Friday, March 23, 2012

శ్రీ నందన ఉగాది ఫలితాలు

నాలుగు పాదములతో కలిసిన  కలియుగ ప్రమాణం 4 లక్షల 32 వేల సంవత్సరాలు.  శ్వేతవరాహ కల్పమందలి 7 వ దిన వైవస్వత మన్వతరములోని 28 వ మహాయుగము నందలి కలియుగ మొదటి పాదంలో 5113 వ దైనయు, ప్రభవాది 60 సంవత్సరాలలో 26 వ దైన ఈ సంవత్సరమునకు శ్రీ నందన నామ సంవత్సరముగా పేర్కొందురు.

భానుం నందన నామానాం భాసాచార పరిష్కృతం
మృగేంద్ర వాహనం పంచవ్రక్త్రం దశభుజం భజే



5 శిరస్సులు, 10 భుజములతో ఉండి, సింహ వాహనంపై దేదీప్యమాన వెలుగుతో వస్తున్నభాను దేవత ఈ నందన నామ సంవత్సరానికి అధిదేవత. 

384 రోజులుండే ఈ నందన నామ సంవత్సరమునందలి రాజాధి నవనాయకులలో శుక్రుడు రాజు, మంత్రి పదవులను పొందాడు. సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి అను మూడు పదవులను గురువు పొందాడు. సస్య, నీరసాదిపత్యములను చంద్రుడు పొందగా, రసాధిపత్యమును బుధుడు, ధాన్యాదిపత్యమును శని కైవసం చేసుకొనగా, రవి కుజులకు ఎలాంటి ఆదిపత్యములు లభించలేదు.

ఖగోళంలో పంచ కోణాకార మండలానికి అధిపతిగా ఉన్న శుక్రుడికి రాజు, మంత్రి పదవులు రావటాన్ని విశ్లేషిస్తే ఓ ముఖ్య విషయం తెలుస్తుంది. ప్రత్యేకంగా శుక్రునియొక్క మండలానికున్న పంచకోణాలను పంచ శిరస్సులతో ఉన్న భాను దేవతగా అన్వయించుకొని , రాజు, మంత్రి శుక్రుడే కావటాన్ని విశ్లేషిస్తే చాలా అరుదుగా వస్తున్న ఘట్టం.

384 రోజులుండే ఈ నందన నామ సంవత్సరములో రాజు, మంత్రి శుక్రుడు కావటంచే పాలనాపర నిర్ణయాలు తీసుకోవటంలో ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. అంటే స్వయం నిర్ణయాలకే ప్రాధాన్యత అని అర్థము. అయితే జ్యేష్ట మాసంలోను, మాఘమాసం లోను శుక్రుడు అస్తమించటం వలన 58 రోజులు పాలనకు భంగం ఏర్పడుతున్నది. (అనగా జ్యేష్టమాసంలో 1.6.2012 నుంచి 10.6.2012 వరకు తిరిగి మాఘమాసంలో శుక్ల ద్వాదశి 22.2 .2013 నుంచి 48 రోజులు అంటే ఫాల్గుణ అమావాస్య వరకు శుక్రుడు పాలనలో ఉండడు.)

