Thursday, August 18, 2016

ద్వాదశ రాశులపై శని కుజుల సంఘర్షణ ప్రభావం

ఈ 2016వ సంవత్సరం వృశ్చికరాశిలో శని గ్రహం ప్రారంభం నుంచే ఉన్నాడు. జ్యోతిష రీత్యా వృశ్చికరాశి అనేది కుజుని యొక్క సొంత ఇల్లు. కుజ గ్రహము తన స్వక్షేత్రమైన వృశ్చిక రాశిలోకి 2016 ఫిబ్రవరి 20 శనివారం సాయంత్రం 4 గం.42 నిముషాలకు ప్రవేశించాడు. అనగా వృశ్చిక రాశిలో శని, కుజులు ఇరువురు ఉన్నారని భావము.

శని గ్రహము మార్చి 25 శుక్రవారం మధ్యాహ్నం 3 గం. 45 నిముషాలకి వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్ర 2వ పాదం నుంచి వక్రం ప్రారంభించాడు. అప్పటికే కుజుడు అనురాధ నక్షత్ర 3వ పాదంలో సంచారంలో ఉన్నాడు. శని గ్రహ వక్రం ప్రారంభమైన తదుపరి 2016 ఏప్రిల్ 17వ తేదీ సాయంత్రం 5 గం.47 నిముషాలకు కుజుడు కూడా వక్ర స్థితిలోనికి రావటం మొదలైనది. శని, కుజులిరువురు బద్ధ శత్రువులై వృశ్చిక రాశిలోనే వెనుకకు నడవటం జరుగుతున్నది.

ఈ వక్ర నడకతో జూన్ 17 శుక్రవారం రాత్రి 11గం. 45 నిముషాలకు తులారాశిలోనికి కుజుడు రావటం జరిగింది. అంటే 2 గ్రహాలూ వక్రంతో ఉన్నప్పటికీ వేరు వేరు రాశులలో ఉండటం జూన్ 17 నుంచి జరిగిందని భావము. జూన్ 29 బుధవారం రాత్రి 10 గం. 57 నిముషాలకు కుజగ్రహం వక్ర స్థితి నుంచి ఋజు మార్గంలోకి ప్రవేశించాడు.

జూలై  12 వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2గం. 19 నిముషాలకి తిరిగి వృశ్చికరాశిలోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న శని గ్రహం ఆ సమయానికి అనురాధ నక్షత్రంలో సంచారం చేస్తూ ఆగష్టు 2వ తేదీ మధ్యాహ్నం 11 గం.10 నిముషాలకి వక్ర స్థితి నుంచి బయటకి వచ్చాడు. ఆ సమయానికి అనూరాధ నక్షత్రంలోనే కుజ గ్రహం ఉండటం జరిగింది. అంటే శని మరియు కుజ గ్రహాలూ రెండూను అనురాధ నక్షత్రంలోనే కలిసి ప్రయాణం చేస్తున్నాయి.

వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, అనూరాధ నక్షత్రానికి అధిపతి శని. కనుక ఈ ఇరువురూ కలిసి ప్రయాణం చేస్తూ ఆగష్టు 24 వ తేదీన ఒకే బిందువులో కలవటం జరిగింది. ఈ కలయికనే కుజ, శనుల సంఘర్షణ అంటారు. దీని ప్రభావం కలయిక ముందు కంటే కూడా కలయిక జరిగిన తదుపరి దాదాపు 4 మాసాల వరకు వ్యతిరేక ఫలితాలు ఉంటాయని జ్యోతిష శాస్త్రం తెలియచేస్తుంది.

ప్రతి సంవత్సరం ఎదో ఒక రాశిలో ఈ రెండు గ్రహాలూ కలుస్తుంటాయి. కలిసే స్థితిని బట్టి, ఆ సమయానికి ఉన్న ఇతర గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు ఒక్కోసారి అనుకూలంగాను, ఒక్కోసారి ప్రతికూలంగాను ఉంటుంటాయి. తులా, వృశ్చిక రాశులలో ఈ రెండు గ్రహాలూ కలిసిన సందర్భాలలో ప్రభావం దేశం మీదే కాకుండా ప్రపంచం మీద కూడా వ్యతిరేక ఫలితాలు చూపటానికి అవకాశములుండును.

1984లో ఈ రెండు గ్రహాలూ తులా రాశిలో కలిసినప్పుడు ఆనాడు ఉన్న ఇతర గ్రహ స్థితులను బట్టి విశ్లేషిస్తే ప్రపంచ వ్యాప్తంగా దాని ప్రభావం అధికంగా కనిపించింది. 1984 లో కలవటానికి కొద్దిరోజుల ముందు పంజాబ్ బంగారు దేవాలయంలో ఉగ్రవాదుల కాల్పులు, కలిసిన తదుపరి ఆనాటి ప్రధాని శ్రీమతి  ఇందిరాగాంధీపై  సెక్యూరిటీ గార్డ్ లే  కాల్పులు జరపటం, ఆ తర్వాత భోపాల్ గ్యాస్ పేలుడు జరగటం, దీనితో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలలో యుద్ధ వాతావరణం అలుముకోవటం జరిగింది.

శని, కుజ గ్రహాల కలయిక జరిగితే ప్రభావం ఎక్కువగా మారణకాండ, కాల్పులు, యుద్ధ భయ వాతావరణం, హింసాత్మక చర్యలు, అగ్ని సంబంధిత ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, రాజకీయ నేతలపై హత్యా ప్రయత్నాలే కాక ఇతర ప్రకృతి సంబంధమైన అగ్ని పర్వతాలు ప్రేలి లావా రావటము, పిడుగు పాట్లు  మొదలైనవి జరుగుతుండును. వ్యక్తుల మధ్య హింసాత్మక దుశ్చర్యలు అధికంగా ఉండే అవకాశాలు ఉండును.

