శ్రీ హేమలంబ మాఘ పూర్ణిమ 31 జనవరి 2018 బుధవారం కర్కాటకరాశిలో పుష్యమి,ఆశ్లేష నక్షత్రాలలో రాహుగ్రస్తంగా రక్తవర్ణంలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును.ఇది నీలిరంగులో (బ్లూ మూన్ గా) ఉండదు. కేవలం రక్త వర్ణం మాత్రమే.ఈ చంద్ర గ్రహణం వలన ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Friday, January 15, 2016

నిజమైన ఆధ్యాత్మికత - గోధుమపిండి దీపారాధన 1

ప్రస్తుత రోజులలో ఆధ్యాత్మికత పేరు చెప్పుకొని జరిగే మోసాలు అనేకం వెలుగు చూస్తున్నాయి. ఆధ్యాత్మికతకు ఉన్న నిజమైన అర్ధం దిగజారిపోతున్నది. ఆధ్యాత్మికత అనగానే వస్త్ర ధారణ మార్చి గడ్డాలు పెంచటము లేక కనులు మూసి శూన్యంలోకి చూడటము లేదా రుద్రాక్షలు ధరించి నాలుగు సూక్తులు వల్లించటము అనుకుంటున్నారు. నిజమైన ఆధ్యాత్మికత అంటే మన ఆలోచనలలో స్వచ్చత తీసుకురావటము. మనకున్న సంస్కారాలు, వాసనలు తొలగించుకోవటం, ఆత్మను శుద్ధి చేసుకొనటమే. దేవుడు కోర్కెలు తీర్చే యంత్రము కాదు, మంత్రము కాదు. చెడు ఖర్మకు చెడు ఫలితం, మంచి ఖర్మకు మంచి ఫలితం ఉంటుంది. ఈ ధర్మం సృష్టి అంతటా ఒకేలా ఉంటుంది.

భగవంతుడు సృష్టించిన పూలు, పండ్లు, కొబ్బరికాయలను భగవంతుడికే సమర్పిస్తూ కోరికలను తీర్చమని అడగటం భావ్యం కాదు. దైవత్వం అనేది నిజం. సృష్టి అంతటా దేవుడే ఉన్నాడు. దేవుడితో సంభాషించాల్సింది హృదయమే కాని కంఠమ్ కాదు. హృదయాంతరాలల్లో భావన లేకుండా కేవలం శబ్దాలతో స్తుతిస్తే ఏం ప్రయోజనం. భాష, శబ్ద ప్రాధాన్యం కంటే భావ ప్రాధాన్యం అతి ముఖ్యం. నిర్మలమైన మనస్సుతో హృదయంలో స్వచ్చత సాదుగుణం పెంపొందించాలి. ఆధ్యాత్మికత అంటే మన అంతరాత్మ ఉనికి తెలియచేసే ఓ అపూర్వమైన జ్ఞాన ప్రక్రియ. ఏది సాధించాలన్నా ఈ శరీరం ద్వారానే సాధ్యపడుతుంది.

తన దైనందిన జీవితంలో ఎలాంటి ముసుగులు, నటనలు లేకుండా స్వచ్చతతో మనిషి ప్రాపంచిక జీవితాన్ని గడిపినప్పుడే ఆధ్యాత్మిక జీవనానికి గట్టి పునాది అవుతుంది. ఆధ్యాత్మిక జీవితం మన ప్రాపంచిక జీవనానికి ఒక ఆభరణంలాంటిదే కానీ అవరోధం మాత్రం ఎన్నటికీ కాదు. ఆధ్యాత్మిక దృష్టితో ప్రాపంచిక జీవనాన్ని గడపటం పరమానందానికి సోపానం. ఈ రెండు జీవితాలు ఒక నాణేనికి బొమ్మ, బొరుసులాంటివి. వీటి మధ్య తేడా ఏమి ఉండదు.  సంసారాన్ని వదిలేసి ఎక్కడికో పారిపోవటం కాదు. హిమాలయాలకి వెళితే అక్కడ లభించే ప్రశాంతత హిమాలయాలదే కానీ, మన హృదయానిది కాదు. మన హృదయంలో నెలకొల్పే నిర్మలమైన మనో నిశ్చలతే అసలైన ఆధ్యాత్మికత.

ఈ మనస్సనేది ప్రతి వ్యక్తికి మెదడులో ఉండే సహస్రారంలో ఉంటుంది. దీనికి అధిపతి చంద్రుడు. శరీరంలోని అన్నీ ప్రక్రియలను నిర్దేశించేదే సహస్రార చక్రం. మన శరీరంలోని అన్ని చక్రాలలోను తలమానికగా నిలిచి, అన్నింటిని పాలించి నియంత్రించేది ఈ చక్రమే. కేంద్ర నాడీమండలంతో అనుసంధానించబడి ఉండును. మానసిక ఆనందానికి సంతోషానికి, ఉల్లాసానికి శక్తివంతమైన ఆలోచనలకు సత్యానికి, ఏకాగ్రతకు కేంద్రమే కాకుండా... అనవసరమైన ఉపయోగంలేనటువంటి వ్యర్ధ భావాజాలానికి ప్రేరణ కూడా ఇక్కడ నుంచే జరుగుతుంది. ఇది మనసును గురించి చెప్పే రెండు మాటలు.

