Saturday, September 9, 2017

వేలాది సంవత్సరాల తర్వాత రానున్న అద్భుత మాలికా యోగం

2017 సెప్టెంబర్ 27 స్వస్తిశ్రీ హేమలంబ నామ సంవత్సర ఆశ్వీజ శుక్ల సప్తమి బుధవారం ఉదయం 9.59 నిముషాలకు మూల నక్షత్రం ప్రారంభం కావటంతో విశేషమైన అరుదైన అద్భుత యోగం ప్రారంభం కానున్నది. ఇక వివరాలలోకి వెళితే ఛాయా గ్రహాలైన రాహువు కర్కాటక రాశిలో ఉండగా కేతువు మకర రాశిలో ఉన్నాడు. సరిగ్గా పై సమయానికి ఖగోళంలో ఉన్న గ్రహ స్థితిని పరిశీలిస్తే ఓ గ్రహ మాలికా యోగం 27 ఉదయం 9.59 నిముషాలకు మూల నక్షత్రంతో ప్రారంభమైనది. సింహరాశిలో కుజ శుక్రులు, కన్యా రాశిలో రవి బుధులు, తులా రాశిలో గురువు, వృశ్చిక రాశిలో శని ఉండగా, చంద్రుడు ఆనాటి ఉదయం 9.59 నిముషాల నుంచి 29 రాత్రి 10.28 నిముషాల వరకు ధనుస్సు రాశిని ఆక్రమించి ఉంటాడు. అంటే దాదాపుగా రెండున్నర రోజుల పాటు ఈ  గ్రహమాలిక యోగము కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు వ్యాపించింది.

ఖగోళంలో గ్రహమాలికా యోగాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. (ఇదేమి కొంతమంది చెప్పే కాలసర్ప దోషము కాదు) దేవి నవరాత్రులలో మూల  నక్షత్రంతో భాసిల్లే సరస్వతి ఆవాహనం దగ్గర నుంచి దుర్గాష్టమి, మహర్నవమి పర్వదినాలు ఈ గ్రహమాలికా యోగంలో ఉండటమనేది అత్యంత అరుదైన విశేషం. ముఖ్యంగా శుభ గ్రహమైన గురువు 7 రాశులలో విరాజిల్లే గ్రహమాలికా యోగానికి మధ్యలో ఉన్న తులా రాశిలో ఉండటం న భూతో న భవిష్యతి.

తులా రాశికి సంకేతం త్రాసు. ఇట్టి త్రాసు ఉన్న రాశిలోనే గురువు ఉండి, అటు 3 రాశులు, ఇటు 3 రాశులకు మధ్యన ఉండటం అద్భుతాలను అందించి న్యాయ నిర్ణేతగా ఉండి తీర్పు ఇవ్వనున్నాడా అన్న చందాన గురువు ఉన్నాడు. ఇక ప్రకృతి రాశి కన్యా రాశిలోకి బుద్ధి కారకుడైన బుధుడు, యోగానికి కొద్దీ  గంటల ముందే విచ్చేసి మహాద్భుతమైన బుధాదిత్య అనే లక్ష్మీ యోగాన్ని అందించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది కూడా ఒక విశేషమే.

సెప్టెంబర్ 27వ తేదీ బుధవారం ఉదయం 9.59 నిముషాల నుంచి 29వ తేదీ శుక్రవారం రాత్రి 10.28 నిముషాల వరకు 7 రాశులలో జరిగే గ్రహ మాలికా యోగం పరోక్షంగా ఆర్ధిక అంశాలపైనా ప్రభావాన్ని చూపిస్తుంది. గురు గ్రహం 7 రాశుల మధ్యలో ఉంటూ బుధాదిత్య యోగంతో భాసిల్లే గ్రహమాలికా యోగం మూలా నక్షత్రంతో ప్రారంభమై సరస్వతి పూజ, దుర్గాష్టమి, మహార్నవమనే మూడు పర్వదినాలలో వ్యాపించి ఉన్న సందర్భంగా ద్వాదశ రాశుల వారు దిగువన చెప్పే మహా యోగ తంత్రాన్ని ఆచరించండి. ఏదో గ్రహ సంచారం వస్తున్నది, సమస్యలు తెస్తున్నదని భావించి పరిహారంగా పాటించాలేమో అని అనుకోవద్దు.

