Tuesday, May 6, 2014

హ్రీంకార యజ్ఞము - ముద్రలపై ఓ విశ్లేషణ - అవసర సారంశము 3

ఒక వ్యక్తి మాట్లాడకుండా ఎదుటివారికి కొన్ని కొన్ని సైగలతో కొంత విషయాన్ని తెలియచేయగలడు. అంటే మన చేతి వ్రేళ్ళ ద్వారా, కదలికల ద్వారా ముద్రలను ఏర్పరుస్తూ ఉన్నచో, మాట్లాడకుండానే ఎదుటివారికి ముద్రల ద్వారా భావాన్ని తెలియచేసే ఒక భాషగా  ముద్రలు ఉపయోగపడును. 

ఆత్మని పరమాత్మతో చేర్చే ప్రయత్నంలో మౌనంతో ఉన్న ఓ వ్యక్తికి ముద్రలనేవి సాధనాలుగా ఉంటాయి. యోగసాధన చేత పూర్ణ చైతన్యం లభిస్తుంది. ముద్రల ద్వారా ప్రాణాయామ తదితరములు సాధన చేసి విజయాన్ని సాధించవచ్చు. అచేతనావస్థ నుండి చేతనావాస్థకు, అస్థిరతం నుండి స్థిరత్వానికి, అగోచరం నుండి గోచర స్థితికి, అధర్మం నుండి ధర్మానికి, అనారోగ్యం నుండి ఆరోగ్యస్థితికి సునాయాసంగా చేర్చగలిగినదే యోగ విద్య. 

మనిషి అంతర్మధనం చెందుతుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుచేత మానసిక క్షోభ, శారీరక సమస్యలు తలెత్తుతాయి. ఏ పని పైన నిశ్చలత్వం ఉండక, కకావికలమైన మనస్సుతో జీవితాన్ని సాగిస్తూ... వత్తిడితో నలిగిపోతుంటాడు. కనుక మనిషికి ప్రశాంతత అవసరం. మనసు నిర్మలంగా, నిలకడగా ఉండాలంటే స్వాంతన ముఖ్యం. ఇట్టి పరిపూర్ణ ఉపశమనం పొందాలంటే యోగసాధన అవసరం. యోగసాధనకు మూలం మనము ఆచరించే ప్రత్యేక ముద్రలు.  కొన్ని సార్లు ముద్రలు సంజీవనిగా ఉపయోగపడతాయని పెద్దలు చెబుతారు. 

భౌతిక సుఖాలు మానసిక ఆనందాన్ని కొంతవరకే కలిగిస్తాయి గాని మిగిలినదంతా అసంతృప్తే. మనం అంతరంగాన్ని మలినాలతో, మాలిన్యాలతో నింపుకుని జీవించినంతకాలం ఆనందానుభవం అసాధ్యం. అంతరంగ కాలుష్య ప్రభావంచే చర్మ వ్యాధులు, శ్వాసకోశ రుగ్మతలు మొదలైనవి ప్రబలుతుంటాయి. 

 అజీర్ణ రోగి  రుచులని ఆశ్వాదించలేడు. చంచల స్వభావి యోగి కాలేడు. నిర్మలమైన మనసులేని భోగి రోగి కాగలడు కాని యోగి కాలేడు. అందుకే ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు. నిత్య సంతోషులుగా ఉన్నవారే ఆరోగ్యవంతులు.

భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలలో భక్తి సంబంధిత అంశాలలో ముద్రలనేవి ఓ భాగం. ముద్రలు వేయటం ద్వారా మనకు ధ్యానంలో ఏకాగ్రత కుదిరి శరీరాన్ని ఆత్మతో సమన్వయ పరచి ఆనందాన్ని పొందగలం. మన చేతులు విశిష్టమైన శక్తి గల్గినవి. వీటిలో విద్యుత్ తరంగాలవంటి శక్తి నిండి ఉంటుంది. పంచభూతములు చేతులలో అంతర్గతంగా నిండి ఉంటాయి. 

ఋషులు, మునులు, యోగులు నిరంతరం ముద్రల ద్వారా సాధన చేస్తూ తమ తపఃశక్తిని పెంచుకునేవారు. ముద్రలు మానసిక శక్తిని, వైఖరిని, గ్రహణ శక్తిని ,ఏకాగ్రతను పెంపొందించును. ముద్రలకు నాడి మండలానికి సంబంధం ఉంది. వివిధ భంగిమలలో ముద్రల కదలిక ద్వారా మనస్సు స్వాధీన పడుతుంది. మన భావనలు, మన ఆలోచనలు సరియైన రీతిలో నడుస్తాయి. ఓ శక్తి ప్రవాహం మనలో వ్యాపించింది అన్న భావానికి లోనవుతాం. మన ఊహలు, ఆలోచనలు, పరిస్థితులను బట్టి బాహ్య పరిస్థితులు రూపుదిద్దుకుంటాయి. సంకల్ప వికల్పాలలో పెను మార్పులుంటాయి.

భక్తి ముక్తి శక్తిదాయకములైన ఈ ముద్రలతో లలితా రహస్య సహస్ర నామావళిని ఆచరిస్తే విశేష శక్తి లభిస్తుందని పెద్దల అభిప్రాయం. ఈ పరంపరలో ప్రస్తుతం జరిగే హ్రీంకార మహా యజ్ఞంలో ముఖ్యమైన సందర్భాలలో ముద్రలను ప్రదర్శించాలి. అయితే ఈ ముద్రలు వేయటంలో అనేక సంప్రదాయ భేదములున్నవి. 

అందుచే చాలామంది ముద్రల జోలికి వెళ్ళకుండా సాధారణ రీతిలోనే లలితా సహస్ర నామాలను, త్రిశతిని, ఖడ్గమాలను వ్యక్తిగతంగాని లేక సామూహికంగా గాని పఠిస్తుంటారు. అందుచే మూడు దశాబ్దాల అనుభవంతో, ఆ దేవి అనుగ్రహంతో నా మనో దృష్టికి అందిన ముద్రలను ఈ హ్రీంకార యజ్ఞంలో పొందుపరుస్తున్నాను. అనుభవంలో ఇవి విశేషమైన ఫలితాలను ఇస్తాయనటంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. 

కనుక ఈ ముద్రలను ఏ విధంగా ప్రదర్శించాలో తదుపరి పోస్టింగ్లో తెలుసుకుందాం.           
                                                                            - శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.