Thursday, October 22, 2015

14 రోజుల పాటు శుభగ్రహ దర్శనాలు

అక్టోబర్ 25 ఆదివారం నుంచి నవంబర్ 7 శనివారం వరకు 14 రోజుల పాటు... ప్రతి నిత్యం తూర్పు దిశలో సూర్యోదయానికి 2గంటల ముందు నుంచి శుభ గ్రహాలను దర్శించి.... అనుగ్రహాన్ని పొందండి. ఇక వివరాలలోకి వస్తే సింహరాశిలోకి గురు ప్రవేశం జరిగిన తర్వాత 79రోజుల పాటు గురు గ్రహము పుష్కర సందర్భంగా సర్వత్రా వర్జితమయ్యే విధంగా ఉండిపోయింది. అంతేకాక ఈ 79 రోజులలోనే గురు గ్రహానికి మరియు శుక్ర గ్రహానికి కూడా మౌడ్యములు ఆపాదించినవి. 2015 సెప్టెంబర్ 30 సాయంత్రం 6.13 లకు గురువు మఘాది పంచ పాదాలు దాటటం పూర్తి చేసుకొని శుభకరమైన స్థితిలోనికి రావటం జరిగినది.

సింహరాశిలోనే శుభులైన గురు గ్రహము, శుక్ర గ్రహము ప్రస్తుతం సంచారం చేస్తున్నారు. వీరిరువురు సింహరాశిలోనే ఒక విశిష్ట బిందువు వద్దకు త్వరలో రాబోతున్నారు. 25 ఆదివారం నాడు శుక్ర గ్రహాన్ని, 26 సోమవారం నాడు గురు, శుక్ర గ్రహాలను, 28 బుధవారం నాడు శుభ గ్రహాలైన గురు, శుక్రులతో పాటు మంగళకర గ్రహమైన అరుణవర్ణ అంగారకుడిని(కుజుడు) తూర్పు దిశలోనే సూర్యోదయం కంటే ముందు రెండు గంటల నుంచి భక్తి విశ్వాసాలతో దర్శించుకోనండి. ఈ అపురూపమైన గ్రహ దర్శనం అదే సింహరాశిలో అదే బిందువు వద్ద కలవటమనేది మరికొన్ని దశాబ్దాల తర్వాతనే జరగనుంది.

ప్రస్తుతం తూర్పు దిశలో సూర్యోదయం కంటే ముందు నుంచే సహజంగానే శుక్రుడు కాంతివంతంగా ఉండే నక్షత్ర ఆకారంలోనూ, దానికి కొద్దిగా దిగువగా మరికొంత కాంతి తక్కువ నక్షత్రంగా గురుగ్రహము, దానికి దిగువగా స్వల్ప అరుణవర్ణంతో మిణుకు మిణుకులాడే కుజ గ్రహం కనపడుతుంటాయి. కాని విశిష్ట బిందువు వద్దకు చేరటం మాత్రం ఈ నెల 25 సోమవారం కానున్నది. కనుక పాఠకులు సూర్యోదయం ముందే లేచి శుచిగా శుభ గ్రహ దర్శనాన్ని చేసుకొనగలరు.

అంతేకాకుండా నవంబర్ 6 శుక్రవారం నాడు గురు గ్రహం చెంతకు ఆశ్వీజ బహుళ దశమి ( మహా వజ్రేశ్వరి దేవికళతో ఉన్న) చంద్రుడు వస్తాడు. నవంబర్ 7 శనివారం రమా ఏకాదశి పర్వదినాన శుభగ్రహమైన శుక్రుని చెంతకు ఏకాదశి చంద్రుడు (వహ్నివాసిని దేవికళ) ఉండటం చూడగలం. కనుక ఈ అద్భుత గ్రహదర్శనాలని సూర్యోదయం కంటే ముందే మనం వీక్షించే అవకాశం కల్గనుంది. కనుక ద్వాదశ రాశులవారు ఆయా రోజులలో దర్శనం తదుపరి ఆచరించాల్సిన విధి విధానాలను తదుపరి పోస్టింగ్లో చూడండి. - శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.