ధర్మ శాస్త్ర నిర్ణయాల ప్రకారం మహర్నవమి పర్వదినాన యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించేవారు శ్వేత తిల ఘృత పాయసాన్నమును బలిహరణముగా వైదిక క్రతువులో చేస్తారు. శ్వేత తిలలు అంటే తెల్ల నువ్వులు. ఘృతము అంటే నెయ్యి. పాయసం చేయాలి అంటే దానికి బియ్యం (తండులాలు) అవసరం. ఈ పాయసం పాలు, సుగంధ ద్రవ్యాలు, బెల్లము తో చేస్తారు. ఇక గ్రహమాలిక యోగంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిలను ఆరాధించే ఈ మూడు రోజులలో శ్వేత తిల మహాయోగ తంత్రాన్ని ప్రతివారు ఆచరిస్తే ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ముగురమ్మల మూలపుటమ్మ అనుగ్రహాన్ని పొందుతూ ఆర్ధిక పటిష్టతకు అవసరమయ్యే ఆలోచనలను పొందుతారని చెప్పటంలో సందేహం ఏ మాత్రం లేదు.

నువ్వులు శని గ్రహానికి ప్రతీకలు. జ్యోతిష రీత్యా చంద్రుడు శనికి అంతర్గత శత్రువు. ప్రతివారు తమ తమ మనోభావాలతోనే జీవన పథంలో అభివృద్ధి చెందుతుంటారు. అధః పాతాళానికి కూరుకుంటుంటారు. ప్రతివారికి మనస్సే చాలా ముఖ్యమైనది. ఇట్టి మనః కారకుడైన చంద్రుడు, శని ఎలాంటి శత్రుత్వాలు లేకుండా దేవి నవరాత్రులలో, ఆర్ధికంగా ఎదగటానికి అవసరమైన మానసిక శక్తిని అందించే యోగ తంత్రమే ఈ గ్రహ మాలికా యోగంలో ఎంతో ఉపయోగపడనుంది.

కనుక శ్రీ హేమలంబ నామ సంవత్సర దేవి నవరాత్రులలో శ్వేత తిల యోగ తంత్రాన్ని ప్రతి వారు రెండు పద్దతులలో ఆచరించవచ్చు. ముందుగానే ఓ 50 గ్రాములు తెల్ల నువ్వులను కొనండి. కొద్ది నెయ్యితో దోరగా తెల్ల నువ్వులను వేయించండి.

ఇక 27వ తేదీ బుధవారం సరస్వతి పూజ రోజున మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 వరకు గల రాహుకాలంలోనూ, మరియు 28 గురువారం దుర్గాష్టమి మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 వరకు ఉన్న రాహుకాలంలోనూ, మరియు 29 శుక్రవారం మహర్నవమి రోజున 10.30 నుంచి 12.00 గంటల లోపల ప్రతివారు దోరగా వేయించిన తెల్ల నువ్వులను కుడి చేతిలో  ఉంచుకొని సూర్య కాంతి చూపించి (సూర్యుని వైపు చూడాల్సిన అవసరం లేదు) మహా ప్రసాదంగా స్వీకరించండి. 

 ఇక రెండవ పద్దతిగా తెల్ల నువ్వులు, బియ్యము, నెయ్యి, బెల్లము, సుగంధ ద్రవ్యాలతో పాయసం చేసుకొని, మీ మీ పూజ మందిరంలోని దేవతలకు నివేదించి, పైన చెప్పిన రాహుకాల సమయాలలో జగన్మాత ప్రసాదంగా స్వీకరించండి. (ఏ సమయంలో నివేదించినను, ఈ రాహుకాల సమయంలో మాత్రమే ప్రసాదంగా స్వీకరించండి) దుర్గాష్టమి గురువారం నాడు భోజనం ముందు చేసినప్పటికీ , రాహుకాలంలోనే ప్రసాదాన్ని తీసుకొనండి.

దక్షిణాయనం ప్రారంభమయ్యే కర్కాటక రాశి నుంచి, ఉత్తరాయణం ప్రారంభమయ్యే మకర రాశి వరకు 7 రాశులలో మధ్య స్థాన శుభగ్రహ గురువుతో, బుధాదిత్య యోగంతో, మూల నక్షత్ర ప్రారంభంతో, సరస్వతి పూజ, దుర్గాష్టమి, మహర్నవమి రోజులతో వచ్చే ఈ యోగం కొన్ని వేలాది సంవత్సరాల తర్వాత వచ్చినదని చెప్పుకోవటంలో అతిశయోక్తి  ఏ మాత్రం లేదు.

