Saturday, August 30, 2014

2014 ఆగష్టు 31 ఆదివారం రాత్రి ఆకాశంలో శని, కుజ, చంద్రుల దర్శనం

ఆగష్టు 31 ఆదివారం షష్టి తిథి వచ్చినందున దీనిని భానుషష్టి అంటారు. ఇదే రోజున తులారాశిలో శని గ్రహం, కుజ గ్రహాలతో పాటు చంద్రుడు కూడా వున్నారు. ఈ మూడు గ్రహాలు ఓ ముక్కోణాకారంగా ఆదివారం సాయంత్రం సూర్యాస్తమం తరువాత ఆకాశంలో నైరుతి దిశలో కనపడతారు. ఈ మూడు గ్రహాలలో శని గ్రహం మాత్రం బంగారు రంగులో దర్శనమిస్తాడు. కుజుడు అరుణ వర్ణంతో ఉంటాడు. జ్యోతిష శాస్త్ర రీత్యా భాను షష్టి పర్వదినాన ప్రదోష కాలంలో త్రిగ్రహ దర్శనం కలగటం, దానిని వీక్షించటము శుభ ప్రదం. ముక్కోణాకారంగా కనపడతాయి అంటే.... శని కుజ చంద్రుల నుంచి ఓ రేఖను గీచినట్ట్లుగా భావిస్తే, ఈ మూడు గ్రహాలూ ఒక త్రికోణానికి మూడు బిందువులుగా ఉంటాయి.
 

శని ఈ తులా రాశినుంచి 2014 నవంబర్ 2 వ తేదిన వృశ్చిక రాశిలోనికి పయనిస్తాడు. శని గ్రహానికి ఇది ఉచ్చ స్థానము. తిరిగి ఈ స్థానంలోకి శని రావాలంటే మరో 30 సంవత్సరాల సమయం పడుతుంది. అప్పుడు శనితో కుజుడు కలవాలి, చంద్రుడు కలావాలి.... భాను షష్టి అయివుండాలి, దీనికి తోడు గణపతి నవరాత్రులు కలిసి రావాలి. ఇలాంటి అవకాశం రావటం కొంత కష్టమే మరి.
 

కనుక ఈ సమయంలో ద్వాదశ రాశులవారు అవకాశం ఉన్నంతవరకు ఈ మూడు గ్రహాలను వీక్షించటానికి ప్రయత్నించటమే కాకుండా.... ఆ సమయంలో దేవి ఖడ్గమాలా స్తోత్ర పఠనమ్ చేయటం ఎంతో శ్రేయోదాయకం. ఇక్కడ కుజుడు, చంద్రుడు మిత్రులు. కుజుడు, శని శత్రువులు. చంద్రుడు శనికి అంతర్గత శత్రువు. అయితే ప్రస్తుతం జరిగే గ్రహ స్థితుల ప్రకారం ద్వాదశ రాశుల వారు ఆరోగ్య అంశాలపై ఈ ఆదివారం నుంచి 5 రోజుల పాటు కొంత అధిక శ్రద్ధ చూపించటం ఎంతైనా మంచిది. కనుక ప్రతి వారు ఈ త్రిగ్రహ దర్శనాన్ని చేసుకొనవలసినది. ఈ సమయంలో ఆకాశం మేఘావృతం కాకుండా వుంటే విశేష స్థితిని వీక్షించగల అవకాశం ఉంటుంది.

Tuesday, August 26, 2014

అంతర్లీన దోషాలు - 2

జన్మించిన ప్రతివారూ తాము మరణించే లోపు ఇతరులకు హాని చేయకుండా మరియు తలపెట్టకుండా, ప్రతి వారికి శుభం కలగాలనే, సమాజంలో అందరూ కలసి మెలసి ఉండాలని కోరుకుంటూ ఉంటుండాలి. కాని కాలగమనంలో వచ్చే మార్పుల వలన గాని లేదా సమాజంలో ఉండే స్థితి గతుల వలన గాని లేదా వ్యక్తిగత స్థితుల వలన గాని, లేదా ఆర్ధిక పరమైన అంశాల వలన గాని మనిషిలో అనేక రకాల మార్పులు రావటం, వాటిచే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే అరిషడ్వర్గాల ప్రభావం అధికం కావటంచే వ్యక్తి మనస్సులో నూతన అంశాలు చోటు చేసుకొని, వాటి వ్రేళ్ళు లోపలకి పాతుకుని పోతున్నాయి. సత్త్వగుణం తగ్గటం, రజో తమో గుణాలు పెరిగి పోవటం జరుగుతున్నది.

