Saturday, October 23, 2010
అక్టోబర్ 29 శుక్రవారం బంగారం కొనవద్దు
2010 అక్టోబర్ 29 శుక్రవారం రోజున బంగారము, పట్టు, సిల్క్ ఇతర వస్త్రాలు, గృహాలంకరణ వస్తువులు, సౌందర్యాలంకరణ సామగ్రి, టెలివిజన్, సెల్ ఫోన్, కంప్యూటర్ తదితర ఎలక్ట్రానిక్ ఉపకరణములను కొనుగోలు చేయకండి. ఆరోజు కొనుగోలు చేయాలనుకున్నవారు ముందు రోజైన 28 గురువారం లేక తరువాత రోజు 30 శనివారం గానీ కొనుగోలు చేయండి. 29 శుక్రవారం మాత్రం వద్దు.
అక్షయ తదియ నాడు కొనుగోలు చేయమని చెప్పే శాస్త్ర ప్రమాణాలు లేవు కదా ! మరి 29 కొనుగోలు వద్దని చెప్పే కారణాలు ఏమిటని అనుకోవచ్చు. ఆశ్వీజ పూర్ణిమ నుంచి అమావాశ్య వరకు కన్యా, తుల, వృశ్చిక, ధను రాశులపై షడ్గ్రహ, సప్తగ్రహ ఆచ్చాదనలుండి, శుక్రుడికి మౌద్యమి సంభవించిన తదుపరి వచ్చే మొదటి శుక్రవారం నాడే ఓ గ్రహస్థితి వుంది. అదేమంటే అసలే వక్ర శుక్రుడు. దానికి తోడు మౌద్యమి. పైగా రాహు నక్షత్రమైన స్వాతిలో ఒకే బిందువులో నీచ రవితో శుక్ర కలయిక, కించిత్ వైరమున్న వక్ర గురువు యొక్క దిన నక్షత్రం పునర్వషు... ఇన్నింటి కారణంగా శుక్ర గ్రహ సంబంధమైనవి కొనుగోలు చేయకూడదు. కొనుగోలు చేస్తే సమస్యలు రాగల అవకాశాలు చాలా వున్నవి. కనుక జ్యోతిశ్శాస్త్రంపై విశ్వాసం వున్నవారు దయచేసి కొనుగోలు చేయకండి. బంగారం ధర తగ్గితే కొందామని కూడా అనుకోకండి.
Tuesday, September 28, 2010
కుజదోషంపై నిజానిజాలు - 2
కుజదోషం అని పండితులు చెప్పగానే వధూవరుల తల్లితండ్రులు కుమిలి కుమిలి పోతుంటారు. అలా బాధపడే వారందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే..."కుజదోషంపై నిజానిజాలు" రెండవ భాగమును ఇవ్వటము జరిగింది
జాతకాలలో కుజగ్రహం జన్మలగ్నము నుంచి 2, 4, 7, 8, స్థానాలలో వుంటే కుజదోషముండునని మొదటి భాగం లో తెలుసుకున్నాము. మరి ఈ కుజదోషం కొందరికి వర్తించదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎవరెవరికి ఈ కుజదోషం వర్తించదో ముందు తెలుసుకుందాం.
జ్యోతిశ్శాస్త్రం ప్రకారం కుజగ్రహం తన నీచస్థానమైన కర్కాటక రాశిలో వుండి వుంటే, అట్టివారికి కుజదోషం వర్తించదని భావం. అలాగే కుజుడికి తన స్వక్షేత్రములైన మేష వృశ్చిక రాశులలో గానీ, ఆయా లగ్నాలలో గానీ జన్మించి వుంటే కుజదోషం వర్తించదు. కుజగ్రహానికి మిత్రులైన రవి గురుల రాశులైన సింహ, ధనుస్సు, మీన రాశులలో గానీ, లగ్నాలలో గానే జన్మించివుంటే కుజదోషము వర్తించదు. కుజగ్రహానికి ఉచ్చస్థానమైన మకరరాశి యందు లేక మకరలగ్న మందు జన్మించిన వారికి కుజదోషము వర్తించదు.
మేష, వృశ్చిక, కర్కాటక, సింహ, ధనుస్సు, మకర, మీన రాశులలో గానీ, లగ్నాలలో జన్మించిన వారికి కుజదోషం భంగమగునని, భయపడవలసిన అవసరం లేదని........ పైన పేర్కొన్న పేరా సారాంశం. మొత్తం 12 రాశులలో 7 రాశుల జాతకులు పోనూ..... మిగిలిన అయిదు రాశుల జాతకులకు కుజదోషం వుంటే భంగం కాదనే కదా సారాంశం. మరి ఆ రాశులు ఏమిటంటే... వృషభ, మిధున, కన్య, తుల, కుంభ రాశులు... మరి ఈ రాశులలో మాత్రమే గాక మొత్తం 12 రాశులలో ఏ రాశివారికైన కుజదోషం వుండి వుంటే, వారి జాతకంలో కుజుడిని, గురుగ్రహం విశేష దృష్టులతో చూస్తూవుండిననూ కుజదోషం వర్తించదనే శాస్త్ర నిర్ణయములున్నవి.
