
1889 జనవరి 1 వ తేదీన సంపూర్ణ సూర్య గ్రహణం సంభవించింది. అప్పటినుంచి ఇప్పటివరకు జనవరి 1 న సూర్య చంద్ర గ్రహణాలు ఏమీ రాలేదు. 121 సంవత్సరాల తదుపరి 1.1.2010 న ఖగోళంలో పాక్షిక చంద్ర గ్రహణం సంభవిస్తున్నది. ఈ గ్రహణం మిధున రాశిలో ఆరుద్రా నక్షత్రంలో కేతుగ్రస్తంగా భారతకాలమాన ప్రకారం 1 వ తేదీ సూర్యోదయానికి పూర్వం (31 వ తేదీ అర్ధరాత్రి ) 12 గంటల 23 నిమిషముల నుంచి 1 గంట 23 నిమిషముల వరకు 60 నిముషాల పాటు పాక్షికంగా చంద్రుడికి గ్రహణం ఆపాదించును. చంద్రుడు గ్రహణానికి ముందు 45 నిముషాల నుంచి ప్రచ్చాయలో ఉన్నందున తేజోవంతమైన కాంతి తగ్గును. 12.23 నుంచి గ్రహణస్పర్శతో మొదలై 1 గంట 23 నిముషాలకు గ్రహణం పూర్తగును. తిరిగి తేజోవంతమైన కాంతి పుంజుకొనుటకు మరో .40నిముషాల కాలము పట్టును. కనుక గర్భవతులు రాత్రి 11.30 నుంచి 2 గంటల వరకు దాదాపుగా 150 నిముషాలసేపు చంద్రుని కాంతి సోకని ప్రదేశములలో విశ్రాంతి తీసుకోవాలి. ఈ సమయములో మల, మూత్ర విసర్జనములు చేయవచ్చును. ఆరుద్ర, స్వాతి, శతభిషా నక్షత్ర జాతకులతో పాటు ప్రస్తుత రాహుమహాదశ జరుగుతున్న జాతకులపై గ్రహణ ప్రభావం స్వల్పం. ఆహార పదార్ధాలపై దర్భగానీ, నువ్వులుగానీ వేయవలెనని ధర్మ శాస్త్రమైన నిర్ణయసింధు పేర్కొంది. గ్రహణ పట్టుస్నానం, మోక్షస్నానం ఆచరించాలి. స్నానం ఆచరించే సమయములో ఎట్టి మంత్రాలనుగానీ, భగవత్ నామాలను గానే పఠించరాదు. స్నానమైన పిదపనే మంత్రములను, స్తోత్రములను మననం చేయవచ్చును. గ్రహణ సమయంలో పట్టు స్నానాంతరం జపించే మంత్రములకు సంఖ్యాబలం పెరుగును.
ధర్మ శాస్త్రమైన నిర్ణయసింధు నిర్ణయములు :
1. గ్రహణ సమయంలో చేసే స్నానాలలో మంత్రాలు జపించకూడదు.
2. ముత్తైదువులు పట్టుస్నానంలో శిరస్సు తడవకుండా స్నానం చేయాలి.
3. వైధవ్య స్త్రీలు పట్టుస్నానంలో శిరస్సు తడిపి స్నానం చేయాలి.
4. గ్రహణం ముగిసిన తదుపరి సర్వులు శిరస్సు తడిపి స్నానం చేయాలి.
5 .గ్రహణ సమయంలో ఆహారపదార్ధాలపై నువ్వులుగానీ, దర్భగానీ ఉంచాలి.
2. ముత్తైదువులు పట్టుస్నానంలో శిరస్సు తడవకుండా స్నానం చేయాలి.
3. వైధవ్య స్త్రీలు పట్టుస్నానంలో శిరస్సు తడిపి స్నానం చేయాలి.
4. గ్రహణం ముగిసిన తదుపరి సర్వులు శిరస్సు తడిపి స్నానం చేయాలి.
5 .గ్రహణ సమయంలో ఆహారపదార్ధాలపై నువ్వులుగానీ, దర్భగానీ ఉంచాలి.
6. గ్రహణం ముగిసిన తదుపరి యజ్ఞోపవీతమును మార్చాలి.
ఈ గ్రహణ ప్రభావం జ్యోతిష్య శాస్త్ర రీత్యా మేషరాశి వారికి సోదర స్థానంలోనూ, వృషభ రాశి వారికి ఆర్ధిక స్థితి గతులపైన, మిధున రాశి వారికి వ్యక్తిగత విషయాలలోనూ, కర్కాటక రాశి వారికి ఖర్చు విషయాలపై, సింహరాశి వారికి లాభార్జనలపై, కన్యా రాశి వారికి నిత్య పరిపాలనా విషయాలపై, తులా రాశి వారికి పితృ స్థాన విషయాలపై వృశ్చిక రాశి వారికి ఆయుస్థాన సంబంధితములపై, ధనుస్సు రాశి వారికి కళత్ర విషయాలపై, మకర రాశి వారికి ఋణ, రోగ, శత్రు సంబంధితములపై, కుంభ రాశి వారికి సంతాన విషయాలలోనూ, చివరగా మీన రాశి వారికి వృత్తి, వ్యాపార, విద్య, ఉద్యోగ, ఆరోగ్య, గృహ, మాతృ స్థానములపై ప్రభావం ఉండును గనుక ఆయా రాశుల వారు పై విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.