Wednesday, June 9, 2010
వరుసగా కూలుతున్న ధ్వజ స్తంభాలు అరిష్టానికి సంకేతాలా ?
జూన్ మూడవ తేది వరంగల్ జ్కిల్లాలో ఓ ధ్వజ స్థంభం ఒరిగిపోవటం, ఆపై రెండు రోజుల్లకు విశాఖ జిల్లాలో మరో ధ్వజం పడిపోవటం, ఈరోజు ఏకంగా మూడు ధ్వజాలు నేలకొరగటం జరిగింది. ఆశ్చర్యమేమిటంటే ప్రకాశం జిల్లాలో ఈరోజే ప్రతిష్ట చేస్తున్న ఓ రాతి ధ్వజ స్థంభం అనుకోకుండానే రెండు ముక్కలు కావటం ప్రజల మనసులను కలవర పెడుతున్నాయి. మే ఇరవై ఆరు నుంచి పదిహేను రోజుల వ్యవధిలో ఇలా ధ్వజాలు పడిపోవటం ఆంద్ర రాష్ట్రానికి మహా అరిష్టమనేది మరో రకంగా చెప్పనవసరం లేదు.
మే తొమ్మిది 2010 పూర్వాభాద్ర అనే గురు నక్షత్రంతో మొదలై మే ఇరవై ఆరు విశాఖ అనే గురు నక్షత్రం వరకు మీనం అనే జల రాశి నుంచి కర్కాటకం అనే జల రాశి వరకు అయిదు రాశులలో అయుదు గ్రహాలూ వుండి, డిగ్రీలలో చూసినప్పుడు కుజును యొక్క ఆచ్చాదన గురువుపై వుండటం ఓ అరిష్టమనే సంగతి భక్తి టీవీలో ఇరవై అయుదు రోజుల క్రితమే చెప్పటం జరిగినది. ఇకపై రాబోయే రోజులలో ఎలాంటి విపత్తులు రాకుండా ప్రజలందరూ శుభిక్షంగా ఉండటానికి, లయకారకుడైన శుభంకరుడైన ఆ శంభోశంకరుడిని ఆనంద తాండవ మొనర్చే విధంగా ఉండాలంటే ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖవారు శివాలయాలలో జరిగే స్వామివారికి అపచారాలు జరగకుండా ఉపచారాలు జరిగేవిధంగా తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేనిచో ఈ అరిష్టాలు పెరిగి మొదటికే మోసం రాగలదు. తస్మాత్ జాగ్రత్త
Monday, June 7, 2010
భద్రాద్రి రాముడు జల సమాధి కానున్నాడా ?
ఆంద్ర రాష్ట్రంలో భద్రాచలంలో నాలుగు శతాబ్దాల క్రితం రామదాసుచే నిర్మితమైన సీతారామ స్వామి ఆలయం భారతదేశంలోనే గుర్తుంపుపొంది చరిత్ర ప్రసిద్ధినొందింది. భద్రాచల చరిత్ర భవిష్య కాలంలో కాల గర్భంలో కలిసే అవకాశాలు అత్యధికంగా వున్నాయి. గోదావరి నదిపై నిర్మితమయ్యే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకుంటే భద్రాచల రామాలయం పూర్తిగా జల సమాధి కానున్నది. రాబోయే రోజులలో చైత్ర మాసంలో సీతారామ కళ్యాణాలు ఇక జరగవేమో అనే భయం అందరియందు ఉత్పన్నమవుతున్నది. ఖమ్మం జిల్లాలో మూడు వందల గ్రామాలు నీటి ముంపునకు గురికాబోతున్నాయి. లక్ష మంది ప్రజలు నిర్వాసితులు కాబోతున్నారు.ప్రభుత్వం తరఫున ప్రాజెక్ట్ కి సంబంధించిన నిపుణులు ఇచ్చిన నివేదికల ప్రకారం, భద్రాచల రామాలయం పూర్తిగా జల సమాధి కాబోతున్నది అనే వార్త విని ప్రజలేవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఈ పోలవరం ప్రాజెక్ట్ అవసరమా, బద్రాద్రి రామాలయం ముఖ్యమా అనే చర్చలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ వలన ఆంద్రప్రదేశ్‌లో నాలుగు జిల్లాలకు పూర్తిగా మంచి నీటి సౌకర్యం ఏర్పడటమే కాకుండా, ఏడు లక్షల ఎకరాలకు నీరు అందనుంది. మరి బద్రాద్రి రాముడు ముంపునకు గురి కాకుండా వుంటే... నాలుగు జిల్లాలకు నీటి సౌకర్యంతో పాటు ఏడు లక్షల ఎకరాలకు.. ఆయన కరుణతో నీరు అందించాగలడా అని వితండ వాదం చేసే వారు కూడా వున్నారు.