పై కారణాలచే వ్యక్తులలో వర్గ వైషమ్యాలు తారాస్థాయిలో ఉండటము, దాని వలన వ్యక్తిలో క్రొత్త ఆలోచనలు రావటం, అవి తనకే కాకుండా ఇతరులకు కూడా హాని తలపెట్టేవిగా ఉండటం జరుగుతున్నది. ఈ అంశాలు ఇటీవల నుంచే వచ్చినవి కానే కావు. అనాదిగా జన్మించిన వారందరిలో దాదాపు 80 శాతం వరకు ఈ కోవలోనే ఉంటుంటారు.

ఇక వారి యొక్క జీవన విధానంలో న్యాయబద్దత లోపించటము, మానవతా భావము అడుగంటటము, ఆవేశంతో చేయకూడని పనులు చేస్తూ ఇతరులను బాధ పెట్టి హింసా మార్గానికి పరోక్షంగా పెద్ద పీట వేస్తుంటారు. ఇట్టి వారి గుణ గణాలు ఇతరులకు ఎట్టి పరిస్థితిలోను నచ్చవు. ఓ కుటుంబంలోని ఓ వ్యక్తి ఇలాంటి హింసా మార్గంలో ఉంటూ... ఏదో ఒకనాడు తనువు చాలిస్తాడు. ఆ వ్యక్తికి కల్గిన సంతానంపై... ఈ తండ్రి చేసిన హింసాయుత చర్యల ప్రభావం తప్పకుండా ఉండి తీరుతుంది. దీనిని బట్టి మనకు తేటతెల్లమయ్యేది ఏమిటంటే... వ్యక్తులు చేసే కార్యాల ప్రభావం, తప్పక సంతతిపై ఫలితాలను చూపిస్తూనే ఉంటాయి. 


కొంతమంది తాము జీవించినంత కాలం ఎదుటివారికి ఎట్టి సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతూ, అందరితో స్నేహ సంబంధాలు మెరుగు పరచుకుంటూ, మానవతా భావంతో ఉంటూ రాగ, ద్వేషాలను విడిచి, భూత దయ కల్గి, కీర్తి శిఖరాలను అధిరోహించినవారు ఉంటుంటారు. ఇట్టి వారు చేసిన సమాజానికి చేసిన ఘనమైన సేవల ప్రభావానికి తగినట్లుగానే... దాని ప్రభావం సంతతిపై ఆనందదాయకంగానే ఫలితాలను అందిస్తూ ఉంటుంది.

వ్యక్తులు చేసే కార్యాకార్యాల ప్రభావం... వారు మరణించిన తదుపరి సంతతికి ఫలితాలను చూపుతూనే ఉంటాయి. అయితే ఇక్కడొక విషయాన్ని గమనించాలి. ఒక వ్యక్తికి నలుగురు సంతానం ఉన్నారనుకుందాం, ఆ వ్యక్తి చనిపోయే లోపు ఎవ్వరికీ ఎలాంటి సమస్యలను ఇవ్వకుండా మంచి భావంతో దాన ధర్మాలు చేసి కాలం చేశాడు. మరి ఈ దాన ధర్మాలు చేసిన వ్యక్తి చనిపోయిన తదుపరి... వారి సంతతిపై వారికున్న నలుగురు సంతానంపై అనుకూలమైన ఫలితాలను ఇస్తాయని అనుకోవాలి. కాని ఈ నలుగురు సంతానంలో తమ చనిపోయిన తండ్రి చేసిన విశేష కార్యాల ప్రభావ ఫలితాలు.... తాను తన జాతకరీత్యా పొందే అవకాశము గల గ్రహస్థితి ఉన్నప్పుడే.... ఆ సంతతికి పూర్ణ ఫలాలు లభిస్తాయి. దీని అర్ధం ఏమిటంటే చనిపోయిన వారి వలన వచ్చే విశేష ఫలితాలను అందుకునే స్థితి జాతకంలో ఉన్నప్పుడే సాధ్యము.

