7 ఆగష్టు 2017 శ్రావణపూర్ణిమ సోమవారం నాడు పాక్షిక చంద్రగ్రహణ సందర్భంగా నూతన యజ్ఞోపవీత ధారణ మాత్రం ఉండదు. కానీ యధావిధిగా రక్షా బంధన కార్యక్రమములు నిరభ్యంతరంగా ఆచరించవచ్చును. శాస్త్రీయంగా పంచాంగగణిత రీత్యా రక్షాబంధనమునకు శుభసమయము మధ్యాహ్నము 11గంటల 4నిముషాల నుంచి సాయంత్రం 4గంటల 1నిముషం వరకు ఉన్నది. అయితే ఉదయకాలంలో రక్షాబంధనాలు చేయువారలకు అది నిషిద్ధ సమయమేమి కాదు. శాస్త్రీయతను కోరుకునేవారు పై సమయాన్ని స్వీకరించండి. - శ్రీనివాస గార్గేయ

Wednesday, January 25, 2017

27 జనవరి 2017 అరుదైన మౌని అమావాస్య

2017 జనవరి 27 శుక్రవారం పుష్య అమావాస్య. దీనినే మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు. సూర్యుడు, చంద్రుడు ఒకే బిందువులో కలిసినచో ఏర్పడే తిథిని అమావాస్య అంటారు. ప్రతి సంవత్సరం ఉత్తరాయణం ప్రారంభమైన తదుపరి ఈ మౌని అమావాస్య వస్తుంది. అంటే ఉత్తరాషాఢ నక్షత్ర 2వ పాదమైన మకరరాశి లోనికి సూర్యుడు ప్రవేశించటాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. అదే మకరరాశిలోకి తదుపరి చంద్రుడు వచ్చి సూర్యునితో కలిస్తే వచ్చే తిధి మౌని అమావాస్య.

మనసుకు కారకుడు చంద్రుడు. శనిగ్రహానికి అంతర్దశ శత్రువు కూడా చంద్రుడే. మకరరాశికి  అధిపతి శనిగ్రహం. జ్యోతిషపరంగా రవి మరియు శనిగ్రహాలు పరస్పర శత్రువులు. ముఖ్యంగా మౌని అమావాస్య పర్వదినాన పుణ్య నదులలోను, సముద్రాలలోను స్నానమాచరించటమే కాక పితరులకు తర్పణ, పిండప్రదానాదులు కూడా ఆచరిస్తుంటారు. కానీ అసలైన అంతర్గత రహస్యం మరొకటి ఉంది. కేవలం స్నానాలు ఆచరించి పిండప్రదానాలు మాత్రమే చేస్తుంటారు తప్ప, రహస్యం తెలుసుకోవటానికి ఎవరూ ప్రయత్నించారు.

ఈ రహస్యం తెలుసుకుని తగిన రీతిలో మౌని అమావాస్య పర్వదినాన ప్రతివారు విధి విధానాలతో ఆచరిస్తుంటే... ప్రతి సంవత్సరం వారి వారి జీవన స్థితిగతులలో కొన్ని అనుకూల మార్పులు వస్తాయని పురాతన గ్రంధాలు తెలియచేస్తున్నాయి. ప్రతి సంవత్సరం వచ్చే మౌని అమావాస్యకు ఈసారి వచ్చే మౌని అమావాస్యకు చాలా వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం శనిగ్రహం వృశ్చికరాశిలో సంచారం సాగిస్తూ, ఏదో ఒకరోజున ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రవేశం అనేది అతిచారంతో ఉండవచ్చు. సహజ గమనంతో ఉండవచ్చు.