ఇట్టి గ్రహ మాలికా యోగ పరంపరలో మహాయోగ తంత్రంగా చెప్పుకొనే శ్వేత తిలల ద్వారా జగన్మాత అనుగ్రహాన్ని పొందటానికి అందరూ ప్రయత్నించండి. -దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Friday, September 8, 2017

గురు గ్రహ గోచార ప్రవేశం - మూర్తి నిర్ణయం విశేషాలు

ఈ 2017 సెప్టెంబర్ 12 ఉదయం 6 గంటల 51 నిముషాలకు గురు గ్రహం తులారాశి ప్రవేశం చేయటంతో గోచారపరంగా ద్వాదశ రాశులకు ఫలితాలు మూర్తి నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ఈ పరంపరలో అనుకూలంగా గోచారంలో ఫలితాలు ఉండి గురు ప్రవేశ సమయ నిర్ణయం ప్రకారం గురు గ్రహ మూర్తి నిర్ణయం లోహ మూర్తి, తామ్రమూర్తిగా ఉన్నప్పుడు అనుకూల ఫలితాలు బదులుగా, వ్యతిరేక ఫలితాలు  ఉంటాయి. అలాగే గోచారంలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వవలసిన సందర్భంలో గురువు మూర్తి నిర్ణయం సువర్ణ లేక రజత మూర్తి మూర్తి రూపాలలో ప్రవేశం ఉంటే సంపూర్ణ అనుకూలతలు కలుగుతాయి.

అయితే అనుకూల ఫలితాలు  వచ్చే సందర్భాలలోనూ, ప్రతికూల ఫలితాలు వచ్చే సందర్భాలలోనూ గురు గ్రహ సంచారానికి ఇతర గ్రహాల వేధలు ఉండవచ్చు. ఇలాంటి వేధలు ఉన్న సమయాలలో ఫలితాలు ఆగిపోతాయి. వ్యతిరేక ఫలితాలు వచ్చే సమయంలో వేధ తగిలితే ఒక విధంగా మంచిదిగానే భావించాలి, ఎందుకంటే వ్యతిరేకతలు ఉండవు కనుక. అదే అనుకూల ఫలితాలు వచ్చే సందర్భంలో వేధ కలిగితే, అనుకూలం ఆగిపోతుందని భావము.

మేష రాశి వారికి సప్తమ స్దాన గురు ప్రవేశం గోచారంలో అనుకూలమై  రజత మూర్తి నిర్ణయం వలన పూర్తి అనుకూలతలు ఉంటాయి. వృషభ రాశి జాతకులకు 6వ స్దాన గోచార ప్రవేశం అశుభమైనప్పటికీ సువర్ణ మూర్తి రూపం కారణంగా మెరుగైన పరిస్థితులు  పొందగలరు. మిధున రాశి వారికి గురువు పంచమ స్దాన  ప్రవేశం అనుకూలంలో ఉన్ననూ, లోహ మూర్తి కారణంగా వ్యతిరేకతలు వచ్చును. కర్కాటక రాశి జాతకులకు చతుర్థ స్దాన ప్రవేశం గోచరంలో వ్యతిరేకంగా ఉన్నప్పటికీ సువర్ణ మూర్తి ప్రవేశమైనందున, అంతా సజావుతో సాగిపోతారు.

ఇక సింహరాశి జాతకులకు తృతీయ గురు ప్రవేశం వ్యతిరేకం కావటం దానికి తోడు, తామ్రమూర్తిత్వంతో ప్రవేశం చేయటంతో మరింత వ్యతిరేకతలు పొందగలరు. కన్యా రాశి జాతకులకు గురు ప్రవేశం గోచరంలో ద్వితీయ స్థానం కావటం అనుకూలము. దీనితో పాటు రజత మూర్తి ప్రవేశం కావటం మరింత మేలైన పరిస్థితి అని భావము. తులారాశి లోకి గురు ప్రవేశం వ్యతిరేకంగా ఫలితాలను ఇస్తాడు. దీనికి తోడు లోహమూర్తి ప్రవేశం కావటం మరింత వ్యతిరేకతలకు స్వాగతం పలికినట్లగును. వృశ్చికరాశి వారికి గోచారంలో 12వ స్దాన ప్రవేశం అశుభం, పైగా తామ్ర మూర్తితో ప్రవేశ నిర్ణయం కావటం మరింత వ్యతిరేకంగా ఫలితాలుండునని భావించాలి. ధనుస్సు  రాశి జాతకులకు 11వ స్థాన ప్రవేశం శుభఫలితాలనే ఇవ్వాలి. పైగా మూర్తి రూపం చూస్తే సువర్ణ మూర్తి. ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశించాలి. మకర రాశి జాతకులకు దశమ స్దాన గురు గోచారం వ్యతిరేకం. మూర్తి రూపం చూస్తే రజత మూర్తి కనుక కొంత అనుకూలాన్ని అందిస్తాడు. కుంభ రాశి జాతకులకు నవమ గురువు మరింత మేలైన ఫలితాలను ఇచ్చే సందర్భంలో లోహ మూర్తిగా పదవిని అలంకరించినందున పూర్తి వ్యతిరేకతలతో గురు సంచారం ఉండును. చివరగా మీన రాశివారికి గురువు అష్టమంలో కష్టాలు తెచ్చే విధంగా సంచారమున్న సందర్భంలో తామ్ర మూర్తి ప్రవేశం మరిన్ని సమస్యలను తెచ్చే విధంగా పరిస్థితులు ఉత్పన్నమవుతాయి.

