Sunday, May 21, 2023

పితృ దోషం అదృష్టాన్ని తరిమివేస్తుంది

పొన్నలూరి శ్రీనివాస గార్గేయ, 9348632385

ముఖ్యంగా త్రిశక్తులలోని  దేహ శక్తి, విద్యా శక్తి, ధన శక్తి అను మూడు శక్తిలకు అధిదేవతలు దుర్గా, సరస్వతి, లక్ష్మి. ఈ మూడు శక్తులు ప్రతి వ్యక్తికి ముఖ్యావసరము. ఈ మూడు శక్తులలో లగ్నం నుండి దేహ శక్తి, పంచమం నుండి విద్యా శక్తి. తొమ్మిదవ స్థానం నుంచి ధన శక్తి లభించును. ఈ తొమ్మిదవ స్థానాన్ని భాగ్య స్థానం అంటారు. లగ్న, పంచమ, నవమ స్థానాలను త్రికోణములు అంటారు. త్రి శక్తులకు మూలము త్రికోణములే. 

సహజంగా జాతక కుండలిని పరిశీలించే సమయంలో నాల్గవ స్థానాన్ని బట్టి విద్య, ఉద్యోగము, ఆరోగ్య స్థితి గతులన్నీ తెలుస్తాయి. అలాగే లగ్నం నుంచి రెండవ స్థానాన్ని ధన, కుటుంబ స్థానం అంటారు. విద్యా స్థితిగతులు నాల్గవ స్థానం నుంచి, ధన వ్యవహారాలన్నీ రెండవ స్థానం నుంచి తెలుసుకోవచ్చును. 

కానీ లగ్న, పంచమ, నవమ స్థానాలనే త్రికోణ స్థితి గతులను బట్టి కూడా మరింత అధికంగా యోగాలను, అవయోగాలను తెలుసుకోవచ్చును. త్రికోణాలలో భాగ్య కోణం అనగా తొమ్మిదవ స్థానాన్ని అదృష్ట స్థానము అంటారు. ఈ స్థానము దెబ్బతింటే ధన యోగము లేనట్టుగానే భావించాలి. ఇక్కడ అదృష్టము అనేది కేవలం డబ్బులు గురించి మాత్రమే కాదు, అదృష్టము అనేది ఏ రూపం నుంచి అయినా రావచ్చును. 

ఈ నవమ కోణానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మి దేవి. అందుచేతనే ప్రధానంగా భాగ్య స్థానమే ధన యోగమునకు మూలమైనది. జాతక చక్రంలో రెండవ స్థానంలో ధన విషయాలు తెలిసినప్పటికీ భాగ్య స్థానం నుంచి కూడా మరింత లోతుగా అదృష్ట యోగాన్ని పరిశీలించవచ్చు.

ఈ త్రికోణాలలో లగ్న కోణం కంటే పంచమ కోణము, పంచమ కోణం కంటే భాగ్య (అదృష్ట ) కోణం బలమైనవి. ఇట్టి నవమ స్థానమనే అదృష్ట స్థానాన్ని బట్టి అత్యధిక భాగం జాతకుల పరిస్థితులను, ప్రభావాలను తెలుసుకొనవచ్చును. ఈ స్థానం ఎంత గొప్పగా ఉంటేనే జాతకులు అంత బలీయంగా ఉంటారని చెప్పటంలో సందేహం లేదు. 

అయితే నవమ స్థానంగా చెప్పబడే అదృష్ట స్థానం 95 శాతం మందికి పూర్తి  స్థాయిలో రాణింపు లేకుండా ఉంటుంది. కేవలం 5 శాతం మందే మిగుల అదృష్టవంతులుగా ఉంటారు. ముఖ్యంగా జాతక చక్రంలో నవమ స్థానం కాకుండా ఇతర స్థానాలలో  దొర్లినప్పుడు అనుకోకుండానే అదృష్ట స్థానం  తక్షణమే దెబ్బతింటుంది.  ఇలాంటి దోషాలను లెక్కిస్తే అనేకం ఉన్నాయి. ఈ అన్నీ దోషాలలోకెల్లా అదృష్ట స్థానాన్ని దెబ్బతీసే మొట్టమొదటి దోషమే పితృ దోషము. 

