శ్రీ హేమలంబ మాఘ పూర్ణిమ 31 జనవరి 2018 బుధవారం కర్కాటకరాశిలో పుష్యమి,ఆశ్లేష నక్షత్రాలలో రాహుగ్రస్తంగా రక్తవర్ణంలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును.ఇది నీలిరంగులో (బ్లూ మూన్ గా) ఉండదు. కేవలం రక్త వర్ణం మాత్రమే.ఈ చంద్ర గ్రహణం వలన ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Friday, January 8, 2016

జనవరి 9 శనివారం రోజున శుక్ర శని గ్రహాల అపూర్వ కలయిక

ఖగోళంలో శని గ్రహం, శుక్ర గ్రహం ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ పరంపరలో ఒకే బిందువు వద్ద  2016 జనవరి 9 శనివారం రోజున ఉదయం 5గంటల నుంచి సూర్యోదయానికి వరకు తూర్పు దిక్కులో శుక్ర శని గ్రహాల అపూర్వ కలయిక జరగనుంది. ఈ అపూర్వ దృశ్యాన్ని సాధారణ కన్నులతో వీక్షించవచ్చు. ఈ వివరాన్నే నిత్యం భారత్ టుడే చానల్ లోను మరియు ఆదివారం నాడు ప్రసారమయ్యే గార్గేయం కార్యక్రమంలో తెలియచేస్తూ వచ్చాను. అలాంటి అద్భుత దృశ్యం రేపే ఆవిష్కృతం కానుంది.

శని గ్రహం అనగానే భయం చెందవద్దు. మానవాళికి పూర్ణ ఆయుష్యుని అందించేవాడు. ప్రస్తుతం జరిగే మన్మధ నామ సంవత్సరానికి రాజే ఈ శని గ్రహం. రాబోయే దుర్ముఖి నామ సంవత్సరానికి రాజు శుక్రుడు. ఈ ఇరు గ్రహాలూ మిత్ర గ్రహాలు. కనుక ఈ ఇరువురు కలిసే రోజున బహుళ చతుర్దశి మూల నక్షత్రం కావటం మహా విశేషం. బహుళ చతుర్దశి అంటే భగమాలిని దేవతగా ఉండే చంద్రకళ. ప్రతి నెలలో చంద్ర దర్శనం జరిగే రోజున ఉండే దేవీ కళే భగమాలిని.

సహజంగా చంద్ర దర్శనం జరిగే రోజున కనిపించే భగమాలిని దేవత, బహుళ చతుర్దశి రోజున సహజంగానే సూర్యోదయం ముందుగా చంద్రకళ ఉదయిస్తుంటుంది. అందుచేత కొన్ని ప్రాంతాలలో 90 శాతం కనపడకపోవచ్చు. కేవలం 10 శాతం మాత్రమే కొన్ని ప్రాంతాలలో కనపడే అవకాశం ఉంది. కనుక రేపటి రోజున మూల నక్షత్రం కావటం, దీనికి తోడు భగమాలిని దేవతా స్వరూపంతో ఉన్న బహుళ చతుర్దశి కావటం విశేషం. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రంలోని 65వ శ్లోకంలోని ఒకటవ లైన్లో భానుమండలమధ్యస్థా భైరవీ భగమాలిని అని ఉండును. భగ అనగా వివిధ శక్తులను ధరించిన తల్లి అని అర్ధము. సౌర శక్తి అనేక శక్తులతో మాలగా గోచరించును. అందుకే తన నుంచి అనేక శక్తులను మాలగా ధరించిన శక్తిని, భగమాలిని అంటారు. భగ శబ్దమునకు ఐశ్వర్యము అని కూడా అర్ధమున్నది. అంటే ఐశ్వర్యమాలను ధరించిన తల్లి అని భావము. ఈ భగమాలిని దేవత పద్మముపై కుడికాలు లోనికి మడిచి ఎడమకాలు దిగువకు ఉంచి, ఆరు భుజాలతో మహా సౌందర్యంతో ఎరుపు వర్ణంతో మూడు నేత్రాలతో ఉంటుందీ దేవత. ఈ దేవత నుంచి వచ్చే కాంతి కిరణాలు క్రిమషన్ రంగును పోలి ఉండును.