అలా కాకుండా ఒక వ్యక్తి అందరినీ హింస పెడుతూ, దాన ధర్మాలు చేయకుండా, నేరాలు కుట్రలు కుతంత్రాలు, హత్యా రాజకీయాలు మొదలైనవాటిని ప్రేరేపిస్తూ కాలం చేశాడని అనుకుందాం. ఈ వ్యక్తికి కూడా నలుగురు సంతానం ఉన్నారనుకుందాం. మరి ఇప్పుడు ఈ దుర్మార్గపు లక్షణాలు గల వ్యక్తి చనిపోయిన తదుపరి... వాటి ప్రభావ ఫలితాలు నలుగురు సంతతిపై ఉంటుందా ? ఒక్కోసారి ఈ నలుగురు సంతతిపై వాటి ఫలితాలు ఉండవచ్చు లేక ఉండకపోవచ్చు లేక కొంతమందికే ఉండవచ్చు. దీని అర్థం ఏమిటంటే, ఆ వ్యక్తికి కలిగిన సంతానం జన్మ జాతకాల ప్రకారం... తమ చనిపోయిన తండ్రి చేసిన దుర్మార్గపు కార్యాల ప్రభావ ఫలితాలు సంతతికి ప్రాప్తించే గ్రహ స్థితి ఉండవచ్చు లేక ఉండకపోవచ్చు.

కనుక ప్రతి వారి జాతకాలలో పితరులు (చనిపోయినవారు) చేసిన కార్యాల ప్రభావంచే అనుకూల లేక ప్రతికూల ఫలితాలు వారి వారి సంతానంపై ఉండటానికి కొన్ని ప్రత్యేక గ్రహస్థితులు ఉంటుంటాయి. ఈ ప్రత్యేక గ్రహస్థితులు గనుక ఎవరి జాతకాలలోనైనా ఉండి ఉంటే వారు తమ పితరులు చేసిన కార్యా కార్య ప్రభావ ఫలితాలను, ప్రస్తుతం పొందుతుంటారు.

ఇంతకూ ఆ ప్రత్యేక గ్రహస్థితులు అనేక రకాలుగా ప్రతి వారి జాతకాలలో అంతర్లీనంగా దాగి ఉంటాయి. ఇట్టి గ్రహస్థితులను జ్యోతిష పండితులు ప్రత్యక్షంగా గ్రహించలేరు. జాతకంలోని పన్నెండు భావాలలో, సమస్యలు ఎక్కడా లేనే లేవని, పండితులు బల్ల గుద్ది చెప్పినప్పటికీ, ఈ జాతకులు మాత్రం సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. కనుక పితరులు చేసిన పుణ్య కార్యాల ఫలితాల ప్రభావాన్ని జాతకులు అందుకొనే గ్రహస్థితి ఉంటే దానిని అదృష్టం గా భావించాలి. ఇట్టి అదృష్ట , ఆకర్షిత గ్రహస్థితి ప్రతివారి జాతకాలలో ఉండదు. కొంత మందికి మాత్రమే పరిమితము.

అలా కాక తమ పితరులు చేసిన పాప కార్యాల ఫలితాల ప్రభావాన్ని వారి సంతానం అందుకొనే గ్రహస్థితి ఉంటే దానిని దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితిగా భావించాలి. ఇట్టి దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితి కూడా అందరికీ ఉండదు. కొంత మందికి మాత్రమే పరిమితము.

చిట్ట చివరిగా ఒక మాటలో చెప్పాలంటే పితరులు చేసిన కార్యాల ప్రభావం అదృష్ట, దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితులుగా జాతకాలలో ఉంటుంటాయి. ఇవి అందరి జాతకాలలో ఉంటాయనుకోవటం పొరపాటు. నూటికి 85 శాతం వరకు మాత్రం ఆకర్షిత గ్రహస్థితులు ఉంటున్నట్లుగా మా పరిశోధనలో వెల్లడైనది.

