Tuesday, September 28, 2010

కుజదోషంపై నిజానిజాలు - 2

కుజదోషం అని పండితులు చెప్పగానే వధూవరుల తల్లితండ్రులు కుమిలి కుమిలి పోతుంటారు. అలా బాధపడే వారందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే..."కుజదోషంపై నిజానిజాలు" రెండవ భాగమును ఇవ్వటము జరిగింది

జాతకాలలో కుజగ్రహం జన్మలగ్నము నుంచి 2, 4, 7, 8, స్థానాలలో వుంటే కుజదోషముండునని మొదటి భాగం లో తెలుసుకున్నాము. మరి ఈ కుజదోషం కొందరికి వర్తించదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎవరెవరికి ఈ కుజదోషం వర్తించదో ముందు తెలుసుకుందాం.

జ్యోతిశ్శాస్త్రం ప్రకారం కుజగ్రహం తన నీచస్థానమైన కర్కాటక రాశిలో వుండి వుంటే, అట్టివారికి కుజదోషం వర్తించదని భావం. అలాగే కుజుడికి తన స్వక్షేత్రములైన మేష వృశ్చిక రాశులలో గానీ, ఆయా లగ్నాలలో గానీ జన్మించి వుంటే కుజదోషం వర్తించదు. కుజగ్రహానికి మిత్రులైన రవి గురుల రాశులైన సింహ, ధనుస్సు, మీన రాశులలో గానీ, లగ్నాలలో గానే జన్మించివుంటే కుజదోషము వర్తించదు. కుజగ్రహానికి ఉచ్చస్థానమైన మకరరాశి యందు లేక మకరలగ్న మందు జన్మించిన వారికి కుజదోషము వర్తించదు.

మేష, వృశ్చిక, కర్కాటక, సింహ, ధనుస్సు, మకర, మీన రాశులలో గానీ, లగ్నాలలో జన్మించిన వారికి కుజదోషం భంగమగునని, భయపడవలసిన అవసరం లేదని........ పైన పేర్కొన్న పేరా సారాంశం. మొత్తం 12 రాశులలో 7 రాశుల జాతకులు పోనూ..... మిగిలిన అయిదు రాశుల జాతకులకు కుజదోషం వుంటే భంగం కాదనే కదా సారాంశం. మరి ఆ రాశులు ఏమిటంటే... వృషభ, మిధున, కన్య, తుల, కుంభ రాశులు... మరి ఈ రాశులలో మాత్రమే గాక మొత్తం 12 రాశులలో ఏ రాశివారికైన కుజదోషం వుండి వుంటే, వారి జాతకంలో కుజుడిని, గురుగ్రహం విశేష దృష్టులతో చూస్తూవుండిననూ కుజదోషం వర్తించదనే శాస్త్ర నిర్ణయములున్నవి.

పై నిర్ణయములు గాక రెండవ స్థానంలో కుజుడు దోషరూపంలో వుండి... వారు మిధున కన్యారాశులలో గానీ, మిధున కన్యాలగ్నాలలోవుండిన కుజదోషం వర్తించదనే శాస్త్రప్రమాణమున్నది. అనగా 4, 7, 8 స్థానాల దోషం భంగపడదు. కేవలం రెండవ స్థాన దోషం భంగమగునని ఉద్దేశ్యం. మరి ఈ విషయం 2 వ స్థాన దోషం వారికి ఊరట నిచ్చే మాట.

నాల్గవ స్థాన కుజదోషం వున్నవారు మేష వృశ్చిక రాశులలో గానీ, మేష వృశ్చిక లగ్నాలలో గానీ జన్మించి వుంటే కుజదోషం వర్తించదు. అంటే 2, 7, 8 స్థానాల లోపం ఉంటుందని భావం. అలాగే సప్తమ స్థానంలో కుజదోషం వున్నవారు మకర కర్కాటక రాశులలో గానీ, మకర కర్కాటక లగ్నాల యందు గానీ జన్మించి వుంటే 7 వ స్థాన కుజదోషం భంగమగునని, రెండు, నాలుగు, ఎనిమిది స్థానాలలో భంగం కాదని శాస్త్ర నిర్దేశం.

ఇక అష్టమ స్థాన కుజదోషం వున్నవారు ..... ధను, మీన రాశులలో లేక లగ్నాలలో జన్మించి వుంటే.... వారికి అష్టమ స్థాన కుజదోషం వర్తించదు. ఈ కుజదోషమనేది జన్మ లగ్నం నుంచే వుంటుంది. జనం లగ్నం నుంచే లెక్కించాలి. చంద్రుడు ఉన్న రాశి నుంచి, శుక్రుడు ఉన్న రాశి నుంచి, కుజ దోష స్థానాన్ని చూడవలసిన అవసరం లేదు. ఆ విధంగా చూస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి జన్మ లగ్నం నుంచి, చంద్రుడి నుంచి శుక్రుడి నుంచి కుజదోషం వుండి తీరుతుంది. ఇది సరియిన సక్రమమైన వివరం కాదు. కేవలం జన్మ లగ్నం నుంచి మాత్రమే కుజదోషాన్ని లెక్కించాలి. అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనూరాధ, పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి అను పదమూడు నక్షత్రములలో జన్మించిన వారికి కుజగ్రహం... ఏ స్థానంలో ఉన్ననూ.. కుజదోషం ఉండదని శాస్త్ర నిర్దేశము. ఇరవై ఏడు నక్షత్రాలలో జన్మించిన ఏ ఒక్కరూ కుజదోషం గురించి బెంగ పడాల్సిన అవసరం లేనేలేదు. కుజదోషం ఉన్ననూ.. దైర్యంగా వుండండి... ఎలా ఉంటాము దైర్యంగా ? అని అనుకుంటున్నారా.... నిజమే మరి అసలుసిసలైన వాస్తవాలను తదుపరి కుజదోషంపై నిజానిజాలు - 3 అను పోస్టింగ్ కొరకు వేచి చూడండి... నగ్న సత్యాలను తెలుసుకోండి.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.