Pranati Television Youtube Channel

Tuesday, January 19, 2016

మూలాధార కుండలినీ - గోధుమపిండి దీపారాధన 4

తల్లియొక్క వెలుగులతో ఈ విశ్వ చక్రమంతా నిండి ఉంది. ఆ శ్రీచక్రమే మన శరీరంలో కూడా ఉన్నదని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అణువులో ఉన్నదే  బ్రహ్మాండములో ఉన్నదనునది మంత్రం శాస్త్ర సిద్దాంతం. అంటే ఈ బ్రహ్మాండమంతా వ్యాపించిన దేవీ చైతన్యం మన శరీరంలో లేకపోతే ఈ శరీరంలో అసలు కదలికలే ఉండవు. చైతన్యం అంతకంటే ఉండదు. శ్రీచక్రంలోని చక్రములన్నీ మన శరీరంలో కూడా ఉన్నాయి. కనుక మన శరీరంలో ఉన్న శ్రీచక్ర దేవతను ఆరాధించటానికి పరోక్షంగా గోధుమపిండి దీపారాధన ఉపయోగపడుతుంది.

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో 36వ శ్లోకంలోని 2వ పంక్తి లోని కుళామృతైకరసికా నుంచి 40వ శ్లోకంలోని రెండవ పంక్తి చివరలో ఉన్న బిసతంతుతనీయసీ వరకు గల శ్రీ లలితా దేవి నామాలను పరిశీలిస్తే... 90వ నామమే కుళామృతైకరసికాయై నమః. అలాగే 111వ నామము బిసతంతుతనీయస్యై నమః వరకు గల 22 నామాలలో కుండలినీ స్వరూపము ఆవిష్కృతం కాబడినది. భారతీయ దేవాతాకృతుల నిర్మాణము వెనుక దాగి ఉన్న రహస్యమును తెలుసుకొనుటకు మంత్రం శాస్త్ర రహస్యములు కూడా కొన్నింటిని మనము తెలుసుకొని ఉండాలి. 

నస్వర్గే నచ తీర్థేషు నౌషధేషు నభేషుచ
ఋషయో దేవతాస్సంతిమంత్రాయేవసు దేవతాః
సాధకానాం ఫలందాతుం తత్తద్రూపం సురైః
ముఖ్యంస్వరూపం తేషాంతుమంత్రాయేవ నచేతరే ॥

అనగా స్వర్గములో, తీర్ధములలో, ఓషదులలో, ఆకాశములలో దేవతలుండరు. ఋషులు, దేవతులు కూడా మంత్రము నందే ఉందురు. మంత్రములే దేవతాకృతులు. సాధకులను అనుగ్రహించుటకు దేవతలు నిత్యము అనేక ఆకృతులను మంత్రానుష్టానమునకు తగిన రీతిలో ధరింతురు. ఆ మంత్రశక్తి ప్రధానముగా కుండలినీ స్వరూపములో ఉండును. కనుక యోగము, మంత్రము, రూపము మూడింటికీ ఓ అవినాభావ సంబంధమున్నది.

ఈ కుండలినీ శక్తి మూలాధార స్వరూపమైన ప్రధమ చక్రమందు ఉండును. నోటితో తోకనుపట్టుకున్న సర్పము లాగా మూడున్నర చుట్లు చుట్టుకొని నిద్రిస్తూ మూలాధార చక్రంలో ఉండును. లలితా సహస్ర నామ స్తోత్రమునందలి 106వ శ్లోకంలోని రెండు లైన్లు, 107వ శ్లోకంలోని మొదటి లైన్ ను పరిశీలిస్తే... 514, 515, 516, 517, 518, 519, 520 అను 7 నామాలలో మూలాధార చక్రం యొక్క అంశములన్నియు వర్ణింపబడినవి.

మూలాధార చక్రములో ఉన్న తల్లి పేరు సాకినీ దేవి. పృథ్వి తత్వ రూపముతో సృష్టికంతటికీ ఆధారంగా పసుపు వర్ణములో ఉండును. ఈ మూలాధార చక్రానికి అధిష్టాన దేవత గణపతి. అలాగే ఈ మూలాధార చక్రానికి ఆధిపత్య గ్రహం కుజుడు.  ఇందలి సాకిన్యాంబ దేవతనే సిద్ధవిద్యా దేవి అని పిలుచుదురు. వరదాదినిషేవితా నామానికి అర్ధమేమంటే వరదా మొదలైన దేవతలచే సేవింపబడుచున్నదని అర్థము. మూలాధారంలో సరస్వతీ దేవి విద్యా సంబంధమైన నాద శక్తిగా ప్రతిపాదింపబడుతున్నది. నాదం యొక్క ఉత్పత్తి స్థానం కూడా మూలాధారము.

విత్తనము లేనిదే వృక్షము లేదు గనక, ఈ మూల నాదము లేకపోతే పలుకే ఉండదు. కనుక వాగ్దేవతకే మూలమైన స్వరూపమైనందున అంకుశము, ఢమరుకము, పుస్తకము, జ్ఞానముద్రను కలిగి ఐదు శిరస్సులతో ఉండును. వేదములలో వర్ణించిన సరస్వతీ సూక్తులన్నీ ఇక్కడ భావించవచ్చును. పరోక్షంగా ఈ మూలాధార చక్రంలోని సాకిన్యాంబ దేవతను అస్థి దేవత ( అస్థిసంస్థితాయై నమః) అని కూడా పిలుస్తారు. అనగా ఎముకలకు అధిష్టాన  దేవత అని అర్ధము.

గర్భస్థ పిండ విషయములో 5వ మాసములోనే వెన్నెముక ఏర్పడి చర్మ ధాతువును ఏర్పరుచుకొనును. సాకిన్యాంబ స్వరూపములో ఉన్న లలితా పరాభట్టారికను ఆరాధిస్తే ఎముకల పుష్టి కలగటమే కాక పరోక్షంగా అనేక దుర్యోగములు పోవునని పురాతన గ్రంధములు తెలియచేస్తున్నాయి. ఈ సాకిన్యాంబ దేవతకు ముద్గౌదనము తయారుచేసి నివేదన ఇచ్చి ప్రసాదముగా స్వీకరించినందున ఎముకల పుష్టి కలగటమే కాక, అపూర్వ శక్తుల ప్రభావంచే ఛాయా గ్రహముల ద్వారా వచ్చే దుర్యోగములు తొలగును. ఈ తల్లినే ముద్గౌదనాసక్తచిత్తా (519వ నామం) అందురు. ముద్గర అనగా పెసలు. ఓదనము అనగా అన్నము. పెసలతో వండిన అన్నముపై ఆసక్తి గల తల్లి అని అర్ధము.