పితరులు అంటే ఎవరు ? ఈ ఆకర్షిత గ్రహస్థితులు ఏ విధంగా ఉంటాయి ?... తల్లి తండ్రులు జీవించి ఉన్నప్పుడు బిడ్డలకు ఎవరి ద్వారా మంచి చెడు ప్రాప్తిస్తుంటాయి? ..... ఒకవేళ దురదృష్ట, అదృష్ట గ్రహస్థితులు ఉంటే, ఏ ఏ దశలలో ప్రభావాలు ఉంటుంటాయి... అసలు ఇలాంటి జాతక స్థితులను ఏమంటారు... అనేక ఆసక్తికర అంశాల కోసం అంతర్లీన దోషాలు మూడవ భాగంలో తెలుసుకుందాం.     - శ్రీనివాస గార్గేయ

భాద్రపదమాస మహాలయపక్షము

భాద్రపదమాసం ప్రారంభమైనది. ఈ మాసంలోని రెండవ పక్షాన్నే పితృ పక్షము అంటారు. పితృ దేవతలకు విశేషంగా ప్రీతికరమైన మాసమని భావము. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజులను పరిశీలిస్తే ఖగోళంలో సూర్యుడు కొద్ది రోజులు సింహ రాశిలోను, కొద్ది రోజులు కన్యా రాశిలోను ఉంటుంటాడు. ఒక్కోసారి ఒక రాశిలో ఉండగానే భాద్రపద మాస పితృపక్షం గడిచిపోతుంది. సూర్యుడు కన్యా, తులా రాశులలో సంచారం చేసి వృశ్చిక రాశి ప్రవేశం జరిగేవరకు ప్రేతపురి శూన్యంగా ఉంటుందని శాస్త్ర వచనం. అంచేత కన్య, తులా రాశులలో సూర్య సంచారం జరిగే షుమారు 60 రోజుల కాలమంతయూ... పితృ దేవతలు తమ ప్రేతపురిలో భోజన పానీయాలు లేకుండా ఉంటారు. ఇట్టి సమయంలో వారందరూ కూడా భూ లోకానికి వచ్చి వారి వారి గృహాల చుట్టూ తిరుగుతుంటారని మహా భారత గ్రంధం చాటి చెప్తుంది.

అందుచేతనే మనిషి చనిపోయిన తర్వాత చేసే కర్మ కాండలకు చాల కీలక ప్రాధాన్యత ఏర్పడింది. మానవులు గతించిన తర్వాత శ్రాద్ధ కర్మలు ఆచరించటం మన సంప్రదాయం. కాని ప్రతిఫలం ఆశించకుండా ఇట్టి శ్రాద్ధ కర్మలను ఆచరించాలి. వంద యజ్ఞాలు చేసే కన్నా పితృ దేవతలకు తర్పణాలు అందించటం ఎంతో ముఖ్యమని మన మహర్షులు తెలియచేస్తున్నారు. గతించిన తల్లి తండ్రులకు, ఇతరులకు తద్దినాలు, తర్పణాలు, పిండప్రదానాలు ప్రతి సంవత్సరము వారు మరణించిన రోజున ఆచరిస్తుంటారు.

కొంతమంది అయితే వారు మరణించిన రోజునే అన్నదానం చేసినట్లయితే పితృ దేవతలకు ఉత్తమ గతులు కల్గుతాయనే నమ్మకంతో అన్నదానంతో పాటు విశేష దానాలను చేస్తుంటారు. ఇలా చేసినందున పితృ దేవతల ఆశీస్సులు లభించి సకల శుభాలు కల్గుతాయని విశ్వాసం. కొంత మంది ఆర్ధిక స్తోమత లేనివారు ఇలాంటి విధానానికి బదులుగా ఆలయ అర్చకులకు, లేక సమీపంలో ఉండే పురోహిత పండితులకు దక్షిణ తాంబూలాలతో వారికి స్వయంపాకం సమర్పిస్తుంటారు. పితృ దేవతల ఆత్మకు శాంతి కల్గినప్పుడే ఇహ లోకంలో ఉన్న మనకు కూడా ప్రశాంతత చేకూరి సుఖ సంతోషాలతో వంశాభి వృద్ధి ఉంటుందని ధర్మశాస్త్రాలు తెలియచేస్తున్నాయి.

