Saturday, October 29, 2016

దీపావళిన మహతీ యోగ సిద్ధికి శ్రీ లలితా షోడశ నామాలతో కామేశ్వరీ దేవతార్చన

శ్రీ - అంటే పరాశక్తి. మహాకాళి, మహాలక్ష్మి , మహా సరస్వతి. వీరు ముగ్గురూ  రూపాలే. చక్రం ఆమె నివాసం. శ్రీచక్రం అంటే పరాశక్తి సామ్రాజ్యమని భావము. ఈ తల్లి సృష్టించిన మానవ దేహంలో ఆమె సామ్రాజ్య లక్షణాలు ఉంటాయి. శ్రీచక్రంలో 5 చక్రాలు శక్తిని, 4 చక్రాలు శివునివి. ఈ విధంగా నవ చక్రాలు శక్తి, శివమయాలు. మానవదేహం నవ ధాతువులచే సృష్టింపబడింది. వీటిలో చర్మము, రక్తము, మాంసము, మెదడు, ఎముకలు అను ఐదు శక్తి ధాతువులు. ఇక మజ్జ, శుక్లము, ప్రాణము, జీవము అను నాలుగూ శివ ధాతువులు. ఇలా మానవ దేహంలోని 9 ధాతువులకు శ్రీచక్రంలోని నవ చక్రాలు (నవ యోనులు) ప్రతీకలు. శ్రీచక్ర నవ ఆవరణాలకి, మానవదేహానికి సంబంధం ఉన్నది.

నవ ఆవరణలతో ఉన్న శ్రీచక్రంలో.. 8వ ఆవరణ త్రిభుజాకారంగా ఉంటుంది. దీనిని సర్వసిద్ధిప్రద చక్రము అంటారు. ఈ త్రిభుజంలోని బిందువును 9వ ఆవరణగా పిలుస్తారు. ఈ బిందువునే సర్వానందమయ చక్రము అంటారు. ఈ బిందువులోనే కామేశ్వరీ, కామేశ్వరులు ఉంటారు.

ఇక 8వ ఆవరణగా చెప్పిన సర్వసిద్ధిప్రద చక్రము అనే త్రిభుజంలోని 3 భుజాలలో ఒక్కో భుజం వైపు 5 మంది దేవతల చొప్పున, 3 భుజాలకు 15 మంది దేవతలు ఉంటారు. ఈ 15 మందినే నిత్య తిధి దేవతలు అంటారు.


ఈ త్రిభుజానికి ఉన్న 3 కోణాలలో ఓ కోణాన్ని జలంధర పీఠంగాను, రెండవ కోణాన్ని పుష్పగిరి పీఠం గాను, మూడవ కోణాన్ని కామగిరి పీఠం గాను పేర్కొంటారు. ఇంక మరీ లోతులకు వెళ్లకుండా 15 మంది దేవతలలో ప్రధమ దేవతే కామేశ్వరీ. ఈ దేవత శుక్ల పక్ష పాడ్యమికి, కృష్ణ పక్ష అమావాశ్యకు నిత్య తిధి దేవతగా (చంద్రకళగా ) ఉండును.. వాస్తవానికి శుక్ల పాడ్యమి రోజున చంద్రుని చూడలేము. అలాగే అమావాస్య రోజున కూడా చంద్రుని చూడలేము.

చంద్రుడు కనపడని ఈ రెండు తిధులకు అధిష్టానంగా ఉన్న కామేశ్వరీ దేవతా స్వరూపాన్ని ముందు తెలుసుకుందాం. కామేశ్వరీ దేవత ఎరుపు మాణిక్యం పొదిగిన కిరీటాన్ని ధరించి ఎరుపు వస్త్రాలతో, కుడి కాలు మడిచి.. ఎడమకాలు క్రిందకి జారవిడిచి పీఠంపై ఆశీనురాలై ఉంటుంది. కోటి మంది సూర్యులు ఒక్కసారిగా సూర్యోదయంలో ఉంటే... అప్పుడు కనపడే అరుణవర్ణ కాంతి ఎలా ఉంటుందో.. అట్టి కాంతితో ఈ నిత్య తిధి దేవత విరాజిల్లుతుంటుంది . మూడు కన్నులు, 6 చేతులు, శిరస్సుపై చంద్రవంకను కలిగి, చిరు మందహాసంతో కామేశ్వరీ దేవత  ఉంటుంది.
ఈ దేవతకున్న 6 చేతులలో 1. చెరకు విల్లు, 2. పుష్పబాణాలు 3. పాశము 4. అంకుశము 5. తేనెతో నింపిన బంగారుపాత్ర 6. వరముద్రను కల్గి ఉండి...  ముంజేతికి, మెడకు, నడుముకు విశేష రీతిలో స్వర్ణాభరణాలని ధరించి భక్తులకు అనుగ్రహం ఇచ్చే రీతిలో సిద్ధంగా ఉంటుంది కామేశ్వరీ మాత.
ఖగోళంలో సూర్యుడు, చంద్రుడు ఒకే డిగ్రీలోనికి వచ్చినప్పుడు ఏర్పడే తిథిని అమావాస్య అంటారు. భూ చలనం వలన సూర్య చంద్రుల మధ్య దూరం పెరుగుతున్న కారణంగా, సూర్య కాంతి చంద్రునిపై పడి నెలవంకతో ప్రారంభమై, దిన దిన ప్రవర్ధమానంగా చంద్రుడు ప్రకాశిస్తూ పూర్ణిమ రోజున సూర్యునికి ఎదురుగా చంద్రుడు ఉంటాడు. ఈ పూర్ణిమ వరకు 15 తిధులు జరగాలి. ఈ 15 తిధులకు ఉన్న నిత్య దేవతల చేతుల సంఖ్యను కలిపితే 108 వచ్చును. ఈ 108 కిరణాలతో (చేతులతో ) త్రిభుజంలో ఉన్న శ్రీ శివ శక్తుల వైభవం బ్రహ్మాండ రీతిలో ఉంటుంది.

