గమనిక : 2018 జూన్ 26 రాత్రి నుంచి అక్టోబర్ 25 వరకు 121 రోజులు కుజగ్రహం వక్రంతో సంచారం చేయనున్నది. కనుక కుజ దోషం అనేది లేకున్ననూ, ఉన్నదని భయపడేవారు, ఋణ శత్రు శరీర పీడల నుంచి ఉపశమనానికి ప్రత్యేక అరుదైన విశేష రోజులలో కుజ గ్రహ దోష నివారణకు అద్భుత పరిహారములను ప్రణతి టెలివిజన్ యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి.- శ్రీనివాస గార్గేయ

Saturday, August 26, 2017

తులారాశిలో 395 రోజుల సంచారానికి విచ్చేస్తున్న దేవగురువు

శ్రీ హేమలంబ నామ సంవత్సర భాద్రపదమాసం బహుళ సప్తమి మంగళవారం సరియగు తేదీ 12 సెప్టెంబర్ 2017 న భారత కాలమానప్రకారం ఉదయం 6 గంటల 51 నిముషాలకు గురుగ్రహం చిత్రా నక్షత్ర మూడవ పాదమైన తులా రాశిలోకి ప్రవేశం జరుగును. గురు గ్రహం తులా రాశి ప్రవేశంతో సార్థ త్రికోటి తీర్థ సహిత  కావేరినదికి పుష్కరాలు ప్రారంభమై, సెప్టెంబర్ 28వ తేదీతో ముగియును. కావేరి నదినే దక్షిణ గంగగా పిలుస్తారు. కావేరీ నదీ తీర పుణ్య క్షేత్రాలలో తమిళనాడులో చిదంబరం, శ్రీరంగం, తంజావూరు, కుంభకోణాలు పేరెన్నిక గన్నవి. సెప్టెంబర్ 29 వరకు తర్పణ పిండప్రదానాదులు ఆచరించవచ్చును.

ఇక వివరాలలోకి వెళితే తులా రాశిలో 395 రోజులపాటు గురు గ్రహం సంచారం చేయబోతున్నాడు. ఈ సమయంలో కొద్దిరోజులు మౌఢ్యమితోను, మరికొద్దిరోజులు వక్రంతోను ఉంటూ, ఈసారి రెండు పర్యాయములు నీచ స్థితిలో ఉన్న రవి చెంతన ఉండబోతున్నాడు. ఈ 395 రోజులలో ఆయన ఏయే రోజులలో ఏయే నక్షత్రాలలో ప్రవేశం చేయబోతున్నాడో తెలుసుకుందాం.

2017 సెప్టెంబర్ 28 చిత్రా నక్షత్ర 4వ పాదంలోకి, అక్టోబర్ 14న స్వాతి 1వ పాదంలోకి, అక్టోబర్ 29న స్వాతి రెండవ పాదంలోకి, నవంబర్ 13న స్వాతి 3వ పాదంలోకి, నవంబర్ 29 న స్వాతి 4వ పాదంలోకి సంచార నిమిత్తమై బయలుదేరతారు. డిసెంబర్ 15వ తేదీ ధనుర్మాస ప్రారంభం కాగానే రెండవ రోజున అంటే డిసెంబర్ 16న తన స్వనక్షత్రమైన విశాఖ నక్షత్ర 1వ పాదంలోకి ప్రవేశం జరగటం, తిరిగి 2018 జనవరి 4 విశాఖ 2వ పాదంలోకి జనవరి 27న విశాఖ 3వ పాదంలోకి ప్రవేశ నిమిత్తమై సిద్దమవుతుంటాడు. ఇంతలో 2018 మార్చి 9 ఉదయం 10 గంటల 19 నిముషాలకి గురువుకి వక్రారంభం మొదలుకావటం, అక్కడ నుంచి వెనుకకు నడవటం ప్రారంభమై తిరిగి 2018 ఆగష్టు 2న రుజు మార్గంతో విశాఖ 1వ పాదంలోకి ప్రవేశిస్తాడు. 2018 సెప్టెంబర్ 3 న విశాఖ 2వ పాదంలోనికి, 2018 సెప్టెంబర్ 23న విశాఖ 3వ పాదంలోనికి ప్రవేశిస్తూ.. ఆ పిమ్మట 2018 అక్టోబర్ 11 శ్రీ విళంబి నామ సంవత్సర ఆశ్వయిజ శుక్ల తదియ గురువారం రాత్రి 7గంటల 20నిముషాలకి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. .

మొత్తం 395 రోజుల కాలగమనంలో కొన్ని రాశుల వారికి మంచి అవకాశాలను ఇవ్వటానికి సిద్ధపడతాడు. కొన్ని రాశుల వారికి సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చి వెళ్ళిపోతాడు. కొందరకు ఇస్తానని చెప్పలేడు.. ఇవ్వనని అనలేడు, మౌనంతోనే ముందుకు వెళ్ళిపోతాడు. ఇంకొందరకు అడగకముందే అన్ని వివరాలను తెలుసుకుని, ఏదో అందించినట్లుగా భ్రాంతి కనపరుస్తూ ఏమి లేకుండానే ప్రక్క రాశిలోకి వెళ్ళిపోతాడు. ఇది సౌర మండలంలో ఉన్న గురు గ్రహ తులా రాశి గమన చరిత్ర. ఇంతకీ తులా రాశి విషయానికి వస్తే గురు గ్రహానికి కించిత్ వైరమున్న స్థానము. ఈ స్థానంలో తన ప్రతిభను చూపిస్తాడా? చూపడా ? అనే ఆలోచనలు ప్రతి వారికీ ఉదయిస్తుంటాయి. ఒకటీ రెండు రోజులు కాకపోయే 395 రోజులు ఆ రాశిలో సంచారం చేయాలి... మరి ఎవరెవరికి ఏమి అందిస్తాడు? ఏమి అందించడు? ఏమి అడుగుతాడు? ఏమి అడగడు? ఎవరెవరికి మౌనంతోనే ముడిపెడతాడు.. కను సైగలతో ఇస్తానని ఆశ చూపిస్తాడు? తన వీక్షణాలతో ఏ విధంగా శుభాశుభాలను అందిస్తాడో చాలా వివరాతి వివరంగా తదుపరి పోస్టింగ్ లలో రాశుల వారీగా గ్రహభూమి బ్లాగ్ లో
(grahabhumi.blogspot.com) తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.