పెసలతో వండిన అన్నాన్నే చాలామంది కట్టే పొంగలి అనుకుంటారు. దీనినే సిద్దాన్నామని కూడా అంటారు. శాస్త్ర రీత్యా ఈ సిద్దాన్నమును తొమ్మిది పదార్ధాలతో వండవలెను.

"సుశాలితండులప్రస్థం తదర్థం ముద్గభిన్నకం,
చతుఃఫలంగుడం ప్రోక్తం, తన్మానం నారికేళకమ్,
ముష్టిమాత్రం మరీచంస్యాత్ తదర్థం సైంధవం రజః,
తదర్థం జీరకం విద్యాత్ కుడవం గోఘ్రుతం విదుః,
గొక్షీరేణస్వమాత్రేణ సం యోజ్యా కమలాసనం,
మందాగ్నివచనాదేవ సిద్ధాన్నమిద ముత్తమం.||"
అని శాస్త్ర రీత్యా చెప్పిన దానికి అర్థమేమిటంటే...
స్వచమైన బియ్యము తీసుకొని దానిలో సగము పెసలు లేక పొట్టు తీయని పెసరపప్పు కలిపి అందులో బెల్లం, కొబ్బరి, మిరియాలు, సైంధవలవణము, జీలకర్ర, ఆవునెయ్యి, ఆవుపాలు కలిపి తయారు చేసిన దానిని ముద్గౌదనము అంటారు. ఇదియే సిద్దాన్నము. ఇదియే పులగము. ఇదియే అసలు సిసలైన కట్టె పొంగలి. దీనిని  సాకీనీ దేవత రూపంలో ఉన్న లలితా దేవికి నివేదన చేస్తే ఆమెయే సాకినీ శక్తిగా సంతోషించి తగిన పుష్టిని, ఇష్టిని చేకూర్చును.

కనుక శరీరంలో ఉండే షట్చక్రాలలో దిగువ భాగంలో ఉండే మూలాధార చక్ర దేవత, నివేదన తెలుసుకున్నాం. అయితే ఈ మూలాధారంలో ఉండే కుండలినీ శక్తి వివరాలు కూడా మనం తెలుసుకోవాలి. ఇదొక సర్పాకారమని పైన చెప్పుకున్నాం.

 షట్చక్రాలలో మూలాధార చక్రానికి ఆధిపత్య గ్రహం కుజుడు. స్వాదిష్టాన చక్రానికి ఆధిపత్య గ్రహం శుక్రుడు. మణిపూరక చక్రానికి ఆధిపత్య గ్రహం రవి. అనాహత చక్రానికి ఆధిపత్య గ్రహం బుధుడు. విశుద్ది చక్రానికి ఆధిపత్య గ్రహం గురువు. ఆజ్ఞా చక్రానికి ఆధిపత్య గ్రహం శని. ఈ ఆరు చక్రాల పైన తలమానికగా ఉంటూ పాలించేది, నియంత్రించేది మరొకటి బ్రహ్మ రంధ్రంలో ఉండును. దానినే సహస్రార చక్రము అంటారు. దీని ఆధిపత్య గ్రహం చంద్రుడు. కనుక నవగ్రహాలలో ఏడు గ్రహాలు ఈ చక్రాలకు ఆదిపత్యంగా నిలుస్తున్నాయి. ఇక మిగిలిన రాహు, కేతువులు ఎక్కడ ఉన్నారు అనే అనుమానం ఉంటుంది.


ఒకవిధంగా మూలాధార చక్రంలోని సర్పాకారంలో ఉన్న కుండలినే రాహు కేతువులుగా తీసుకోవాలి. తల భాగాన్ని రాహువని, తోక భాగాన్ని కేతువని పిలుస్తారు. శనివత్ రాహు, కుజవత్ కేతుః అని శాస్త్ర వచనం. అనగా శని రాహువుతో సమానమని, కుజుడు కేతువుతో సమానమని అర్థము. అందుకే తల భాగంగా ఉన్న ఆజ్ఞా చక్రానికి ఆధిపత్య గ్రహం శని కాగా, అదోభాగానున్న మూలాధారానికి కుజుడు కావటం గమనార్హం.

కాబట్టి నవగ్రహ ఆధిపత్యాలన్ని మన శరీరంలోనే ఉన్నాయి. ఇక మానవాళికి సమస్యలుంటుంటాయి, సంతోషాలు వస్తుంటాయి. ఈ రెండింటికీ ప్రధాన కేంద్ర బిందువులు రాహు, కేతువులే అన్న నగ్న సత్యం నూటికి 90 మందికి తెలియదు. కనుక ఈ రాహు, కేతువులు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను తృప్తి కల్గించటానికి ఎన్నెనో పద్ధతులున్నాయి. ఈ పద్దతులలో తాంత్రిక మార్గంలో ఆచరించేది గోధుమపిండి దీపారాధన. ఈ 2016లో గురు చండాలయోగం అనేది త్వరలో రానున్నది. అంటే శుభ గ్రహమైన గురువు రాహువుతో కలవబోతున్నాడన్నమాట.

కనుక కేవలం గురు చండాల యోగానికి మాత్రమే కాకుండా మానవాళి శ్రేయస్సుకై ఆచరించే తాంత్రికారాధన గోధుమ పిండి దీపారాధన. పెద్దగా ఖర్చుతో కూడినది కాదు. అలాగే వైదిక మార్గంలో గురుచండాలయోగానికి కూడా హోమ సహిత విశేష క్రతువులు ఉన్నాయి. వాటిని కూడా తెలియచేస్తాను.

ఈ పరంపరలో గోధుమ పిండి దీపారాధన ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి,  ఏ నివేదన ఇవ్వాలి అనే ముఖ్య అంశాలతో రాబోయే పోస్టింగ్ ఉండును. 2016 జనవరి 29 రాత్రికి కన్యారాశి నుంచి సింహ రాశిలోనికి రాహు ప్రవేశం జరగనుంది. కనుక మరో 2 రోజుల లోపలనే గోధుమ పిండి దీపారాధనకు ముగింపును పలుకుదాం. వైదిక మార్గ విధి విధానాలను కూడా తెలుసుకోవటానికి ప్రారంభం చేద్దాం.  - శ్రీనివాస గార్గేయ

Sunday, January 17, 2016

మానవ శరీరమే ఒక శ్రీచక్రము - గోధుమపిండి దీపారాధన 3

హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌ: క్లీం కలాం భిభ్రతీం
సౌవర్ణామ్బర ధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం
వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం
త్వాంగౌరీం  త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీమ్


శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి శ్రీచక్రసంచారినీ అని పై శ్లోకంలో స్పష్టంగా చెప్పబడింది. ప్రపంచంలో ఏ వస్తువు గాని, ఏ శక్తి గాని, ఏ జీవి గాని, ఏదైనా సరే ఆదిపరాశక్తి యొక్క సృష్టియే. మనకంటూ ఏమి లేనివారిమి. మనదంటూ ఏది కానివారిమి. మనసా వాచా కర్మణ్యా ఆ భగవతిని ఆరాధించి ఇహ పరాలకు రెండింటికి దగ్గరై, రెండింటిని పొందటమే మానవులుగా మనం చేయవలసింది. ఇహంలో కూడా పరాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం లేకపోతే పరానికి చెడిపోయి కేవలం ఇహమే మిగులుతుంది. అట్టి పర హీనమైన ఇహం వ్యర్ధం. ఎందుకంటే పరమనేది శాశ్వతమైనది. ఇహమనేది తాత్కాలికం.

పరానికి ప్రయత్నం భక్తి ద్వారా చేస్తూ ఇహాన్ని అనుభవించటంలో తప్పు లేదు. పరాన్ని పోగొట్టుకోకుండా ఇహ లోకంలో జీవితం అనుభవిస్తూ భక్తి ద్వారా ఆది పరాశక్తిలో ఐక్యత చెందటమే మానవ జన్మ ముఖ్య లక్షణం. అది సాధించటానికి శ్రీచక్రమంతటి గొప్ప ఉపకరణం మరొకటి లేనే లేదు. మూడత్వం, అజ్ఞానం భక్తిని కలుగచేయవు. వాటిని దూరంగా ఉంచాలి. భక్తితో ఆరాధించేవారికి నియమాలు, కట్టుబాట్లు అవసరం లేదు. మనసుతో ప్రధానంగా ఆరాధిస్తే ఏ నియమాలు పాటించనవసరం లేదు. నిర్మలమైన నిర్వికారమైన భక్తి కావాలి. అదే శ్రీమాత కోరుకునేది. సంకోచ, వ్యాకోచాలు, అనవసర అనుమానాలు పెట్టుకోవద్దు.

ప్రతి దేవతకి మంత్రం, యంత్రం, పూజ ఉంటాయి. మనం దేవతను ఒక రూపంగా భావించి అనేక ఉపచారాలతో కొలుస్తాం. అదే దేవతను రేఖా రూపంగా యంత్రంలో ఉంచి కూడా పూజిస్తాం. రూపం ఉన్న దేవతని అర్చించటం కంటే రేఖా రూపంగా యంత్ర రూపంలో ఉన్న అదే దేవతను అర్చించటం కంటే... మరో శక్తి వంతమైన రూపంలో దేవతను ప్రార్ధించే విధానాన్ని తంత్రం అంటారు. పరోక్షంగా చెప్పాలంటే మానసికమైన సూక్ష్మ రూపంతో ఉన్న దేవతోపాసనను లేక పూజను తంత్రం అంటారు.

ఈ తంత్రాలని శివ, దేవి, విష్ణు సంబంధాన్ని బట్టి విభజిస్తారు. శివాంశ సంబంధిత తంత్రాలను శైవ తంత్రాలని, దేవి తంత్రాలను శక్తి తంత్రాలని, విష్ణు సంబంధితములను వైష్ణవ తంత్రాలని చెబుతారు. శివ తంత్రాలు ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అనే మూడింటిని చెబుతున్నాయి. దేవి తంత్రాలు మాత్రం అద్వైతములు మాత్రమే చెప్తాయి. వైష్ణవ తంత్రాలు ద్వైతాన్ని, విశిష్టాద్వైతాన్ని వివరిస్తాయి. శ్రీ కృష్ణుడు శివ తత్వాలను తాంత్రిక రూపంలో ఉపాసన చేసినట్లుగా  మహాభారతంలోని శాంతి పర్వం తెలియచేస్తుంది.


తంత్ర శాస్త్రంలో శక్తులకు గుర్తుగా రేఖా చిత్రాలని ఉపయోగిస్తారు. వాటిని యంత్రములు అంటారు. యంత్రాలన్నింటిలోను శ్రీచక్రం అత్యున్నతమైనది. ఇది శ్రీచక్రంలో ఒకదానిలో ఒకటి ఇమిడిన త్రికోణాలున్నాయి. కేంద్రములో బిందువున్నది. తొమ్మిది త్రికోణములు ఒక వృత్తంలో ఉంటాయి. ఈ తొమ్మిదింటిలో ఐదు త్రికోణాలు దిగువ వైపుకు నాలుగు త్రికోణాలు ఎగువవైపుకు ఉంటాయి. దిగువ వైపుకు అనగా అధోముఖంగా ఉండే ఐదింటిని శక్తి కోణాలని, ఊర్ధ్వ ముఖంగా ఉండే నాల్గింటిని శివ కోణాలని అంటారు.

శ్రీచక్రం యొక్క సాధారణ అవగాహన లేనిదే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని కొన్నింటిని పూర్ణంగా తెలుసుకొనలేము. విశ్వచక్రమే శ్రీచక్రము. అలాగే మన శరీరమే ఒక శ్రీచక్రంగా చెప్పబడుతున్నది. శ్రీదేవి శ్రీచక్రంలోనే ఉంటుంది గనుక, మన హృదయంలో దర్శనం చేయటం మొదలు పెడితే మనలోనే శ్రీచక్రం సాక్షాత్కరిస్తుంది. అంటే శ్రీచక్ర అధిష్టాన దేవత అయిన శ్రీ లలితా పరమేశ్వరి సాక్షాత్కారిస్తారన్నమాట. శ్రీచక్రాన్ని యంత్రమని  పిలుస్తాం.

భారతీయ విగ్రహారాధనలో, విగ్రహం యంత్రంతో సంబంధం కలిగి ఉంటుందని తెలుసుకోవాలి. "అరుణాం కరుణాతరంగితాక్షీం" అని అమ్మవారిని చేసిన ధ్యానానికి శ్రీచక్రానికి సంబంధం ఉంది. అంతా శ్రీచక్రాకృతి. అందుచేతనే ధ్యాన శ్లోకాలలో ఈ శ్లోకానికి మరింత ప్రాధాన్యం ఇవ్వబడింది. శ్రీచక్రం 9 ఆవరణలతో కూడి ఉన్నది. ఆవరణ అనగా ఆకృతి అని అర్ధం. "అణిమాదిభిరావృతంమయూఖై: " ఈ ఆవరణలన్నీ వెలుగైతే, ఆ ఆవరణల మధ్య ఉన్న జ్యోతి వంటిది అమ్మవారు. ఆ జ్యోతియే బిందువు. ఆ బిందువు వద్ద భాసిస్తున్న తల్లియైన జగదాంబిక "అరుణాం కరుణాతరంగితాక్షీం" అని వర్ణించబడింది.

