Tuesday, January 19, 2016

మూలాధార కుండలినీ - గోధుమపిండి దీపారాధన 4

తల్లియొక్క వెలుగులతో ఈ విశ్వ చక్రమంతా నిండి ఉంది. ఆ శ్రీచక్రమే మన శరీరంలో కూడా ఉన్నదని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అణువులో ఉన్నదే  బ్రహ్మాండములో ఉన్నదనునది మంత్రం శాస్త్ర సిద్దాంతం. అంటే ఈ బ్రహ్మాండమంతా వ్యాపించిన దేవీ చైతన్యం మన శరీరంలో లేకపోతే ఈ శరీరంలో అసలు కదలికలే ఉండవు. చైతన్యం అంతకంటే ఉండదు. శ్రీచక్రంలోని చక్రములన్నీ మన శరీరంలో కూడా ఉన్నాయి. కనుక మన శరీరంలో ఉన్న శ్రీచక్ర దేవతను ఆరాధించటానికి పరోక్షంగా గోధుమపిండి దీపారాధన ఉపయోగపడుతుంది.

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో 36వ శ్లోకంలోని 2వ పంక్తి లోని కుళామృతైకరసికా నుంచి 40వ శ్లోకంలోని రెండవ పంక్తి చివరలో ఉన్న బిసతంతుతనీయసీ వరకు గల శ్రీ లలితా దేవి నామాలను పరిశీలిస్తే... 90వ నామమే కుళామృతైకరసికాయై నమః. అలాగే 111వ నామము బిసతంతుతనీయస్యై నమః వరకు గల 22 నామాలలో కుండలినీ స్వరూపము ఆవిష్కృతం కాబడినది. భారతీయ దేవాతాకృతుల నిర్మాణము వెనుక దాగి ఉన్న రహస్యమును తెలుసుకొనుటకు మంత్రం శాస్త్ర రహస్యములు కూడా కొన్నింటిని మనము తెలుసుకొని ఉండాలి. 

నస్వర్గే నచ తీర్థేషు నౌషధేషు నభేషుచ
ఋషయో దేవతాస్సంతిమంత్రాయేవసు దేవతాః
సాధకానాం ఫలందాతుం తత్తద్రూపం సురైః
ముఖ్యంస్వరూపం తేషాంతుమంత్రాయేవ నచేతరే ॥

అనగా స్వర్గములో, తీర్ధములలో, ఓషదులలో, ఆకాశములలో దేవతలుండరు. ఋషులు, దేవతులు కూడా మంత్రము నందే ఉందురు. మంత్రములే దేవతాకృతులు. సాధకులను అనుగ్రహించుటకు దేవతలు నిత్యము అనేక ఆకృతులను మంత్రానుష్టానమునకు తగిన రీతిలో ధరింతురు. ఆ మంత్రశక్తి ప్రధానముగా కుండలినీ స్వరూపములో ఉండును. కనుక యోగము, మంత్రము, రూపము మూడింటికీ ఓ అవినాభావ సంబంధమున్నది.

ఈ కుండలినీ శక్తి మూలాధార స్వరూపమైన ప్రధమ చక్రమందు ఉండును. నోటితో తోకనుపట్టుకున్న సర్పము లాగా మూడున్నర చుట్లు చుట్టుకొని నిద్రిస్తూ మూలాధార చక్రంలో ఉండును. లలితా సహస్ర నామ స్తోత్రమునందలి 106వ శ్లోకంలోని రెండు లైన్లు, 107వ శ్లోకంలోని మొదటి లైన్ ను పరిశీలిస్తే... 514, 515, 516, 517, 518, 519, 520 అను 7 నామాలలో మూలాధార చక్రం యొక్క అంశములన్నియు వర్ణింపబడినవి.

మూలాధార చక్రములో ఉన్న తల్లి పేరు సాకినీ దేవి. పృథ్వి తత్వ రూపముతో సృష్టికంతటికీ ఆధారంగా పసుపు వర్ణములో ఉండును. ఈ మూలాధార చక్రానికి అధిష్టాన దేవత గణపతి. అలాగే ఈ మూలాధార చక్రానికి ఆధిపత్య గ్రహం కుజుడు.  ఇందలి సాకిన్యాంబ దేవతనే సిద్ధవిద్యా దేవి అని పిలుచుదురు. వరదాదినిషేవితా నామానికి అర్ధమేమంటే వరదా మొదలైన దేవతలచే సేవింపబడుచున్నదని అర్థము. మూలాధారంలో సరస్వతీ దేవి విద్యా సంబంధమైన నాద శక్తిగా ప్రతిపాదింపబడుతున్నది. నాదం యొక్క ఉత్పత్తి స్థానం కూడా మూలాధారము.