పై నిర్ణయములు గాక రెండవ స్థానంలో కుజుడు దోషరూపంలో వుండి... వారు మిధున కన్యారాశులలో గానీ, మిధున కన్యాలగ్నాలలోవుండిన కుజదోషం వర్తించదనే శాస్త్రప్రమాణమున్నది. అనగా 4, 7, 8 స్థానాల దోషం భంగపడదు. కేవలం రెండవ స్థాన దోషం భంగమగునని ఉద్దేశ్యం. మరి ఈ విషయం 2 వ స్థాన దోషం వారికి ఊరట నిచ్చే మాట.
నాల్గవ స్థాన కుజదోషం వున్నవారు మేష వృశ్చిక రాశులలో గానీ, మేష వృశ్చిక లగ్నాలలో గానీ జన్మించి వుంటే కుజదోషం వర్తించదు. అంటే 2, 7, 8 స్థానాల లోపం ఉంటుందని భావం. అలాగే సప్తమ స్థానంలో కుజదోషం వున్నవారు మకర కర్కాటక రాశులలో గానీ, మకర కర్కాటక లగ్నాల యందు గానీ జన్మించి వుంటే 7 వ స్థాన కుజదోషం భంగమగునని, రెండు, నాలుగు, ఎనిమిది స్థానాలలో భంగం కాదని శాస్త్ర నిర్దేశం.
ఇక అష్టమ స్థాన కుజదోషం వున్నవారు ..... ధను, మీన రాశులలో లేక లగ్నాలలో జన్మించి వుంటే.... వారికి అష్టమ స్థాన కుజదోషం వర్తించదు. ఈ కుజదోషమనేది జన్మ లగ్నం నుంచే వుంటుంది. జనం లగ్నం నుంచే లెక్కించాలి. చంద్రుడు ఉన్న రాశి నుంచి, శుక్రుడు ఉన్న రాశి నుంచి, కుజ దోష స్థానాన్ని చూడవలసిన అవసరం లేదు. ఆ విధంగా చూస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి జన్మ లగ్నం నుంచి, చంద్రుడి నుంచి శుక్రుడి నుంచి కుజదోషం వుండి తీరుతుంది. ఇది సరియిన సక్రమమైన వివరం కాదు. కేవలం జన్మ లగ్నం నుంచి మాత్రమే కుజదోషాన్ని లెక్కించాలి. అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనూరాధ, పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి అను పదమూడు నక్షత్రములలో జన్మించిన వారికి కుజగ్రహం... ఏ స్థానంలో ఉన్ననూ.. కుజదోషం ఉండదని శాస్త్ర నిర్దేశము. ఇరవై ఏడు నక్షత్రాలలో జన్మించిన ఏ ఒక్కరూ కుజదోషం గురించి బెంగ పడాల్సిన అవసరం లేనేలేదు. కుజదోషం ఉన్ననూ.. దైర్యంగా వుండండి... ఎలా ఉంటాము దైర్యంగా ? అని అనుకుంటున్నారా.... నిజమే మరి అసలుసిసలైన వాస్తవాలను తదుపరి కుజదోషంపై నిజానిజాలు - 3 అను పోస్టింగ్ కొరకు వేచి చూడండి... నగ్న సత్యాలను తెలుసుకోండి.
Tuesday, September 21, 2010
కుజదోషంపై నిజానిజాలు - 1

వివాహ ప్రయత్నాలు ఆలశ్యమవుతున్నా, వివాహమైన తదుపరి సమస్యలు తలెత్తుతున్నా, అందరికీ వెంటనే గోచరించేది కుజదోషం. కుజదోషం వున్నవారు కుజదోషం వున్న వారినే వివాహమాడాలని అంటాము. మరి ఈ కుజదోషం ఎవరెవరికి వుంటుంది ? నిజంగా కుజదోషమున్నవారికి లేదని, కోజదోషం లేనివారికి వున్నదని చెప్పే పండితులు కూడా ఈమధ్యకాలంలో సిద్ధమవుతున్నారు. ఏ చిన్నపాటి సమస్యకైనా, ఓ పండితుడిని దంపతులు గానీ, దంపతుల తల్లితండ్రులు గానీ విచారించగానే, ముందుగా ఆ పండితుల వారు సెలవిచ్చేది కుజదోషం వుందని లేక కాలసర్పదోషముందని, ఈ కుజదోషం వలన భార్య భర్తలలో ఒకరికి మరణం త్వరలో వుందని, భయభ్రాంతులయ్యే సంభాషణలతో పండితుడు చెప్పగానే, ఆ మాటలు విన్న దంపతులకో లేక వారి తల్లితండ్రులకో ప్రాణాలు అప్పుడే గాలిలో కలిసిపోయే విధంగా వుంటాయి.
