Friday, March 19, 2010

శ్రీ వికృతి నామ సంవత్సర లఘు ఫలితాలు - 2

ఆహారధాన్యాల దిగుబడులలో క్రమబద్దీకరణ ఉందును. సాఫ్ట్వేర్ రంగానికి స్వల్పంగా ఆశలు చిగురించును. శాహిత్య, విద్య, వైద్య, సినీ రంగాలు ప్రాధాన్యతను సంతరించుకున్నప్పటికీ, ప్రజలు మరువలేని బాధలు సినిమా రంగంలో ఏర్పడు సూచనుంది. వేద, పురాణ, ఉపనిషత్తులకు చక్కని ప్రాధాన్యత కలగే రీతిలో పరిస్థితులు ఉపకరించును.

6 జూన్ ఆదివారం నుంచి 13 ఆదివారం లోపల తొలకరికి అవకాశములేర్పడును. తొలకరి ప్రారంభమైనప్పటికీ నైరుతి ఋతుపవనాలు ప్రజలకు ఆలస్యంగానే పూర్తి ఆశలు చిగురించును.

ఉత్తర భారతంలో వర్షములధికమై నదులు పొంగి ప్రవహించును. మన రాష్ట్రంలో కరువు రాజ్యమేలుతుండును. ఆంధ్రప్రదేశ్లో రైతాంగం తుఫాను కోసం పరితపించే రీతిలో పరిస్థితులు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. వికృతి లో ఋతుధర్మానికి వ్యతిరేకంగా వర్షములున్నందున పంటలు ఆలశ్యంగా ఇంటికి చేరును. మినుములు, నువ్వులు, పెసలు పుష్కలంగా పండును. మిరప ఆటుపోట్లకు గురికాగలదు. దక్షిణాయనంలో యందు మిర్చికి అధిక ధరలుండును.

జూలై, ఆగష్టు నెలలలో అధిక ధరలకు కొంత కళ్ళెం పడును. మత్తు పానీయాల తయారీలోనూ, బెల్లం పరిశ్రమపైననూ నిబంధనలు విధించు అవకాశాములున్నవి. టోకు వర్తకులు ప్రజల నుంచి ధాన్యాలను కొనుగోలు చేసి స్వార్ధచిత్తంతో నిల్వవుంచి తద్వారా అధిక రేట్లతో వినియోగదారులను పలు సమస్యలకు గురిచేయుదురు. శుభకార్యాల పరంపరలో బంగారు వినియోగం తగ్గుముఖం చెందును. బంగారు బిస్కెట్ల కుంభకోణం ఆలశ్యంగా వెలుగు చూసే అవకాశముంది. కాస్మోటిక్స్ వ్యాపారాలత్ ప్రజలు మోసపోవుదురు. స్టాక్ మార్కెట్ అనేకమార్లు మదుపరులను నష్టాలబాటలో పయనింపజేయును. నేర ప్రపంచంతో ప్రజలందరూ భీతిల్లుతుందురు.


ఏప్రిల్ 14 నుంచే ఏర్పడే కుంభమేళా పవిత్రామావాస్యపై ఉగ్రవాదుల దుష్టచర్యలు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ప్రభుత్వాలు చేయాల్సి ఉండటమేకాక, ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలతో ప్రజల రక్షణకు బాసటగా నిలవాల్సిన అవసరం వుంది. 2010 లో రాజధాని ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలకు వచ్చే క్రీడాకారులతో సమస్యలు రాగల అవకాశం వుంది. ప్రభుత్వం ముందు చూపుగా చర్యలు గైకోనేది. లేనిచో సమస్య జటిలమగును.


భారత్, పాక్ సరిహద్దులలో స్వల్పంగా కాల్పులు ఉందునేగానీ యుద్ధం రాదు. అయిననూ పాకిస్తాన్ నుంచి ఘర్షణ ఎక్కువగా ఉండును. బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్,భారత్లలో కారుబామ్బులు అధికమగును. అమెరికా, బ్రిటన్ దేశాలపై రసాయన ఆయుధాలతో సరిక్రొత్త పోకడలతో గురిపెట్టు సూచన వుంది. పాలస్తీనాలో శాంతి మార్గం కరువగును. చైనాకు చెందినా ఓ మత ధర్మాచార్యుని పెత్తనం శ్రుతిమించుతుంది. భారత్ చైనాల మధ్య ఈ ధర్మాచార్యుతో వివాదాలు వచ్చి నష్టంవాటిల్లే సూచనుంది. నేపాల్లో మావోయిష్టు మారణకాండ శ్రుతిమించును.