తల్లియొక్క వెలుగులతో ఈ విశ్వ చక్రమంతా నిండి ఉంది. ఆ శ్రీచక్రమే మన శరీరంలో కూడా ఉన్నదని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అణువులో ఉన్నదే  బ్రహ్మాండములో ఉన్నదనునది మంత్రం శాస్త్ర సిద్దాంతం. అంటే ఈ బ్రహ్మాండమంతా వ్యాపించిన దేవీ చైతన్యం మన శరీరంలో లేకపోతే ఈ శరీరంలో అసలు కదలికలే ఉండవు. చైతన్యం అంతకంటే ఉండదు. శ్రీచక్రంలోని చక్రములన్నీ మన శరీరంలో కూడా ఉన్నాయి. కనుక మన శరీరంలో ఉన్న శ్రీచక్ర దేవతను ఆరాధించటానికి పరోక్షంగా గోధుమపిండి దీపారాధన ఉపయోగపడుతుంది.

ఒకేసారి ఒకే  వ్యాసంతోనే గోధుమపిండి దీపారాధన ప్రతి ఆదివారం చేయండి అని ఒక్క ముక్కలో చెప్పవచ్చును. కాని ఇలా ఎందుకు చేయాలి అని సవివరంగా చెప్పటానికై, పాఠకులకు పరిపూర్ణమైన అవగాహన మరింత మెరుగుగా ఉండాలనే ఆలోచన తోటే  ఇంత సుదీర్ఘ వ్యాసాన్ని అందిస్తున్నాను. మరో రెండు వ్యాసాలతో గోధుమపిండి దీపారాధన పూర్తి వివరాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. - శ్రీనివాస గార్గేయ

Saturday, January 16, 2016

రాహు కేతు యోగాలు, గోధుమపిండి దీపారాధన 2

నవగ్రహాలలో ఏడు గ్రహాలు పూర్తి స్థాయిలో జాతకునకు అనుకూలంగా ఉన్నప్పటికీ రాహు, కేతువులు అనుకూలంగా లేకపోతే... ఆ జాతకునకు పరిస్థితులు దగ్గరకు వస్తూనే ఉంటాయి... కాని ఆనుభవించలేడు. రాజకీయ రంగంలోనే ఇలాంటివి తరచుగా కనపడుతుంటాయి. వ్యక్తికి అంగబలం, అర్ధబలంతో పాటు ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతుంటారు. కాబోయే మంత్రిగారు అనే ప్రచారం కూడా బాగా సాగుతుంది. కాని రాహు, కేతువుల అనుగ్రహం లేని కారణంగానే నామినేషన్ల తదుపరి చేసే స్క్రూట్నీతో కాబోయే మంత్రి గారి పేరు గల్లంతవుతుంది.

చూశారా ఇలాంటి స్వల్ప అవయోగాలవలెనే విశేష రాజయోగాలు ఉన్ననూ దెబ్బతినేవారు అనేకమంది ఉన్నారు. ముక్కు మొహం తెలియని వారు ఒక్కోసారి అనుకోకుండా ఎన్నికలలో గెలవటము, ఉన్నత పదవులు అలంకరించటము జరుగుతుంది. ఇలాంటి యోగాలని అనుకోకుండా అందించేవాడే రాహువు.

సప్త గ్రహాలూ అనుకూలించకపోయినప్పటికీ రాహు, కేతువుల యోగాల వలన అనుకోకుండా అదృష్టం వరించి... ఏక్ దిన్ కా సుల్తానా లాగా పదవిని అలంకరిస్తారు.  ఇలాంటి వారు ఆ సప్త గ్రహాలను తగిన రీతిలో అనుకూలించేలా తగు తగు పరిహారములు చేసుకుంటే ఈ పదవి పది కాలాలపాటు ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ రాహు, కేతువులు ఇచ్చే యోగాలు శాశ్వతం కావు. అశాశ్వతాలే. కనుక ఈ అశాశ్వత రాజ యోగాలను పట్టుకొని, మన వ్యక్తిత్వాన్ని సరియైన స్థితిలో నియంత్రించుకుంటూ ఉంటుంటే... రాహు, కేతువులిచ్చే అశాశ్వత యోగాన్ని శాశ్వతం చేసుకోవచ్చు. లేకుంటే మహారాజ సమానుడై భోగ భాగ్యాలతో జీవితం గడుపుతూ చివరకు ఆకాశ వీధులలో మరణం జరిగి అన్నీ అవయవాలు లేకుండా  అంత్య క్రియలు జరగటం కూడా ఈ చాయా గ్రహాల ప్రభావమేనని గుర్తించాలి.

కనుక ప్రతివారు సప్త గ్రహాలు యోగాలను ఇచ్చిననూ, ఇవ్వకపోయినను, రాహు కేతువుల యొక్క రాజయోగాన్ని సంపాదించటానికి కృషి చేస్తూ, ఈ యోగాన్ని శాశ్వత ప్రాతిపదికగా నిలుపుకోనేలా కూడా ప్రయత్నాలు చేయటానికి అనేక తాంత్రిక మార్గాలు ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకుందాం.

అష్ట దిక్పాలకులలో ఉత్తరపు దిక్కునకు అధిపతిగా ఉండే దేవత పేరే కుబేరుడు. నవ గ్రహాలలో రాహు కేతువులను ఛాయా గ్రహాలుగా పేర్కొంటారు. రాహువు ఉత్తర ధృవమునకు అధిపతిగా ఉండే ఓ బిందువు. అలాగే కేతువు కూడా దక్షిణ ధృవానికి అధిపతిగా ఉన్న ఓ బిందువుగా పరిగణించాలి. జ్యోతిష శాస్త్ర రీత్యా రాహు, కేతువులు ఓ సర్పాకారంగా ఉంటారని రాహువు తల భాగంగాను, కేతువు తోకభాగంగాను ఉండును. ఈ రెండు గ్రహాలూ ఖగోళంలో అపసవ్యంగానే తిరుగుతుంటాయి. మిగిలిన ఏడు గ్రహాలూ గడియారంలో ముళ్ళులాగా సవ్యదిశలో తిరుగుతుంటారు.

