శ్వేతవరాహకల్పము నందలి ఏడవదైన వైవస్వత మన్వంతరము నందలి 28వ మహా యుగములోని కలియుగ ప్రధమ పాదములో 5111 వది, ప్రభవాది 60 సంవత్సరములలో 24 దైన, ఈ సంవత్సరమునకు చాంద్రమానముచే " శ్రీ వికృతి " నామ సంవత్సరమని పేరు. త్వష్ట్ర ( విశ్వకర్మ ) దేవతాధీన పంచయుగాంతర్గత, ' ప్రజాపతి' దేవతాధీన 'అనువత్సర'మను నాల్గవదే శ్రీ వికృతి .
శ్లో : వికృతౌ ప్రకృతిర్యాతి వికృతిం వికృతి స్తథా
తథాపిమోదతేలోక శ్చాస్మి వికృతివత్సరే
శ్రీ వికృతి సంవత్సరంలో ప్రకృతి వికృతి అగును. వికృతి ప్రకృతి అగును. అయిననూ ప్రజలు సంతోషంతో వుండురని భావము. ఋతుధర్మాలకు వ్యతిరేకంగా స్థితిగతులు ఉండగలవని యోచించాలి. శ్రీ వికృతి సంవత్సరంలో రాజ్యాధిపత్యము, సేనాధిపత్యము, అర్ఘాదిపత్యము, మేఘాదిపత్యమను నాలుగు ఆదిపత్యములు కుజ గ్రహానికి రాగా, మంత్రిత్వము బుధ గ్రహానికి, దాన్యాదిపత్యము గురు గ్రహానికి, సస్య, నీరసాదిపత్యములు శుక్ర గ్రహానికి, రాసాదిపత్యము సూర్యునికి వచ్చి ఈ ఖగోళ రాజ్యాన్ని పాలించుటకు సంవత్సరాది నుండి కుజ, బుధ, గురు, శుక్ర, రావులు సంసిద్ధులగుచున్నారు. శని గ్రహం మరియు చంద్రులకు ఏఒక్క ఆధిపత్యము లభించలేదు.
గ్రహస్థితులను పరిశీలించగా అధిక వైశాఖ మాసముతో 384రోజులు జరిగే శ్రీ వికృతి సంవత్సరానికి రాజు కుజుడు. సంవత్సర ప్రారంభంలోనే నీచ సంచారంతో 72రోజులు, కార్తిక మాసం నుంచి అస్తమయ స్థితిలో 132రోజులు, కన్యా రాశిలో శత్రుగ్రహ శనితో సంఘర్షణ 43 రోజులు పోగా,రాజైన కుజునకు వికృతి సంవత్సర పరిపాలనకు అర్హత కలిగిన రోజులు కేవలం 137మాత్రమె. గణాంకాలు ఇలా వుంటే రాజ్యాదిపత్యం కైవసం చేసుకొన్న రోజు నుంచే శత్రుగ్రహ నక్షత్రమైన పుష్యమిలో కుజుడు ఉండి, సంవత్సరాంతంలో కూడా శత్రుగ్రహ నక్షత్రమైన ఉత్తరాభాద్రలో సంచారం చేయటం గమనార్హం.శత్రు నక్షత్రంలో నీచ స్థితిలో పదవిని అలంకరించి, మధ్యలో శత్రువుతోనే పోరాడి, అధిక కాలం అస్తమయదశలో శత్రు నక్షత్రంతోనే సంవత్సరం ముగియటం అనేది అరుదుగా జరిగే గ్రహస్థితి.
వికృతి సంవత్సర రాజు కుజుని పరిపాలనచే రాష్ట్రాల నడుమ, దేశాల నడుమ విరోధాలు అధికమగును. వింత రోగాలు ప్రబలి, అగ్నిభయములుండి, వ్యవసాయ రంగం తిరోగామనములో ఉంటూ ఉగ్రవాద చర్యలు మితిమీరుతూ అధిక ప్రాంతాలలో అనావృష్టి రాజ్యమేలుతూ, ఋతుధర్మ మార్పులతో ప్రజలకు అసౌకర్యముంటూ ప్రజలు భయపడే అవకాశం వుంది.
నిజ నేరస్తులు రాజాలుగా పల్లకిలో ఊరేగుదురు. హోంశాఖ ఉన్నతాధికారులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేయుదురు. దేశ వ్యాప్త సచివాలయాలలో అవినీతిమయముతో లొసుగులు ఏర్పడి పాలకుల గుట్టురట్టగును. ప్రజల అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి సమన్వయపాత్ర పోషించే ప్రసార మాద్యమాలపై దాడులు జరిగే అవకాసం కలదు. ప్రభత్వ ప్రజాకర్షక పధకాలు సక్రమంగా ప్రజలకు అందనందున సరిక్రొత్త ప్రభువుల కొరకు ప్రజలందరూ వెంపర్లాడుతుండురు.
పాలకులు దైర్య సాహసాలతో పరిపాలన పరమైన నిర్ణయాలను తీసుకోనలేరు. రాజకీయ అస్తిరతలు యేర్పడును. పరిపాలనలో బుద్ధిబలమును ఉపయోగించిననూ శత్రువులను పాలకులు ఎడుర్కొనలేరు. దేశ వ్యాప్త రాజకీయాలలో స్త్రీలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు వాటిల్లే అవకాశము వున్నది. భారీ వ్యాపార రంగములు అనుకోకుండా ఆటుపోటులను ఎదుర్కొనటంతో, దాని ప్రభావంతో కొన్ని రాష్ట్రాల భవితవ్యం బీటలువారును.
తరువాయి భాగం మరు పోస్టింగ్ లో
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.