శ్రీ విరోధిలో దక్షిణాయనం ప్రారంభమైన 7 వరోజునే సంపూర్ణ సూర్యగ్రహణం గోచరించగా, శ్రీ విక్రుతిలో ఆదివారం అమావాస్య సంపూర్ణ సూర్యగ్రహణం జరిగిన 7 వరోజునే దక్షిణాయనం ప్రారంభమవుతున్నది. విక్రుతిలో 2 సార్లు, ఒకే చాంద్రమాన మాసంలో పూర్ణిమ,అమావాస్యకు సంపూర్ణ సూర్యగ్రహణం - మార్గాశిరంలో పూర్ణిమకు సంపూర్ణ చంద్రగ్రహణం, అమావాస్యకు పాక్షిక సూర్యగ్రహణం జరగనున్నవి. ఈ నాల్గు గ్రహణాలు దనూ, మిధున రాశులలో సంభవించనున్నవి. మార్గాశిరంలో సంభవించనున్న పూర్ణిమ, అమావాస్య గ్రహణాలు రెండూనూ మంగళవారాలే వస్తూ, రెండూ గ్రహణాల మధ్యన ధనుస్సు రాశిలో కుజ, రాహువుల కలయిక జరుగుచూ, కన్యారాశి నుంచి ధనస్సువరకు 4 రాశులలో సప్తగ్రహ ఆచ్చాదన ఉండటంచే ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలకు హేతువగుచున్నది.


జూన్ 5 శనివారం నుంచి 12 శనివారం వరకు, జూన్ 22 మంగళవారం నుంచి 29 మంగళవారం వరకు, జూలై 6 మంగలవ్చారం నుంచి 13 మంగళవారం వరకు ప్రకృతి వైపరిత్యములు జరుగు అవకాశాములున్నవి. సముద్ర సంబంధ కంపనములు అధికముగా ఉండును. సముద్ర కెరటములు విపరీతముగా ఎగిసిపడే సూచనున్నందున, జాలర్లు, విహార యాత్రికులు సముద్ర చెంతకు వెళ్ళవద్దని సలహా ఇవ్వటమైనది.


27 జూలై 2010 మంగళవారం నుంచి 3 ఆగస్టు మంగళవారం వరకు 8 రోజులు ప్రపంచ ప్రజలు అప్రమత్తులై వుండాలి. వైమానిక సంబంధంగా, రాజకీయ సంబంధంగా, ప్రకృతి వైపరీత్యా సంబంధంగా, ఉగ్రవాద సంబంధంగా, సమస్య ఏదైననూ ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లలో ఉండాల్సిన అవసరముందని తెలియజేస్తున్నాను.


2010 నవంబర్ 10 నుంచి 20 వరకు పలుచోట్ల ప్రేలుడు పదార్ధాలను విస్పోటనాలకు ఉపయోగించగా, ప్రేలకుండా ఉన్నవాటిని కనుగొను సూచన. 2010 డిశెంబర్ 16 గురువారం నుంచి 23గురువారం వరకు ధనస్సులో రవి, బుధ, రాహు, కుజులు చాతుర్గః కూతమిచే తూర్పు ఆశియా, ఫసిఫిక్, యూరప్ మరియు భారత్ కు ఈశాన్య ప్రాంతాలలో భూ మరియు సముద్ర కంపనముల తీవ్రత వున్నది. 2010 జనవరి 3,4,5 తేదీలలో ధనస్సులో రాహు, కుజ, బుధ, చంద్రుల చాతుర్గ్రహ కూతమిచే ప్రకృతి వైపరిత్యములకు తావు కలదు. ప్రజలు భయపడవలసిన అవసరం లేదు.


నవమేఘ నిర్ణయానుసారం పుష్కర నామమేఘం మేరు పర్వతమునకు ఈశాన్య భాగంలో ఉద్భవించుటచే, ఈ సంవత్సరంలో 2 భాగములు వర్షము, 4 భాగములు గాలి ఉండును. సముద్రములపై 10 భాగముల వర్షము, పర్వతములపై 7 భాగముల వర్షము, భూమిపై కేవలం 2 భాగములే వర్షించును. అందుచేత ఆంధ్రరాష్టంలోని ప్రతి గ్రామ శివాలయాలలో ధూప, దీప, నైవేద్య, కర్పూర హారతులను, సక్రమముగా చేయులాగున ప్రతి ఒక్కరూ పాటుపడేది. అంతేకాక పుష్యమి, ఆశ్లేష, ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములు పూర్తిగా వున్న సమయములలోనే వరుణ సంబంధ జపములుగానీ, యాగములుగానీ చేయులాగున ప్రయత్నించేది. భూమిపై 2 భాగములే వర్షమున్నదని పంచాంగాలలో వుంటే వరుణయాగాలు చేస్తే వర్షం పెరుగుతుందా? అనే ఆలోచనలో ఎంతోమంది ఉండవచ్చు. ఆ 2 భాగాల వర్షమే... స్వల్ప, స్వల్పంగా సంవత్సరమంతా వర్షించకుండా... అన్నదాతకు అవసరమైన సమయంలోనే వర్షిస్తే .... చాలు. ఇందుకోసమే ఋతుధర్మానుసారం వర్షించాలనే విశ్వాసంతో వరుణ సంబంధ జపాలు, యాగాలను దక్షిణ సంబంధ ఫలాపేక్ష లేకుండా చేసేది.


ప్రజలందరూ యజ్ఞయాగాది శాంతి క్రతువులు ఆచరిస్తూ, ఎనలేని సంయనంతో, ఓర్పుతో, మానవతాదృష్టితో ఉండాలని భగవంతుని కోరుకుంటూ.. సర్వేజనా సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు ... శ్రీనివాస గార్గేయ



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.