శ్రీ హేమలంబ మాఘ పూర్ణిమ 31 జనవరి 2018 బుధవారం కర్కాటకరాశిలో పుష్యమి,ఆశ్లేష నక్షత్రాలలో రాహుగ్రస్తంగా రక్తవర్ణంలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును.ఇది నీలిరంగులో (బ్లూ మూన్ గా) ఉండదు. కేవలం రక్త వర్ణం మాత్రమే.ఈ చంద్ర గ్రహణం వలన ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Friday, March 11, 2016

2016లో అరుదైన గురు రాహు నాగబంధనం పార్ట్ 1

మేషాది ద్వాదశ రాశులలో 5వ రాశి సింహరాశి. జ్యోతిష శాస్త్రంలో పంచమ స్థానము అనగానే సంతాన అంశాలను తెలుసుకునే భావమని అర్థము. సంతాన కారకత్వ గ్రహము గురువు. పితృ కారకత్వ గ్రహము సూర్యుడు. ప్రతి వ్యక్తి కూడా మరో వ్యక్తికి సంతానంగా ఉంటాడు. ప్రతి వ్యక్తికి తమ కుటుంబంలోని పెద్దలలో కొంతమంది మరణించి ఉండవచ్చు. ఇలా మరణించే వారు తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు.. మామ, అత్త, మేనమామ, మేనత్త, సోదరుడు, తాత, అమ్మమ్మ, నాయనమ్మ, బాబాయి, పిన్నమ్మ, అక్క, బావ ఇలా రక్త సంబంధం ఉన్నవారు మరణించి ఉండవచ్చు. ఇలా మరణించిన వారినే పితరులు అంటారు.

ఈ పితరులనే పితృ దేవతలు అని పిలుస్తాం. ప్రతి సంవత్సరము ఏదో ఒక నదికి పుష్కరాలంటూ వస్తుంటాయి. ఈ పుష్కరాలలో  పితృ దేవతల ఆత్మలకు శాంతి కలగాలనే ఉద్దేశ్యంతోనే తర్పణ పిండ ప్రదానాదులు ఆచరిస్తూ ఉంటుంటాం. ఇక్కడ ఒక విషయాన్ని బాగా గమనించాలి. పితృ కారకత్వ గ్రహమైన రవి, సంతాన కారకత్వ గ్రహమైన గురువు... ఈ రెండింటితో సంబంధం ఉండే రాశి సింహారాశి మాత్రమే. మిగిలిన రాశులకు అధిపతులు ఇతర గ్రహాలు ఉంటుంటాయి. కనుక పితృ దేవతల ఆత్మలు శాంతి కలగాలనే ఉద్దేశ్యంతోనే ప్రతి సంవత్సరము పుష్కరాలలో పితృ దేవతలకు తర్పణ, పిండ ప్రదానాదులు ఇస్తుంటారు. సింహరాశిలోనికి గురు గ్రహ ప్రవేశం చేయటంతో 12 సంవత్సరాలకు ఒకసారి గోదావరి వస్తాయి.

గోదావరి నదికి పుష్కరాలు కాకుండా ఇతర నదులకు పుష్కరాలు వస్తే వివాహాది శుభ కార్యములు నిరాటంకంగా ఆచరించుకోవచ్చు. గోదావరి నదికి పుష్కరాలు వస్తే మాత్రం వివాహాది శుభ కార్యములు ఉండవు. ఎందుకనగా పితృ కారకత్వ గ్రహమైన సూర్య రాశిలోనికి సంతాన కారకత్వ గ్రహమైన గురు ప్రవేశం చాలా విశేషవంతమైనది కనుక. అయితే ఇక్కడ మరొక విషయం గుర్తుంచుకోవాలి. మఘాది పంచ పాదేషు గురు సర్వత్ర వర్జితః. అని శాస్త్ర వచనం. అనగా మఘ నక్షత్ర నాలుగు పాదాలు, పుబ్బ నక్షత్ర 1వ పాదంలో గురువు సంచార కాలమంతా శుభకార్య నిషిద్దమని అర్థము. దీనినే సింహస్థ గురు దోషము అంటారు. ఉత్తర భారతంలో అయితే సింహరాశిలో గురు సంచారం ఉన్న సంవత్సరమంతయూ శుభ కార్యాలు నిషిద్దమని భావము.