చదివారు కదా ఇంతవరకు, కానీ నిశ్చింతగా ఉండండి. ఎందుకంటే అనుకూల ఫలితాలు కానీ, ప్రతికూల ఫలితాలు కానీ వచ్చే సమయాలలో ఆటంకాలు పరిచే వేధ గ్రహాల గురించి పైన చెప్పలేదు. కనుక ఆటంకాలు వచ్చే రాశులవారు వేధ ఉంటే బాగుండునేమో  అనుకుంటారు. కారణమేమంటే ఆటంకాలు రావని. అలాగే అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వారు కూడా వేధ గ్రహాలు రాకుండా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే వారి అనుకూలతలు ఎక్కడ భంగం కలుగుతుందో అనే ఆలోచనతో. కానీ 12 రాశులకు 395 రోజులలో ఎక్కడెక్కడ వేధలు కల్గుచున్నాయో, వాటి వలన అనుకూలతలు ప్రతికూలతలు ఎలా ఉంటున్నాయో, ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పే 12 వీడియోలు ఈ దిగువన ఉన్నాయి. .ఇక మరో రెండు రోజులలో పరిహారాలు చెప్పే మరిన్ని వీడియోలు కూడా అందించబోతున్నాను. వాటిపై కూడా దృష్టి ఉంచటానికి ప్రయత్నించండి. - దైవజ్ఞ శ్రీనివాస గార్గేయ 

 

Saturday, September 2, 2017

తులారాశి ప్రవేశ సమయంతో తారుమారు కానున్న గురు గోచార ఫలితాలు

2017 సెప్టెంబర్ 12 ఉదయం 6.51 నిముషాలకు గురు గ్రహం తులారాశిలోకి ప్రవేశం చేయును. సహజంగా గోచార రీత్యా 5 రాశుల వారికి అనుకూల ఫలితాలు, 7 రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మరికొంత లోతులకి వెళితే ప్రవేశం చేసే సమయానికి ఉన్న గురు స్వరూపాన్ని బట్టి అనుకూల ఫలితాలు వ్యతిరేకం కావచ్చు, వ్యతిరేక ఫలితాలు అనుకూలం కావచ్చు. అనుకూలం గా గాని, వ్యతిరేకంగా గాని గురువు ఫలితాలను ఇచ్చే సందర్భంలో ఏవైనా ఆటంకాలు (గ్రహ వేధలు) కలిగినప్పుడు అనుకూలము ఆగిపోతాయి, ప్రతికూలము ఆగిపోతాయి. అనుకూలం ఆగితే కించిత్ బాధపడతాము. అదే ప్రతికూలం ఆగిపోతే ఎంతో ఆనందపడతాము. కనుక క్రింది వీడియో ద్వారా ఉపోద్గాతము వినండి. తదుపరి వీడియో లలో 12 రాశులకు ఏ ఏ తేదీలలో అనుకూలమా, ప్రతికూలమా తెలుసుకుంటూ, ఒకవేళ అనుకూలమే ఆగిపోతే పరిహారము ఏమి చేయాలి ? ప్రతికూలమే ఆగిపోతే సంతోషంతోనే ఉంటూ అనుకూలం కలగటానికి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేవి వరుస వీడియోలలో తెలుసుకుందాం.
ఇక ఉపోద్గాత వీడియోని చూడండి. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Saturday, August 26, 2017

తులారాశిలో 395 రోజుల సంచారానికి విచ్చేస్తున్న దేవగురువు

శ్రీ హేమలంబ నామ సంవత్సర భాద్రపదమాసం బహుళ సప్తమి మంగళవారం సరియగు తేదీ 12 సెప్టెంబర్ 2017 న భారత కాలమానప్రకారం ఉదయం 6 గంటల 51 నిముషాలకు గురుగ్రహం చిత్రా నక్షత్ర మూడవ పాదమైన తులా రాశిలోకి ప్రవేశం జరుగును. గురు గ్రహం తులా రాశి ప్రవేశంతో సార్థ త్రికోటి తీర్థ సహిత  కావేరినదికి పుష్కరాలు ప్రారంభమై, సెప్టెంబర్ 28వ తేదీతో ముగియును. కావేరి నదినే దక్షిణ గంగగా పిలుస్తారు. కావేరీ నదీ తీర పుణ్య క్షేత్రాలలో తమిళనాడులో చిదంబరం, శ్రీరంగం, తంజావూరు, కుంభకోణాలు పేరెన్నిక గన్నవి. సెప్టెంబర్ 29 వరకు తర్పణ పిండప్రదానాదులు ఆచరించవచ్చును.

