శత్రుదేశాలతోనూ, రాష్ట్రాలతోనూ స్నేహాన్ని ఎలా చేయాలనే విషయంలో విజ్ఞులిచ్చే సలహాలు పాలకులు స్వీకరించలేరు. ఆర్ధిక రాజకీయ సామాజిక స్థితి స్తబ్దతను సమర్ధవంతమైన శక్తియుక్తులతో తొలగించే ప్రయత్నాలు చేస్తుంటారు. పరిపాలనలో ఆధిపత్యపోరు అధికమగును. భారీ కాంట్రాక్టులు, ఒప్పందాలు, విద్యా, వైద్య వ్యవస్థలు కలుషితమగును. మత్తు పదార్ధాల దొంగరవాణాను అరికట్టలేరు. పాలకులే ఆలయసంపదను దోపిడీ చేయాలనే దౌర్భాగ్యపు ఆలోచనతో వుంటారు. శుభకార్యాలలో పసిడి వినియోగం తగ్గక, మోజుపడే వారి సంఖ్య పెరుగును. అంతర్జాతీయ మార్కెట్లో బంగారు కుంభకోణంలో కీలకవ్యక్తులు భారతీయులుగా వుండే అవకాశం ఉంది.
బూటకపు ఎన్కౌంటర్లు పెరుగును. రాజకీయ రంగ స్త్రీలకున్న ఉగ్రవాద ముప్పును పసిగట్టలేరు. రసాయన ఆయుధాలతో సరిక్రొత్త పోకడలతో దుష్టులు చేపట్టే చర్యలతో శాంతి మార్గం కరువగును. మావోయిష్టుల ప్రాబల్యం పెరిగి కొన్ని రాష్ట్రాలలో నేతలు హతమవుదురు. మతతత్వ చాందసవాదుల విధ్వంసకర కార్యకలాపములు అధికమగును.
ప్రకృతి వైపరీత్యా సమయాలలో బుద్దిబలంతో రక్షణశాఖ వారు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టి ప్రాణనష్టాన్ని అరికట్టుదురు. బుద్ధిబలంతో రక్షణశాఖవారు శత ప్రయత్నాలు చేసినా, శత్రువులను ఎదుర్కొనలేరు. ముఖ్యనేతలపై జరిగే విద్రోహచర్యలను సమర్ధవంతంగా అరికట్టలేరు. రౌడీయిజంపై ధైర్యసాహసాలతో పరిపాలనాపర నిర్ణయాలను తీసుకొనలేరు.
సస్యాధిపతి శని, ధాన్యాధిపతి శుక్రునకు పరస్పర మిత్రత్వం ఉన్నందున నిత్యావసర వస్తు నిల్వదారులపై చర్యలు తీసుకునే నాధులుండరు. రైతాంగం కల్తీ సస్యాలను వినియోగించి నష్టపోవుదురు. నకిలీ వాణిజ్యం చేయు మేధావులు తయారగుదురు. స్టాక్ మార్కెట్ పలుమార్లు పతనం కావటంతో, భారీ కంపెనీల షేర్ మార్కెట్ విలువలు పడిపోవటంతో, కొంతమంది దారుణంగా దెబ్బతిని ఆత్మహత్యలకు గురికాగల సూచన వుంది. మాయలతో మోసాలతో వాణిజ్య రంగాన్ని దెబ్బతీయాలనే దుష్ట శక్తుల కుట్ర రట్టగును.
ఫోనుబాంబులు, టిఫిన్ బాక్స్ బాంబులు అధికమగును. రైలు రోడ్డు ప్రయాణీకులకు దోపిడీ బాధలు తప్పవు. భారతీయ విమానానికి బాంబు బెదిరింపు లేక హైజాకింగ్ జరిగే సూచన. ప్రసారమాధ్యమాలపై దాడులు జరుగును. స్త్రీ రాజకీయ నేతలపై జరిగే ప్రత్యక్ష దాడులను ఆపలేరు. ఉగ్రవాద, మావోయిష్టుల చిట్టాలో ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముఖ్య రాజకీయ నేతలు చేరుదురు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి శివాలయంలో ధూప, దీప, నైవేద్య, కర్పూర హారతులు సక్రమంగా నిర్వర్తించేలా... ప్రతి ఒక్కరు దయచేసి పాటుపడేది. ఋతు ధర్మానుసారం వర్షించాలనే విశ్వాసంతో వరుణ జపాలు, యాగాలను పండితులు అధిక దక్షిణ ఫలాపేక్షణ లేకుండా లోక కల్యాణం కొరకై చేసేది. పుష్యమి, ఆశ్లేష, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములు పూర్తిగా ఉన్న సమయాలలోనే ఈ వరుణ జపాలు, యాగాలు చేయటానికి ప్రయత్నించాలి.
ప్రజలందరూ యజ్ఞయాగాది శాంతి క్రతువులు ఆచరిస్తూ, యనలేని సంయమనంతోను, ఓర్పుతోను, మానవతా దృష్టితో వుండాలని భగవంతుని కోరుకుంటూ... సర్వేజన సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు.
ప్రజాకర్షక పధకాలకు ఆర్ధికమాంద్యం ఏర్పడును. కీర్తి ప్రతిష్టలు పెంపొందులాగున నిజనేరస్తులను పల్లకీలలో ఊరేగించుదురు. మాజీ ముఖ్యమంత్రులపై న్యాయస్థానాల ప్రతికూలతీర్పులు. భారతావనిలో ఓ మత ధర్మచార్యుని వివాదంతో తలనొప్పి. పలుమార్లు స్టాక్ మార్కెట్ కుదుపులతో భారీగా నష్టాలు. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో రాజకీయ అస్థిరతలు పెరగటంతో పాలకులకు గడ్డురోజులు.