విత్తనము లేనిదే వృక్షము లేదు గనక, ఈ మూల నాదము లేకపోతే పలుకే ఉండదు. కనుక వాగ్దేవతకే మూలమైన స్వరూపమైనందున అంకుశము, ఢమరుకము, పుస్తకము, జ్ఞానముద్రను కలిగి ఐదు శిరస్సులతో ఉండును. వేదములలో వర్ణించిన సరస్వతీ సూక్తులన్నీ ఇక్కడ భావించవచ్చును. పరోక్షంగా ఈ మూలాధార చక్రంలోని సాకిన్యాంబ దేవతను అస్థి దేవత ( అస్థిసంస్థితాయై నమః) అని కూడా పిలుస్తారు. అనగా ఎముకలకు అధిష్టాన  దేవత అని అర్ధము.

గర్భస్థ పిండ విషయములో 5వ మాసములోనే వెన్నెముక ఏర్పడి చర్మ ధాతువును ఏర్పరుచుకొనును. సాకిన్యాంబ స్వరూపములో ఉన్న లలితా పరాభట్టారికను ఆరాధిస్తే ఎముకల పుష్టి కలగటమే కాక పరోక్షంగా అనేక దుర్యోగములు పోవునని పురాతన గ్రంధములు తెలియచేస్తున్నాయి. ఈ సాకిన్యాంబ దేవతకు ముద్గౌదనము తయారుచేసి నివేదన ఇచ్చి ప్రసాదముగా స్వీకరించినందున ఎముకల పుష్టి కలగటమే కాక, అపూర్వ శక్తుల ప్రభావంచే ఛాయా గ్రహముల ద్వారా వచ్చే దుర్యోగములు తొలగును. ఈ తల్లినే ముద్గౌదనాసక్తచిత్తా (519వ నామం) అందురు. ముద్గర అనగా పెసలు. ఓదనము అనగా అన్నము. పెసలతో వండిన అన్నముపై ఆసక్తి గల తల్లి అని అర్ధము.

పెసలతో వండిన అన్నాన్నే చాలామంది కట్టే పొంగలి అనుకుంటారు. దీనినే సిద్దాన్నామని కూడా అంటారు. శాస్త్ర రీత్యా ఈ సిద్దాన్నమును తొమ్మిది పదార్ధాలతో వండవలెను.

"సుశాలితండులప్రస్థం తదర్థం ముద్గభిన్నకం,
చతుఃఫలంగుడం ప్రోక్తం, తన్మానం నారికేళకమ్,
ముష్టిమాత్రం మరీచంస్యాత్ తదర్థం సైంధవం రజః,
తదర్థం జీరకం విద్యాత్ కుడవం గోఘ్రుతం విదుః,
గొక్షీరేణస్వమాత్రేణ సం యోజ్యా కమలాసనం,
మందాగ్నివచనాదేవ సిద్ధాన్నమిద ముత్తమం.||"
అని శాస్త్ర రీత్యా చెప్పిన దానికి అర్థమేమిటంటే...
స్వచమైన బియ్యము తీసుకొని దానిలో సగము పెసలు లేక పొట్టు తీయని పెసరపప్పు కలిపి అందులో బెల్లం, కొబ్బరి, మిరియాలు, సైంధవలవణము, జీలకర్ర, ఆవునెయ్యి, ఆవుపాలు కలిపి తయారు చేసిన దానిని ముద్గౌదనము అంటారు. ఇదియే సిద్దాన్నము. ఇదియే పులగము. ఇదియే అసలు సిసలైన కట్టె పొంగలి. దీనిని  సాకీనీ దేవత రూపంలో ఉన్న లలితా దేవికి నివేదన చేస్తే ఆమెయే సాకినీ శక్తిగా సంతోషించి తగిన పుష్టిని, ఇష్టిని చేకూర్చును.

