Saturday, July 22, 2017

విరుద్ధ జంట గ్రహణాలకై పరిహారం

2017 ఆగస్టులో శ్రావణ పూర్ణిమ సోమవారం నాడు జరిగే పాక్షిక చంద్రగ్రహణం మకర రాశిలో శ్రవణా నక్షత్రంలో కేతుగ్రస్తంగా భారతదేశంలో కనపడును. తదుపరి శ్రావణ అమావాస్య రోజున సింహరాశిలో మఖా నక్షత్రంలో సంపూర్ణ సూర్యగ్రహణం రాహు గ్రస్తంగా జరగనుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనపడదు.

సహజంగా ఒక మాసంలో జంట గ్రహణాలు వస్తుంటే, రాశి చక్రంలో అవి మొదటి గ్రహణం ఏర్పడిన రాశికి 7వ రాశిలో ఉండటం జరుగును. కానీ ఈ ఆగష్టు గ్రహణాలు అలా కాకుండా మకర రాశి నుంచి సింహరాశికి అష్టమ స్థానం కావటము, సింహ రాశి నుంచి మకర రాశికి షష్టమ స్థానం కావటం జరిగింది. అందుకే ఈ రెండు గ్రహణాలను షష్టాష్టక గ్రహణాలు అంటారు.

అంతేకాకుండా శ్రవణా నక్షత్రంలో చంద్రగ్రహణం జరుగుతుంటే మఖ నక్షత్రంలో సూర్యగ్రహణం జరుగుతున్నది. శ్రవణం నుంచి మఖ నక్షత్రానికి తారాబలం లెక్కిస్తే ప్రమాదకరమైన నైధన తారగా జ్యోతిష శాస్త్ర రీత్యా ఉన్నది. ఈ విధంగా ఉండటం వలన ప్రపంచంపై ఈ గ్రహణ ప్రభావాలు కొంత వ్యతిరిక్తంగా ఉందని భావించాలి. సూర్య గ్రహణం జరిగిన రోజు నుంచే శుక్ర రాహువుల కలయికలు ప్రారంభం కావటం, కుజ రాహువుల తీవ్రత అధికంగా ఉండటం, సూర్యునిపై శని యొక్క తీవ్ర వీక్షణ అధికంగా ఉండటం జరుగుతున్నవి.

పైగా శ్రావణ మాసంలో శుక్ల పాడ్యమి, పూర్ణిమ, అమావాస్యలు సోమవారాలే రావటం.. అంతేకాక శ్రావణ మాసం ప్రారంభం చంద్రుని రాశియైన కర్కాటక రాశి నుంచే శని నక్షత్రమైన పుష్యమితో ప్రారంభం కావటం, పుష్యమి నక్షత్ర అధిపతియైన శని గ్రహ రాశిలో (మకర రాశిలో) చంద్రుని నక్షత్రమైన శ్రవణా నక్షత్రంలోనే పాక్షిక చంద్ర గ్రహణం కేతు గ్రస్తంగా జరగటం విశేషం.

అంతేకాక ఈ రెండు గ్రహణాలు సంభవించటానికి మూడు రోజుల ముందుగానే రాహు, కేతువులు రాశి మారటం కూడా మరో విశేషం. ఇన్ని కారణాలు ఉన్నందున వీటి ప్రభావ తీవ్రత నుంచి సంరక్షించబడటానికై ద్వాదశ రాశులవారు ఆగష్టు 7 సోమవారం నుంచి 16 సోమవారాల పాటు దర్భ కంకణాన్ని కుడి చేతికి ధరించుట ఎంతెంతో శ్రేయోదాయకం.

ఈ జంట గ్రహణాల ప్రభావ తీవ్రతను తగ్గించటానికి సోమవారమునే ఎందుకు ఎన్నుకోవాలి ? కారణమేమంటే రాహు కేతువుల గ్రస్తంగా జరిగే విరుద్ధ గ్రహణాలు సోమవారం నాడే సంభవిస్తున్న సమయంలో సోమవారాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలి.
అంతేకాకుండా మరో విశేషం కూడా ఉన్నది. అదేమిటంటే ప్రతిరోజూ రాహువుకు సంబంధించిన రాహుకాలం, కేతువుకు సంబంధించిన యమగండకాలము వస్తుంటాయి. ఈ యమగండకాలాన్నే కేతుకాలము అని కూడా అంటారు. పగటి సమయంలో ఉండే ఆరు లగ్నాలలో మొదటి మూడు లగ్నాలలోనే... మధ్యాహ్నంతోనే రాహుకాలం, కేతుకాలం వెళ్లిపోయేది ఒక్క సోమవారం  నాడే. ( ఈ కారణంగా మరెప్పుడైనా భవిష్యత్ లో జంట విరుద్ధ గ్రహణాలు వచ్చి అవి వేరు వేరు వారాలైనప్పుడు కూడా సోమవారాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలి)  సోమవారం రాహుకాలం ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు, 10.30 నుంచి 12.00 గంటల వరకు కేతుకాలము ఉండును (సూర్యుడు నడి నెత్తికి వచ్చు సమయము). ఈ విధంగా ఈ రెండు కాలాలు మధ్యాహ్న సమయంతోనే ముగిసేది ఒక్క సోమవారంతోనే. మిగతా రోజులలో రాహు కాలం ముందు వచ్చి కేతు కాలం తదుపరి ఏర్పడి మధ్యాహ్న సమయంతో ముగియవు. అందుచేతనే సోమవారాన్ని ప్రాధాన్యతగా తీసుకొని దర్భ కంకణాన్ని ధరించి గ్రహణ ప్రభావాల నుంచి ఉపశాంతి పొందవచ్చును. ఈ దర్భ కంకణం అంటే ఏమిటి ? ఎలా తయారు చేసుకోవాలి ? ఎలా వేసుకొవాలి ? అనే విషయాలు మరికొద్ది గంటలలో పోస్టింగ్ చేయబడే వీడియోలో చూడగలరు. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Saturday, July 15, 2017