దీనిని బట్టి నిర్ణీత సమయంగా ఉన్న 384 రోజులలో, 48 రోజుల ముందుగానే రాజు, మంత్రి పదవులను అలంకరించిన శుక్రుడు నిష్క్రమిస్తున్నాడన్నమాట.
కనుక కేవలం 236 రోజులే రాజైన శుక్రుడు పరిపాలిస్తాడు. శుక్రుడు స్త్రీ గ్రహం.
పాలనా యంత్రాంగాలలో స్త్రీల పాత్ర అధికము. రాజకీయ రంగ స్త్రీలు ప్రాధాన్యతను సంతరించుకుంటారు.
సనాతన మార్గవాసులు సంప్రదాయ విలువలను గాలికి వదిలేస్తారు. సినీ రంగ తళుకు తారలకు తీవ్ర సమస్యలేదురగును.
ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో పోటి ఏర్పడి నీచ సంస్కృతికి తెర తీస్తారు. ప్రేమ వివాహాలలో వైఫల్యాలధికము.
తీవ్రవాద, ఉగ్రవాద చర్యలు చాప క్రింద నీరులా అల్లుకుపోవటాన్ని పాలకులు గుర్తించలేరు.
సినీ మాఫియా గణం తమ కార్య కలాపాలను యధేచ్చగా ఉధృతం చేస్తారు.
మత్తుపదార్ధాల దొంగ రవాణా అధికము. ప్రభుత్వ శాకలలో అవినీతి, అశ్లీల కార్యాలు అధికమైనను పాలకులు పట్టించుకోరు.
సాఫ్ట్వేర్ సంస్థలు కొన్ని సమస్యలలో చిక్కుకుంటాయి.
వస్త్ర, టెలికాం, కంప్యూటర్, సినీ మరియు సౌందర్య సాధన వ్యాపారాలలో లోపాలు పెరిగి నష్టాలు చవి చూచుదురు.
విలాస జీవితం గడిపే వారికి, సంపన్న వర్గీయులకు చేదు అనుభవాలు ఎదురగును.
రాజకీయ కక్షలతో రాష్ట్రాల నడుమా, దేశాల నడుమ, ప్రాంతాల నడుమ విరోధాలదికమగును.
అనేకమార్లు స్టాక్ మార్కెట్ కుప్ప కూలుతుంటుంది.
అంతర్జాతీయ వాణిజ్య మార్పులచే పసిడి ధర పెరుగుతుంటుంది.
సేనాధిపతి గురువు యొక్క సాత్వికంచే దుష్టులపై కఠినచర్యలు తీసుకోలేడు.
తరచూ ఉద్త్రిక్త పరిస్థితులూ, అశాంతి కార్యాలు, తీవ్రవాదుల ప్రాభల్యం అధికం.
మతతత్వ ఛాందస వాదుల విద్వంసాలతో భారీనష్టం.
ధైర్య సాహసాలతో రౌడియుజంపై ఉక్కుపాదం మోపలేరు.
సస్యాధిపతి చంద్రుడు కావటంచే అన్నదాతలు మనఃస్పూర్తిగా వ్యవసాయంపై అభిమానాన్ని పెంచుకుంటారు.
వర్షరుతువులో ఓ పూర్ణిమ అధికంగా రావటంచే పాడిపరిశ్రమకు మంచి రోజులు వస్తున్నవి.
ధాన్యాధిపతి శని 249 రోజులు తులా రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నందున ధాన్యాలకు సరియైన గిట్టుబాటు ధరలు ఉండవు.
మేఘాధిపతి గురువు కావటంచే నైరుతి ఋతుపవనాలు స్వల్ప ఆలస్యంగా వచ్చినను అన్నదాతలకు నష్టం వాటిల్లదు.
జూలై 10 నుంచి 25 వరకు, సెప్టెంబర్ 8 నుంచి 24  వరకు, అక్టోబర్ 24 నుంచి 31 వరకు అధిక వర్షపాతం.
ఆవర్తన మేఘంచే 9 భాగాలు సముద్రంపైనా, 9 భాగాలు పర్వతాలపైనా, 2 భాగాలు భూమిపైనా వర్షించును.
2 భాగాల మోతాదు మించితే రైతాంగం నష్టాలలో కూరుకుపోతారనేది వాస్తవం. కనుక 2 తో సంతోషించాలి.
పుష్కలంగా ధాన్యం పండినను అన్నదాతలకు మార్కెట్ లో సరియైన ధరలు దొరకవు.
జూన్ 22 నుంచి ఆగష్టు 5 వరకు సర్వధాన్యాలకు అనుకూలమైన కాలం కాదు.
అర్ఘాదిపతి గురువు కావటంచే వాణిజ్య రంగం మేధావుల కృషితో విజయమార్గాన వెళ్ళును.
భారతీయ వాణిజ్యం కొత్త పుంతలు త్రొక్కును.
చిన్న ఉత్ప్పత్తులు కార్పొరేట్ రంగంలో హెచ్చు ధరలతో దర్శనమగును.
రసాధిపతి బుధుడు కావటంచే రసవస్తువులైన ఉప్పు, బెల్లం, చక్కర, చింతపండు ధర వరలలో మార్పులుండును.
నీరసాదిపతి చంద్రుడు కావటంచే తీపి మిఠాయి ఉదృతంగా ఉండును.
పారిశ్రామిక రంగం కష్టాలలో నలిగి పోతుంటుంది.
రవాణ, విద్య, వైద్య రంగాలు పూర్తిస్థాయిలో కలుషితమగును.
స్త్రీ, శిశు సంక్షేమ రంగాలు వైభవాన్ని చూపిస్తుంటాయి.
రాజకీయ రంగం సంక్షోభంలో కూరుకుపోవును.
క్రీడారంగ వాసులకు తీపి వార్తలు, చేదు అనుభవాలు మెండు.