ఇంతకీ బద్రాద్రి రామాలయానికి ఈ ముప్పు తప్పుతుందా ? ఎంతో మంది న్యాయవాదులు సర్వోన్నుత న్యాయస్థానానికి వెళ్లి భద్రాద్రి రామున్ని ముంచుకోస్తోన్న ముప్పు నుంచి తప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.... వేచి చూడాలి మరి... ధర్మ ప్రభువుగా వున్న బద్రాచల రామునికి 1999 నుంచి అధర్మంగా వివాదంతో కళ్యాణాలు చేయటం మొదలుపెట్టారు ఆలయ అధికారులు మరియు పండితులు. ఈ విధమైన కళ్యాణాలే 26 మార్చ్ 1999 న మొదటిసారి, రెండవసారి 13.4.2000 న, మూడవసారి 4.4.2009 న ధర్మ శాస్త్రాలకు వ్యతిరేకంగా స్వామివారికి అధర్మంగా జరిగాయి. ఇప్పటికైనా కొంతమంది పీటాదిపతులు, ఆలయ అర్చకులు ఉన్నతాధికారులు మేల్కొనాలి.
*గమనిక : బద్రాచలంలో పాంచరాత్ర ఆగమ పండితుల నిర్వాకమే, ఆ స్వామి అరిష్టానికి హేతువు అవుతున్నది. ఈ విషయంలో పూర్తి నగ్న సత్యాలతో తదుపరి పోస్టింగ్ లో చుడండి.
Sunday, June 6, 2010
శ్రీ కాళహస్తి మహారిష్టానికి మహా శాంతి
శ్రీకాళహస్తి కి వందల ఏళ్ళ పాటు చిహ్నంగా అలరారిన గాలి గోపురం 2010 26 మే రాత్రి 7గంటల 50నిమిషాలకు శిధిల రాశిగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా భక్తులను కలచి వేస్తోంది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం లేదంటూ దేవదయ ధర్మదయ శాఖా మంత్రి గాదె వెంకట రెడ్డి తన అసమర్ధత చాటుకొన్నారు.గాలి గోపురం క్రింద దాదాపు 270కోతులు, మరో ఇద్దరు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఓ చిన్న కోతి పిల్ల మాత్రం బతికి బయట పడగలిగింది. గాలి గోపురం కూలడం ఒక అరిష్టానికి ఓ అంచనా. దాని క్రింద కోతులు మృతి చెందటం మరో అరిష్టం. కోతుల మృత కళేబరాలు, మానవ మృతదేహాలు శిధిలాల క్రింద వుండగా, గర్భాలయంలో స్వామి వారికి పూజలు చేయటం మహా అరిష్టం. దీనిపై ప్రభుత్వం గానీ, ఆలయ పాలక మండలి గానీ పెదవి విప్పకపోవడం శోచనీయం.
2009 సంవత్సరం జూన్ 22న ముక్కంటి ఈశ్వరుడు ముందే జాగ్రత్త పడుతున్నాడా ? అనే పోస్టింగ్ లో శ్రీ కాలహస్తీశ్వరునికి అర్ధాష్టమ శని ప్రారంభమైనదని, 2009 జూలై 20న గ్రహణం రోజున దైవ దర్శనమా ? అనే ఆశక్తికరమైన విషయాలు గ్రహభూమి బ్లాగులో వుంచటం జరిగింది.
వాయులింగేశ్వరుడిగా ప్రసిద్ధికెక్కిన శ్రీ కాళహస్తి రాజగోపురం క్రింద వాయు పుత్ర అంశకు చెందిన వానరాలు మృతి చెందడం మహా తప్పిదం. ఈశ్వరుని వీర్యాన్ని వాయుదేవుడు అంజనీదేవి గర్భంలో ఉంచినందున, జననమే వాయుపుత్రుడైన ఆంజనేయ స్వామి. పరోక్షంగా ఈశ్వర పుత్రుడే ఆంజనేయ స్వామి. వాయులింగేశ్వరుడికి ఈ క్షేత్రంలో మహా అరిష్టం ఏర్పడినందుకు, దీనికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ మహా శాంతి జరపవలసి వుంది. శ్రీ కాళహస్తికి వెళ్ళిన భక్తులందరికీ అక్కడ స్వామిని ఈశ్వరుడిగా భావించరు. రాహు కేతువులుగా దర్శించుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం గత 2దశాభ్దాలుగా దేవస్థాన ఆదాయం కోసం రాహు కేతువుల పూజలు చేయటం, ఇవి కూడా తప్పుల తడికగా చేస్తున్నందున స్వామి వారికి ఈ పూజలు మహా అరిష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి.