పరోక్షంగా పితృ కార్యాలకు ప్రాధాన్యత ఇవ్వటానికే ఈ శుభ కార్యాలు నిషిద్ధం కావించబడినవి. ఇంతవరకు బావున్నది. కాని వచ్చిన సమస్యేమిటంటే ఈ సంవత్సరం  సింహరాశిలో గురు సంచారం ప్రారంభం కాగానే గురువుకు సింహగురు దోషం ఆపాదించటమే కాక 2016 జనవరి 29 నుంచి ఆగష్టు 11 వరకు రాహువు గురువుకు చేరువ కావటంతో గురు చండాల యోగం కూడా తోడైనది. ఇంతటితో ఆగక... సింహరాశి అధిపతి సూర్యునికి మార్చి 9 మరియు సెప్టెంబర్ 11 న సంపూర్ణ సూర్య గ్రహణాలు సంభవిస్తున్నాయి. ఈ రెండూ గ్రహణాల మధ్యలోనే అనగా 25 జూన్ 2016న గురువును రాహువు కబలించబోతున్నాడు. దీనినే నాగబంధనం అంటారు.

గురు చండాల యోగం ప్రారంభమైన తర్వాత ఏదో ఒక సమయంలో  నాగ బంధనం జరిగి తీరుతుంది. కాని ఈ నాగ బంధనానికి ముందు వెనుకాలలో... రాశ్యాధిపతి రవికి గ్రహణాలు రావటం, పరస్పర వైరి గ్రహాలైన కుజ, శనులు ఏక కాలంలో వక్రం కావటం, ఏక బిందువులో సంయోగం చెందటం జరిగాయి. వీటన్నిటి ప్రభావం నాగ బంధనాన్ని మరింత బలపరిచేలా.. ప్రాభావితం చేస్తున్నాయి. గతంలో సింహరాశిలో జరిగిన నాగ బంధనాలకు, ఈ నాగ బంధనానికి చాలా వ్యత్యాసం ఉన్నది. అనేక శతాబ్దాల తదుపరి రెండు గ్రహణాల మధ్య, అరిష్ట గ్రహ స్థితుల మధ్య ఏర్పడిన అరుదైన నాగ బంధనం ఇదే.

ఈ నాగబంధనం ప్రభావం ఒక స్థాయి వరకైతే, ఇతర అరిష్ట గ్రహ స్థితులతో గ్రహణాలు రావటం స్థాయి పెరగటమైనది. కనుక బంధనం జరిగేది గురువుకి. ఈ గురువే సంతాన కారకత్వ గ్రహం. ఈ సంతానం ఎవరు ?.. మనమే... మనము ఒకరికి సంతానంగా ఉంటున్నాం కదా ! అంతే కాకుండా షట్ చక్రాలలో కంఠ స్థానంలో ఉండే విశుద్ధి చక్రానికి ఆధిపత్య గ్రహం కూడా గురువే. అనగా వాక్ స్థానానికి అధిపతి ఈ గురువు. ఇట్టి గురువుకు రాహువుతో నాగ బంధనం జూన్ 25న జరగనుంది. కనుక అప్పటి నుంచి దాని ప్రభావం మరో ఏడు నెలలు వ్యతిరేకంగా ఉంటుందని భావము. కనుక గురు, రాహు కలయిక, శుక్ర రాహు కలయిక, కుజ రాహు కలయికలు మానవాళికి వివిధ రాశులలో సంచారం చేసే సమయాలలో అనేక సమస్యలను ఇస్తుంటాయి. ఈ సమస్యలు ముఖ్యంగా రాజకీయం మీద మాత్రమే కాకుండా ఇతర అతిముఖ్య అంశాలపై కూడా ప్రభావాలను చూపుతుంటాయి.

గతంలో గురు, రాహు కలయిక జరిగిన సందర్భంలో జన్మించిన వారు కూడా ఉండి ఉంటారు. మరి వారికి ఏ విధంగా ఫలితాలు ఉంటుంటాయి.. ఇప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి ? గతంలో గురు రాహు కలయిక లేని సందర్భాలలో జన్మించిన వారికి ఇప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి ? అసలు ఈ నాగ బంధనం ఎంతవరకు ప్రభావాలని వ్యతిరేకంగా ఇస్తుంది ? ఆ ప్రభావాలు గతం నుంచి ఉండి ఉంటె రాబోయే రోజులలో ఎలా ఉంటాయి. శాస్త్ర రీత్యా ఈ నాగ బంధనం దేశాల నడుమ, రాష్ట్రాల నడుమ యుద్ధ భయ వాతావరణం ఏర్పరుస్తుందా? విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహ, సంతాన, దాంపత్య, రుణ, రోగ, శత్రు.. ఈ విధమైన అంశాలలో ఎలాంటి ప్రభావాలను చూపిస్తుందనే అంశాలను పూర్తి స్థాయిలో విశదంగా తదుపరి ధారావాహిక పోస్టింగ్ లలో  తెలుసుకుందాం.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.