ఈ పరంపరలో 2016 ఆగష్టు 24న జరిగే కుజ గ్రహ, శని గ్రహ ప్రభావం, అప్పటినుంచి తదుపరి నాలుగు మాసాల వరకు ఉన్నప్పటికీ అధికప్రభావం ఆగష్టు 23 నుంచి 50 రోజుల పాటు మాత్రం కొంత ఎక్కువగా ఉండును. ఎందుకంటే కుజ, శనుల సంఘర్షణ జరిగిన 250 గంటలలోపే సూర్య గ్రహణ బిందువుపై శని యొక్క దృష్టి కూడా పడుతున్నది. అందుచేతనే శని, కుజుల సంఘర్షణ ప్రభావం ఆగష్టు 23 నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు (50 రోజుల పాటు) అల్జీరియా, మొరాకో, బ్రెజిల్, వాషింగ్టన్, దుబాయ్, ఇండోనేషియా, సూరత్, మధ్యప్రదేశ్, మలేసియా, పోలాండ్, ఐర్లాండ్, ఇరాన్, నార్త్ కొరియా, సౌదీ అరేబియా, ఉక్రెయిన్, చైనా, కాలిఫోర్నియా, జపాన్, జార్జియా, టాంజానియా, హిందూకుష్ పర్వతాలు మొదలైన చోట్ల భారీ భూకంప సూచనలతో పాటు హిందూ మహా సముద్రం మరియు సుమత్రా దీవులలో సునామీ అవకాశాలు ఉన్నవి. ఇవి ప్రకృతి సంబంధితములు.

అంతేకాక ఇజ్రాయిల్, పారిస్, రష్యా, టర్కీ, ఉక్రెయిన్, సిరియా, నార్త్ కొరియా, చైనా, యు.యస్.ఏ, సౌదీ అరేబియా, పాలస్తీనా దేశాలలో అధిక తీవ్రవాద చర్యలతో పాటు కొన్ని ప్రాంతాలలో యుద్ధాలకు కాలు దువ్వే విధంగా ప్రభుత్వాలు మరియు రాజకీయ సంక్షోభాలు ఉండును. అలాగే భారతదేశంలో కాశ్మీర్ మరియు ఇతర కొన్ని రాష్ట్రాలలో ఉగ్రవాద, తీవ్రవాద చర్యలతో పాటు కొన్ని చోట్ల రాజకీయ సంక్షోభాలతో పాటు కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులకు సమస్యలున్నవని జ్యోతిష శాస్త్ర రీత్యా చెప్పవచ్చును.

మేషరాశివారు సంతాన విషయాలలోనూ, ప్రయాణ విషయాలలోనూ... వృషభ రాశివారు వృత్తి, ఆరోగ్య, వ్యాపార, విద్య, ఉద్యోగ, వాహన, గృహ, దాంపత్య విషయాలలోనూ ... మిధున రాశివారు సోదర, సోదరి, రుణ, అనారోగ్య, శత్రు అంశాలలోను... కర్కాటక రాశివారు సంతాన మరియు ధన, కుటుంబ, వాక్ స్థాన విషయాలపైనా అధికంగా దృష్టి ఉంచుతూ సమయానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

సింహరాశి వారు ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, వాహన, తల్లి, గృహ, మానసిక, శారీరక అంశాలపైననూ.. కన్యా రాశివారు సోదర, సోదరీ మరియు ఖర్చు విషయాల పైనను జాగ్రత్తగా దృష్టిని పెట్టాలి... తులారాశి జాతకులు లాభ సంబంధిత అంశాల పైన జాగ్రత్తలు తీసుకుంటూ, ఆర్ధిక వాక్ స్థాన, కుటుంబ వ్యవహారాలలో అధిక దృష్టిని ఉంచాలి.. వృశ్చిక రాశి జాతకులు తమ మానసిక, శారీరక, అంశాల పైన అధిక దృష్టిని ఉంచుతూ తాము ఆలోచన చేసే అంశాలను సరియైనవా కాదా అనే భావంతో ఉంటూ తమ తమ నిత్యా జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ప్రతి అంశం పైన సునిశితమైన దృష్టిని ఉంచి ప్రణాళికా బద్ధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

ధనూ రాశి జాతకులు అనవసర ఖర్చు విషయంలోనూ మరియు పితృ సంబంధ విషయాలపైనా దృష్టి ఉంచి సమస్యలు రాకుండా పావులు కదుపుకోవాలి .... అలాగే మకరరాశి జాతకులు లాభ సంబంధ వ్యవహారాలన్నిటిపై తగిన శ్రద్ధను ఉంచుతూ వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులతో దురుసుగా వ్యవహరించకూడదు.

ఇక కుంభ రాశి జాతకుల విషయంలో నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి అంశంలోనూ అత్యధిక శ్రద్ధను చూపుతూ ఉండాలి. దీనితో పాటు భార్య భర్తల మధ్య ఏదైనా చాప క్రింద నీరులా ప్రవేశించకుండా ఆలోచన చేస్తూ ఉండాలి... చివరగా ఉన్న మీనరాశి జాతకుల విషయంలో అనారోగ్య, శత్రు, వాహన చోదక మరియు ప్రయాణ విషయాలతో పాటు, పితృ సంబంధమైన అంశాల మీద కూడా దృష్టిని కేంద్రీకరించాలి .

మొత్తం మీద శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని  ఏ భాగం ద్వారా ద్వాదశ రాశుల వారు ఉపశాంతి మార్గం పొందగలరో తెలియచేసే అంశాలను తదుపరి పోస్టింగ్లో ఉంచగలను.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.