దానశీలిగా పేరుగాంచిన కర్ణుడు మరణానంతరము స్వర్గ లోకానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఆకలి, దప్పిక కలగటంతో, తాను సమీపంలోని ఫల వృక్షానికి ఉన్న పండును కోసుకొని.. తినాలనుకునే సమయంలో, ఆ పండు కాస్తా బంగారు పండుగా మారిపోయింది. ఆ విధంగా సమీపంలో ఉన్న ఏ ఫల వృక్షం నుంచి ఫలాన్ని కోసిననూ, అవి కూడా స్వర్ణ ఫలాలుగానే మారిపోతున్నాయి. దప్పిక తీర్చుకుందామని సమీప సెలయేటిలోని నీటిని దోసిలిలో తీసుకున్నప్పటికీ, ఆ నీరు స్వర్ణ జలంగా మారటం జరిగింది. స్వర్గానికి వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే పరిస్థితి పునరావృత మైనది.

ఈ విధంగా జరగటానికి ప్రధాన కారణమేమిటని కర్ణుడు వాపోతుంటే... కర్ణా... ధన, కనక, వస్తు, వాహనాలన్నీ దానం చేసావు గాని ఏ ఒక్కరికి కూడా పట్టెడు అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ స్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. వెంటనే కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని ప్రాధేయ పూర్వకంగా ప్రార్ధించగా, సూర్య దేవుని యొక్క అనుగ్రహం మేరకు ఇంద్రుడు ఓ అపురూపమైన అవకాశాన్ని కర్ణునికి ఇచ్చాడు.

అదేమిటంటే తక్షణమే భూ లోకానికి వెళ్లి అక్కడ వారందరికీ అన్న పానీయాలను అందచేసి, మాతా పితరులందరికీ తర్పణాలు వదిలి తిరిగి స్వర్గానికి రావటము. ఇంద్రుని అవకాశం మేరకు కర్ణుడు భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి రోజున భూలోకానికి రావటము, ఇక్కడ పేదలకు అన్న సంతర్పణలు, పితరులకు తర్పణ, పిండ ప్రదానాలు వదిలి తిరిగి భాద్రపద అమావాస్య రోజున స్వర్గానికి వెళ్ళాడు. ఇట్టి అన్న సంతర్పణలు, పితృ తర్పణాలు చేసినందున స్వర్గ లోకంలో కర్ణుడు సుఖంగా ఉండటానికి అవకాశం లభించింది.

కర్ణుడు భూలోకానికి వచ్చి, ఇక్కడ కొద్ది రోజులు ఉండి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలోని చివరి రోజునే మహాలయ అమావాస్య అంటారు.

ప్రస్తుత యాంత్రిక యుగంలో పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు (తద్దినాలు) పెట్టటము మానుతున్నారు. సమయం లేక కొంతమంది, బ్రాహ్మణులు దొరకక ఇంకొంతమంది, గృహంలో అనారోగ్య కారణాలచే శుచితో (మడి) వంట చేసేవారు లేక అలాగే వంట వారు దొరకక, మరికొన్ని సందర్భాలలో శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే పితృ దేవతలకు చేరతాయా అనే హాస్యాస్పద ధోరణితో.... ప్రస్తుత కాలంలో తద్దినాలు తగ్గిపోతున్నాయి. ఈ కారణాల వలన వంశాభివృద్ధి జరగటంలేదనేది అక్షర సత్యము.

ఆచార వ్యవహారాల మీద మహా విశ్వాసం ఉన్న వారికి కూడా, తమ తమ ఉద్యోగ వ్యాపారాల వలన కాని ఇతర అనారోగ్యాల వలన కాని ఒక్కోసారి సమయం దొరక్క, ఆ రోజున వారి పితృ దేవతలను స్మరిస్తూ, ఆ యా రోజులలో కొన్ని పుణ్యక్షేత్రాలలోని నిత్యాన్నదాన సత్రాలలో తమ పెద్దల పేరుతో, తమ శక్తికి తగినట్లుగా అన్నసంతర్పణ గావిస్తున్నారు. ఏమి చేయలేని ఆర్ధిక దుస్థితి లో ఉన్నవారు... సమీపంలో ఉన్న వృక్ష సముదాయాల దగ్గరకు వెళ్లి, ఆ వృక్షాన్ని హత్తుకొని పితరులను ఉద్దేశించి కన్నీరైన కార్చవలెనని ధర్మ శాస్త్రం తెలియచేస్తుంది.

