Saturday, May 10, 2014

హ్రీంకార యజ్ఞము - సర్వసంక్షోభణ చక్ర అవసర సారంశము 6

3. సర్వసంక్షోభణ చక్రము 

పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఇందులో మూడవచక్రమే సర్వసంక్షోభణ చక్రము. దిగువ కనపడే శ్రీచక్ర మేరులో పీఠంపై  షోడశదళం పైన అష్టదళ పద్మంగా గుండ్రముగా ఉండినదే సర్వసంక్షోభణ చక్రము అంటారు.  



















దీనికి 8 దళాలు ఉంటాయి.  ఈ శరీరంలో ఉన్న షట్చక్రాలలో మూడవదిగా ఉన్నమణిపూరక చక్రమే. ఇది శరీరంలో నాభి స్థానం దగ్గర ఉండును. ఈ సర్వసంక్షోభణ చక్రములో ఎనిమిది మంది గుప్తతర యోగినులనబడే దేవతలు ఉంటారు.

సర్వసంక్షోభణ చక్రానికి ప్రదర్శించవలసిన ముద్ర పేరే సర్వాకర్షిణీ
సర్వసంక్షోభణ చక్రానికి అధిష్టాన దేవత త్రిపుర సుందరీ 

వైదిక కర్మలయందు శ్రద్ధ తగ్గి అవైదిక కర్మలయందు ఆసక్తి పెరిగి, యజ్ఞ యాగాది క్రతువులలో ప్రజలు విముఖులైనప్పుడు సంక్షోభమేర్పడుతుంది. ఇట్టి సంక్షోభాన్ని పార్వతి పరమేశ్వరులు తొలగిస్తారు. అదే శ్రీచక్రంలో మూడవ ఆవరణకు ఉన్న విశిష్టత. అందుచేతనే దీనిని సర్వసంక్షోభణ చక్రమని పిలుస్తారు. (సంక్షోభణాన్ని ఎలా నివారించారో పురాణం గాధలున్నవి.)

తారకాసుర సంహారం తదుపరి ఇంద్రుడు పదవిని అధిష్టించటం, తదుపరి లోకాలలో వైదిక కర్మలు, యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహింపబడటం, దేవతలకు వారి వారి హవిర్భాగాలు అందటం ప్రారంభమై లోకాలలో ఏర్పడ్డ సంక్షోభం నివారింపబడింది. మన్మధుడు దహనమై తదుపరి అనంగుడైనాడు. దీనికి సంకేతంగానే సర్వ సంక్షోభణ చక్రంలోని గుప్తతర యోగినులను అనంగనామంతో చెప్పటం సంప్రదాయమైనది. 

లోకాలలో మరియు జీవితాలలో ఏర్పడే సంక్షోభాలను నివారించటానికే ప్రతి ఒక్కరూ హ్రీంకార మహా యజ్ఞాన్ని ఆచరిస్తూ తద్వారా సర్వసంక్షోభణ చక్రాధిదేవత అయిన త్రిపురసుందరిని ఉపాసిస్తే సమస్త సుఖాలను ప్రసాదిస్తుంది. అందుకే శ్రీ లలితా సహస్ర నామావళిలో మణిపూరబ్జనిలయా నుండి  లాకిన్యాంబా స్వరూపిణి వరకు గల పది నామాలలో సర్వసంక్షోభణ చక్రం స్తుతించబడుతున్నది. ఇందులో గల ఓ నామంలో సమస్త భక్తసుఖదా అని ఉండటంలో అంతరార్ధం స్పష్టంగా గోచరమవుతుంది. 

మరొక ముఖ్యమైన రహస్యమేమిటంటే అసలు మణిపూరక చక్రంలో ఉండే దేవత పేరు వయోవస్థావివర్జితా. ఈ నామమే లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. అంటే కాలానికి అతీతురాలు పరమేశ్వరి. వయసుతోను, కాలంతోను వచ్చే మార్పులు ఆమెకి ఉండవు. 

బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలు ఏమి లేనటువంటిదని భావము. అంటే కాల వ్యవస్థ పరమేశ్వరి కల్పితము. పరమేశ్వరి కాల కల్పనకు పూర్వమే ఉండినందున, పరమేశ్వరి వయస్సును కాలము నిర్ణయింపజాలదు. 

అందుకే లలితా సహస్ర నామాలలో పరమేశ్వరిని పూర్వజా అని, మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అని, మహాప్రళయసాక్షిని అని స్తుతించబడింది. ఈ నవ చక్రాలలో నాభిస్థానంలో ఉన్న సర్వసంక్షోభణ చక్ర విశిష్టత చెప్పనలవికానిది.

కనుక సర్వసంక్షోభణ చక్రములోని 8 గుప్తతర యోగినుల రుద్ర గాయత్రీ మంత్రములను దిగువ తెల్పిన రీతిలో ముద్రను ప్రదర్శిస్తూ పఠించేది. ప్రతి దేవతకు హ్రీం బీజాక్షరం మూడు మార్లు వచ్చునని గుర్తించాలి. ఈ ముద్ర ఏ విధంగా ఉంటుందో చివరలో ఉండే వీడియోలో మూడవ ముద్రను గమనించండి. 

1. ఓం హ్రీం అనంగకుసుమాయై విద్మహే హ్రీం రక్తకంచుకాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

2. ఓం హ్రీం అనంగమేఖలాయై విద్మహే హ్రీం పాశహస్తాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

3. ఓం హ్రీం అనంగమదనాయై విద్మహే హ్రీం శరహస్తాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్। 

4. ఓం హ్రీం అనంగమదనాతురాయై విద్మహే హ్రీం ధనుర్హస్తాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।  

5. ఓం హ్రీం అనంగరేఖాయై విద్మహే హ్రీం దీర్ఘకేశిన్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।  

6. ఓం హ్రీం అనంగవేగిన్యై విద్మహే హ్రీం సృణిహస్తాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।  

7. ఓం హ్రీం అనంగాంకుశాయై విద్మహే హ్రీం నిత్యక్లేదిన్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।  

8. ఓం హ్రీం అనంగమాలిన్యై విద్మహే హ్రీం సుప్రసన్నాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।  



తదుపరి పోస్టింగ్ లో నాల్గవదైన సర్వసౌభాగ్యదాయక చక్రం గురించి తెలుసుకుందాం.  పాఠకులలో అసంఖ్యాకంగా అడిగిన ప్రశ్నలను బట్టి హ్రీంకార యజ్ఞం ఎందుకు చేయాలి ? హ్రీంకారమునకు మూలం ఏమిటి ? శ్రీవిద్యకు, శ్రీ యంత్రానికి ఉన్న సంబంధం ఏమిటి ? పంచదశి మంత్రానికి, శ్రీ యంత్రానికి సంబంధం ఏమిటి ? ఇంకా ఇంకా అనేకనేక ప్రశ్నలకు బ్లాగు ద్వారానే వివరాలను అందిస్తాను. సంపూర్ణ వివరాలన్నీ హ్రీంకార మహా యజ్ఞం అనే పుస్తకంలో పొందుపరుస్తూ... యజ్ఞ కార్యక్రమం నాటికే అందరికీ అందించాలనే తాపత్రయంతో ఉన్నానని తెలియచేస్తున్నాను. 
                                                                          - శ్రీనివాస గార్గేయ  

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.