పితృ కారక గ్రహమే రవి. ఈ రవికి పితృ దోషము ఏర్పడుతుంటుంది. జాతక చక్రంలో రవి ఏ స్థానంలో ఉన్ననూ, గొప్పగా బలీయంగా ఉన్ననూ... కొన్ని కొన్ని కారణాల వలన రవి పితృ దోషానికి లోనగును. ఎప్పుడైతే రవి (సూర్య గ్రహం) పితృ దోషానికి లోనగునో ఆ జాతకులకు అదృష్ట స్థాన ఉనికి దెబ్బతిన్నదని గమనించాలి. కొన్ని కొన్ని జాతకాలలో ఒక పితృ దోషం ఉండచ్చు, మరో పితృ దోషం ఉండచ్చు, ఇంకో పితృ దోషం కూడా ఉండచ్చు. అనగా ఒకటి కంటే అధికంగా కూడా పితృ దోషాలు వస్తుంటాయి. 

ఒక వ్యక్తి జాతకంలో పితృ దోషం ఏర్పడినది చెప్పగానే, ఆ వ్యక్తి తండ్రి పాపాలు చేశాడని, లేదా ఆ వ్యక్తి కుటుంబంలో మరణించిన పెద్దలెవరైనా ఉంటే వారి ఆత్మలకు శాంతి కలుగని కారణం గానే పితృ దోషాలు వస్తుంటాయని అత్యధికులు భావిస్తుంటారు. ఈ మాట వాస్తవమే. కానీ ఈ రెండూ అంశాలు కాకుండా అదనంగా పితృ దోషాలను ఉత్పన్నం చేసే మరో 600 రకాల కాంబినేషన్లు కూడా జాతకాలలో ఉంటాయనే విషయం కొంత మందికే తెలుసు. 

కేవలం తండ్రి పాపాలు చేసినందున మరణించిన పెద్దల ఆత్మల శాంతి కలిగినందున పితృ దోషాలు వస్తున్నాయని అనుకోరాదు. ఇతరంగా చెప్పబడే 600 కాంబినేషన్ల వలన కూడా పితృ దోషాలు ఏర్పడి అదృష్ట స్థానం ఉనికిని కోల్పోయి, ఆ వ్యక్తి విజయ పరంపరలో ఉండక నిర్భాగ్యంతో ఉండటం ఎంతో మంది జాతకాలలో చూస్తుంటాం. 

ఉదాహరణకు భారత దేశంలో ధీరూభాయ్ అంబానీని గురించి తెలియని వారుండరు. వీరికి ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు  కుమారులు. ఈ ఇరువురికీ తండ్రి ఆస్తి పాస్తులు సమానంగా వచినప్పటికీ  పెద్ద వాడుగా ఉన్న ముఖేష్ అంబానికి ఉన్న అదృష్ట జాతకంతో దిన దిన ప్రవర్ధమానమై ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో చేరిపోగా, రెండవ కుమారుడుగా ఉన్న అనిల్ అంబానీకి అదృష్ట స్థానం ఉనికి కోల్పోవటంతో.. తాను చేపట్టిన వ్యాపారాలన్నీ క్రమ క్రమంగా నష్టాల ఊబిలోకి చేరిపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది తమ తమ జాతకాలలో పితృ దోషం వలన అదృష్ట స్థానం యోగాన్ని కోల్పోతున్నారు.

ఇక్కడ అదృష్టం అనగానే వెంటనే ధనంతోనే ముడిపడదు. విద్య, ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపారము, గృహము, బుద్ధిబలం, జ్ఞాన బలము, వివాహము, దాంపత్య జీవితమూ, సంతానం, ఆయుర్భలము మొదలైన ఎన్నో విధాలుగా అదృష్టం ముడిపడి ఉంటుంది. ఎప్పుడైతే పితృదోషం జాతకంలో ఉంటె అదృష్ట యోగం వ్యక్తి నుంచి దూరం అవుతుంటుంది. 

మరి పితృ దోషాలు ఉండేవారికి అదృష్ట యోగం ఏ ఏ వయసులలో దూరమవుతుంది, ఏ ఏ కాంబినేషన్లు ఉంటె అదృష్ట యోగం తొంగి చూడదు అనే అంశాలపై అంచలంచలుగా పూర్తి వివరాలను తెలుసుకుందాం. అలాగే జాతక సరళిలో పితృ దోషాలు ఉన్నప్పుడు, వాటి ప్రభావం అదృష్ట స్థానంపై ఉండకుండా ఉండాలంటే ఏ విధమైన పరిహారాలు చేయాలి అనే అంశంపై కూడా దీర్ఘంగా చెప్పుకుందాం. ఈ పరిహారాలు స్వల్ప కాలమే చేయాలా లేక దీర్ఘ కాలం చేయాలా అనేది... ఆయా జాతక చక్రాలపై ఆధారపడి ఉంటుంది. వీటన్నింటినీ https://www.gargeyaastro.com వెబ్సైటు లో సర్వులకూ అర్థమయ్యేలాగా ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.