Saturday, June 6, 2009

ముందుమాట

అసంఖ్యాకమైన మేధావులకు భరతభూమి పుట్టినిల్లు. మన హైందవ ప్రాచీన మేధావుల గురించి చెప్పుకోవడం మొదలు పెడితే, అది తరిగే విషయం కాదు. మహా ఋషులే ప్రాచీనకాలం లోని శాస్త్రవేత్తలు. జగమెరిగిన పురాణ ప్రసిద్ధులు అనేకమంది వున్నారు. ప్రాచీన మహర్షులు ఏకాగ్రతతో తపస్సులు చేస్తూ, మనోనిశ్చలత, వాక్సుద్ధి, దివ్యదృష్టి వంటి అద్భుత శక్తులను సంపాదించేవారు. తాము సాధించిన శక్తితో సృష్టి, ప్రకృతిల గురించి తెలియజేస్తూ, ఎంతో శాస్త్రీయ పరిజ్ఞానం వున్న వేదాలను వ్రాసుకొచ్చారు. యజ్ఞ యాగాలనే ప్రయోగాలతో ప్రకృతి శక్తులను కైవసం చేసుకోవడం తెలుసుకున్నారు. దుష్టులను సంహరించటానికి అస్త్రాలను కూడా రూపొందించారు. లోక కళ్యాణానికి ఎన్నో - ఎన్నెన్నో మార్గాలను చూపించారు.విశ్వం స్వరూప స్వభావాలను గురించి, ప్రకృతి శక్తుల గురించి వేద ఋషులు స్పష్టాతి స్పష్టమైన సిద్ధాంతాలను మనకు అందించారు. గ్రహగతులకు మానవుని భవిష్యత్తుకు అవినాభావ సంభంధం ఉన్నదని మూడువంతుల ఖగోళ విజ్ఞానమును ఋగ్వేదంలో వుంచారు.

దీన్ని బట్టి వేద ఋషుల యొక్క ఖగోళశాస్త్ర పరిజ్ఞానం ఎంత అపారమైనదో తెలుస్తుంది. నక్షత్ర సమూహాలైన గెలాక్సీ గురించి, రాశిచక్రాన్ని గురించి, విషువత్తుల గురించి, ధ్రువతార మార్పులను గురించి, సౌరశక్తిని గురించి, గ్రహాల గురించి, భూమి వర్ణన...దాని చలానాలను గురించి, ఉత్తరద్రువం, ఋతువుల గూర్చి... ఇలా... ఎన్నో... ఎన్నెన్నో అంతరిక్ష ఖగోళ విజ్ఞానాంశాలు నిండిన గ్రంధమే ఋగ్వేదం. పైన తెల్పిన విశేషాలపై ఆధారపడే జ్యోతిష్యశాస్త్రం పుట్టింది. జ్యోతిషం కోసం గ్రహగతులను లెక్కించాలి. కనుక జ్యోతిషంతో పాటు గణితం కూడా చెట్టాపట్టాలు వేసుకొని పెరిగింది. అటు జ్యోతిషంలోను ఇటు గణితం లోను ఆరితేరిన మేదావులైన పరాశరుడు, ఆర్యభట్ట, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు లాంటివారు అతి ప్రాచీన కాలంలోనే తమ శాస్త్రీయ పరిజ్ఞానంతో మన హిందూ జాతిని ముందుకు నడిపించిన మేధావులు. ఇట్టివారిని మనం మననం చేసుకుంటూ, నిత్యం నమస్కరించుకోవాలి.

