Saturday, October 29, 2016

మహతీ యోగ సిద్ధికి లలితా సహస్ర అతి రహస్యనామాలు

శ్రీ లలితా సహస్రనామాలలో 8 అక్షరాలతో వచ్చే నామాలు 240 ఉన్నాయి. ఇవి అతి రహస్య నామాలు. ఈ 8 సంఖ్యకు చాలా విశేష ప్రాధాన్యం ఉన్నది. ఈ  ప్రాధాన్యత చెప్పుకునేముందు తిధి దేవతలను గురించి చర్చించుకుందాం. శుక్ల పక్ష పాడ్యమి నుంచి దేవి కళ ప్రారంభమై కామేశ్వరీ, భగమాలినీ, నిత్యక్లిన్నా, భేరుండా, వహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, శివదూతీ, త్వరితా, కులసుందరీ, నిత్యా, నీలాపతాకా, విజయా, సర్వమంగళా, జ్వాలామాలినీ, చిత్రా అనే 15 నిత్యదేవతలు పూర్ణిమ వరకు ఆరాధించబడుదురు. 

అలాగే కృష్ణ పక్షంలో వెనుకనుంచి వరుసగా చిత్రా, జ్వాలామాలినీ, సర్వమంగళా, విజయా, నీలాపతాకా, నిత్యా, కులసుందరీ, త్వరితా, శివదూతీ, మహావజ్రేశ్వరీ, వహ్నివాసినీ, భేరుండా, నిత్యక్లిన్నా, భగమాలినీ, కామేశ్వరీ అనే విధంగా చంద్రకళలు నిత్య తిధి దేవతలుగా ఉంటారు. శుక్ల పక్షంలో వచ్చే 15 దేవతలలో 8వ (శుక్ల అష్టమికి) నిత్యా దేవత త్వరితా. అలాగే కృష్ణ పక్షంలో 8వ (బహుళ అష్టమికి) నిత్యా దేవత కూడా త్వరితే. మిగిలిన అన్ని తిధులకు వేరు వేరు నిత్యా దేవతలు ఉంటారు. కానీ శుక్ల అష్టమి, బహుళ అష్టమి తిథులలో మాత్రం త్వరితా అనే నిత్యా దేవత మాత్రమే ఉండును. అనగా అష్టమి తిధి నాడు తిధి దేవత మారదు. 

అందుకే "అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా" అను శ్రీ లలితా సహస్ర నామావళిలోని 15వ నామంలో 8 వ తిధి అయిన అష్టమినాడు ప్రకాశించు చంద్రుని కళవలె ప్రకాశించు తల్లి అని భావము. శుక్ల పక్షము లోని పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు నిత్యం చంద్రుడు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాడు. కృష్ణ పక్షంలోని బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు క్రమ క్రమంగా చంద్రుడు క్షీణిస్తూ ఉండటం అందరికీ తెలిసిందే. శుక్ల అష్టమి, బహుళ అష్టమి రోజులలో మాత్రం చంద్రుడు ఒకే సైజు లోనే ఉండటం విశేషం. ఈ 8వ చంద్రకళకు విశేష ప్రాధాన్యత ఉన్నది . 

ఎనిమిది (అష్టమి అంటే ) అనగానే చాలా మంది భయపడతారు. మత్స్య పురాణంలో "లక్ష్మీర్మేధా ధరా పుష్టిః గౌరీ తుష్టిః ప్రభా ధృతిః ఏతాభిః పాహి తనుభి రష్ఠాభిర్మాం సరస్వతీ" అని సరస్వతి 8 విధములైన ప్రాణస్వరూపిణిగా చెప్పబడింది. "ప్రాణశక్తి సరస్వతి" అని వేదం చెప్పింది. ఈ ప్రాణశక్తి ప్రపంచమంతా వ్యాపించి 8 విధాలుగా మనల్ని రక్షిస్తున్నది.

సరస్వతి శబ్దానికి ప్రవాహము కలది అని కూడా అర్ధము కలదు .శరీరంలో ఈ ప్రవాహ లక్షణము ప్రతి అణువు నందు ప్రసరిస్తుంటుంది. ఇట్టి ప్రాణ స్వరూపిణిగా ఉన్న అష్టమూర్తిత్వములో లక్ష్మీ అనగా ఐశ్వర్యము, సంపద.. మేధా అనగా బుద్ధి.. ధరా అంటే ధరించునది అనగా భూమి.. పుష్టి అంటే ఇంద్రియాలకు కావలసిన శక్తి.. గౌరీ అనగా వాక్స్వరూపిణి, తుష్టి అంటే తృప్తి, ప్రభా అనగా వెలుగు, ధృతి అనగా ధైర్యమని అర్ధము. ఈ 8 శక్తులు మానవులకు సహకరించి రక్షిస్తుంటాయి.

అలాగే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, మహాలక్ష్మి అనబడే అష్టమాతృక దేవతలు కూడా ఉన్నారు. కామాక్షి దేవిని కూడా ధరణీమయీ, భరణీమయీ, పవనమయీ, గగనమయీ, దహనమయీ, హవనమయీ, అంబుమయీ, ఇందుమయీ అనే 8 రూపాలలో ప్రార్దిస్తుంటాము. 


