Friday, August 22, 2014

అంతర్లీన జాతకదోషాలు - 1

పురాతన తాళపత్ర గ్రంధాలలో జ్యోతిష అంశాలు నిక్షిప్తమై ఉన్నాయి. కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చినప్పటికీ, ఇంకా ఎన్నో అంశాలు వెలుగులోకి రావలసిన అవసరం ఉన్నది. చాలా మంది జాతక చక్రాలలో పైకి దోషాలు ఏమి కనపడక పోయినప్పటికీ... వారు అనేక బాధలతో, సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఉదాహరణకు ఒకరికి జాతక చక్రంలో వివాహ స్థానంలో సమస్య ఎక్కడా గోచరించకపోయినప్పటికీ... ఆ ఒకరికి ప్రధమ వివాహం దెబ్బతిని విడాకులు తీసుకున్నారు. మరి ఎందుకు విడాకులు తీసుకొనవలసి వచ్చింది. ఇలాంటి సందర్భాలలో కేవలం దోషమనేది వివాహ స్థానంలోనే ఉంటుందని కాదు. ఆ దోషాన్ని ఇచ్చే గ్రహ స్థితులు, జాతకంలో మరో స్థానంలో ఉండి, పరోక్షంగా వివాహ అంశం మీద ప్రభావం చూపింది.

అలాగే జాతక చక్రంలోని 12 భావాలలో కనపడని దోష స్థితులు వేరు వేరు రకాలుగా కనపడుతూ ఉంటాయి. ఇలాంటి వాటిని ప్రతి ఒక్కరూ గమనించుకుంటూ, దోష పరిహారం కూడా క్రమం తప్పకుండా చేసుకుంటూ ఉంటుండాలి.  కొన్ని కొన్ని దోషాలకు ఉపశమనంగా చేసే పరిహారాలు కొంతకాలం వరకే ఆచరించాలి.  మరికొన్ని దోషాలకు అతి దీర్ఘ కాలం పరిహారాలు ఆచరిస్తూ ఉండాలి. 

ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి జాతక పరమైన దోషం ఉన్నప్పుడు, ఆ వ్యక్తి మాత్రమే పరిహారం పాటిస్తూ ఉంటే... జీవితం సంతోషమయంగా ఉంటుంది. అలా కాక ఆ వ్యక్తికి బదులుగా మరొక వ్యక్తి పరిహారం పాటిస్తే, ఫలితాలు సజావుగా ఉండవు. 

మన జాతక చక్రాలలో గ్రహ బలా బలాలు ఎలా ఉన్నప్పటికీ దైవబలం కూడా మనకు అనుకూలంగా ఉంటుండాలి. అందుకే చాలా మంది ఆలయ దర్శనాలు చేయటం , వ్రతాలు, నోములు చేపట్టటం , హోమ కార్యక్రమాలలో పాల్గొనటం చేస్తుంటారు. భగవంతుని యొక్క అనుగ్రహం పొందటానికి, ప్రతి ఒక్కరు వారికి తోచిన మరియు తెలిసిన రీతిలో ప్రార్ధనలు సాగిస్తుంటారు.
భారతీయ సనాతన సాంప్రదాయంలో అనేక వైదిక క్రియలు ఉన్నాయి. ఇవి కొంతమందికి అందుబాటులో ఉంటాయి. చాలా మందికి అందుబాటులో కూడా వుండవు. 


మనది కర్మభూమి, వేదభూమి. మనం చేయాల్సిన, ఖచ్చితంగా ఆచరించాల్సిన కర్మలను విసర్జిస్తున్నాం. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే మన నిత్య యాంత్రిక జీవనంలో సమయాభావం వలన ఆచరించాల్సిన కర్మలను ఆచరించలేక, తేలికపాటి అంశంతోనే తూ తూ మంత్రంగా చేయి దులుపుకుంటున్నారు. ఇందుచేతనే క్షణ క్షణం సమస్యలు, మానసిక వత్తిడులు, చెప్పుకోలేని కష్టాలు ఎదురవుతున్నాయి.
 

కొంతమందికి కావలసినంత ధనం ఉంటుంది. కాని తెలియని ఆవేదన, అశాంతి వెంటాడుతూనే ఉంటాయి. ఇంకొంత మందికి సకల భోగాలతో తులతూగే అవకాశాలు ఉన్నప్పటికీ, తనివితీరా భోజనం చేయటానికి అనారోగ్యం అడ్డుపడుతుంటుంది.
 

మరికొన్ని కుటుంబాలను పరిశీలిస్తుంటే అనేక ఆశ్చర్యకరమైన తేటతెల్లమవుతుంటాయి. కుటుంబ సభ్యులలో అధికులకు వివాహం కాకుండా వుండటం లేదా సంతానం కలగకుండా ఉండిపోవటం, ఏదో వంశ పారంపర్యంగా వస్తున్నదన్నట్లుగా కనుచూపు తగ్గిపోవటం, మూగవారుగా ఉండిపోవటం, అంగవైకల్యంతో ఉండటం గాని, న్యాయ స్థానాల చుట్టూ జీవితకాలం తిరగటం కాని, జన్మించిన తర్వాత విద్యా బుద్ధులు రాక మందమతులుగా మిగిలిపోవటము.... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి.  

ఈ విధంగా ఉండటానికి జాతక చక్రంలో లోపాలా అని ఒకవైపు ఆలోచిస్తుంటాం, కాని జాతకచక్రంలోని 12 భావాలలో... దోషాలు కనపడవు. మరి ఈ సమస్యలు ఏ దోషాల వలన వస్తాయి. అవి జాతకాలలో అంతర్లీనంగా ఉంటుంటాయి కనుక వాటిని గురించి పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు జ్యోతిష తాళపత్రాల గ్రంధాల ద్వారా తేటతెల్లమవుతున్నాయి. అలాంటి జాతకాలలో దాగి ఉన్న దోషాలను తెలుసుకొని, వాటి పరిహారాలను క్రమబద్దంగా, శాస్త్రీయంగా పాటించగలిగినప్పుడే.... మనకు పరిపూర్ణమైన ప్రశాంతత చేకూరుతుంది. తదుపరి ఆర్టికల్ లో మరిన్ని వివరాలు తెలుసుకోగలరు.
                                                                              - శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.