ఆధ్యాత్మిక, జ్యోతిష రంగాలపై ప్రజలు మక్కువను, నమ్మకాన్ని పెంచుకుంటారు.
న్యాయరంగం తమ తీర్పులతో ప్రాధాన్యతను సంతరించుకొనును.
బూటకపు ఎన్కౌంటర్లు తగ్గును. శాంతి భద్రతలు దెబ్బతినును.
రక్షణ శాఖ కీర్తి ప్రతిష్టలను పొందలేదు.
వైమానిక రంగానికి సమస్యలతో పాటు, బాంబు బెదిరింపులు ఉండును .
ప్రజా కర్షక పధకాలకు ఆర్ధిక మాంద్యం అడ్డు తగులును.
జలవిద్యుత్ ప్రాజెక్ట్లు నత్తనడకన సాగును.
నిత్యావసర వస్తు నిల్వ దారులపై దాడులు పెరుగును.
దేవాలయ సంపదను దోపిడీ చేసే మేలి ముసుగు వ్యక్తుల గుట్టు రట్టగును.
రైలు, విమాన ప్రమాదాలు, భూకంపాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
స్వాతి నక్షత్రం మంగళవారంతో ఆశ్వీజం ప్రారంభమై, స్వాతి మంగళవారంతో అమావాస్య వచ్చి, స్వాతి కార్తె ఇదే నెలలో మంగళవారంతో రావటం విశేషం. దీని ఫలితాలు నిదానంగా తెలుసుకొందాం.
ఆగష్టు 14 నుంచి 28 వరకు తులా రాసిలో కుజ గ్రహ, శని గ్రహ కలయికలు.
సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 9 వరకు వృశ్చిక రాసిలో కుజ గ్రహ, రాహు గ్రహ కలయికలు.
ఆగష్టు 17 నుంచి నవంబర్ 16 వరకు తులా రాసిలో శని గ్రహ, నీచ రవి ఏక కాల సంచారం.
మే 21 నుంచి జూన్ 4 వరకు వృషభరాశిలో పంచగ్రహ కూటమి. దీని ఫలితాలు నిదానంగా తెలుసుకొందాం.
జూన్ 5 నుంచి 14 వరకు వృషభరాశిలో చాతుర్గ్రహ కూటమి. దీని వివరాలు తర్వాత తెలుసుకొందాం.
2013 ఫిబ్రవరి 21 నుంచి మార్చ్ 4 వరకు కుంభ రాశిలో చాతుర్గ్రహ కూటమి. దీని ఫలితాలు నిదానంగా తెలుసుకొందాం.
2013 జనవరిలో బంగాళాఖాతంలో భీకర తుఫానుకు అవకాశం.
శని, కుజులు ఆగష్టు 15 , శని శుక్రులు నవంబర్ 27 , శుక్ర రాహువులు డిసెంబర్ 12 న కలియుదురు. దీని ఫలితాలు నిదానంగా తెలుసుకొందాం.
2012 ఏప్రిల్ 20 , 21 , 22 , 23 .. మే 12  నుంచి 16 , జూన్ 1 నుంచి 20 , జూలై 15 నుంచి 20 , ఆగష్టు 13 నుంచి 19 , అక్టోబర్ 1 నుంచి 26 , నవంబర్ 25 , 26 , 27 .. డిసెంబర్ 10 , 11 , 12 , 13 .. 2013 జనవరి 5 , 6 , 7 ... పిబ్రవరి 7 నుంచి 26 తేదిలలో వ్యతిరేక గ్రహస్థితులు ఉన్నందున, దాని ఫలితాలు ప్రజలపై ఉంటాయని భయందోళనలు చెందవద్దు. సరియైన పరిహారలతో చక్కని రాజమార్గాలను ఆచరిస్తూ, ద్వాదశ రాసులవారు అధిక లబ్దిని పొందవచ్చు. వివరాలు నిదానంగా తెలుసుకొందాం.
ధను, మీనరాసులవారికి ఆదాయం 5  ఉంటే ఖర్చు భాగం 14 ఉందని బాధపడకండి. మంచి వివరాలు అతి త్వరలోనే తెలుసుకుందాం.
మేష, వృశ్చిక రాసులవారికి ఆదాయం 2 ఉంటే ఖర్చు 8 భాగాలని విచారించకండి.  తీపి వార్తలు  అతి త్వరలోనే తెలుసుకుందాం.
వృషభ, కర్కాటక, తులా రాశులవారికి 3 భాగాలు అధికంగా వ్యయం ఉందని ఆలోచించకండి. ఈ వ్యయం ఎందుకోసమో త్వరలోనే తెలుసుకుందాం.
మిధున, కన్య రాశులవారికి 3 భాగాలు ఆదాయం మిగిలిందని సంతోషించండి. వివరాలు మరిన్ని తెలుసుకుందాం.
అన్ని రాశుల కంటే సింహ రాశి వారికే 9 భాగాలు ఆదాయం మిగిలిందని నిద్ర పోకండి. వివరాలు తెలుసుకొని మరింత లబ్దిని పొందండి.
మకర కుంభ రాశులకి వచ్చిన ఆదాయం అంతా ఖర్చైందని నివ్వెర పోవద్దు. తియ్యటి వివరాల కోసం వేచి చూడండి.
ఈ నందన నామ సంవత్సరం ప్రతి ఒక్కరికి సకల శుభాలను అందించాలని మనసారా కోరుకుంటున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కో రాశికి పూర్తి వివరాలను తెలియచేస్తాను. మరొక్కసారి మీ అందరికి ఈ నందన సంవత్సర శుభాకాంక్షలు. 


- పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.