రాహువు, కేతువుల మధ్యలో సవ్యంగా తిరిగే ఏడూ గ్రహాలూ ఉన్నప్పుడు, దానిని కాలసర్పయోగము అంటారు. కాని ప్రస్తుత రోజులలో ఈ విషయాన్ని అనేకమంది మర్చిపోయి కాలసర్ప దోషంగా చిత్రీకరించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంటారు. ఉదాహరణకు కన్యా రాశిలో రాహువున్నాడు. మీనరాశిలో కేతువున్నాడు. మిగిలిన ఏడూ గ్రహాలూ ఈ రెండు గ్రహాల మధ్యనే ఉండాలన్నమాట. ఉదాహరణకు మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో కేతువున్నాడు. రేవతి నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు. అనేకమంది పండితులు ఈ కేతువు చంద్రుడు ఉన్న స్థానాలను గమనించక... మీకు కాలసర్ప దోషం పట్టింది, సమస్యలు వెంటాడతాయి అని భయపెట్టి... పబ్బం గడుపుకుంటుంటారు. వాస్తవానికి ఉత్తరాభాద్ర నక్షత్రం తర్వాత రేవతి నక్షత్రం వస్తుంది. గ్రహాలలో కేతువు తర్వాత ఇంకెవరూ ఉండకూడదు. అలా ఉండకుండా ఉంటేనే అది కాలసర్పయోగమవుతుంది. పైన చెప్పిన ఉదాహరణకు కాలసర్పయోగం పట్టదు. అలా కాకుండా ఉత్తరాభాద్రలో చంద్రుడు ఉండి, రేవతిలో కేతువుంటే కాలసర్పయోగం పడుతుంది. అనగా ఒక రాశిలో కొన్ని గ్రహాలు ఉన్నప్పుడు.. వాటి వాటి ముందు వెనుకలను తెలుసుకోకుండానే భయపెడుతుంటారు.

కాలసర్పయోగం ఉన్నవారు తారాస్థాయిలో ఎంతోమంది ఉన్నారు. అబ్రహం లింకన్, జార్జ్ బుష్, ధీరుభాయ్ అంబాని... మహేశ్ యోగి, సర్దార్ వల్లభాయ్ పటేల్, మెగాస్టార్ చిరంజీవి ఇలా ఎందరెందరో ఉన్నారు. కాలసర్పయోగం ఉన్నవారు ఒక రంగంలోనే ఉండాలి తప్ప రెండవ రంగానికి వెళ్ళకూడదు. కీర్తిశేషులు అంబాని వ్యాపార రంగంలోనే ఉన్నారు తప్ప రాజకీయ రంగంలోకి ప్రవేశించలేదు. అలాగే చిరంజీవి సినిమా రంగం కాకుండా రాజకీయ రంగం మీదకి వెళ్ళాడు. అందుకే ఈ రంగం ప్రాధాన్యతను సంతరించుకోలేదు. కనుక కాలసర్ప దోషమనేది లేదు. కాలసర్పయోగమనేది ఉన్నది. పైగా పురాతన జ్యోతిష గ్రందాల సారాంశం ప్రకారం కాలసర్ప యోగం ప్రభావం వ్యక్తులకంటే కూడా సరిహద్దు ప్రాంతాలపైనే ప్రభావం ఉంటుందని స్పష్టమైనది. ఇక అసలు విషయంలోకి ప్రవేశిద్దాం.

రాహువు ప్రతిరోజు 90 నిముషాల పాటు రాహుకాలంగా ఒక్కో వారంలో ఉంటుంటాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే 12 గంటల సమయంలో... సోమవారం రాహుకాలం ఏడున్నర గంటలకు, శనివారం 9గంటలకు, శుక్రవారం 10.30గంటలకు, బుధవారం 12 గంటలకు, గురువారం 1.30 నిముషాలకు, మంగళవారం 3 గంటలకు, ఆదివారం 4.30 గంటలకు ప్రారంభాలు జరుగుతుంటాయి. అంటే ఉదయం 6 గంటల నుంచి 7.30 వరకు ఏ వారానికి కూడా రాహుకాలం ఉండదు. కనుక ఈ 90 నిముషాల వ్యవధిలో మనం రాహువు యొక్క పరోక్ష యోగాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి.

మరి ఉన్న ఏడు రోజులలో ఏరోజున ఈ సమయాన్ని తీసుకోవాలి అనే అనుమానం ఉంటుంది కొందరికి. గ్రహ రాజు సూర్యుడు, సూర్యుని యొక్క వారమే ఆదివారం. కనుక సూర్య కుటుంబంలోనే ఈ గ్రహాలు సంచారం చేస్తుంటాయి. కనుక ప్రతి ఆదివారం ఉదయం 6.00 గంటల నుంచి 7.30 గంటల లోపలనే గోధుమపిండి దీపారాధన  ఆచరించాలి. అసలు ఈ గోధుమ పిండితో ఎందుకు చేయాలి ? చేశామనుకుందాం. ఎందుకు ఆ వెలుగును చూడాలి ? వెలుగును చూసినంత మాత్రాన లబ్ది  వస్తుందా ? ఇలాంటి అనేకానేక ప్రశ్నలు ప్రతివారికి ఉదయిస్తుంటాయి.

కనుకనే అలాంటి ప్రశ్నలు ఉదయించకుండా ఉండటానికే సుదీర్ఘమైన వ్యాసాలను అందిస్తున్నాను. కనుక రేపు వచ్చే ఆదివారమే దీపారాధన చేయాలని కాదండి. ప్రతి ఆదివారం దీపారాధన చేస్తూనే ఉందాం. వెలుగును చూస్తూనే ఉందాం. రాహు యోగాన్ని పొందుతూనే ఉందాం. అసలైన ఆసక్తికర వివరాల కోసం పోస్టింగ్ కాబోయే మూడవ వ్యాసంలోకి వెళదాం. విలువైన ఈ సమాచారాన్ని మీ బంధు మిత్రాదులకు పంపండి. - శ్రీనివాస గార్గేయ

Friday, January 15, 2016

నిజమైన ఆధ్యాత్మికత - గోధుమపిండి దీపారాధన 1

ప్రస్తుత రోజులలో ఆధ్యాత్మికత పేరు చెప్పుకొని జరిగే మోసాలు అనేకం వెలుగు చూస్తున్నాయి. ఆధ్యాత్మికతకు ఉన్న నిజమైన అర్ధం దిగజారిపోతున్నది. ఆధ్యాత్మికత అనగానే వస్త్ర ధారణ మార్చి గడ్డాలు పెంచటము లేక కనులు మూసి శూన్యంలోకి చూడటము లేదా రుద్రాక్షలు ధరించి నాలుగు సూక్తులు వల్లించటము అనుకుంటున్నారు. నిజమైన ఆధ్యాత్మికత అంటే మన ఆలోచనలలో స్వచ్చత తీసుకురావటము. మనకున్న సంస్కారాలు, వాసనలు తొలగించుకోవటం, ఆత్మను శుద్ధి చేసుకొనటమే. దేవుడు కోర్కెలు తీర్చే యంత్రము కాదు, మంత్రము కాదు. చెడు ఖర్మకు చెడు ఫలితం, మంచి ఖర్మకు మంచి ఫలితం ఉంటుంది. ఈ ధర్మం సృష్టి అంతటా ఒకేలా ఉంటుంది.

