Tuesday, August 26, 2014

అంతర్లీన దోషాలు - 2

జన్మించిన ప్రతివారూ తాము మరణించే లోపు ఇతరులకు హాని చేయకుండా మరియు తలపెట్టకుండా, ప్రతి వారికి శుభం కలగాలనే, సమాజంలో అందరూ కలసి మెలసి ఉండాలని కోరుకుంటూ ఉంటుండాలి. కాని కాలగమనంలో వచ్చే మార్పుల వలన గాని లేదా సమాజంలో ఉండే స్థితి గతుల వలన గాని లేదా వ్యక్తిగత స్థితుల వలన గాని, లేదా ఆర్ధిక పరమైన అంశాల వలన గాని మనిషిలో అనేక రకాల మార్పులు రావటం, వాటిచే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే అరిషడ్వర్గాల ప్రభావం అధికం కావటంచే వ్యక్తి మనస్సులో నూతన అంశాలు చోటు చేసుకొని, వాటి వ్రేళ్ళు లోపలకి పాతుకుని పోతున్నాయి. సత్త్వగుణం తగ్గటం, రజో తమో గుణాలు పెరిగి పోవటం జరుగుతున్నది.

పై కారణాలచే వ్యక్తులలో వర్గ వైషమ్యాలు తారాస్థాయిలో ఉండటము, దాని వలన వ్యక్తిలో క్రొత్త ఆలోచనలు రావటం, అవి తనకే కాకుండా ఇతరులకు కూడా హాని తలపెట్టేవిగా ఉండటం జరుగుతున్నది. ఈ అంశాలు ఇటీవల నుంచే వచ్చినవి కానే కావు. అనాదిగా జన్మించిన వారందరిలో దాదాపు 80 శాతం వరకు ఈ కోవలోనే ఉంటుంటారు.

ఇక వారి యొక్క జీవన విధానంలో న్యాయబద్దత లోపించటము, మానవతా భావము అడుగంటటము, ఆవేశంతో చేయకూడని పనులు చేస్తూ ఇతరులను బాధ పెట్టి హింసా మార్గానికి పరోక్షంగా పెద్ద పీట వేస్తుంటారు. ఇట్టి వారి గుణ గణాలు ఇతరులకు ఎట్టి పరిస్థితిలోను నచ్చవు. ఓ కుటుంబంలోని ఓ వ్యక్తి ఇలాంటి హింసా మార్గంలో ఉంటూ... ఏదో ఒకనాడు తనువు చాలిస్తాడు. ఆ వ్యక్తికి కల్గిన సంతానంపై... ఈ తండ్రి చేసిన హింసాయుత చర్యల ప్రభావం తప్పకుండా ఉండి తీరుతుంది. దీనిని బట్టి మనకు తేటతెల్లమయ్యేది ఏమిటంటే... వ్యక్తులు చేసే కార్యాల ప్రభావం, తప్పక సంతతిపై ఫలితాలను చూపిస్తూనే ఉంటాయి. 


కొంతమంది తాము జీవించినంత కాలం ఎదుటివారికి ఎట్టి సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతూ, అందరితో స్నేహ సంబంధాలు మెరుగు పరచుకుంటూ, మానవతా భావంతో ఉంటూ రాగ, ద్వేషాలను విడిచి, భూత దయ కల్గి, కీర్తి శిఖరాలను అధిరోహించినవారు ఉంటుంటారు. ఇట్టి వారు చేసిన సమాజానికి చేసిన ఘనమైన సేవల ప్రభావానికి తగినట్లుగానే... దాని ప్రభావం సంతతిపై ఆనందదాయకంగానే ఫలితాలను అందిస్తూ ఉంటుంది.

వ్యక్తులు చేసే కార్యాకార్యాల ప్రభావం... వారు మరణించిన తదుపరి సంతతికి ఫలితాలను చూపుతూనే ఉంటాయి. అయితే ఇక్కడొక విషయాన్ని గమనించాలి. ఒక వ్యక్తికి నలుగురు సంతానం ఉన్నారనుకుందాం, ఆ వ్యక్తి చనిపోయే లోపు ఎవ్వరికీ ఎలాంటి సమస్యలను ఇవ్వకుండా మంచి భావంతో దాన ధర్మాలు చేసి కాలం చేశాడు. మరి ఈ దాన ధర్మాలు చేసిన వ్యక్తి చనిపోయిన తదుపరి... వారి సంతతిపై వారికున్న నలుగురు సంతానంపై అనుకూలమైన ఫలితాలను ఇస్తాయని అనుకోవాలి. కాని ఈ నలుగురు సంతానంలో తమ చనిపోయిన తండ్రి చేసిన విశేష కార్యాల ప్రభావ ఫలితాలు.... తాను తన జాతకరీత్యా పొందే అవకాశము గల గ్రహస్థితి ఉన్నప్పుడే.... ఆ సంతతికి పూర్ణ ఫలాలు లభిస్తాయి. దీని అర్ధం ఏమిటంటే చనిపోయిన వారి వలన వచ్చే విశేష ఫలితాలను అందుకునే స్థితి జాతకంలో ఉన్నప్పుడే సాధ్యము.

