Thursday, June 25, 2009

వరుణ యాగం ముహూర్తం సరైనదేనా ?

జూన్ మొదటి వారంలోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించి ఊరించిన ఋతుపవనాలు చివరకు నిరాశ మిగిల్చాయి. ఈ యేడాది దేశం మొత్తం మీద నైరుతి ఋతుపవనాల ప్రభావము సాధారణము కంటే తక్కువే వుంటుందని కేంద్ర భూశాస్త్ర విభాగ మంత్రి పృధ్వీ రాజ్ ఢిల్లీలో చెప్పారు.


ఆంధ్రప్రదేశ్ లో జూన్ లో కనీస వర్షపాతమైనా నమోదు కావాలి. ప్రస్తుతం నేల తదిసేవరకు కూడా పడటం లేదు. పూర్తిగా రాష్ట్రం అంతా వర్షాభావం అలుముకుంది. భారత దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి ఇలానేవుంది. ఇప్పటికే మాంద్యంతో కృంగి పోయిన ఆర్ధికవ్యవస్థకు వర్షాభావ హెచ్చరిక శరాఘాతం కానుంది.

పుష్కలంగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా వుండటానికి వరుణయాగాలు, ప్రార్ధనలు చేయాలని ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సూచించారు. ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు జరపాలని ప్రభుత్వం వారు.... అన్ని మతాల పెద్దలకు విజ్ఞప్తి చేసారు. రాష్ట్రవ్యాప్తంగా 199 పెద్ద, 1819 చిన్న ఆలయాలలో కలిసి మొత్తం 1938 దేవాలయాల్లో వర్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని దేవదాయ, ధర్మదాయ ( దేవాదాయ, ధర్మాదాయ కాదు ) శాఖ మంత్రి గాదె వెంకట రెడ్డి తెలిపారు.

ఈ నేపధ్యం లో తిరుమలలో వరుణ జపాలు, ప్రత్యక పూజలు నిర్వహించనున్నట్లు టి.టి.డి. చైర్మన్ ఆదికేశవులు నాయుడు తెలిపారు. గత యేడాది దాదాపు 40 లక్షలు ఖర్చుపెట్టి వరుణ యాగం చేశారు. అలాగే ఈ సంవత్సరం కూడా హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 108 హోమగుండాలతో జూలై 2 నుంచి 4 వరకు వరుణయాగం చేయనున్నారు టి.టి.డి. వారు.

అయితే మేము తెలియచేసే వివరాలు ఏమిటంటే గతంలోనూ, ఎన్నోసార్లు వరుణయాగాలు చేసి విజయం సాధించని దాఖలాలు వున్నవి. దీనివలన యాగాల కొరకు సొమ్మును వృధా చేస్తున్నారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నవి.వరుణయాగం చేయాలనుకున్నప్పుడు కేవలం సేవాభావంతో, భక్తి తత్పరతతో, విశ్వాసంతో సరైన నక్షత్ర బలంతో పునాది వేస్తే, ఆ భక్తిచే భగవంతునితో బంధం ఏర్పడుతుంది. గనుక ప్రాధమిక విషయాలు గుర్తించకుండా, విపరీతంగా డబ్బు ఖర్చుపెట్టి.... ఫలితాలు రాకపోతే, ఇతరులచే నిందింపబడేదానికన్నా........ ముందుగా జ్యోతిష్య పండితులలో సిద్ధహస్తులైన వారితోనే ప్రభుత్వ అధికారులు చర్చలు జరపాలి........ఏమి చర్చలు ?..... దేని కోసం?

నాచే రచింపబడిన శ్రీ విరోధి సంవత్సర " గ్రహభుమి " పంచాంగం ( పేజీ నెంబర్ 31 ).... " కాలచక్రం " పంచాంగం ( పేజీ నెంబర్ 40 ) లలో ఆఢక మేఘ వాయి నిర్ణయాలు అనే శీర్షికలో జూన్ ఆఖరి నాటి పరిస్థితి తెలియజేస్తూ "త్రాగునీటికి తీవ్ర ఎద్దడి యేర్పడును. ఋతుపవనాలకై వేచి వుందురు." జూలై 4 వ తేది తరువాత వాతావరణము ఆంద్రప్రదేశ్ లో కొన్నిచోట్ల చల్లబడును. బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడినప్పటికీ ఫలితం తక్కువ" అని వ్రాసాను.

నా పంచాంగం లో జూలై 4 తరువాత వాతావరణం చల్లబడును అని వుంది గనుక, 4 వ తేదీతో వరుణయాగం ముగిస్తే.... విజయం పొందామని ఊహించవచ్చు.......... కాని ఫలితం తక్కువేనని నేనంటున్నాను. ఎందుకంటే.... వరుణయాగం చేసే సమయంలో ముఖ్యంగా చంద్రుడు జల సంబంధ రాశులలో వుంది తీరాలి అప్పుడే యాగం విజయవంతమవుతుంది. అనగా చంద్రుడు కర్కాటక, మీన , మకర, రాశులలో వుండి ఇతర గ్రహ సంచారం అనుకూలంగా వుండాలి. అలాంటప్పుడు జూలై 8,9,10 తేదీలలో వరుణయాగ సంబంధిత వేదమంత్రాలు, వరుణప్రియ, అమృతవర్షిణి రాగాలతో సంగీత ఝరి ఏర్పాటు చేస్తే తప్పక వరుణ దేవుడు కరుణించి కటాక్షిస్తాడు.

కాబట్టి టి.టి.డి వారు జూలై 2,3,4 తేదీలు కాకుండా జూలై 8,9,10 తేదీలలో వరుణయాగం ఏర్పాటు చేస్తే, చంద్రుడు మకర రాశిలో వున్నందున పూర్ణ ఫలితం లభిస్తుంది. చెప్పేటంతవరకే నా కృషి..... వినని వారిని భగవంతుడు కూడా ఏమీ చేయలేడు.................. శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.