భగవంతుడు సృష్టించిన పూలు, పండ్లు, కొబ్బరికాయలను భగవంతుడికే సమర్పిస్తూ కోరికలను తీర్చమని అడగటం భావ్యం కాదు. దైవత్వం అనేది నిజం. సృష్టి అంతటా దేవుడే ఉన్నాడు. దేవుడితో సంభాషించాల్సింది హృదయమే కాని కంఠమ్ కాదు. హృదయాంతరాలల్లో భావన లేకుండా కేవలం శబ్దాలతో స్తుతిస్తే ఏం ప్రయోజనం. భాష, శబ్ద ప్రాధాన్యం కంటే భావ ప్రాధాన్యం అతి ముఖ్యం. నిర్మలమైన మనస్సుతో హృదయంలో స్వచ్చత సాదుగుణం పెంపొందించాలి. ఆధ్యాత్మికత అంటే మన అంతరాత్మ ఉనికి తెలియచేసే ఓ అపూర్వమైన జ్ఞాన ప్రక్రియ. ఏది సాధించాలన్నా ఈ శరీరం ద్వారానే సాధ్యపడుతుంది.

తన దైనందిన జీవితంలో ఎలాంటి ముసుగులు, నటనలు లేకుండా స్వచ్చతతో మనిషి ప్రాపంచిక జీవితాన్ని గడిపినప్పుడే ఆధ్యాత్మిక జీవనానికి గట్టి పునాది అవుతుంది. ఆధ్యాత్మిక జీవితం మన ప్రాపంచిక జీవనానికి ఒక ఆభరణంలాంటిదే కానీ అవరోధం మాత్రం ఎన్నటికీ కాదు. ఆధ్యాత్మిక దృష్టితో ప్రాపంచిక జీవనాన్ని గడపటం పరమానందానికి సోపానం. ఈ రెండు జీవితాలు ఒక నాణేనికి బొమ్మ, బొరుసులాంటివి. వీటి మధ్య తేడా ఏమి ఉండదు.  సంసారాన్ని వదిలేసి ఎక్కడికో పారిపోవటం కాదు. హిమాలయాలకి వెళితే అక్కడ లభించే ప్రశాంతత హిమాలయాలదే కానీ, మన హృదయానిది కాదు. మన హృదయంలో నెలకొల్పే నిర్మలమైన మనో నిశ్చలతే అసలైన ఆధ్యాత్మికత.

ఈ మనస్సనేది ప్రతి వ్యక్తికి మెదడులో ఉండే సహస్రారంలో ఉంటుంది. దీనికి అధిపతి చంద్రుడు. శరీరంలోని అన్నీ ప్రక్రియలను నిర్దేశించేదే సహస్రార చక్రం. మన శరీరంలోని అన్ని చక్రాలలోను తలమానికగా నిలిచి, అన్నింటిని పాలించి నియంత్రించేది ఈ చక్రమే. కేంద్ర నాడీమండలంతో అనుసంధానించబడి ఉండును. మానసిక ఆనందానికి సంతోషానికి, ఉల్లాసానికి శక్తివంతమైన ఆలోచనలకు సత్యానికి, ఏకాగ్రతకు కేంద్రమే కాకుండా... అనవసరమైన ఉపయోగంలేనటువంటి వ్యర్ధ భావాజాలానికి ప్రేరణ కూడా ఇక్కడ నుంచే జరుగుతుంది. ఇది మనసును గురించి చెప్పే రెండు మాటలు.

శరీరంలోని షట్చక్రాలలో హృదయ కుహరంలో ఉండే చక్రమే అనాహత చక్రం. ఈ చక్రానికి అధిపతి బుధుడు. ఈ చక్రం ద్వారా హృదయాన్ని, ఊపిరితిత్తులను, రక్తాన్ని, రక్తసరఫరాను చేస్తూ, ఊపిరితిత్తులు సాగి ముడుచుకునే గుణాన్ని, ఉచ్చ్వాస, నిశ్వాసాలను నిర్దేశిస్తూ
వ్యక్తికి భావనలను అందించే కేంద్రంగా ఉంటుంది. అన్ని చక్రాలకన్నా అతి సున్నితమైనది. మనస్సనే చంద్రగ్రహ పరిధిలో హృదయాదిపతైన బుధుడు పని చేస్తుంటాడు. ఈ చంద్రుడు, బుధుడు రెండింటి ద్వారానే వ్యక్తి జీవనంలో ఎదుగుదలలు, తగ్గుదలలు ఉంటాయి. అందుకే అధర్వణ వేదంలో ఉన్న మూడు ఉపనిషత్తులలో మొదటిదైన ప్రశ్నోపనిషత్తులోని శాంతి పాఠంలో ఏమి చెప్పబడిందంటే  దేవతలని, సూర్యుడిని, బృహస్పతిని ప్రార్ధిస్తూ చక్కని బుద్ది అనుగ్రహించాలని ఈ జీవితం తరించటానికి ఆయువు ఉన్నంతవరకు ఇబ్బందులు లేకుండా మనసు చెదరకుండా, సాధన సక్రమంగా కొనసాగించుకొనే అవకాశాన్ని అనుగ్రహించమని ప్రార్ధన. ఈ శాంతి మంత్రంలో "పశ్యేమ దేవహితం యదాయు:" అని ఉంటుంది. దేవతలకు హితంగా జీవించాలనుకుంటున్నామని భావం.

ముఖ్యంగా కళ్ళు, చెవులు చాలా బలవంతమైనవి. ఒక ఘోర దృశ్యం కంటపడటమో లేక వినరానివి విన్నప్పుడు, మన ఏకాగ్రతను చెదరగొట్టి మనసుని వికలం చేస్తుంది. మనసు సరిగా లేకపోతే బుద్ది ఎలా పని చేస్తుంది. అందుకే ఆ శాంతి మంత్రంలో భద్రం పశ్యేమ, భద్రం శృణుయామ దేవతలారా... సాధనా కాలంలో మంచి దృశ్యాలతో, మంచి శబ్దాలతో మమ్ములను అనుగ్రహించండి. ఓ బృహస్పతి మాకు సహకరించండి.... అంటూ ప్రార్ధన ఉంటుంది.