ఇక వివరాలలోకి వెళితే తులా రాశిలో 395 రోజులపాటు గురు గ్రహం సంచారం చేయబోతున్నాడు. ఈ సమయంలో కొద్దిరోజులు మౌఢ్యమితోను, మరికొద్దిరోజులు వక్రంతోను ఉంటూ, ఈసారి రెండు పర్యాయములు నీచ స్థితిలో ఉన్న రవి చెంతన ఉండబోతున్నాడు. ఈ 395 రోజులలో ఆయన ఏయే రోజులలో ఏయే నక్షత్రాలలో ప్రవేశం చేయబోతున్నాడో తెలుసుకుందాం.

2017 సెప్టెంబర్ 28 చిత్రా నక్షత్ర 4వ పాదంలోకి, అక్టోబర్ 14న స్వాతి 1వ పాదంలోకి, అక్టోబర్ 29న స్వాతి రెండవ పాదంలోకి, నవంబర్ 13న స్వాతి 3వ పాదంలోకి, నవంబర్ 29 న స్వాతి 4వ పాదంలోకి సంచార నిమిత్తమై బయలుదేరతారు. డిసెంబర్ 15వ తేదీ ధనుర్మాస ప్రారంభం కాగానే రెండవ రోజున అంటే డిసెంబర్ 16న తన స్వనక్షత్రమైన విశాఖ నక్షత్ర 1వ పాదంలోకి ప్రవేశం జరగటం, తిరిగి 2018 జనవరి 4 విశాఖ 2వ పాదంలోకి జనవరి 27న విశాఖ 3వ పాదంలోకి ప్రవేశ నిమిత్తమై సిద్దమవుతుంటాడు. ఇంతలో 2018 మార్చి 9 ఉదయం 10 గంటల 19 నిముషాలకి గురువుకి వక్రారంభం మొదలుకావటం, అక్కడ నుంచి వెనుకకు నడవటం ప్రారంభమై తిరిగి 2018 ఆగష్టు 2న రుజు మార్గంతో విశాఖ 1వ పాదంలోకి ప్రవేశిస్తాడు. 2018 సెప్టెంబర్ 3 న విశాఖ 2వ పాదంలోనికి, 2018 సెప్టెంబర్ 23న విశాఖ 3వ పాదంలోనికి ప్రవేశిస్తూ.. ఆ పిమ్మట 2018 అక్టోబర్ 11 శ్రీ విళంబి నామ సంవత్సర ఆశ్వయిజ శుక్ల తదియ గురువారం రాత్రి 7గంటల 20నిముషాలకి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. .

మొత్తం 395 రోజుల కాలగమనంలో కొన్ని రాశుల వారికి మంచి అవకాశాలను ఇవ్వటానికి సిద్ధపడతాడు. కొన్ని రాశుల వారికి సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చి వెళ్ళిపోతాడు. కొందరకు ఇస్తానని చెప్పలేడు.. ఇవ్వనని అనలేడు, మౌనంతోనే ముందుకు వెళ్ళిపోతాడు. ఇంకొందరకు అడగకముందే అన్ని వివరాలను తెలుసుకుని, ఏదో అందించినట్లుగా భ్రాంతి కనపరుస్తూ ఏమి లేకుండానే ప్రక్క రాశిలోకి వెళ్ళిపోతాడు. ఇది సౌర మండలంలో ఉన్న గురు గ్రహ తులా రాశి గమన చరిత్ర. ఇంతకీ తులా రాశి విషయానికి వస్తే గురు గ్రహానికి కించిత్ వైరమున్న స్థానము. ఈ స్థానంలో తన ప్రతిభను చూపిస్తాడా? చూపడా ? అనే ఆలోచనలు ప్రతి వారికీ ఉదయిస్తుంటాయి. ఒకటీ రెండు రోజులు కాకపోయే 395 రోజులు ఆ రాశిలో సంచారం చేయాలి... మరి ఎవరెవరికి ఏమి అందిస్తాడు? ఏమి అందించడు? ఏమి అడుగుతాడు? ఏమి అడగడు? ఎవరెవరికి మౌనంతోనే ముడిపెడతాడు.. కను సైగలతో ఇస్తానని ఆశ చూపిస్తాడు? తన వీక్షణాలతో ఏ విధంగా శుభాశుభాలను అందిస్తాడో చాలా వివరాతి వివరంగా తదుపరి పోస్టింగ్ లలో రాశుల వారీగా గ్రహభూమి బ్లాగ్ లో
(grahabhumi.blogspot.com) తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Sunday, August 20, 2017

