ప్రతి హిందువుపై ఉన్నదనే విషయాన్ని మరువకూడదు. ప్రస్తుతం ముద్రితమవుతున్న పురాణ గ్రంధాలలో అనేక ప్రక్షిప్తాలు కనపడుతున్నాయి. అలాగే ధర్మాన్ని పరిరక్షించవలసిన మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా వారి వారి నియమాలను ఉల్లంఘిస్తున్నారు. ఆర్ష ధర్మం ప్రకారంగా సన్యాసం స్వీకరించిన వారు సముద్రం దాటి వెళ్లకూడదని నియమం ఉన్నది. గతంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు కూడా ఒకానొక అంశంలో ప్రాయశ్చిత్తం చేసుకొనవలసి వచ్చింది . మరి ఈనాడు పీఠాధిపతులుగా పేరెన్నిక గన్నవారు చేస్తున్న విదేశీ ప్రయాణాలకు అడ్డుకట్ట వేసే వారే లేరా? మరి ఆర్ష ధర్మాన్ని గురించి చెప్పవలసిన వారే ఈ విధంగా చేస్తుంటే కంచే చేను మేసినట్లు కాదా! సనాతన ధర్మాలు కానీ, పర్వదిన నియమాలు కానీ , ఇతర వ్రతాలు మొదలైన వాటిని పరిశీలిస్తే... ఇవన్నీఈ కూడా మానవాళి ఆరోగ్య శ్రేయస్సుతో  ముడిపడి ఉన్నాయనే నగ్న సత్యాన్ని తేటతెల్లం చేస్తాయి.

ప్రతిరోజు చేసే సంధ్యావందనాది సంకల్పాలలో జీవనదులు ప్రస్తావన ముడిపడి ఉంటుంది. ఆ ప్రకారంగానే ఎప్పుడైతే పుష్కరాలు జరుగుతాయో ఆ సమయంలో పుష్కర నదిని సంకల్పించుకుంటూ చేసే స్నానమే పుణ్య స్నానం. అసలు నదిని ప్రక్షాళన చేయటం కొరకుగా పుష్కర రాజు వేంచేయటం జరుగుతుంది. దీనిని ఆసరాగా తీసుకొని నదిని విపరీతంగా కలుషితం చేస్తున్నారు. రాబోయే పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల ప్రజా ధనమంతా పుష్కర ఘాట్ల ఏర్పాటుకే సరిపోతాయి. ప్రస్తుతం జరుగుతున్న పుష్కర సరళిని గమనిస్తే... ఇప్పుడు నిర్ణయాలు చెప్పే వారే నిజమైన పండితులని, రెండు దశాబ్దాల క్రితం పండితులు లేరని, అందుకే ఆనాడు పుష్కరాలకు జన సందోహం లేరని అనుకునే వారు కూడా ఉన్నారు. ఇది పొరపాటు. ప్రతి గ్రామంలో ఓ పండితులవారు ఉంటారు. ఆ పండితులవారి చేతిలో పంచాంగము ఉంటుంది, వివరాలు ఉంటాయి. ఆ గ్రామం వరకు ఆ పండితుల వారు తెలియచేస్తారు. ఆనాడు దినపత్రికలు ఉన్నాయి, రేడియోలు ఉన్నాయి. మరి ఆనాటి పుష్కరాలకు జనసందోహం ఎందుకు రాలేదు? ... అంటే  రవాణా సౌకర్యాలు అధికంగా లేవు గనక జనసందోహం లేదని సమాధానం చెప్తారు. ఏది ఏమైనా భారతీయ సనాతన సంప్రదాయాలను సరియైన రీతిలో చెబుతూ ప్రజలకు మార్గ దర్శకులుగా ఉండాలి. అంతేతప్ప విపరీత ప్రచారాలు చేసి అనారోగ్యాలు తెప్పించే విధంగా ఉండకూడదు. టోల్ ప్లాజాల వద్ద గంటల పాటు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ లు రోడ్ల మీద జరుగుతుంటే... పిల్లలు, వృద్దులు తాగటానికి నీళ్లు, తినటానికి తిండి లేక వాహనాలలో ఇబ్బందులు పడుతున్నవారు కోకొల్లలు. మరి ఈ పాపం ఎవరిది????

ఇప్పటికైనా ప్రతివారు మేల్కొనండి. ధర్మాన్ని కాపాడటానికి మార్గాలు ఎన్నో ఉంటాయి. రాబోయే సంవత్సరాలలో తెలిసీ తెలియక తప్పులు జరుగుతుంటే మూల్యం ఎవరు చెల్లించుకుంటారు. కనుక చెప్పవలసిన రీతిలో ప్రజలకు చెప్పాలి. తమ తమ స్వగృహాలలోనే ఉంటూ నదులను సంకల్పించుకుంటూ ఆయా రోజులలోనే స్నానాలు ఆచరించండి. అవే పుణ్యస్నానాలు. ప్రజలందరినీ నదులు దగ్గరికి వెళ్ళమని సలహాలు ఇవ్వకూడదు. ఉగాది పండుగ నాడే ఉగాది పచ్చడి తింటాము. అంతే కానీ శ్రీరామ నవమి రోజు ఉగాది పచ్చడి తినము.. ఇది ఎలాగో... అలాగే పుష్కరాలు వచ్చిన 12 రోజులలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ అక్కడ ఉండే జలాన్ని తీసుకొని సంకల్పిస్తే... తక్షణమే పుష్కరుడు ఆనీటి యందు ఉంటాడు. మనస్సాక్షిగా... ఆత్మసాక్షిగా చేసే సంకల్పాలకు దేవతల అనుగ్రహం ఉంటుందని ఆర్ష ధర్మం తెలియచేస్తుంది. కనుక అలాంటి సంకల్పాలకు వెళ్ళమని ప్రజలను చైతన్య పరచాలి. మన జీవ నదులను కాపాడుకోవాలి. మాటకు మాట విసురుతూ పొతే చివరలో ఆర్ష ధర్మానికి తూట్లు పడుతుంటాయి. ప్రజలకు చక్కని ఆరోగ్యాన్ని ఇస్తూ, విజయంవైపు పయనించేలా మంచి మనసును అందించేవాడే చంద్రుడు. ఈ చంద్రుడు జల రాశికి అధిపతి. కనుక మన సమీపంలో ఉన్న జలరాశులతోనే మనం విజయం సాధించేలా ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆర్ష ధర్మానికి పెద్దపీట వేసినట్లవుతుంది.

ముగింపుగా ప్రతిరాశిలోకి గ్రహ రాజైన సూర్యుడు ప్రవేశించటమే సంక్రమణం ప్రారంభమై, పితరులకు తర్పణాదులు పుణ్యకాలంలోనే ఆచరిస్తారు . అలాగే గురు గ్రహం కూడా ప్రతి రాశి ప్రవేశం కాగానే ఆ 12 రోజులు నదిని సంకల్పించుకొని చేసే స్నానాలే పుణ్య స్నానాలని అర్ధం. కనుక రాబోయే సంవత్సరాలలో శాస్త్ర అంశాలను అర్ధమయ్యే రీతిలో పండితులు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. చెప్పటంలో పొరపాటు జరిగితే అవాంఛనీయ సంఘటనలు మొదలై పలు అనర్ధాలకు హేతువగుననే విషయం విస్మరించరాదు. - దైవజ్ఞ శ్రీనివాస గార్గేయ