Monday, September 20, 2010
చీకటిలేని రాత్రులతో గురుగ్రహ సందర్శనంతో మహాలయ పక్ష ప్రారంభం
సెప్టెంబర్ 20 అనగా నేటి రాత్రి నుంచే సూర్యుడు పశ్చిమాన అస్తమించగానే...... గురువు తూర్పు దిశలో ఉదయించటం, శుక్రగ్రహం కంటే దేదీప్యమాన వెలుగుతో దర్శనం ఇచ్చి....... తెల్లవారేసరికి గురువు పడమరలోకి వెళ్ళటం........ సూర్యుడు తూర్పున ఉదయించటం జరగనుంది. ఈప్రకారంగా గురువు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ మధ్య వరకు భూమి మీద ప్రజలందరికీ దర్శన భాగ్యాన్ని కలిగించబోతున్నాడు. మరొక విశేషం ఏమనగా సెప్టెంబర్ 23 న భాద్రపద పూర్ణిమ రోజు రాత్రి వరుసగా 3 రోజులు చీకటిలేని రాత్రులు కావటం ఒక విశేషమైతే, మీనరాశిలో చంద్రుని ప్రక్కనే గురువును కూడా దర్శించబోతున్నాము.
23 వ తేది భాద్రపద పూర్ణిమ గురువారం కావటం, ఆరోజు రాత్రి నుంచే వరుసగా మూడు రోజులు వరుసగా చీకటి లేకపోవటం విశేషం. ఏలయనగా 23 సాయంత్రం సూర్యుడు అస్తమించకముందే పూర్ణ చంద్రుడు ఉదయించటం, మరునాడు సూర్యోదయం తదుపరి పూర్ణ చంద్రుడు అస్తమించటం జరుగుతుంది. ఆవిధంగా 23, 24, 25 తేదీలలో పగటి సమయంలో సూర్యవెలుగుతో, రాత్రి సమయంలో చంద్రకాంతితో మహాలయ పక్షములు ప్రారంభం కానున్నవి.
ఈ సెప్టెంబర్ 20 నుంచి దర్శనం ఇచ్చే గురువు, తిరిగి 2022 లో మనకు దర్శనం ఇస్తాడు. ఈ గురు దర్శన సమయంలో లలితా సహస్ర నామ స్తోత్రంలో 129 వ శ్లోకం... "అదృశ్యా దృశ్య రహితా విజ్జ్ఞాత్రి వేద్యవర్జితా" అను పంక్తిని చదివి, ఆపైన గురు శ్లోకమైన "దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం బుద్దిమంతం త్రిలోకేశం తం నమామి బృహసృతిం" అను శ్లోకాన్ని ఉచ్చరించి, ఆ పిదప శ్రీ దత్తాత్రేయిడుని ధ్యానం చేయండి.
మరి ముందుగా శ్రీ లలితాదేవిని ఎందుకు స్మరించాలి అని అనుకుంటారేమో ! ఇంద్రియములకు గోచారము కానిది అదృశ్యము. దృశ్యమనగా జగత్తునందలి సర్వవస్తు సముదాయము. చూస్తూ కూడా బయట వస్తువుని చూడని స్థితిని దృశ్యరహిత స్థితి అంటారు. ఏదైతే తెలుసుకోవాలనుకుంటామో దానిని వేద్యమైనది అంటాము. ఇక తెలుసుకోవాల్సింది ఏమిలేదు అనుకుంటే... దానిని వేద్యవర్జిత అంటారు... ఎవరైతే సర్వము తెలిసి ఉంటారో, అలాంటి విజ్ఞానమూర్తులనే విజ్ఞాత్రులు అంటారు.
గనుక లలితాదేవి తనకు బయటా లోపల అనుబేధం లేక సర్వము తానగుటచే తనకు తెలియవలసినదేమీ లేదు. అందుచే ఆమె వేద్యవర్జిత. అట్టి విజ్ఞానమూర్తి గనుకనే ఆమె విజ్ఞాత్రి అనబడింది.... ఇటువంటి దేవతను, ఆయా నామాల అనుష్ఠానం వలన, ఇంతవరకు అదృశ్యంగావుండి, ఇప్పుడు దర్శనం ఇచ్చే గురువుని దర్శించటానికి తగిన సమర్ధతను, శక్తిని మనకు అనుగ్రహం కల్గటానికే... ఆ తల్లిని ముందు.. ఆయా నామాలతో ధ్యానించుకుందాం.
ధ్యానించండి... అనుగ్రహాన్ని పొందండి..
Thursday, September 9, 2010
గణేశ చతుర్ధిన వినువీధిలో అరుదైన తారా శాశాంకం
