Saturday, April 16, 2016

గురు చండాల ప్రభావంతోనే భూకంపములు తీవ్రతరం

2016 జనవరి 29 నుంచి ఆగస్ట్ 11 వరకు సింహరాశిలోనే గురు చండాల యోగం జరుగుతున్నది. ముఖ్యంగా ఓ వైపు సింహరాశిలో చండాల యోగం జరుగుతుంటే, సింహరాశి అధిపతి రవికి 9 మార్చి 2016 న గురు  నక్షత్రమైన పూర్వాభాద్ర కుంభ రాశిలో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది.  తిరిగి 1 సెప్టెంబర్ 2016న కంకణ పూర్వక సంపూర్ణ సూర్య గ్రహణం సింహరాశిలోనే రాహుగ్రహంచే సంభవించనుంది. ఈ రెండు గ్రహణాల మధ్యలో అనగా ఏప్రిల్ 17 నుంచి జూన్ 17 వరకు వృశ్చిక రాశిలో వైరి గ్రహాలైన శని మరియు కుజుడు ఇరువురు ఏక కాలంలో వక్ర సంచారం చేస్తున్నారు. ఇది ఒక అరిష్ట యోగము. ఇది కాక  జూన్ 25 శనివారం సూర్యోదయానికి పూర్వము భారత కాలమాన ప్రకారం 3గంటల 24 నిముషాల 22 సెకన్లకు ఒకే బిందువులో గురువుపై రాహు పంజా ఏర్పడనుంది. దీనినే నాగ బంధనం అంటారు.

వాస్తవానికి దీని ప్రభావం మార్చ్ 9 గ్రహణం ముందునుంచే ప్రారంభమగును. ఈ విషయాన్నే 1 మార్చి 2016 మంగళవారం నాడు విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సమావేశంలో చెప్పిన అంశాలలో కొన్ని ఏమనగా... మార్చి 9 సంపూర్ణ సూర్య గ్రహణానికి ముందు వెనుకాలలో ఇండోనేషియా, సుమిత్ర, పాకిస్తాన్, చైనా ప్రాంతాలలో భారీ భూకంప తీవ్రతలు రిక్టర్ స్కేల్ పై 6.6 గాని, 7.8 గాని ఉండునని... సునామి హెచ్చరికలు జారి అగునని తెలియచేస్తూ, దేశాల నడుమ విభేదాలు తారాస్థాయిలో ఉండి యుద్ధ భయ వాతావరణం ఉండేలా అశాంతి నెలకొనునని, ప్రజల క్షేమం కోసం కోరుకొనే ముఖ్య మంత్రులు కాని, ప్రధాన మంత్రులుకాని, దేశాధ్యక్షులు గాని (ప్రపంచమంతటా) ప్రప్రధమంగా వారి భద్రతను కట్టు దిట్టం చేసుకోవాలని తెలియని రీతిలో ఉగ్రవాద చర్యలు ఉండి అవాంచనీయ సంఘటనలు రాజకీయ వర్గీయులకు ఉండునని, గతంలో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఏర్పడిన గ్రహ స్థితులకు సమానంగా ఉండే స్థితి గతులు రాబోతున్నవని తెలియచేశాను. 



2వ తేది సాయంత్రమే ఇండోనేషియా లో 7.8 తీవ్రతతో భూకంపం రావటం, సునామి వంటి హెచ్చరికలు జారి కావటం, గ్రహణం తదుపరి వరుసగా చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, ఉత్తరభారతం, హిందూకుష్ పర్వతాలు, మరియు తాజాగా జపాన్ భూకంపాలు మరికొన్ని ఇతర చోట్ల తరచుగా భూకంపాలు రావటాన్ని గమనిస్తే రానున్న గ్రహస్థితి ప్రభావం అధికమని స్పష్టమవుతున్నది.

గురు చండాల యోగ ప్రభావం రాజకీయ నాయకులపై ఉంటుందని గతంలో చెప్పటం జరిగింది. దీని వలన ప్రపంచ వ్యాప్తంగా పనామా పేపర్ల లీకుల వలన అనేకమంది నాయకుల కీర్తి ప్రతిష్టలు దిగజారటమే కాక, రాజీనామాలు చేయటం, ఇతర సమస్యలు దేశ నాయకుల మెడలకు చుట్టుకోవటం జరుగుచున్నది.

శతాబ్దాల తర్వాత అరుదుగా వస్తున్న గురు చండాల యోగ ప్రభావం విమానాలు, విమాన ప్రయాణాలు, రాజకీయ రంగంలో పేరెన్నికగన్న నేతలు సరిహద్దు సమస్యలు, భూకంపాలు, ఉగ్రవాద చర్యలతో పాటు వివాహ, సంతాన అంశాలపై అధికంగా ఉండును. అందుకే కొంత ఉపశాంతి పొందుటకై సప్త సూర్య మహా యాగాలు చేయుటకు నేను సంకల్పించటం జరిగింది. ఇంతవరకు 2 యాగాలు పూర్తయినవి. 3వది 2016 మే 1 ఆదివారం నాడు ప్రకాశం జిల్లా ఒంగోలులో జరగనున్నది.

వాస్తవానికి రాహు సంబంధంగా ఏర్పడే ఈ గురు చండాల ప్రభావం 432 అంశాలపై ఉండును. అందుకే ప్రతివారి జాతకాలలో ఏర్పడే సమస్యలు ఈ 432 చిట్టాలోనే ఉండును. కనుక ఉపశాంతి మార్గంగా ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని చేపట్టటం, తదనంతర రోజులలో 432 సమస్యలున్న వారందరికీ 2016 సెప్టెంబర్ తదుపరి నుంచి మరికొంత వ్యక్తిగత సమస్యలకు తగు రీతిలో పరిహారం చేయుటకు సంకల్పం జరుగుచున్నది.

ప్రస్తుతం జరిగే గురు, చండాల యోగ ప్రభావం నుంచి కొంత గట్టెక్కుటకు ఈ యాగముల ద్వారా లభించే భస్మ లేహ్యమును కంఠమునకు బొట్టుగా పెట్టుకోవాలి. కనుకనే ఈ యాగములో పాల్గొనిన వారందరికీ 7 యాగముల తదుపరి భస్మ లేహ్యము అందచేయబడును. మొత్తం మీద ఎండ వేడిమి తీవ్రంగా ఉన్నప్పటికీ ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి భక్తి విశ్వాసాలతో ఈ కార్యక్రమాలలో పాల్గొన్న వారందరితో పాటు సర్వులకు శుభం కలగాలనే కోరుకుంటున్నాను.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.