కాబట్టి ప్రతి నెలలో వచ్ఛే ఈ తిధి సమయాలలో సాయంత్ర సమయంలో శ్రీలలితా పరమేశ్వరిని ధ్యానిస్తూ, ఆ పరమేశ్వరిలోనే పైన చెప్పిన కామేశ్వరీ రూపు రేఖలను భావించుకుంటూ... 8 అక్షరాలతో ఉన్న శ్రీ లలితా సహస్రంలోని 16 నామాలను పఠిస్తూ .. 16 ఉపచారాలుగా అందించటం శ్రేయస్కరం. ఇక సహజంగానే సంకల్పం చెప్పుకోవటం అనేది పూజ కార్యక్రమంలో ప్రధమంగా ఉండే అంశము. మనమెవరో, మన గోత్రమేమిటో అన్నీ ఆ తల్లికి తెలుసు. ఇట్టి స్థితిలో తిరిగి సంకల్పము అనవసరం.  మనకు బదులుగా, మనకొరకుగా మరొక వ్యక్తి దేవిని ప్రార్ధించే సమయంలోనే సంకల్పం అవసరము.
సంకల్పం చెప్పుకోవాలని ఉత్సాహం ఉన్నవారు చెప్పుకొనవచ్చును.  అంతేగాని ఎవరికి  వారు సంకల్పాలపైనా, అంగన్యాస కరన్యాసాల పైన దృష్టి ఉంచకుండా ఒక్కొక్క నామాన్ని పఠిస్తూ 16 ఉపచారాలను చేయటానికి ప్రయత్నించండి. ఉపచారాలు చేయలేకపోయిననూ కనీసం 16 నామాలను మానసిక పూజతో భక్తి విశ్వాసాలతో పఠించండి.

నివేదనగా మీకు నచ్చిన ఏ పదార్ధమైన సమర్పించండి. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ 16 నామాలను పఠించే సమయంలో కామేశ్వరీ రూపాన్ని మనసులో ధ్యానించండి.

సంపద, సంతోషాల కొరకు, మానసిక శాంతికొరకు, కుటుంబ సఖ్యత అభివృద్ధి దిశలో ఉండుటకు, సమంజసమైన కోరికలను తీర్చుటకు కామేశ్వరి దేవత వరముద్రతో అనుగ్రహించటానికి ప్రతి పాడ్యమి, ప్రతి అమావాస్య తిధి సమయాలలో సిద్ధంగా ఉంటుంది.

చివరగా మహతీ యోగం ఏర్పడుతున్న కారణంగా దీపావళి అమావాస్య సాయంత్రం సూర్యుడు అస్తమించిన తదుపరి నుంచి తొలి 2 గంటలలోనే దీపారాధనతో ధ్యానించండి. (వత్తుల సంఖ్య, వెలిగించటానికి తోడ్పడే తైలాల గురించి అనసవసర సందేహాలకు వెళ్ళవద్దు). ఈ కామేశ్వరీ తల్లి చంద్ర కళలతో  కూడిన  నిత్య తిధి దేవత. చంద్రుడు మనసుకు కారకుడు. ఈ మనస్సుతో  ప్రధానంగా చేసే పూజా కార్యక్రమమే ఇది.

ఈ దిగువ ఇచ్చిన వీడియోలో కామేశ్వరీ దేవతను దర్శించి నామాలను తెలుసుకొని ప్రయత్నించండి.
దీపావళి తర్వాత రోజు శుక్ల పాడ్యమి కనుక ఆనాటి దేవత కూడా కామేశ్వరే. కనుక ఇవే నామాలు తరువాత రోజుకి కూడా వర్తిస్తాయి.   




గమనిక -
మహతీ యోగం రోజులలోనే కాకుండా, భవిష్య కాలంలో వచ్చే పాడ్యమి, అమావాస్య తిథులలో కూడా ఆరాధించవచ్చును. అంతేకాదండోయ్ సూర్యోదయం తర్వాత మొదటి రెండు గంటలలో కనపడే శ్రీ సూర్యనారాయణ మూర్తిని కనులు మూసుకొని వీక్షిస్తూ, ఈ కామేశ్వరీ దేవతా రూపాన్ని తలుచుకుంటూ ఆ 16 నామాలను పఠించటం సర్వదా శ్రేయస్కరం. (నామాలు కంఠస్థం వచ్చినప్పుడు మాత్రమే ఈ పని చేయండి. )

తదుపరి పోస్టింగ్లో శుక్ల విదియకు సంబంధించిన భగమాలిని దేవత గురించి తెలుసుకుందాం. - దైవజ్ఞ పొన్నలూరి  శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.