ప్రతి నెలలో అమావాస్య తదుపరి నెలవంకగా కొద్ది గంటలు మాత్రమే కనపడే చంద్ర కళే ఈ భగమాలినీ దేవత. కనుక భగం అంటే ఐశ్వర్యం, భాగ్యం అని ఎన్నో అర్ధాలు ఉన్నవి. ద్వాదశ ఆదిత్యులలో భగుడు ఒకడు. మొత్తం మీద భగాన్ని కాంతి, సౌభాగ్య, సౌందర్యాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ భగమాలను శ్రీ లలితా మాత ధరిస్తుంది కాబట్టే భగమాలినిగా పిలువబడింది.

2016 జనవరి 9 సూర్యోదయానికే ముందు భగమాలిని దేవత ఉదయిస్తుంది. కొద్ది నిముషాలలోనే సూర్యోదయం కూడా అవుతుంది. కనుక ఈ స్వల్ప వ్యవధి లోనే అద్భుత ఖగోళ దృశ్యం ఆవిష్క్రుతమైతే, మూల నక్షత్ర విశిష్ట దినాన పరివేష్టితురాలైన భగమాలిని నెలవంక కనపడితే ఎంత అదృష్టమో మరి.

కాబట్టి శని, శుక్ర గ్రహాలను జనవరి 9 శనివారం ఉదయం దర్శించి ప్రార్ధించండి. ఏమని ప్రార్దిస్తారంటే ఈ 2016లో ఇటు మన్మధ, అటు దుర్ముఖి సంవత్సరాల రారాజుల కలయిక జరుగుతున్న శుభ తరుణంలో, వారి సంపూర్ణ అనుగ్రహం మీ పైన ప్రసరించాలని... మీతో పాటు అందరిపై ఉండాలని ఆకాంక్షతో దర్శనం చేసుకోండి.  5 గంటల నుంచి 6.30 లోపల తూర్పు దిక్కులో తేజోవంతమైన కాంతితో కనపడే నక్షత్రమే శుక్రుడు. దానికి దిగువన మినుకు మినుకుమనే మంద కాంతితో కనపడే నక్షత్రమే శని గ్రహం. ఈ ఇరువురు 5 గంటల నుంచి షుమారు 6.40 వరకు కనపడగలరు. దాదాపు ఉదయం 6.20 నుంచి 6.40 లోపల భగమాలిని చంద్రవంక కనపడవచ్చు, కనపడకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ అటు శని శుక్ర గ్రహాలను దర్శనం చేసుకుంటూ 6.20 తదుపరి కూడా తూర్పు దిక్కుగా దర్శించండి. అవకాశమున్నంత మేర సూర్యోదయం వరకు వేచి చూస్తూనే ఉండండి. దేవత కొన్ని ప్రాంతాలలో కనపడక పోయినా బాధపడక  చంద్రునికో నూలు పోగును, చంద్ర దర్శనం రోజున నివేదించినట్లే, శని శుక్ర గ్రహాలను దర్శించి నూలు పోగును కూడా నివేదించండి. ప్రత్యేక నైవేద్యాలు ఏమి లేవు. రాబోయే గురు చండాల యోగానికి సంబంధించిన ఓ పరిహారం రేపే చెప్పబోతున్నాను. ఈ క్రింది వీడియోలో రెండవ సగభాగంలో శని శుక్ర గ్రహాల వివరణ ఉన్నది, వీక్షించగలరు. మీ బంధు మిత్రాదులకు తెలియచేయండి. - శ్రీనివాస గార్గేయ No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.