వైదిక పరమైన ఆచారాలు, సంప్రదాయాల మీద నమ్మకం లేని వారు కూడా సంవత్సరంలో ఒక్కరోజైనా చనిపోయిన వారిని తలుచుకొని పేదలకు వస్త్ర, ధన, అన్నదానాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. వస్త్ర దానం గాని, ధన దానం గాని చేసిన తర్వాత స్వీకరించిన వారు పూర్తిగా తృప్తి పడలేరు. ఎందుకంటే బాగా ధనవంతులుగా ఉన్నారుగా ! మరికొంత ఎక్కువ ధనం  ఇస్తే బాగుండేది అనుకుంటారు, అలా కాకుండా వారిని కూర్చోపెట్టి కడుపునిండా... తృప్తి పడేలా అన్నదానం చేసినప్పుడు వారు... సంతృప్తి తోనే ఇక చాలు అంటారు. అందుకే అన్నీ దానాల కంటే అన్నదానం గొప్పదని శాస్త్ర వచనం.

కనుక పాఠకులు ఈ ఆర్టికల్ ను చదివి మహాలయ పక్షంలో తమ పితరులకు తర్పణ పిండ ప్రదానాదులు ఆచరిస్తూ, పేదలకు తమ శక్త్యానుసారం అన్నదానం చేయగలరని ఆశిస్తూ.. జ్యోతిష శాస్త్ర ప్రకారం భాద్రపద మాస మహాలయ పక్షము సూర్యుడు సింహ, కన్య రాశులలో సంచారం చేసే సమయంలోనే  వస్తుంది. ఈ సమయంలో విధి విధానంతో ఆచరించినప్పటికీ... పితృ కారకుడైన సూర్య గ్రహము ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 16 నుంచి నవంబర్ 17 వరకు కన్యా, తులా రాశులలో సంచరిస్తుంటాడు. కనుక ఈ 60 రోజులలో వచ్చే ఇతర  అమావాస్య  రోజులలో కూడా తమ తమ పితరులను ఉద్దేశించి వైదిక క్రియల ద్వారా గాని అన్న సంతర్పణలు గాని ఆచరించవచ్చును.  ఈ పితృ దేవతలను గురించిన విశేష అంశాలు జాతకాలలో ఏ విధంగా అనుకూల, ప్రతికూల ప్రభావాలు చూపిస్తుంటాయో  అంతర్లీన దోషాలు - 1 నుంచి వరుసగా చదవండి . - శ్రీనివాస గార్గేయ

Friday, August 22, 2014

అంతర్లీన జాతకదోషాలు - 1

పురాతన తాళపత్ర గ్రంధాలలో జ్యోతిష అంశాలు నిక్షిప్తమై ఉన్నాయి. కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చినప్పటికీ, ఇంకా ఎన్నో అంశాలు వెలుగులోకి రావలసిన అవసరం ఉన్నది. చాలా మంది జాతక చక్రాలలో పైకి దోషాలు ఏమి కనపడక పోయినప్పటికీ... వారు అనేక బాధలతో, సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఉదాహరణకు ఒకరికి జాతక చక్రంలో వివాహ స్థానంలో సమస్య ఎక్కడా గోచరించకపోయినప్పటికీ... ఆ ఒకరికి ప్రధమ వివాహం దెబ్బతిని విడాకులు తీసుకున్నారు. మరి ఎందుకు విడాకులు తీసుకొనవలసి వచ్చింది. ఇలాంటి సందర్భాలలో కేవలం దోషమనేది వివాహ స్థానంలోనే ఉంటుందని కాదు. ఆ దోషాన్ని ఇచ్చే గ్రహ స్థితులు, జాతకంలో మరో స్థానంలో ఉండి, పరోక్షంగా వివాహ అంశం మీద ప్రభావం చూపింది.

అలాగే జాతక చక్రంలోని 12 భావాలలో కనపడని దోష స్థితులు వేరు వేరు రకాలుగా కనపడుతూ ఉంటాయి. ఇలాంటి వాటిని ప్రతి ఒక్కరూ గమనించుకుంటూ, దోష పరిహారం కూడా క్రమం తప్పకుండా చేసుకుంటూ ఉంటుండాలి.  కొన్ని కొన్ని దోషాలకు ఉపశమనంగా చేసే పరిహారాలు కొంతకాలం వరకే ఆచరించాలి.  మరికొన్ని దోషాలకు అతి దీర్ఘ కాలం పరిహారాలు ఆచరిస్తూ ఉండాలి. 

ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి జాతక పరమైన దోషం ఉన్నప్పుడు, ఆ వ్యక్తి మాత్రమే పరిహారం పాటిస్తూ ఉంటే... జీవితం సంతోషమయంగా ఉంటుంది. అలా కాక ఆ వ్యక్తికి బదులుగా మరొక వ్యక్తి పరిహారం పాటిస్తే, ఫలితాలు సజావుగా ఉండవు. 

మన జాతక చక్రాలలో గ్రహ బలా బలాలు ఎలా ఉన్నప్పటికీ దైవబలం కూడా మనకు అనుకూలంగా ఉంటుండాలి. అందుకే చాలా మంది ఆలయ దర్శనాలు చేయటం , వ్రతాలు, నోములు చేపట్టటం , హోమ కార్యక్రమాలలో పాల్గొనటం చేస్తుంటారు. భగవంతుని యొక్క అనుగ్రహం పొందటానికి, ప్రతి ఒక్కరు వారికి తోచిన మరియు తెలిసిన రీతిలో ప్రార్ధనలు సాగిస్తుంటారు.
భారతీయ సనాతన సాంప్రదాయంలో అనేక వైదిక క్రియలు ఉన్నాయి. ఇవి కొంతమందికి అందుబాటులో ఉంటాయి. చాలా మందికి అందుబాటులో కూడా వుండవు. 


మనది కర్మభూమి, వేదభూమి. మనం చేయాల్సిన, ఖచ్చితంగా ఆచరించాల్సిన కర్మలను విసర్జిస్తున్నాం. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే మన నిత్య యాంత్రిక జీవనంలో సమయాభావం వలన ఆచరించాల్సిన కర్మలను ఆచరించలేక, తేలికపాటి అంశంతోనే తూ తూ మంత్రంగా చేయి దులుపుకుంటున్నారు. ఇందుచేతనే క్షణ క్షణం సమస్యలు, మానసిక వత్తిడులు, చెప్పుకోలేని కష్టాలు ఎదురవుతున్నాయి.
 

కొంతమందికి కావలసినంత ధనం ఉంటుంది. కాని తెలియని ఆవేదన, అశాంతి వెంటాడుతూనే ఉంటాయి. ఇంకొంత మందికి సకల భోగాలతో తులతూగే అవకాశాలు ఉన్నప్పటికీ, తనివితీరా భోజనం చేయటానికి అనారోగ్యం అడ్డుపడుతుంటుంది.
 

మరికొన్ని కుటుంబాలను పరిశీలిస్తుంటే అనేక ఆశ్చర్యకరమైన తేటతెల్లమవుతుంటాయి. కుటుంబ సభ్యులలో అధికులకు వివాహం కాకుండా వుండటం లేదా సంతానం కలగకుండా ఉండిపోవటం, ఏదో వంశ పారంపర్యంగా వస్తున్నదన్నట్లుగా కనుచూపు తగ్గిపోవటం, మూగవారుగా ఉండిపోవటం, అంగవైకల్యంతో ఉండటం గాని, న్యాయ స్థానాల చుట్టూ జీవితకాలం తిరగటం కాని, జన్మించిన తర్వాత విద్యా బుద్ధులు రాక మందమతులుగా మిగిలిపోవటము.... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి.  

ఈ విధంగా ఉండటానికి జాతక చక్రంలో లోపాలా అని ఒకవైపు ఆలోచిస్తుంటాం, కాని జాతకచక్రంలోని 12 భావాలలో... దోషాలు కనపడవు. మరి ఈ సమస్యలు ఏ దోషాల వలన వస్తాయి. అవి జాతకాలలో అంతర్లీనంగా ఉంటుంటాయి కనుక వాటిని గురించి పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు జ్యోతిష తాళపత్రాల గ్రంధాల ద్వారా తేటతెల్లమవుతున్నాయి. అలాంటి జాతకాలలో దాగి ఉన్న దోషాలను తెలుసుకొని, వాటి పరిహారాలను క్రమబద్దంగా, శాస్త్రీయంగా పాటించగలిగినప్పుడే.... మనకు పరిపూర్ణమైన ప్రశాంతత చేకూరుతుంది. తదుపరి ఆర్టికల్ లో మరిన్ని వివరాలు తెలుసుకోగలరు.
                                                                              - శ్రీనివాస గార్గేయ