Saturday, July 22, 2017

విరుద్ధ జంట గ్రహణాలకై పరిహారం

2017 ఆగస్టులో శ్రావణ పూర్ణిమ సోమవారం నాడు జరిగే పాక్షిక చంద్రగ్రహణం మకర రాశిలో శ్రవణా నక్షత్రంలో కేతుగ్రస్తంగా భారతదేశంలో కనపడును. తదుపరి శ్రావణ అమావాస్య రోజున సింహరాశిలో మఖా నక్షత్రంలో సంపూర్ణ సూర్యగ్రహణం రాహు గ్రస్తంగా జరగనుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనపడదు.

సహజంగా ఒక మాసంలో జంట గ్రహణాలు వస్తుంటే, రాశి చక్రంలో అవి మొదటి గ్రహణం ఏర్పడిన రాశికి 7వ రాశిలో ఉండటం జరుగును. కానీ ఈ ఆగష్టు గ్రహణాలు అలా కాకుండా మకర రాశి నుంచి సింహరాశికి అష్టమ స్థానం కావటము, సింహ రాశి నుంచి మకర రాశికి షష్టమ స్థానం కావటం జరిగింది. అందుకే ఈ రెండు గ్రహణాలను షష్టాష్టక గ్రహణాలు అంటారు.

అంతేకాకుండా శ్రవణా నక్షత్రంలో చంద్రగ్రహణం జరుగుతుంటే మఖ నక్షత్రంలో సూర్యగ్రహణం జరుగుతున్నది. శ్రవణం నుంచి మఖ నక్షత్రానికి తారాబలం లెక్కిస్తే ప్రమాదకరమైన నైధన తారగా జ్యోతిష శాస్త్ర రీత్యా ఉన్నది. ఈ విధంగా ఉండటం వలన ప్రపంచంపై ఈ గ్రహణ ప్రభావాలు కొంత వ్యతిరిక్తంగా ఉందని భావించాలి. సూర్య గ్రహణం జరిగిన రోజు నుంచే శుక్ర రాహువుల కలయికలు ప్రారంభం కావటం, కుజ రాహువుల తీవ్రత అధికంగా ఉండటం, సూర్యునిపై శని యొక్క తీవ్ర వీక్షణ అధికంగా ఉండటం జరుగుతున్నవి.

పైగా శ్రావణ మాసంలో శుక్ల పాడ్యమి, పూర్ణిమ, అమావాస్యలు సోమవారాలే రావటం.. అంతేకాక శ్రావణ మాసం ప్రారంభం చంద్రుని రాశియైన కర్కాటక రాశి నుంచే శని నక్షత్రమైన పుష్యమితో ప్రారంభం కావటం, పుష్యమి నక్షత్ర అధిపతియైన శని గ్రహ రాశిలో (మకర రాశిలో) చంద్రుని నక్షత్రమైన శ్రవణా నక్షత్రంలోనే పాక్షిక చంద్ర గ్రహణం కేతు గ్రస్తంగా జరగటం విశేషం.

అంతేకాక ఈ రెండు గ్రహణాలు సంభవించటానికి మూడు రోజుల ముందుగానే రాహు, కేతువులు రాశి మారటం కూడా మరో విశేషం. ఇన్ని కారణాలు ఉన్నందున వీటి ప్రభావ తీవ్రత నుంచి సంరక్షించబడటానికై ద్వాదశ రాశులవారు ఆగష్టు 7 సోమవారం నుంచి 16 సోమవారాల పాటు దర్భ కంకణాన్ని కుడి చేతికి ధరించుట ఎంతెంతో శ్రేయోదాయకం.

ఈ జంట గ్రహణాల ప్రభావ తీవ్రతను తగ్గించటానికి సోమవారమునే ఎందుకు ఎన్నుకోవాలి ? కారణమేమంటే రాహు కేతువుల గ్రస్తంగా జరిగే విరుద్ధ గ్రహణాలు సోమవారం నాడే సంభవిస్తున్న సమయంలో సోమవారాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలి.
అంతేకాకుండా మరో విశేషం కూడా ఉన్నది. అదేమిటంటే ప్రతిరోజూ రాహువుకు సంబంధించిన రాహుకాలం, కేతువుకు సంబంధించిన యమగండకాలము వస్తుంటాయి. ఈ యమగండకాలాన్నే కేతుకాలము అని కూడా అంటారు. పగటి సమయంలో ఉండే ఆరు లగ్నాలలో మొదటి మూడు లగ్నాలలోనే... మధ్యాహ్నంతోనే రాహుకాలం, కేతుకాలం వెళ్లిపోయేది ఒక్క సోమవారం  నాడే. ( ఈ కారణంగా మరెప్పుడైనా భవిష్యత్ లో జంట విరుద్ధ గ్రహణాలు వచ్చి అవి వేరు వేరు వారాలైనప్పుడు కూడా సోమవారాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలి)  సోమవారం రాహుకాలం ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు, 10.30 నుంచి 12.00 గంటల వరకు కేతుకాలము ఉండును (సూర్యుడు నడి నెత్తికి వచ్చు సమయము). ఈ విధంగా ఈ రెండు కాలాలు మధ్యాహ్న సమయంతోనే ముగిసేది ఒక్క సోమవారంతోనే. మిగతా రోజులలో రాహు కాలం ముందు వచ్చి కేతు కాలం తదుపరి ఏర్పడి మధ్యాహ్న సమయంతో ముగియవు. అందుచేతనే సోమవారాన్ని ప్రాధాన్యతగా తీసుకొని దర్భ కంకణాన్ని ధరించి గ్రహణ ప్రభావాల నుంచి ఉపశాంతి పొందవచ్చును. ఈ దర్భ కంకణం అంటే ఏమిటి ? ఎలా తయారు చేసుకోవాలి ? ఎలా వేసుకొవాలి ? అనే విషయాలు మరికొద్ది గంటలలో పోస్టింగ్ చేయబడే వీడియోలో చూడగలరు. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.