2010 జూన్ 7 సోమవారం హనుమజ్జయంతి పర్వదినం. అలాగే జూన్ 13వ తేది ఆదివారం ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఆరుద్ర శివుని జన్మనక్షత్రం అందుకే 7వ తేది సోమవారం హనుమజ్జయంతి నుంచి 13వ తేది ఆరుద్ర నక్షత్రం ఆదివారం వరకు ప్రతిరోజు రాహు కాల సమయంలో భక్తులందరూ భక్తి ప్రపత్తులతో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ప్రపంచ వ్యాప్తంగా రాహుకాల సమయాలు మారుతూ వుంటాయి.
ఇంతకీ ఏ సమయంలో రాహుకాలం పాటించాలి అంటే..... సూర్యుడు 6గంటలకు ఉదయించి సాయంత్రం 6గంటలకు అస్తమిస్తే, దినప్రమానం 12గంటలు వుంటుంది. దీనిని 8 సమభాగాలు చేయగా, ఒక్కో భాగమునకు ఒకటిన్నర గంట వచ్చును. ఈ 8 సమభాగాలలో మొదటి గంటన్నర భాగాన్ని ఏ వారమునకు కేటాయించలేదు. రెండవ భాగాన్ని సోమవారానికి, మూడవదాన్ని శనివారానికి, నాల్గవదాన్ని శుక్రవారానికి, అయిదవ భాగాన్ని బుధవారానికి, ఆరవదాన్ని గురువారానికి, ఏడవభాగాన్ని మంగళవారానికి, ఎనిమిదవ భాగాన్ని ఆదివారానికి కేటాయించటమైనది. ఇది సూర్యోదయ, సూర్యాస్తమయములు ఉదయం 6గంటలు సాయంత్రం 6గంటలు అయినచో రాహుకాలం ఏ విధంగా వుంటుంది అనే చెప్పే ఓ ఉదాహరణ మాత్రమే.
పై ఉదాహరణ ప్రకారం 7వ తేది సోమవారం నుంచి 13వ తేది ఆదివారం వరకు ప్రతిరోజూ రాహుకాల సమయాలను గణించుకొని.... భక్తులు వ్యక్తిగతంగా గాని సామూహికంగా గాని హనుమాన్ చాలీసా పారాయణ చేసి, శ్రీ కాళహస్తి మహా పుణ్య క్షేత్రానికి ఆపాదింపబడిన మహా అరిష్టానికి తగ్గ మహా శాంతి పారాయణ క్రతువులో పరోక్షంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని విశ్వసిస్తున్నాను..... శ్రీనివాస గార్గేయ.
Friday, March 19, 2010
శ్రీ వికృతి నామ సంవత్సర లఘు ఫలితాలు - 2
ఉత్తర భారతంలో వర్షములధికమై నదులు పొంగి ప్రవహించును. మన రాష్ట్రంలో కరువు రాజ్యమేలుతుండును. ఆంధ్రప్రదేశ్‌లో రైతాంగం తుఫాను కోసం పరితపించే రీతిలో పరిస్థితులు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. వికృతి లో ఋతుధర్మానికి వ్యతిరేకంగా వర్షములున్నందున పంటలు ఆలశ్యంగా ఇంటికి చేరును. మినుములు, నువ్వులు, పెసలు పుష్కలంగా పండును. మిరప ఆటుపోట్లకు గురికాగలదు. దక్షిణాయనంలో యందు మిర్చికి అధిక ధరలుండును.