శరీరంలోని షట్చక్రాలలో హృదయ కుహరంలో ఉండే చక్రమే అనాహత చక్రం. ఈ చక్రానికి అధిపతి బుధుడు. ఈ చక్రం ద్వారా హృదయాన్ని, ఊపిరితిత్తులను, రక్తాన్ని, రక్తసరఫరాను చేస్తూ, ఊపిరితిత్తులు సాగి ముడుచుకునే గుణాన్ని, ఉచ్చ్వాస, నిశ్వాసాలను నిర్దేశిస్తూ
వ్యక్తికి భావనలను అందించే కేంద్రంగా ఉంటుంది. అన్ని చక్రాలకన్నా అతి సున్నితమైనది. మనస్సనే చంద్రగ్రహ పరిధిలో హృదయాదిపతైన బుధుడు పని చేస్తుంటాడు. ఈ చంద్రుడు, బుధుడు రెండింటి ద్వారానే వ్యక్తి జీవనంలో ఎదుగుదలలు, తగ్గుదలలు ఉంటాయి. అందుకే అధర్వణ వేదంలో ఉన్న మూడు ఉపనిషత్తులలో మొదటిదైన ప్రశ్నోపనిషత్తులోని శాంతి పాఠంలో ఏమి చెప్పబడిందంటే  దేవతలని, సూర్యుడిని, బృహస్పతిని ప్రార్ధిస్తూ చక్కని బుద్ది అనుగ్రహించాలని ఈ జీవితం తరించటానికి ఆయువు ఉన్నంతవరకు ఇబ్బందులు లేకుండా మనసు చెదరకుండా, సాధన సక్రమంగా కొనసాగించుకొనే అవకాశాన్ని అనుగ్రహించమని ప్రార్ధన. ఈ శాంతి మంత్రంలో "పశ్యేమ దేవహితం యదాయు:" అని ఉంటుంది. దేవతలకు హితంగా జీవించాలనుకుంటున్నామని భావం.

ముఖ్యంగా కళ్ళు, చెవులు చాలా బలవంతమైనవి. ఒక ఘోర దృశ్యం కంటపడటమో లేక వినరానివి విన్నప్పుడు, మన ఏకాగ్రతను చెదరగొట్టి మనసుని వికలం చేస్తుంది. మనసు సరిగా లేకపోతే బుద్ది ఎలా పని చేస్తుంది. అందుకే ఆ శాంతి మంత్రంలో భద్రం పశ్యేమ, భద్రం శృణుయామ దేవతలారా... సాధనా కాలంలో మంచి దృశ్యాలతో, మంచి శబ్దాలతో మమ్ములను అనుగ్రహించండి. ఓ బృహస్పతి మాకు సహకరించండి.... అంటూ ప్రార్ధన ఉంటుంది.

అసలు ఈ బృహస్పతే (గురువు) మన ప్రార్ధనను వినే స్థితిలో లేక సమస్యలతో ఉన్నప్పుడు, మన సాధన స్థితి ఎట్లా? ఈ విషయంలోనే పాఠకులు బాగా ఆకళింపు చేసుకుంటూ ముందుకు నడవవలసిన అనేక అంశాలు ముందున్నాయి. ఖగోళంలో ఉండే గురు గ్రహంతో రాహువు మమేకమవుతున్న సందర్భం రానున్నది. ఇతర వ్యతిరేక గ్రహస్థితులు అనేకం ఈ 2016 నుంచే ప్రారంభం కానున్నవి. కనుకనే గోధుమ పిండి దీపారాధనతో తొలుత ప్రారంభం చేసి, సరైన ఆధ్యాత్మికతకు దగ్గరవటము, మరికొంత తాంత్రిక, వైదిక మార్గాలలో ఉన్న అంశాలను తెలుసుకుంటూ మనసును, బుద్ధిని కట్టడి చేస్తూ రాహు ప్రభావాన్ని సరియైన రీతిలో అనుకూలంగా మరల్చుకుంటూ గురు చందాల యోగ ప్రభావాన్ని దూరం చేసుకోటానికి... మనమేసే అడుగులు ఎన్నో ఉన్నాయి. ఆ అడుగులలో మొదటిది గోధుమ పిండి దీపారాధానతో వ్యక్తీకరించబడే ఆధ్యాత్మిక భావనను ముందు తెలుసుకుందాం. ఈ విషయాలను అర్ధమయ్యే రీతిలో చెప్పటానికే పై విధమైన సోదాహరణ వ్యాసం అవసరమైనది. - శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.