చారమంటే నడక, గమనమన్నా నడకే. సహజధోరణిలో మనం అతిగా మాట్లాడవద్దు అని సంబోధిస్తుంటాం. అంటే మాట్లాడవలసిన స్థాయికన్నా అధికంగా మాట్లాడటాన్ని అతి అంటారు. మరొక అర్ధంలో ఎక్కువ అని కూడా అర్ధము. అతిగా తినటము... అతిగా మాట్లాడటము, అతిగా నిద్రపోవటము.. ఈ విధంగా సాధారణ స్థితి కంటే ఎక్కువ చేసే దానిని అతి అంటారు. ఈ విధమైన అతి వలన సమస్యలు కూడా అధికంగా ఉంటాయనే విషయాన్ని సర్వులు గమనించాలి. ఈ అమావాస్యకు శని అతిచార గమనము తోడవుతుంది. 

ప్రస్తుతం వృశ్చికరాశిలో సమాచారం చేస్తున్న శనిగ్రహం సహజ గమనంతో ధనుస్సు రాశిలోనికి 2017 అక్టోబర్ 26న ప్రవేశించవలసి ఉన్నది. కానీ ఈ లోపలే అతి గమనంతో హడావిడిగా 2017 జనవరి 26 రాత్రి 7 గంటల 31 నిముషాలకి ధనుస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన శని తిరిగి వృశ్చికరాశి లోనికి జూన్ 21వతేదీకి చేరుకుంటాడు. వృశ్చికరాశిలో కొంతకాలం పాటు ఉండి సహజగమనంతో అక్టోబర్ 26న ధనస్సురాశిలోనికి తిరిగి ప్రవేశిస్తాడు.

అయితే 2017 జనవరి 26 న అతిచార ప్రవేశం తదుపరి కొద్ది గంటలకే మౌని అమావాస్య ప్రారంభం. ధనూరాశి ప్రవేశం ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అయితే ధనస్సురాశిలో శని ఉన్న రెండున్నర సంవత్సరాల కాలంలో 2 లేక 3 సార్లు మౌని అమావాస్య వస్తుంటుంది. కానీ అతిచార గమనంతో ధనూరాశిలో ప్రవేశ సమయంలో వచ్చే మౌని అమావాస్య మాత్రం అత్యంత అరుదైనది.

మౌని అమావాస్య పర్వదినాన స్నానాలు, తర్పణాలు, పిండ ప్రదానాదులు ఆచరించటం ఆనవాయితీ. ఇక అసలైన రహస్య విషయానికి వస్తే... పురాణగాధలు అనేకం ఉన్నప్పటికీ మౌని అమావాస్య రోజున జ్యోతిషపరంగా ముఖ్యంగా మౌనం వహించటం ప్రధానమైన అంశం. మౌనం ఎందుకు వహించాలి అనే విషయం తెలుసుకోవాలి.  మనసునకు కారకుడు చంద్రుడు. అమావాస్య రోజున చంద్రుడు రవితో కలిసి ఉన్నందున, ప్రకాశాన్ని కోల్పోయి ఉంటాడు. అంతేకాక రవి, చంద్రుల కలయిక శని క్షేత్రంలో జరుగుతుంది.

జ్యోతిషపరంగా శని ఆయుష్కారకుడు. ఆయుష్యు అంటే... కేవలం ఒక వ్యక్తి ప్రాణంతో అధికకాలం జీవించటాన్ని మాత్రమే ఆయుష్యు అనటం కాదు. ఈ ఒక్క జీవించే అంశం కాకుండా బంధుత్వాలకి, బాంధవ్యాలకి, మిత్రత్వాలకి, వస్తువులకి, వ్యవహారాలకి, వ్యాపకాలకి కూడా ఆయుష్యు అనే మాట వర్తిస్తుంది.

ఎలాగంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో స్నేహితంగా ఉంటున్నాడు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం ఒకే ఒకమాటతోనే చెదిరిపోయింది. జీవితంలో తిరిగి వీరివురు కలిసి మాట్లాడుకోవటం జరగలేదు. వారిద్దరి బంధాన్ని చెదరగొట్టినది కేవలం ఒక వాక్కు మాత్రమే. ఈ వాక్కుకు వెనక సూత్రధారి, పాత్రధారిగా ఉండే గ్రహం చంద్రుడు. పొరపాటున కావచ్చు, కావాలని కావచ్చు, నోటిద్వారా అన్న మాట ఆ ఇరువురి స్నేహిత బంధం అనే ఆయుష్యుకు గండిపడింది.