2017 ఆగష్టు 21 సోమవారం ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం

ఈ సూర్యగ్రహణం మఖ నక్షత్ర రాహు గ్రస్తంగా సంభవిస్తున్నప్పటికీ రాహువు మాత్రం సింహరాశిలో కాకుండా కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో ఉండటం ఈ గ్రహణ ప్రత్యేకత. ఈ సంపూర్ణ సూర్య గ్రహణం భారతదేశంలో కనపడదు. భారత దేశంలో కనపడని కారణంగా ఇక్కడ గర్భవతులు హాయిగా గాలి పీల్చుకోవచ్చును. సంపూర్ణ సూర్య గ్రహణం జరిగే సమయంలో భారతదేశంలో రాత్రి సమయంలో ఉంటుంది. ఇక సంపూర్ణ సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని కాలమాన ప్రకారంగా వివిధ ప్రాంతాలలో పాక్షిక గ్రహణంగాను, కొలంబియా మరియు కెంచుకి ప్రాంతాలలో అను రెండు ప్రాంతాలలో సంపూర్ణ సూర్యగ్రహణం గాను కనపడును. సూర్యునికి వాయువ్య భాగంలో గ్రహణం ప్రారంభమై, తూర్పు దిశలో మోక్షం కల్గును.

ఉత్తర అమెరికాలోని కెంచుకి కాలమాన ప్రకారం గ్రహణ సమయాలు
వాయువ్యాన గ్రహణ స్పర్శ - మధ్యాహ్నం 11 గం.56 ని.లు 
సంపూర్ణ స్థితికి గ్రహణ రాక - మధ్యాహ్నం 1 గం.25 ని.లు 
గ్రహణ మధ్య కాలం - మధ్యాహ్నం 1 గం.26 ని.లు 
సంపూర్ణం నుంచి విడుపు ప్రారంభం - మధ్యాహ్నం 1 గం.27 ని.లు
గ్రహణ మోక్షకాలం - మధ్యాహ్నం 2 గం.52 ని.లు   
ఆద్యంతం పుణ్యకాలం - 176 నిముషాలు
సంపూర్ణ గ్రహణ బింబదర్శన సమయం - 2 నిముషాలు మాత్రమే.

కొలంబియాలోని సౌత్ కెరొలినా కాలమాన ప్రకారం గ్రహణ సమయాలు
వాయువ్యాన గ్రహణ స్పర్శ - మధ్యాహ్నం 1 గం.13 ని.లు 
సంపూర్ణ స్థితికి గ్రహణ రాక - మధ్యాహ్నం 2 గం.42 ని.లు 
గ్రహణ మధ్య కాలం - మధ్యాహ్నం 2 గం.43 ని.లు 
సంపూర్ణం నుంచి విడుపు ప్రారంభం - మధ్యాహ్నం 2గం.44 ని.లు
గ్రహణ మోక్షకాలం - సాయంత్రం 4 గం.06 ని.లు   
ఆద్యంతం పుణ్యకాలం - 173 నిముషాలు
సంపూర్ణ గ్రహణ బింబదర్శన సమయం - 2 నిముషాలు మాత్రమే.

ఉత్తర అమెరికాలోని వివిధ ప్రాంతాలలో పాక్షిక గ్రహణ సమయాలు
అట్లాంటా - మ 1.06 - సా 4.02
ఆస్టిన్ - మ 11.41 - 2.39
బర్మింగ్ హమ్ - మ12.01 - 2.58
బోస్టన్ - మ 1.29 - 3.59
చికాగో - మ 11.54 - 2.43
డల్లాస్ - మ 11.40 - 2.39
డెన్వర్ - ఉ 10.23 - మ 1.15
డెట్రాయిట్ - మ 1.04 - మ 3.48
హౌస్టన్ - మ 11.47 - 2.46
జాక్సన్విల్లే - మ 1.16 - సా 4.12
న్యూజెర్సీ - మ 1.23 - సా 4.01
లాస్ వేగాస్ - ఉ 9.09- మ 11.53
లాస్ ఏంజెల్స్ - ఉ 9.06 - 11.45
లూయిస్ విల్లే - మ 12.59- 3.52
మెల్బోర్న్ - మ 1.22 - సా 4.17
మియామి - మ 1.28 - సా 4.21
న్యూయార్క్ - మ 1.23 - సా 4.01
ఓక్లాండ్ - ఉ 9.02- మ 11.37
ఫిలడెల్ఫియా -  మ 1.21 - సా 4.01
ఫోనిక్స్ -  ఉ 9.14- మ 12.00
పిట్స్ బర్గ్ - మ 1.11 - 3.55
పోర్ట్ ల్యాండ్ - ఉ 9.06- మ 11.38
రిచ్ మాండ్ - మ 1.18 - సా 4.04
శాన్ఫ్రాన్సిస్కో -  ఉ 9.02- మ 11.37
స్ప్రింగ్ ఫీల్డ్ - మ 11.51 - 2.43
సెయింట్ లూయిస్ - మ 11.50 - 2.44
వాషింగ్టన్ - మ 11.51 - 2.42
వాషింగ్టన్ డి. సి - మ 1.18 - సా 4.02