అలా కాకుండా ఒక వ్యక్తి అందరినీ హింస పెడుతూ, దాన ధర్మాలు చేయకుండా, నేరాలు కుట్రలు కుతంత్రాలు, హత్యా రాజకీయాలు మొదలైనవాటిని ప్రేరేపిస్తూ కాలం చేశాడని అనుకుందాం. ఈ వ్యక్తికి కూడా నలుగురు సంతానం ఉన్నారనుకుందాం. మరి ఇప్పుడు ఈ దుర్మార్గపు లక్షణాలు గల వ్యక్తి చనిపోయిన తదుపరి... వాటి ప్రభావ ఫలితాలు నలుగురు సంతతిపై ఉంటుందా ? ఒక్కోసారి ఈ నలుగురు సంతతిపై వాటి ఫలితాలు ఉండవచ్చు లేక ఉండకపోవచ్చు లేక కొంతమందికే ఉండవచ్చు. దీని అర్థం ఏమిటంటే, ఆ వ్యక్తికి కలిగిన సంతానం జన్మ జాతకాల ప్రకారం... తమ చనిపోయిన తండ్రి చేసిన దుర్మార్గపు కార్యాల ప్రభావ ఫలితాలు సంతతికి ప్రాప్తించే గ్రహ స్థితి ఉండవచ్చు లేక ఉండకపోవచ్చు.

కనుక ప్రతి వారి జాతకాలలో పితరులు (చనిపోయినవారు) చేసిన కార్యాల ప్రభావంచే అనుకూల లేక ప్రతికూల ఫలితాలు వారి వారి సంతానంపై ఉండటానికి కొన్ని ప్రత్యేక గ్రహస్థితులు ఉంటుంటాయి. ఈ ప్రత్యేక గ్రహస్థితులు గనుక ఎవరి జాతకాలలోనైనా ఉండి ఉంటే వారు తమ పితరులు చేసిన కార్యా కార్య ప్రభావ ఫలితాలను, ప్రస్తుతం పొందుతుంటారు.

ఇంతకూ ఆ ప్రత్యేక గ్రహస్థితులు అనేక రకాలుగా ప్రతి వారి జాతకాలలో అంతర్లీనంగా దాగి ఉంటాయి. ఇట్టి గ్రహస్థితులను జ్యోతిష పండితులు ప్రత్యక్షంగా గ్రహించలేరు. జాతకంలోని పన్నెండు భావాలలో, సమస్యలు ఎక్కడా లేనే లేవని, పండితులు బల్ల గుద్ది చెప్పినప్పటికీ, ఈ జాతకులు మాత్రం సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. కనుక పితరులు చేసిన పుణ్య కార్యాల ఫలితాల ప్రభావాన్ని జాతకులు అందుకొనే గ్రహస్థితి ఉంటే దానిని అదృష్టం గా భావించాలి. ఇట్టి అదృష్ట , ఆకర్షిత గ్రహస్థితి ప్రతివారి జాతకాలలో ఉండదు. కొంత మందికి మాత్రమే పరిమితము.

అలా కాక తమ పితరులు చేసిన పాప కార్యాల ఫలితాల ప్రభావాన్ని వారి సంతానం అందుకొనే గ్రహస్థితి ఉంటే దానిని దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితిగా భావించాలి. ఇట్టి దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితి కూడా అందరికీ ఉండదు. కొంత మందికి మాత్రమే పరిమితము.

చిట్ట చివరిగా ఒక మాటలో చెప్పాలంటే పితరులు చేసిన కార్యాల ప్రభావం అదృష్ట, దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితులుగా జాతకాలలో ఉంటుంటాయి. ఇవి అందరి జాతకాలలో ఉంటాయనుకోవటం పొరపాటు. నూటికి 85 శాతం వరకు మాత్రం ఆకర్షిత గ్రహస్థితులు ఉంటున్నట్లుగా మా పరిశోధనలో వెల్లడైనది.

పితరులు అంటే ఎవరు ? ఈ ఆకర్షిత గ్రహస్థితులు ఏ విధంగా ఉంటాయి ?... తల్లి తండ్రులు జీవించి ఉన్నప్పుడు బిడ్డలకు ఎవరి ద్వారా మంచి చెడు ప్రాప్తిస్తుంటాయి? ..... ఒకవేళ దురదృష్ట, అదృష్ట గ్రహస్థితులు ఉంటే, ఏ ఏ దశలలో ప్రభావాలు ఉంటుంటాయి... అసలు ఇలాంటి జాతక స్థితులను ఏమంటారు... అనేక ఆసక్తికర అంశాల కోసం అంతర్లీన దోషాలు మూడవ భాగంలో తెలుసుకుందాం.     - శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.