ఇలాగే బంధుత్వాలకి, కుటుంబంలో ఒకరినొకరికి, సంఘంలో పలకరించే సన్నిహితులకి... ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో తారసపడే ఎంతోమంది వ్యక్తులతో సంబంధం బాంధవ్యాలు ఉంటూ ఉంటాయి.

పై విధంగా అనివార్య కారణాల వలన ఆయుష్యనే బంధం చెదిరిపోవటానికి వాక్కు తోడ్పడుతుంది. ఇతరులని మంచితనంతో రంజింప చేయాలన్నా, ఇతరులను బాధించే విధంగా తప్పు మాటలు చెప్పినా... కేవలం వాక్కు వలన మాత్రమే సాధ్యం.

ఓ ఖరీదైన కారుని ఓ వ్యక్తి కొన్నాడనుకుందాం. ఆ కారు అనేది ఇనుప వస్తువు. ఈ ఇనుముని శనిగా భావిస్తాం. అంత ఖరీదైన కారు.. తనంతట తానుగా వెళ్లి ప్రమాదానికి గురి కాదు. .దానిని సక్రమంగా నడపక పోతే ప్రమాదం వాటిల్లి, కారు రూపమే చెదిరిపోవును. అంటే వ్యక్తి ఏదో ఆలోచనతో ఉన్నందువలన లేక నిద్ర వలన లేక ఎదురుగా అనాలోచనతో వచ్చిన మరో వాహనం డ్యాష్ ఇచ్చిన కారణంగా ఈ వాహనం దెబ్బతిన్నది. అందుకే శనికి అంతర్గత శత్రువు చంద్రుడయ్యాడు.

కనుక ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వాహన, జీవన, స్నేహిత అనే అనేక రంగాలలో అత్యధిక కాలం ఉండకుండా మధ్యలోనే చెడిపోవటమో, చెదిరిపోవటమో లేక నాశనమవ్వటమో లేక మరణించటమో జరిగితే.. .ఆయుష్యు పోయింది అంటారు. ఇట్టి ఆయుష్యు కారకుడైన శనిని ముప్పు తిప్పలు పెట్టేవాడే చంద్రుడు.

జ్యోతిషపరంగా ఆయుష్యకారకుడైన శని యొక్క క్షేత్రంలో... అంతర్గత శత్రువైన చంద్రుడు, శనికి బద్ధశత్రువైన శనితో కలిసిన మహా పర్వదినమైన మౌని అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మౌనం వహించినచో ఆ సంవత్సరానికి కొంతమేర సమస్యలు సన్నగిల్లి... మానవాళి మంచి అంశాలతో ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయనేదే మౌని అమావాస్య ప్రధాన ఉద్దేశ్యం. 


అయితే ఈ 2017 జనవరి నెలలో వచ్చే మౌని అమావాస్య పర్వదినానే అతిచారంతో వచ్చిన శనిగ్రహం ఉంది గనుక అత్యంత విశ్వాసంతో పగటి సమయమంతా అలా వీలుకానిచో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మౌనం పాటించినవారందరికీ పరోక్ష శుభాలు ఉంటాయి. ఇతర దేశాలలో ఉండే వారు ఈ క్రింది సమయాలలో మౌనం పాటించినచో పరోక్షంగా శుభకర ఫలితాలు ఉంటాయి.

కాలిఫోర్నియా - ఉదయం 10.48 నుంచి మధ్యాహ్నం 12.05 వరకు
న్యూయార్క్ - ఉదయం 10.55 నుంచి మధ్యాహ్నం 12.09 వరకు
టెక్సాస్ - ఉదయం 11.22 నుంచి మధ్యాహ్నం 12.40 వరకు
వాషింగ్టన్ డి. సి - ఉదయం 11.06 నుంచి మధ్యాహ్నం 12.21 వరకు
లండన్ - ఉదయం 11.08 నుంచి మధ్యాహ్నం 12.13 వరకు


దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.