ఇక ఆదిశంకరులు దక్షిణామూర్తి స్తోత్రంలో భవ, శర్వ, ఈశాన, పశుపతి, రుద్ర, ఉగ్ర, భీమ, మహాదేవ అనే 8 పేర్లను అష్టమూర్తులుగా తెలియచేశారు. ఇక ఈ అష్టమూర్తులకు చెందిన శక్తి అమ్మవారులే భవాని, శర్వాణి, ఈశాని, పశుపాశవిమోచనీ, రుద్రాణీ, ఉగ్రాణి, మహాదేవీ అను 8 శివుని యొక్క శక్తులు. కనుక ఈ 8 అంకెలో ఉన్నదంతా శక్తి స్వరూపిణి అయినా జగన్మాతే.
కాబట్టి 8 అంకెలో ఉన్న జగన్మాత శక్తి స్వరూప అతి రహస్య నామాలు శ్రీ లలితా సహస్రనామావళిలో 240 ఉన్నాయి. ఈ 240 నామాలు ఒక్కొక్కటి 8 అక్షరాలతోనే ఉంటాయి. ఒక పక్షానికి 15 తిధులు. మొత్తం 240 నామాలను 15 తిధులకు విభజించగా, ఒక్కొక్క తిధికి 16 నామాలు వస్తాయి. ఈ పరంపరలో శ్రీ చక్ర 8వ ఆవరణను సర్వసిద్ధిప్రదా చక్రము అంటారు. ఇది త్రిభుజాకారాంలో  ఉంటుంది. ఒక్కోభుజానికి 5మంది దేవతలు (తిధి దేవతలు) చొప్పున మూడు భుజాలకి 15 మంది నిత్య తిధి దేవతలు ఉంటారు.

ఒక్కో దేవతకు 16 నామాలు చొప్పున పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 240 నామాలు సరిపోతాయి. అలాగే బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు తిరిగి ఇవే నామాలు పునరావృతం అవుతాయి. అయితే శ్రీ లలితా సహస్రంలోని 240 నామాలు ఏ ఏ తిధి దేవతలకు ఏ విధంగా వుంటాయో తెలుసుకుందాం.

కామేశ్వరీ - శుక్ల పాడ్యమి , అమావాస్య తిధులకు దేవత
భగమాలినీ - శుక్ల విదియ, బహుళ చతుర్దశి తిధులకు దేవత
నిత్యక్లిన్నా - శుక్ల తదియ, బహుళ త్రయోదశి తిధులకు దేవత
భేరుండా - శుక్ల చవితి, బహుళ ద్వాదశి తిధులకు దేవత
వహ్నివాసినీ - శుక్ల పంచమి, బహుళ ఏకాదశి  తిధులకు దేవత
మహావజ్రేశ్వరీ - శుక్ల షష్టి, బహుళ దశమి తిధులకు దేవత
శివదూతీ - శుక్ల సప్తమి, బహుళ నవమి తిధులకు దేవత
త్వరితా - శుక్ల అష్టమి, బహుళ అష్టమి తిధులకు దేవత
కులసుందరీ - శుక్ల నవమి, బహుళ సప్తమి తిధులకు దేవత
నిత్యా - శుక్ల దశమి, బహుళ షష్టి తిధులకు దేవత
నీలాపతాకా - శుక్ల ఏకాదశి, బహుళ పంచమి తిధులకు దేవత
విజయా - శుక్ల ద్వాదశి, బహుళ చవితి తిధులకు దేవత
సర్వమంగళా - శుక్ల త్రయోదశి, బహుళ తదియ తిధులకు దేవత
జ్వాలామాలినీ - శుక్ల చతుర్దశి, బహుళ విదియ తిధులకు దేవత
చిత్రా - పూర్ణిమ, బహుళ పాడ్యమి తిధులకు దేవత

పై విధంగా ఒక్కోదేవతకు రెండు తిధులు ఉంటాయి. ఈ నేపథ్యంలో మహతీ యోగ సందర్భంగా ఈ ఆశ్వయిజ అమావాస్య దీపావళి రోజున మరియు రెండవ రోజు శుక్ల పాడ్యమి రోజున కామేశ్వరీ దేవతే ఉంటుంది. కనుక ఈ కామేశ్వరీ దేవతకు సంబంధించిన 16 అతిరహస్య నామాలను దిగువున ఇవ్వటమైనది. ప్రతి నామానికి ముందు ఓం అని, చివరన నమః అని కలుపుకోవాలి. ఇలా కలిపే సందర్భాలలో నామము 8 అక్షరాలు అయినప్పటికీ సంధితో ఉన్నందున 9 అక్షరాలుగా ఒక్కోసారి కనపడతాయి. కానీ అవి 8 అక్షరాలే అని గమనించాలి.



కనుక దీపావళి అమావాస్య సాయంత్ర సమయంలో కామేశ్వరీ దేవతను 16 నామాలతో ఎలా ప్రార్ధించాలి, కామేశ్వరీ దేవతా స్వరూపం ఎలా ఉంటుంది అనే వివరాలను మరికొద్ది గంటలలో వుంచబోయే తదుపరి పోస్టింగ్లో తెలియచేస్తాను. మీ బంధు, మిత్రాదులందరికీ ఈ మహతీ యోగ వివరాలను గురించి తెలియచేయండి. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.