గతంలో శ్రీ సిద్ధార్ది నామ సంవత్సరం శ్రావణ మాసం అమావాస్య బుధవారం సరియగు తేదీ 22 ఆగష్టు 1979 న సింహరాశిలోనే మఖ నక్షత్రంలోనే సంపూర్ణ సూర్యగ్రహణం రాహు గ్రస్తంగా జరగటం ఆ గ్రహణంతోపాటే శని, శుక్రులు ఉండటం, పైగా ఆ సంపూర్ణ గ్రహణం చివరికి కంకణ గ్రహణంగా రూపాంతరం చెందింది. ఆ గ్రహణం తరువాత, దాదాపు 38 సంవత్సరాలకు అదే శ్రావణమాస అమావాస్యను సింహరాశిలో రాహు గ్రస్తంగా మఖ నక్షత్రంలో గ్రహణం సంభవిస్తున్నది. ఈ గ్రహణం గత గ్రహణంతో పోలిస్తే అతి పెద్ద గ్రహణంగా భావించాలి. ఇందుకోసంగా ప్రజలెవ్వరూ ఆందోళనలు చెందవలసిన అవసరం లేదు.

ముఖ్యంగా పైన పేర్కొన్న ప్రాంతాలలో ఉన్న ఎంతో మంది తెలుగువారు ఉన్నారు. వారిలో గర్భవతులు కూడా ఉండవచ్చును. కనుక వారి జాగ్రత్త కొరకై సమయాలతో ఇవ్వటం జరిగింది. అయితే హైద్రాబాద్లో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పరోక్షంగా నన్ను కామెంట్ చేస్తూ, ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తున్నానని ఏదేదో అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఇతర దేశాలలో గ్రహణం పడితే మనకు ప్రభావం ఉండదని అనుకోవటం కేవలం వారి అజ్ఞానానికి పరాకాష్ట.


కొన్ని కొన్ని సంవత్సరాలలో మకర రాశిలోకి సూర్య ప్రవేశం అనేది రాత్రి సమయాలలో జరుగుతుంటుంది. అంటే ఆ సమయంలో భారత దేశంలో సూర్యుడు కనపడడు. కానీ రెండవ రోజున మకర సంక్రమణ పుణ్య కాలంగా భావించి తర్పణ, పిండ ప్రదానాదులు పితృదేవతలకు అందిస్తుంటారు. ఇది వైదిక వృత్తిలో ఉన్న ప్రతివారికి తెలుసు. అలాగే గురు గ్రహము రాత్రి సమయంలో ఒకరాశి నుంచి మరొక రాశికి ప్రవేశం జరిగినప్పుడు, భారత దేశంలో పుష్కరాలు రెండవ రోజు సూర్యోదయం నుంచే ప్రారంభమవుతాయి. ఇలాంటి అంశాలు జ్యోతిష శాస్త్రంలో ఎన్నో ఉంటాయి. రవి మహర్దశలు, రవి అంతర్దశలు జరిగే వారు ఉంటారు. గోచార స్థితిలో గ్రహణం వ్యాప్తి చెందినప్పుడు దాని ప్రభావం మరికొంత కాలం విశ్వంపై ఉంటుందనే ఆలోచన అజ్ఞాన సిద్ధాంతులు తెలుసుకుంటే మంచిది. కేవలం నాలుగు ముక్కలు నేర్చుకుని యూటుబ్లో పుంఖాను పుంఖాలుగా వీడియోలు పెట్టటం అనేది ఒక గొప్ప విషయం కానీ కాదు. ధైర్యముండి, జ్ఞానముండి , గణితం మీద పట్టు ఉంటే నా ఎదురుగా కూర్చుని గ్రహణం చేయమను. ఇలాంటి వాటికి బహు దూరంగా ఉంటారు. నా గ్రహభూమి  అంతర్జాతీయ  పంచాంగంలో గ్రహణ సమయాలను దాదాపు ఎప్పుడో ఇవ్వటం జరిగింది. కనీసం మన తెలుగువారు ఇతర దేశాలలో ఉన్నారని, వారికి గ్రహణ సమయాలకు కనీసం తెలియచేస్తే మంచిదనే ఆలోచన  లేకపోవటం శోచనీయం. కనుక పాఠక మహాశయులు సోషల్ మీడియాలో వచ్చే చెత్త అంశాలను నమ్మి మీ మీ సమయాలను వృధా చేసుకోవద్దు.