ఇందుచే వేద పురుషుని చక్షువుగా జ్యోతిశ్శాస్త్రం గుర్తింపబడినది. ఆకాశంలో కనపడే సూర్యచంద్రులు, నక్షత్రములు, గ్రహములు మొదలైన వాటిని మానవుడు పరికిస్తూ, కాలగమనంలో క్రమం తప్పకుండా వస్తున్న మార్పులను జ్యోతిష శాస్త్రం ద్వారా గమనించటం జరుగుతుంది.గనుక ప్రకృతిలోని సమస్తవస్తు జాలముల సృష్టి స్థితి లయములకు కాలమే హేతువవుతోంది. ఈ కాలమును అతిక్రమించుట ఎవ్వరికీ సాధ్యము కాదు. దేవతలు, రాక్షసులు, రాజులు, ప్రజలు, జంతువులు, సర్వప్రాణులు కాలవశముననే జనించుట, నశించుట జరుగుతుంది. ప్రాచీన మహర్షులు కాలమునకు రూపం కల్పించి కాలపురుషునిగా గ్రహించారు. ఇందులో కొన్ని సమయములు కొన్ని సంఘటనలకు కారణములుగా చెప్పబడతాయి. ఈ సంఘటనలు గ్రహప్రభావములచే అకస్మాత్తుగా కొత్త మార్గం లో ప్రయాణిస్తాయి. నిర్ణయాత్మకమైన మార్పులచే మానవుని సాంఘిక జీవితలో వివిధ రకాలుగా ప్రయోజనాన్ని కల్గించే శాస్త్రాలలో అత్యంత ప్రాధాన్యత కల్గిన శాస్త్రముగా జ్యోతిష్యశాస్త్రం నిలబడిపోయింది.

మానవుని అవసరాలకు, కోరికలకు జ్యోతిష్యపరమైన విచారణకు, పరిశీలనకు ఎల్లప్పుడూ ప్రేరేపణ శక్తులుగా వుంటున్నాయి. ఈ కారణములే మానవుని జీవితంలో విభిన్న సందర్భాలలో ఏర్పడే ఘటనలకు జ్యోతిష ఫల శాస్త్రమునకు గల అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. ఈ శాస్త్రముననుసరించే జీవితంలోని సంఘటలను వీలైనంత ఖచ్చితంగానే చెప్పవచ్చును. 19 వ శతాబ్ది ఉత్తరభాగము నాటికి మానవుని జనన కాలమును ఖచ్చితంగా నమోదు చేయుటకు ప్రామాణిక గడియారాలు లేకపోవడం, అత్యల్ప సంఖ్యలోనే విధ్యావంతులున్డటం, సక్రమమైన గణితాలతో పంచాంగాలు అందుబాటులో లేకపోవడమనే ముఖ్య లోపాలు వుండేవి. 20 వ శతాబ్ది మధ్యభాగం నాటికి ఇవన్నీ పూర్తిగా సమకూరడంతో జ్యోతిషరంగం ప్రపంచ ప్రజల సమస్యలకు ధీటుగా జవాబు చెప్పగల స్థాయిలో ఉందనుటలో సందేహంలేదు.

మహాపుణ్య ప్రదంగా, ప్రత్యక్ష నిదర్శనంచే రహస్యమైనదిగా సూర్యచంద్రుల సాక్షులు కల్గినదిగా, వేదములచే ప్రభోదించ బడినదిగా, శ్రౌత స్మార్తాదిగా అన్ని కార్యములకు ఉపయుక్తమైనదిగా, కాలాన్ని సూచించునది, మానవునికి జన్మకర్మల ప్రకారము ప్రాప్తించే శుభాశుభ ఫల నిర్ణయం చేయునదైన ఈ జ్యోతిష్య శాస్త్రం ద్వారా భవిష్య ఫలితాలను, అనేక పురాణ ఇతిహాస సారాంశాలను, ధర్మ సందేహాలకు సమాధానాలను, రాబోయే గ్రహ సంచార స్థితి గతులను సకాలంలో సకుటుంబ సపరివార సమేతంగా సందర్శించటానికై సనాతన సంప్రదాయ సమాచార సంగ్రహాన్ని సగర్వంగా మీకు అందించనుంది మా " గ్రహభూమి ". క్రమం తప్పక సందర్శకులు ఆసక్తితో చదవగలరని ఆశిస్తూ

- దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.