జూలై, ఆగష్టు నెలలలో అధిక ధరలకు కొంత కళ్ళెం పడును. మత్తు పానీయాల తయారీలోనూ, బెల్లం పరిశ్రమపైననూ నిబంధనలు విధించు అవకాశాములున్నవి. టోకు వర్తకులు ప్రజల నుంచి ధాన్యాలను కొనుగోలు చేసి స్వార్ధచిత్తంతో నిల్వవుంచి తద్వారా అధిక రేట్లతో వినియోగదారులను పలు సమస్యలకు గురిచేయుదురు. శుభకార్యాల పరంపరలో బంగారు వినియోగం తగ్గుముఖం చెందును. బంగారు బిస్కెట్ల కుంభకోణం ఆలశ్యంగా వెలుగు చూసే అవకాశముంది. కాస్మోటిక్స్ వ్యాపారాలత్ ప్రజలు మోసపోవుదురు. స్టాక్ మార్కెట్ అనేకమార్లు మదుపరులను నష్టాలబాటలో పయనింపజేయును. నేర ప్రపంచంతో ప్రజలందరూ భీతిల్లుతుందురు.
ఏప్రిల్ 14 నుంచే ఏర్పడే కుంభమేళా పవిత్రామావాస్యపై ఉగ్రవాదుల దుష్టచర్యలు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ప్రభుత్వాలు చేయాల్సి ఉండటమేకాక, ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలతో ప్రజల రక్షణకు బాసటగా నిలవాల్సిన అవసరం వుంది. 2010 లో రాజధాని ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలకు వచ్చే క్రీడాకారులతో సమస్యలు రాగల అవకాశం వుంది. ప్రభుత్వం ముందు చూపుగా చర్యలు గైకోనేది. లేనిచో సమస్య జటిలమగును.
భారత్, పాక్ సరిహద్దులలో స్వల్పంగా కాల్పులు ఉందునేగానీ యుద్ధం రాదు. అయిననూ పాకిస్తాన్ నుంచి ఘర్షణ ఎక్కువగా ఉండును. బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్,భారత్‌లలో కారుబామ్బులు అధికమగును. అమెరికా, బ్రిటన్ దేశాలపై రసాయన ఆయుధాలతో సరిక్రొత్త పోకడలతో గురిపెట్టు సూచన వుంది. పాలస్తీనాలో శాంతి మార్గం కరువగును. చైనాకు చెందినా ఓ మత ధర్మాచార్యుని పెత్తనం శ్రుతిమించుతుంది. భారత్ చైనాల మధ్య ఈ ధర్మాచార్యుతో వివాదాలు వచ్చి నష్టంవాటిల్లే సూచనుంది. నేపాల్‌లో మావోయిష్టు మారణకాండ శ్రుతిమించును.
శ్రీ విరోధిలో దక్షిణాయనం ప్రారంభమైన 7 వరోజునే సంపూర్ణ సూర్యగ్రహణం గోచరించగా, శ్రీ విక్రుతిలో ఆదివారం అమావాస్య సంపూర్ణ సూర్యగ్రహణం జరిగిన 7 వరోజునే దక్షిణాయనం ప్రారంభమవుతున్నది. విక్రుతిలో 2 సార్లు, ఒకే చాంద్రమాన మాసంలో పూర్ణిమ,అమావాస్యకు సంపూర్ణ సూర్యగ్రహణం - మార్గాశిరంలో పూర్ణిమకు సంపూర్ణ చంద్రగ్రహణం, అమావాస్యకు పాక్షిక సూర్యగ్రహణం జరగనున్నవి. ఈ నాల్గు గ్రహణాలు దనూ, మిధున రాశులలో సంభవించనున్నవి. మార్గాశిరంలో సంభవించనున్న పూర్ణిమ, అమావాస్య గ్రహణాలు రెండూనూ మంగళవారాలే వస్తూ, రెండూ గ్రహణాల మధ్యన ధనుస్సు రాశిలో కుజ, రాహువుల కలయిక జరుగుచూ, కన్యారాశి నుంచి ధనస్సువరకు 4 రాశులలో సప్తగ్రహ ఆచ్చాదన ఉండటంచే ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలకు హేతువగుచున్నది.
జూన్ 5 శనివారం నుంచి 12 శనివారం వరకు, జూన్ 22 మంగళవారం నుంచి 29 మంగళవారం వరకు, జూలై 6 మంగలవ్చారం నుంచి 13 మంగళవారం వరకు ప్రకృతి వైపరిత్యములు జరుగు అవకాశాములున్నవి. సముద్ర సంబంధ కంపనములు అధికముగా ఉండును. సముద్ర కెరటములు విపరీతముగా ఎగిసిపడే సూచనున్నందున, జాలర్లు, విహార యాత్రికులు సముద్ర చెంతకు వెళ్ళవద్దని సలహా ఇవ్వటమైనది.
