Thursday, January 14, 2016

పాఠశాలకు, జీవితానికి ఇదేనా తేడా?

దాదాపు 15 సంవత్సరాల నుంచి నేను చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట కొన్ని మాటలను తరచుగా వినేవాడిని. అవి ఏమిటంటే క్రైసిస్ ని... ఆపర్చ్ట్యునిటీగా తీసుకోవాలి అనేవారు. ఇలా ఎందుకంటున్నారు అని అర్ధం చేసుకోవటానికి 4, 5 సంవత్సరాల కాలం దొర్లింది. సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలనేది వారి ఉద్దేశ్యం. బాగా ఆలోచిస్తే వారన్నమాటలు అక్షరసత్యాలు.

ప్రతి సంక్షోభంలోను ఓ అవకాశం ఉంటుంది. అసలు సమస్యలే లేకుంటే అవకాశాలే ఉండవు. ఒక సమస్యను గుర్తించి పరిష్కరించటమే విజయానికి కీలకమని ఓ సామెత చెబుతుంది. పరాజయం ఎదురైనప్పుడు ఏడుస్తూ కూర్చోవాలా లేక ఈ పరాజయాన్ని ఓ ఉత్తేజ పూరితమైన అవకాశంగా తీసుకోవాలా? ఇదే మన ముందున్న ఛాయిస్.

కనుక దీనిని ఒక సమస్యగా చూడవచ్చు లేదా ఒక అవకాశంగా చూడవచ్చు. నిర్ణయం మనదే. జీవిత సమస్యలలో కూడా... మంచి చెడుని మించి ఉంటుంది. సుఖం దుఃఖాన్ని మించి ఉంటుంది. సంతోషం బాధని మించి ఉంటుంది. కాని దానిని మనం ఏ విధంగా చూడాలి అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. సానుకూల దృష్టి కోణం నుంచి చూడాలా? లేక ప్రతికూల దృష్టి కోణం నుంచి చూడాలా?.. ఈ జీవితం సమస్యలతో నిండి ఉంటుంది. కనుక సమస్యలున్నచోటే అవకాశాలు ఉంటాయి. సమస్యలు లేకపోతే అవకాశాలే ఉండవు.

అందుకేనేమో జీవితాన్ని ఓ పాఠశాలగా చెప్తారు. పాఠశాలలో  ముందు అనేక పాఠాలను చదువుకొని తదుపరి పరీక్షని (ఎగ్జామ్) ఎదుర్కొంటాం. అదే జీవితంలో అయితే ముందు పరీక్షలను ఎదుర్కొంటాం వాటి నుంచి పాఠాలను నేర్చుకొంటాం.

ఈ పరంపరలో పరీక్షలు త్వరలో వస్తున్నాయ్... నేనిచ్చే వివరాలను చదివి ఆకళింపు చేసుకోండి. తద్వారా మంచి పాఠాలను నేర్చుకోవటానికి 2016 జనవరి 15 సంక్రాంతి పర్వదినం మనందరికీ స్వాగతం పలుకుతుంది. ఈ నెల 9న శుక్రశనుల కలయికను వీక్షించి ఉంటారు. ఆ శుక్రగ్రహ వారమైన శుక్రవారం రోజున శనిగ్రహ నక్షత్రమైన ఉత్తరాభాద్రతో కూడిన రేపటి మకర సంక్రాంతి పర్వదినాన, జగద్రక్షకుడైన శ్రీ సూర్య భగవానుని భక్తితో ప్రార్ధించండి. రేపు ఉదయం మకర సంక్రాంతి పుణ్యకాలం 6.43 నుంచి  12.16 వరకు ఉంటుంది. సంక్రమణ తర్పణ మహా పుణ్యకాలం ఉదయం 6.43 నుంచి 8.34 వరకు ఉంటుంది. తర్పణాలు ఇవ్వవలసినవారు పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వండి. అవకాశం లేకుంటే పితృ పితామహాదులను భక్తితో స్మరించండి. - శ్రీనివాస గార్గేయ

గమనిక : తదుపరి పోస్టింగ్లో ప్రతి ఆదివారం ఆచరించాల్సిన గోధుమపిండి దీపారాధన

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.