Monday, June 29, 2015

శతాబ్దాల తదుపరి అరుదైన శుభగ్రహ దర్శనం

దాదాపు 800 సంవత్సరాల క్రితం జరిగిన అద్భుత ఖగోళ గ్రహస్థితి 2015 జూలై 1 నుంచి జూలై 18 మధ్య రానున్నది. శ్రీ మన్మధ నామ సంవత్సర అధిక ఆషాఢమాస పూర్ణిమ బుధవారం 1 జూలై 2015 మూల నక్షత్రంతో గ్రహస్థితి ప్రారంభమై 18 జూలై శనివారం నిజ అధికమాసంతో గ్రహస్థితి పూర్తి కాబోతున్నది.

సూర్యుడు రాశి మారకుండా ఉన్న మాసాన్నే అధికమాసము అంటారు. ఈ అధికమాస పూర్ణిమ రోజున మూల నక్షత్రం వచ్చింది. ఇదేరోజు సాయంత్రం సూర్యాస్తమయం నుంచి రాత్రి 8 గంటల వరకు శుభగ్రహాలైన గురుగ్రహము, శుక్రగ్రహము కర్కాటకరాశిలో ఒకే బిందువు వద్ద ఉండి సాధారణ కన్నులతో వీక్షించటానికి అవకాశం ఉండేలా దర్శనమివ్వబోతున్నారు.  తిరిగి 18వ రోజున గురు, శుక్రులిద్దరూ మఘ నక్షత్రంలో నెలవంకతో కలిసి దర్శనమివ్వబోతున్నారు. 2015 జూలై 14 నుంచి సింహరాశిలోనికి గురు గ్రహప్రవేశం  చేయటంతో పవిత్ర గోదావరి నదికి పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. పుష్కరాలు ప్రారంభమైన అయిదవరోజునే సింహరాశిలో శుభగ్రహాలైన గురువు, శుక్రుడు, చంద్రుడనే మూడు గ్రహాలూ సూర్యాస్తమయం నుంచి కేవలం ఒక రెండు గంటలపాటు ఒకే బిందు స్థానంలో దర్శనమిస్తారు.

మూల నక్షత్రంలో గ్రహస్థితి ప్రారంభమై మఘ నక్షత్రంతో గ్రహస్థితి ముగియనున్నది. ఈ 2 నక్షత్రాలు కేతు గ్రహ నక్షత్రాలు. కేతువు మోక్షకారకుడు. ధనుస్సు రాశి మూల నక్షత్రంతో ప్రారంభమగును. ధనుస్సు అనగా మూలాధారమునకు సంకేతము. కేతు నక్షత్రమైన మఘలోకి గురుగ్రహము రావటంతో శాస్త్రరీత్యా 'మఘాది పంచపాదేషు గురుసర్వత్ర నిందితః' అన్నందున వివాహాది శుభకార్యములు చేయకూడదు.

అయితే మూలతో ప్రారంభమై, మఘతో ముగిసే ఈ 18 రోజుల కాలము శతాబ్దాల తర్వాత వస్తున్న అద్భుత విశేష శుభగ్రహ వీక్షణ ఉన్న రోజులుగా భావించాలి. అందుచే ఈ 18 రోజులలో నిత్యం మూలాధార  చక్రానికి అధిపతిగా ఉన్న గణపతిని ప్రార్దిస్తూ, ఒక్కోరోజు ఒక్కో దేవతను ప్రార్ధించేలా.... 18 రోజులలో అష్టాదశ శక్తి పీఠాలలోని దేవతలందరినీ ప్రార్ధించినట్లయితే సకల శుభాలు కల్గుతాయని పురాతన తాళపత్ర గ్రంధాలు తెలియచేస్తున్నాయి. ముఖ్యంగా శతాబ్దాల తదుపరి పుష్కర సమయంలో జూలై 18వ తేది జరిగే అరుదైన విశేష అద్భుత గ్రహస్థితిని ప్రతి ఒక్కరూ దర్శించుకొని జగన్మాత అనుగ్రహానికి పాత్రులు కాగలరని, ఈ నేపధ్యంలోనే 30 జూన్ 2015 మంగళవారం తిరుపతి పట్టణంలోని మహతి ఆడిటోరియంలో నేను (శ్రీనివాస గార్గేయ) ఈ అద్భుత గ్రహస్థితిపై విశ్లేషనాత్మక వివరాలను అందిస్తున్నాను.