27 జూలై 2010 మంగళవారం నుంచి 3 ఆగస్టు మంగళవారం వరకు 8 రోజులు ప్రపంచ ప్రజలు అప్రమత్తులై వుండాలి. వైమానిక సంబంధంగా, రాజకీయ సంబంధంగా, ప్రకృతి వైపరీత్యా సంబంధంగా, ఉగ్రవాద సంబంధంగా, సమస్య ఏదైననూ ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లలో ఉండాల్సిన అవసరముందని తెలియజేస్తున్నాను.
2010 నవంబర్ 10 నుంచి 20 వరకు పలుచోట్ల ప్రేలుడు పదార్ధాలను విస్పోటనాలకు ఉపయోగించగా, ప్రేలకుండా ఉన్నవాటిని కనుగొను సూచన. 2010 డిశెంబర్ 16 గురువారం నుంచి 23గురువారం వరకు ధనస్సులో రవి, బుధ, రాహు, కుజులు చాతుర్గః కూతమిచే తూర్పు ఆశియా, ఫసిఫిక్, యూరప్ మరియు భారత్ కు ఈశాన్య ప్రాంతాలలో భూ మరియు సముద్ర కంపనముల తీవ్రత వున్నది. 2010 జనవరి 3,4,5 తేదీలలో ధనస్సులో రాహు, కుజ, బుధ, చంద్రుల చాతుర్గ్రహ కూతమిచే ప్రకృతి వైపరిత్యములకు తావు కలదు. ప్రజలు భయపడవలసిన అవసరం లేదు.
నవమేఘ నిర్ణయానుసారం పుష్కర నామమేఘం మేరు పర్వతమునకు ఈశాన్య భాగంలో ఉద్భవించుటచే, ఈ సంవత్సరంలో 2 భాగములు వర్షము, 4 భాగములు గాలి ఉండును. సముద్రములపై 10 భాగముల వర్షము, పర్వతములపై 7 భాగముల వర్షము, భూమిపై కేవలం 2 భాగములే వర్షించును. అందుచేత ఆంధ్రరాష్టంలోని ప్రతి గ్రామ శివాలయాలలో ధూప, దీప, నైవేద్య, కర్పూర హారతులను, సక్రమముగా చేయులాగున ప్రతి ఒక్కరూ పాటుపడేది. అంతేకాక పుష్యమి, ఆశ్లేష, ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములు పూర్తిగా వున్న సమయములలోనే వరుణ సంబంధ జపములుగానీ, యాగములుగానీ చేయులాగున ప్రయత్నించేది. భూమిపై 2 భాగములే వర్షమున్నదని పంచాంగాలలో వుంటే వరుణయాగాలు చేస్తే వర్షం పెరుగుతుందా? అనే ఆలోచనలో ఎంతోమంది ఉండవచ్చు. ఆ 2 భాగాల వర్షమే... స్వల్ప, స్వల్పంగా సంవత్సరమంతా వర్షించకుండా... అన్నదాతకు అవసరమైన సమయంలోనే వర్షిస్తే .... చాలు. ఇందుకోసమే ఋతుధర్మానుసారం వర్షించాలనే విశ్వాసంతో వరుణ సంబంధ జపాలు, యాగాలను దక్షిణ సంబంధ ఫలాపేక్ష లేకుండా చేసేది.
ప్రజలందరూ యజ్ఞయాగాది శాంతి క్రతువులు ఆచరిస్తూ, ఎనలేని సంయనంతో, ఓర్పుతో, మానవతాదృష్టితో ఉండాలని భగవంతుని కోరుకుంటూ.. సర్వేజనా సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు ... శ్రీనివాస గార్గేయ
Tuesday, March 16, 2010
శ్రీ వికృతి నామ సంవత్సర లఘు ఫలితాలు
శ్లో : వికృతౌ ప్రకృతిర్యాతి వికృతిం వికృతి స్తథా
తథాపిమోదతేలోక శ్చాస్మి వికృతివత్సరే
శ్రీ వికృతి సంవత్సరంలో ప్రకృతి వికృతి అగును. వికృతి ప్రకృతి అగును. అయిననూ ప్రజలు సంతోషంతో వుండురని భావము. ఋతుధర్మాలకు వ్యతిరేకంగా స్థితిగతులు ఉండగలవని యోచించాలి. శ్రీ వికృతి సంవత్సరంలో రాజ్యాధిపత్యము, సేనాధిపత్యము, అర్ఘాదిపత్యము, మేఘాదిపత్యమను నాలుగు ఆదిపత్యములు కుజ గ్రహానికి రాగా, మంత్రిత్వము బుధ గ్రహానికి, దాన్యాదిపత్యము గురు గ్రహానికి, సస్య, నీరసాదిపత్యములు శుక్ర గ్రహానికి, రాసాదిపత్యము సూర్యునికి వచ్చి ఈ ఖగోళ రాజ్యాన్ని పాలించుటకు సంవత్సరాది నుండి కుజ, బుధ, గురు, శుక్ర, రావులు సంసిద్ధులగుచున్నారు. శని గ్రహం మరియు చంద్రులకు ఏఒక్క ఆధిపత్యము లభించలేదు.