మా కాలచక్రం పంచాంగంలో పేజీ నంబర్ 28 మరియు 30 పేజీలలో, గ్రహభూమి పంచాంగం 15వ పేజీలో (grahabhumi panchangam) భూకంప వివరాలను తేదీలలో సంవత్సరం క్రితమే ఇవ్వటం జరిగింది. అలాగే గత 2016 మార్చి 1న విజయవాడ ప్రెస్ మీట్ లో ఇండోనేషియా లో భూకంపం రిక్టర్ స్కేల్ పై 7.8 గా వస్తుందని తీవ్రతతో తేదీని ప్రకటించగా విజయవాడలోని స్థానిక వార్త  పత్రికలన్నీ ప్రకటించాయి. (http://grahabhumi.blogspot.in/2016/04/blog-post.html) వాటిని చూసి రెండవ రోజున ప్రజలను నేనేదో భయ భ్రాంతులకు గురి చేస్తానని టీవీ 9 మరియు యన్ టీవీ వారు కెమెరాలు పట్టుకుని దాదాపుగా 30 నిముషాల పాటు రికార్డ్ చేసి, ఆ వివరాలను రాత్రికి ప్రసారం చేస్తామని వెళ్లారు. వారు వెళ్లిన అరగంటలోనే ఇండోనేషియా లో భారీ భూకంపం రిక్టర్ స్కేల్ పై 7.8 గా నమోదు కావటం, వీరు రికార్డ్ చేసిన కార్యక్రమాన్ని ప్రసారం చేయకుండా ఆపటం జరిగింది. ఇది ఎందుకు చెబుతున్నాను అంటే 40 సంవత్సరాల జ్యోతిష శాస్త్ర అనుభవంతో పరిశోధనలు చేసి చెబుతున్న అంశాలు  అనేకం ఉన్నాయి. కానీ కొన్నింటిని మాత్రమే నేను తెలియచేస్తున్నాను.

కనుక దాదాపుగా వేయి అంశాలకు ఎక్కడో ఒక అంశం పొరపాటుగా దారి తప్పటం మానవ సహజం, దానిని పట్టుకుని హేతువాదులు మాట్లాడటం విడ్డూరం. ప్రతి మీడియా ఛానల్ జ్యోతిష అంశాలతోనే వారి వారి రేటింగ్లను పెంచుకుంటుంటారు. జ్యోతిష కార్యక్రమాలతో వచ్చే డబ్బుతో జీతాలను ఉద్యోగులకి ఇస్తుంటారు. కానీ ఇంత చేస్తూ కూడా హేతువాదులు కూర్చోపెట్టి వెకిలిగా ప్రశ్నలను వేయటం సహించరాని తప్పు. మెరుగైన సమాజం కోసం అంటూ చెప్పుకునే కొంతమంది రత్నాన్ని ధరించటం అవివేకం అంటారు. కానీ రాత్రి 11 గంటల సమయంలో ఆ రత్నాల కంపెనీ వారిచ్చే సొమ్ముతో పబ్బం గడుపుకుంటారు. ఇది అందరికి తెలిసిన నగ్న సత్యమే. అందుకే కొన్ని కొన్ని విలువలకు లోబడి దూరంగా ఉండాలనే కోరుకుంటున్నాను. అయితే పుంఖాను పుంఖాలుగా వచ్చే ఈ అజ్ఞానులు సోషల్ మీడియాలో పెట్టె విషపు బీజాలను నమ్మి జీవితాలను నాశనం చేసుకోవద్దని మనః పూర్వకంగా కోరుతున్నాను.

ఈ గ్రహణం కోసంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అంతేతప్ప ఏదో వచ్చి పడిపోతుందని అనుకోవద్దు. మంచి పనులు చేయాలన్న మన మనస్సే, చెడు పనులు చేయాలన్న మన మనస్సే. ఈ మనః కారకుడే చంద్రుడు. ఈ చంద్రుడే గ్రహణ సమయంలో సూర్యుడితో ఆలింగనంలో ఉంటాడు. అంటే సూర్యుని డిస్క్ తో చంద్రుని డిస్క్ కలిసిపోతుంది. అందువలన దాని ప్రభావం విశ్వ వ్యాప్తంగా ఉంటుందని గమనించాలి. కేవలం నా మీద అక్కసుగా వీడియోలు పెడుతున్నందుకు నేనేమి బాధపడటం లేదు. వాస్తవాలు తెలియచేస్తున్నాను. ఈ క్రింది వీడియోలను వీక్షించండి.
  - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