Friday, November 20, 2015

రవి, శనుల కలయికతో మానస సరోవరం మహా సాగరం కానున్నదా?

ఆధ్యాత్మికపరంగా వ్యక్తికున్న సప్త శరీరాలలో చతుర్థ శరీరమే మానసిక శరీరం. ఈ మనస్సును ఎల్లప్పుడూ ప్రసన్నంగానే ఉంచాలి. రాగ ద్వేషాలను పోషించకుండా  సంహరిస్తుండాలి. చిత్తం యొక్క మలినమే మనస్సు యొక్క దోషం. చిత్తముకు గల ప్రసన్నతే సద్గుణము. ఈ సద్గుణమును హడావిడిగా ప్రతివారు పొందలేకపోవచ్చు. కాని నవవిధ వ్యక్తులతో సన్నిహితంగా ఉండేవారు ప్రప్రధమంగా ఈ దిగువ చెప్పిన అంశాలలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి.

1. ఆయుధాలు కల్గి ఉన్నవారితో ఆయుధాలు లేని వారు శత్రుత్వాన్ని కల్గి ఉండరాదు.
2. తన రహస్యాలను వారితో తప్పు చేసిన వ్యక్తి (దోషి) పగ, ప్రతీకారాలతో మెలగరాదు.
3. ఓ యజమాని దగ్గర పని చేసే నౌకరు శత్రుత్వంతో అసలు ఉండకూడదు.
4. దుష్ట  స్వభావులతో... సాత్విక స్వభావ సిద్ధి గల మంచివారు శత్రుత్వం లేకుండానే మెలగాలి.
5. సంపన్న వర్గీయుడితో పేదరికం ఉన్న వ్యక్తి శత్రుత్వం కలిగి ఉండరాదు.
6. శూర, వీరులతో స్తుతించే వారు శత్రు లక్షణాలకు దూరంగా ఉండాలి.
7. ఓ కవి శత్రు పోకడలతో ఉన్న కవిత్వాన్ని మహారాజుకు వినిపించకూడదు.
8. వైద్యులతో రోగులు మిత్రత్వాన్నే కోరుకోవాలి.
9. నిత్యం కడుపు నింపే అన్నదాతతో శత్రుత్వంతో సంభాషించరాదు.

పై నవవిధ వ్యక్తులతో ఎవరైతే శత్రు విరోధ లక్షణాలు లేకుండా ఉంటారో వారు సుఖంగా ఉంటారు. ఈ శత్రు విరోధ లక్షణాలను అనుకోకుండా తెరపైకి తెచ్చే గ్రహ స్థితులు ఉన్నప్పుడు ప్రతివారు అతి జాగరూకులై అప్రమత్తతతో వ్యవహరించాలి. కనుక భావోద్రేకాలు సంయమనం పాటిస్తూ... సమయస్పూర్తితో, సమయానుకూలంగా మనస్సనే వానరాన్ని అధిక అప్రమత్తతతో నడిపించాల్సిన అవసరం ప్రతి వారి విషయంలో ఎంతైనా ఉన్నది. హడావుడి పడితే మొదటికే మోసం వస్తుంది. కేవలం తమకు తాముగా పరిధిని దాటకుండా ప్రేక్షకులుగా వ్యవహరిస్తూ జీవన సమరంలో విధి నిర్వహణ చేయాలి.

పట్టుదల, శ్రమ, మేధస్సు వల్లనే అద్భుతాలు జరుగుతాయి. ఈ మూడింటి సమాహారమే పురాణం, ఇతిహాసాలలో మనం చెప్పుకొనే మహిమలు, మహత్తులు. ఓ సరియైన జ్ఞానాన్ని మానవాళికి అందించేందుకు ఋషులు, యోగులు శ్రమించారు. సృష్టి రహస్యాలను అద్భుత రచనల ద్వారా మనకందించారు. అటు ఆధ్యాత్మికము, ఇటు విజ్ఞానము కలబోతగా ఉండి యుగాలు మారినా, జగాలు మారినా దివ్య ప్రభోదాలుగా, మార్గదర్శకాలుగా నిలిచాయి. మానవుడిని మాధవుడిగా చేసేవిగా పవిత్రంగా పురాణ ఇతిహాసాలు భాసిల్లుతున్నాయి. దేవతలను బలోపేతుడుగా చేసేందుకు అమృతాన్ని సాధించేటందుకు, మంథర పర్వతాన్ని కవ్వంగా మలుచుకొని, వాసుకిని తాడుగా చేసుకొని పాలకడలిని మధించమని దేవ దానవులతో చెప్తాడు శ్రీ మహావిష్ణువు. స్థితి, గతి స్వరూపమే ఆయన. స్థితిని బట్టే, గతి ఉంటుంది, గతిని బట్టే స్థితి ఉంటుంది. ఈ స్థితి గతులను నిర్ణయించేదే మహా సాగరమనే మనస్సు. కనుక కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు. కారణమేమిటంటే ఆ కృషి వెనుక సరియైన సారధ్యం వహించేది మనస్సు మాత్రమే.

మరి రవి శనుల కలయిక వలన నవంబర్ 30 నుంచి ప్రతి వారి విధి నిర్వహణలో ఎదురయ్యే ఆటుపోట్లు, అస్థిరతలు, ఆటంకాలు ఎలా ఉంటాయో, దానికి తగ్గ కృషి ఎలా చేస్తే గ్రహస్థితి వ్యతిరేక పంథా నుంచి విజయం చేకూరుతూ మన మనో సాగరం రాజహంసలు  విహరించే మానససరోవరం కావాలంటే తదుపరి పోస్టింగ్లో తెలుసుకుందాం. - శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.