అసలు ఈ బృహస్పతే (గురువు) మన ప్రార్ధనను వినే స్థితిలో లేక సమస్యలతో ఉన్నప్పుడు, మన సాధన స్థితి ఎట్లా? ఈ విషయంలోనే పాఠకులు బాగా ఆకళింపు చేసుకుంటూ ముందుకు నడవవలసిన అనేక అంశాలు ముందున్నాయి. ఖగోళంలో ఉండే గురు గ్రహంతో రాహువు మమేకమవుతున్న సందర్భం రానున్నది. ఇతర వ్యతిరేక గ్రహస్థితులు అనేకం ఈ 2016 నుంచే ప్రారంభం కానున్నవి. కనుకనే గోధుమ పిండి దీపారాధనతో తొలుత ప్రారంభం చేసి, సరైన ఆధ్యాత్మికతకు దగ్గరవటము, మరికొంత తాంత్రిక, వైదిక మార్గాలలో ఉన్న అంశాలను తెలుసుకుంటూ మనసును, బుద్ధిని కట్టడి చేస్తూ రాహు ప్రభావాన్ని సరియైన రీతిలో అనుకూలంగా మరల్చుకుంటూ గురు చందాల యోగ ప్రభావాన్ని దూరం చేసుకోటానికి... మనమేసే అడుగులు ఎన్నో ఉన్నాయి. ఆ అడుగులలో మొదటిది గోధుమ పిండి దీపారాధానతో వ్యక్తీకరించబడే ఆధ్యాత్మిక భావనను ముందు తెలుసుకుందాం. ఈ విషయాలను అర్ధమయ్యే రీతిలో చెప్పటానికే పై విధమైన సోదాహరణ వ్యాసం అవసరమైనది. - శ్రీనివాస గార్గేయ

Thursday, January 14, 2016

పాఠశాలకు, జీవితానికి ఇదేనా తేడా?

దాదాపు 15 సంవత్సరాల నుంచి నేను చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట కొన్ని మాటలను తరచుగా వినేవాడిని. అవి ఏమిటంటే క్రైసిస్ ని... ఆపర్చ్ట్యునిటీగా తీసుకోవాలి అనేవారు. ఇలా ఎందుకంటున్నారు అని అర్ధం చేసుకోవటానికి 4, 5 సంవత్సరాల కాలం దొర్లింది. సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలనేది వారి ఉద్దేశ్యం. బాగా ఆలోచిస్తే వారన్నమాటలు అక్షరసత్యాలు.

ప్రతి సంక్షోభంలోను ఓ అవకాశం ఉంటుంది. అసలు సమస్యలే లేకుంటే అవకాశాలే ఉండవు. ఒక సమస్యను గుర్తించి పరిష్కరించటమే విజయానికి కీలకమని ఓ సామెత చెబుతుంది. పరాజయం ఎదురైనప్పుడు ఏడుస్తూ కూర్చోవాలా లేక ఈ పరాజయాన్ని ఓ ఉత్తేజ పూరితమైన అవకాశంగా తీసుకోవాలా? ఇదే మన ముందున్న ఛాయిస్.

కనుక దీనిని ఒక సమస్యగా చూడవచ్చు లేదా ఒక అవకాశంగా చూడవచ్చు. నిర్ణయం మనదే. జీవిత సమస్యలలో కూడా... మంచి చెడుని మించి ఉంటుంది. సుఖం దుఃఖాన్ని మించి ఉంటుంది. సంతోషం బాధని మించి ఉంటుంది. కాని దానిని మనం ఏ విధంగా చూడాలి అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. సానుకూల దృష్టి కోణం నుంచి చూడాలా? లేక ప్రతికూల దృష్టి కోణం నుంచి చూడాలా?.. ఈ జీవితం సమస్యలతో నిండి ఉంటుంది. కనుక సమస్యలున్నచోటే అవకాశాలు ఉంటాయి. సమస్యలు లేకపోతే అవకాశాలే ఉండవు.

అందుకేనేమో జీవితాన్ని ఓ పాఠశాలగా చెప్తారు. పాఠశాలలో  ముందు అనేక పాఠాలను చదువుకొని తదుపరి పరీక్షని (ఎగ్జామ్) ఎదుర్కొంటాం. అదే జీవితంలో అయితే ముందు పరీక్షలను ఎదుర్కొంటాం వాటి నుంచి పాఠాలను నేర్చుకొంటాం.

ఈ పరంపరలో పరీక్షలు త్వరలో వస్తున్నాయ్... నేనిచ్చే వివరాలను చదివి ఆకళింపు చేసుకోండి. తద్వారా మంచి పాఠాలను నేర్చుకోవటానికి 2016 జనవరి 15 సంక్రాంతి పర్వదినం మనందరికీ స్వాగతం పలుకుతుంది. ఈ నెల 9న శుక్రశనుల కలయికను వీక్షించి ఉంటారు. ఆ శుక్రగ్రహ వారమైన శుక్రవారం రోజున శనిగ్రహ నక్షత్రమైన ఉత్తరాభాద్రతో కూడిన రేపటి మకర సంక్రాంతి పర్వదినాన, జగద్రక్షకుడైన శ్రీ సూర్య భగవానుని భక్తితో ప్రార్ధించండి. రేపు ఉదయం మకర సంక్రాంతి పుణ్యకాలం 6.43 నుంచి  12.16 వరకు ఉంటుంది. సంక్రమణ తర్పణ మహా పుణ్యకాలం ఉదయం 6.43 నుంచి 8.34 వరకు ఉంటుంది. తర్పణాలు ఇవ్వవలసినవారు పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వండి. అవకాశం లేకుంటే పితృ పితామహాదులను భక్తితో స్మరించండి. - శ్రీనివాస గార్గేయ

గమనిక : తదుపరి పోస్టింగ్లో ప్రతి ఆదివారం ఆచరించాల్సిన గోధుమపిండి దీపారాధన

Friday, January 8, 2016

జనవరి 9 శనివారం రోజున శుక్ర శని గ్రహాల అపూర్వ కలయిక

ఖగోళంలో శని గ్రహం, శుక్ర గ్రహం ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ పరంపరలో ఒకే బిందువు వద్ద  2016 జనవరి 9 శనివారం రోజున ఉదయం 5గంటల నుంచి సూర్యోదయానికి వరకు తూర్పు దిక్కులో శుక్ర శని గ్రహాల అపూర్వ కలయిక జరగనుంది. ఈ అపూర్వ దృశ్యాన్ని సాధారణ కన్నులతో వీక్షించవచ్చు. ఈ వివరాన్నే నిత్యం భారత్ టుడే చానల్ లోను మరియు ఆదివారం నాడు ప్రసారమయ్యే గార్గేయం కార్యక్రమంలో తెలియచేస్తూ వచ్చాను. అలాంటి అద్భుత దృశ్యం రేపే ఆవిష్కృతం కానుంది.