కనుక శరీరంలో ఉండే షట్చక్రాలలో దిగువ భాగంలో ఉండే మూలాధార చక్ర దేవత, నివేదన తెలుసుకున్నాం. అయితే ఈ మూలాధారంలో ఉండే కుండలినీ శక్తి వివరాలు కూడా మనం తెలుసుకోవాలి. ఇదొక సర్పాకారమని పైన చెప్పుకున్నాం.

 షట్చక్రాలలో మూలాధార చక్రానికి ఆధిపత్య గ్రహం కుజుడు. స్వాదిష్టాన చక్రానికి ఆధిపత్య గ్రహం శుక్రుడు. మణిపూరక చక్రానికి ఆధిపత్య గ్రహం రవి. అనాహత చక్రానికి ఆధిపత్య గ్రహం బుధుడు. విశుద్ది చక్రానికి ఆధిపత్య గ్రహం గురువు. ఆజ్ఞా చక్రానికి ఆధిపత్య గ్రహం శని. ఈ ఆరు చక్రాల పైన తలమానికగా ఉంటూ పాలించేది, నియంత్రించేది మరొకటి బ్రహ్మ రంధ్రంలో ఉండును. దానినే సహస్రార చక్రము అంటారు. దీని ఆధిపత్య గ్రహం చంద్రుడు. కనుక నవగ్రహాలలో ఏడు గ్రహాలు ఈ చక్రాలకు ఆదిపత్యంగా నిలుస్తున్నాయి. ఇక మిగిలిన రాహు, కేతువులు ఎక్కడ ఉన్నారు అనే అనుమానం ఉంటుంది.


ఒకవిధంగా మూలాధార చక్రంలోని సర్పాకారంలో ఉన్న కుండలినే రాహు కేతువులుగా తీసుకోవాలి. తల భాగాన్ని రాహువని, తోక భాగాన్ని కేతువని పిలుస్తారు. శనివత్ రాహు, కుజవత్ కేతుః అని శాస్త్ర వచనం. అనగా శని రాహువుతో సమానమని, కుజుడు కేతువుతో సమానమని అర్థము. అందుకే తల భాగంగా ఉన్న ఆజ్ఞా చక్రానికి ఆధిపత్య గ్రహం శని కాగా, అదోభాగానున్న మూలాధారానికి కుజుడు కావటం గమనార్హం.

కాబట్టి నవగ్రహ ఆధిపత్యాలన్ని మన శరీరంలోనే ఉన్నాయి. ఇక మానవాళికి సమస్యలుంటుంటాయి, సంతోషాలు వస్తుంటాయి. ఈ రెండింటికీ ప్రధాన కేంద్ర బిందువులు రాహు, కేతువులే అన్న నగ్న సత్యం నూటికి 90 మందికి తెలియదు. కనుక ఈ రాహు, కేతువులు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను తృప్తి కల్గించటానికి ఎన్నెనో పద్ధతులున్నాయి. ఈ పద్దతులలో తాంత్రిక మార్గంలో ఆచరించేది గోధుమపిండి దీపారాధన. ఈ 2016లో గురు చండాలయోగం అనేది త్వరలో రానున్నది. అంటే శుభ గ్రహమైన గురువు రాహువుతో కలవబోతున్నాడన్నమాట.

కనుక కేవలం గురు చండాల యోగానికి మాత్రమే కాకుండా మానవాళి శ్రేయస్సుకై ఆచరించే తాంత్రికారాధన గోధుమ పిండి దీపారాధన. పెద్దగా ఖర్చుతో కూడినది కాదు. అలాగే వైదిక మార్గంలో గురుచండాలయోగానికి కూడా హోమ సహిత విశేష క్రతువులు ఉన్నాయి. వాటిని కూడా తెలియచేస్తాను.

ఈ పరంపరలో గోధుమ పిండి దీపారాధన ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి,  ఏ నివేదన ఇవ్వాలి అనే ముఖ్య అంశాలతో రాబోయే పోస్టింగ్ ఉండును. 2016 జనవరి 29 రాత్రికి కన్యారాశి నుంచి సింహ రాశిలోనికి రాహు ప్రవేశం జరగనుంది. కనుక మరో 2 రోజుల లోపలనే గోధుమ పిండి దీపారాధనకు ముగింపును పలుకుదాం. వైదిక మార్గ విధి విధానాలను కూడా తెలుసుకోవటానికి ప్రారంభం చేద్దాం.  - శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.