గ్రహస్థితులను పరిశీలించగా అధిక వైశాఖ మాసముతో 384రోజులు జరిగే శ్రీ వికృతి సంవత్సరానికి రాజు కుజుడు. సంవత్సర ప్రారంభంలోనే నీచ సంచారంతో 72రోజులు, కార్తిక మాసం నుంచి అస్తమయ స్థితిలో 132రోజులు, కన్యా రాశిలో శత్రుగ్రహ శనితో సంఘర్షణ 43 రోజులు పోగా,రాజైన కుజునకు వికృతి సంవత్సర పరిపాలనకు అర్హత కలిగిన రోజులు కేవలం 137మాత్రమె. గణాంకాలు ఇలా వుంటే రాజ్యాదిపత్యం కైవసం చేసుకొన్న రోజు నుంచే శత్రుగ్రహ నక్షత్రమైన పుష్యమిలో కుజుడు ఉండి, సంవత్సరాంతంలో కూడా శత్రుగ్రహ నక్షత్రమైన ఉత్తరాభాద్రలో సంచారం చేయటం గమనార్హం.శత్రు నక్షత్రంలో నీచ స్థితిలో పదవిని అలంకరించి, మధ్యలో శత్రువుతోనే పోరాడి, అధిక కాలం అస్తమయదశలో శత్రు నక్షత్రంతోనే సంవత్సరం ముగియటం అనేది అరుదుగా జరిగే గ్రహస్థితి.
వికృతి సంవత్సర రాజు కుజుని పరిపాలనచే రాష్ట్రాల నడుమ, దేశాల నడుమ విరోధాలు అధికమగును. వింత రోగాలు ప్రబలి, అగ్నిభయములుండి, వ్యవసాయ రంగం తిరోగామనములో ఉంటూ ఉగ్రవాద చర్యలు మితిమీరుతూ అధిక ప్రాంతాలలో అనావృష్టి రాజ్యమేలుతూ, ఋతుధర్మ మార్పులతో ప్రజలకు అసౌకర్యముంటూ ప్రజలు భయపడే అవకాశం వుంది.
నిజ నేరస్తులు రాజాలుగా పల్లకిలో ఊరేగుదురు. హోంశాఖ ఉన్నతాధికారులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేయుదురు. దేశ వ్యాప్త సచివాలయాలలో అవినీతిమయముతో లొసుగులు ఏర్పడి పాలకుల గుట్టురట్టగును. ప్రజల అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి సమన్వయపాత్ర పోషించే ప్రసార మాద్యమాలపై దాడులు జరిగే అవకాసం కలదు. ప్రభత్వ ప్రజాకర్షక పధకాలు సక్రమంగా ప్రజలకు అందనందున సరిక్రొత్త ప్రభువుల కొరకు ప్రజలందరూ వెంపర్లాడుతుండురు.
పాలకులు దైర్య సాహసాలతో పరిపాలన పరమైన నిర్ణయాలను తీసుకోనలేరు. రాజకీయ అస్తిరతలు యేర్పడును. పరిపాలనలో బుద్ధిబలమును ఉపయోగించిననూ శత్రువులను పాలకులు ఎడుర్కొనలేరు. దేశ వ్యాప్త రాజకీయాలలో స్త్రీలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు వాటిల్లే అవకాశము వున్నది. భారీ వ్యాపార రంగములు అనుకోకుండా ఆటుపోటులను ఎదుర్కొనటంతో, దాని ప్రభావంతో కొన్ని రాష్ట్రాల భవితవ్యం బీటలువారును.
తరువాయి భాగం మరు పోస్టింగ్ లో