శని గ్రహం అనగానే భయం చెందవద్దు. మానవాళికి పూర్ణ ఆయుష్యుని అందించేవాడు. ప్రస్తుతం జరిగే మన్మధ నామ సంవత్సరానికి రాజే ఈ శని గ్రహం. రాబోయే దుర్ముఖి నామ సంవత్సరానికి రాజు శుక్రుడు. ఈ ఇరు గ్రహాలూ మిత్ర గ్రహాలు. కనుక ఈ ఇరువురు కలిసే రోజున బహుళ చతుర్దశి మూల నక్షత్రం కావటం మహా విశేషం. బహుళ చతుర్దశి అంటే భగమాలిని దేవతగా ఉండే చంద్రకళ. ప్రతి నెలలో చంద్ర దర్శనం జరిగే రోజున ఉండే దేవీ కళే భగమాలిని.

సహజంగా చంద్ర దర్శనం జరిగే రోజున కనిపించే భగమాలిని దేవత, బహుళ చతుర్దశి రోజున సహజంగానే సూర్యోదయం ముందుగా చంద్రకళ ఉదయిస్తుంటుంది. అందుచేత కొన్ని ప్రాంతాలలో 90 శాతం కనపడకపోవచ్చు. కేవలం 10 శాతం మాత్రమే కొన్ని ప్రాంతాలలో కనపడే అవకాశం ఉంది. కనుక రేపటి రోజున మూల నక్షత్రం కావటం, దీనికి తోడు భగమాలిని దేవతా స్వరూపంతో ఉన్న బహుళ చతుర్దశి కావటం విశేషం. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రంలోని 65వ శ్లోకంలోని ఒకటవ లైన్లో భానుమండలమధ్యస్థా భైరవీ భగమాలిని అని ఉండును. భగ అనగా వివిధ శక్తులను ధరించిన తల్లి అని అర్ధము. సౌర శక్తి అనేక శక్తులతో మాలగా గోచరించును. అందుకే తన నుంచి అనేక శక్తులను మాలగా ధరించిన శక్తిని, భగమాలిని అంటారు. భగ శబ్దమునకు ఐశ్వర్యము అని కూడా అర్ధమున్నది. అంటే ఐశ్వర్యమాలను ధరించిన తల్లి అని భావము. ఈ భగమాలిని దేవత పద్మముపై కుడికాలు లోనికి మడిచి ఎడమకాలు దిగువకు ఉంచి, ఆరు భుజాలతో మహా సౌందర్యంతో ఎరుపు వర్ణంతో మూడు నేత్రాలతో ఉంటుందీ దేవత. ఈ దేవత నుంచి వచ్చే కాంతి కిరణాలు క్రిమషన్ రంగును పోలి ఉండును.

ప్రతి నెలలో అమావాస్య తదుపరి నెలవంకగా కొద్ది గంటలు మాత్రమే కనపడే చంద్ర కళే ఈ భగమాలినీ దేవత. కనుక భగం అంటే ఐశ్వర్యం, భాగ్యం అని ఎన్నో అర్ధాలు ఉన్నవి. ద్వాదశ ఆదిత్యులలో భగుడు ఒకడు. మొత్తం మీద భగాన్ని కాంతి, సౌభాగ్య, సౌందర్యాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ భగమాలను శ్రీ లలితా మాత ధరిస్తుంది కాబట్టే భగమాలినిగా పిలువబడింది.

2016 జనవరి 9 సూర్యోదయానికే ముందు భగమాలిని దేవత ఉదయిస్తుంది. కొద్ది నిముషాలలోనే సూర్యోదయం కూడా అవుతుంది. కనుక ఈ స్వల్ప వ్యవధి లోనే అద్భుత ఖగోళ దృశ్యం ఆవిష్క్రుతమైతే, మూల నక్షత్ర విశిష్ట దినాన పరివేష్టితురాలైన భగమాలిని నెలవంక కనపడితే ఎంత అదృష్టమో మరి.

కాబట్టి శని, శుక్ర గ్రహాలను జనవరి 9 శనివారం ఉదయం దర్శించి ప్రార్ధించండి. ఏమని ప్రార్దిస్తారంటే ఈ 2016లో ఇటు మన్మధ, అటు దుర్ముఖి సంవత్సరాల రారాజుల కలయిక జరుగుతున్న శుభ తరుణంలో, వారి సంపూర్ణ అనుగ్రహం మీ పైన ప్రసరించాలని... మీతో పాటు అందరిపై ఉండాలని ఆకాంక్షతో దర్శనం చేసుకోండి.  5 గంటల నుంచి 6.30 లోపల తూర్పు దిక్కులో తేజోవంతమైన కాంతితో కనపడే నక్షత్రమే శుక్రుడు. దానికి దిగువన మినుకు మినుకుమనే మంద కాంతితో కనపడే నక్షత్రమే శని గ్రహం. ఈ ఇరువురు 5 గంటల నుంచి షుమారు 6.40 వరకు కనపడగలరు. దాదాపు ఉదయం 6.20 నుంచి 6.40 లోపల భగమాలిని చంద్రవంక కనపడవచ్చు, కనపడకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ అటు శని శుక్ర గ్రహాలను దర్శనం చేసుకుంటూ 6.20 తదుపరి కూడా తూర్పు దిక్కుగా దర్శించండి. అవకాశమున్నంత మేర సూర్యోదయం వరకు వేచి చూస్తూనే ఉండండి. దేవత కొన్ని ప్రాంతాలలో కనపడక పోయినా బాధపడక  చంద్రునికో నూలు పోగును, చంద్ర దర్శనం రోజున నివేదించినట్లే, శని శుక్ర గ్రహాలను దర్శించి నూలు పోగును కూడా నివేదించండి. ప్రత్యేక నైవేద్యాలు ఏమి లేవు. రాబోయే గురు చండాల యోగానికి సంబంధించిన ఓ పరిహారం రేపే చెప్పబోతున్నాను. ఈ క్రింది వీడియోలో రెండవ సగభాగంలో శని శుక్ర గ్రహాల వివరణ ఉన్నది, వీక్షించగలరు. మీ బంధు మిత్రాదులకు తెలియచేయండి. - శ్రీనివాస గార్గేయ