2017 శ్రావణమాసంలో విరుద్ధ గ్రహణాలు

ఈ శ్రావణమాసంలో 2 గ్రహణాలు ఖగోళంలో సంభవిస్తున్నాయి. ఈనెలలో వచ్చే గ్రహణాలకి, ఇతర మాసాలలో వచ్చే గ్రహణాలకి చాలా  తేడా ఉన్నది. ఇక వివరాలలోకి వెళితే హేమలంబ నామ సంవత్సర శ్రావణ పూర్ణిమ సోమవారం సరియగు తేదీ 7 ఆగష్టు 2017 న మకర రాశిలో శ్రవణా నక్షత్రంలో మేష, వృషభ లగ్నాలలో కేతు గ్రస్తంగా పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తున్నది. చంద్రునికి వాయువ్య భాగంలో స్పర్శించి గ్రహణం పాక్షికంగా ఉండును.

భారత కాలమాన ప్రకారం ఆగష్టు 7 రాత్రి 10 గంటల 53 నిముషాలకు చంద్రునికి గ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి 12 గంటల 48 నిముషాలకు ముగియును.. ఇది పాక్షికం మాత్రమే. మొత్తం 115 నిముషాలు గ్రహణము జరుగును. అయితే ఈ గ్రహణం జరిగే సమయంలో చంద్రుడు మకర రాశిలో ఉంటే కేతువు మాత్రం కుంభరాశిలో ఉన్నాడు. ఈ ఇరువురు పక్క పక్కనే లేరు.

అలాగే శ్రావణ అమావాస్యకు అంటే 21 ఆగష్టు 2017 సోమవారం నాడు సింహరాశిలో సంపూర్ణ సూర్య గ్రహణం సంభవిస్తుంది. ఇది భారతదేశంలో కనపడదు. ఈ గ్రహణం రాహు గ్రస్తంగా జరుగుచున్నప్పటికీ రాహువు మాత్రం కర్కాటక రాశిలో ఉన్నాడు. గ్రహణాలు జరిగే సమయాలలో రాహు కేతువులు రవి చంద్రులున్న రాశిలోనే ఉండాలి. కానీ కొద్దీ వ్యత్యాసంతో ప్రక్క రాశులలో ఛాయా గ్రహాలు ఉండటం, చంద్రుడు ఉన్న రాశికి 7వ రాశిలో సూర్య గ్రహణం జరగవలసి ఉండగా 8వ రాశిలో గ్రహణం జరిగింది. అనగా ఈ రెండు గ్రహణాలు ఒకదానికొకటి షష్టాష్టకాలలో ఉన్నాయి.

కనుక ఈ రెండు గ్రహణాలకు జ్యోతిష పరంగా విశేష ప్రాముఖ్యం ఉన్నది. శ్రావణ మాసంలో పాడ్యమి, పూర్ణిమ అమావాస్యలు సోమవారమే రావటము, సూర్య గ్రహణం రోజునుంచే శని, కుజుల పరస్పర వీక్షణలు ప్రారంభం కావటము, ఈ రెండు గ్రహణాల మధ్యనే కుజ రాహువుల కలయికలు జరగటం మొదలైన అనేక ఇతర అంశాలు చోటుచేసుకోనున్నవి. కనుక ఈ రెండు గ్రహణాల ప్రభావం ద్వాదశ రాశులపై ఏ విధంగా ఉంటాయో ఈ క్రింది వీడియోల ద్వారా తెలుసుకొనండి. సంపూర్ణ సూర్య గ్రహణ ప్రభావ ఫలితాలు ఆచరించాల్సిన పరిహార క్రమ వీడియోలు కూడా త్వరలో పోస్టింగ్ జరగబడును. -  శ్రీనివాస గార్గేయ పొన్నలూరి

Wednesday, June 7, 2017

వేప చెట్టు స్పర్శతో లక్ష్మీ అనుగ్రహం

హిందూ సనాతన ధర్మంలో వేప వృక్షానికున్న ప్రాధాన్యం అత్యంత విశేషమైనది.ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో, అట్టి వారు ఆరోగ్యవంతంగా అధిక కాలం జీవిస్తారని  ప్రాచీన ఆయుర్వేద గ్రంధంలో చరకుడు తెలియచేశాడు. వేపచెట్టును ఇంటి ఆరోగ్య దేవతగా వైద్య శాస్త్రం అభివర్ణిస్తుంటే భారతీయ పురాణాలు వేపచెట్టును ఓ లక్ష్మీ దేవిగా భావిస్తారు. చాంద్రమానం ప్రకారంగా చైత్ర శుక్ల పాడ్యమి తిథి ఉగాది పండుగతో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఆనాడు తైలాభ్యంగనము తదుపరి వేప పూత పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇట్టి వేప చెట్టుతో అనేక ఆధ్యాత్మిక పరంగా ఎన్నెన్నో అద్భుత రహస్యాలు ఉన్నట్లుగా తంత్రశాస్త్ర గ్రంధాలు పేర్కొంటున్నాయి. అలాంటి వాటిలో లక్ష్మి దేవి అనుగ్రహ ప్రాప్తికి శుక్రవారం రాహుకాలంలో ఆచరించే ఓ అద్భుతమైన ప్రక్రియను తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. -  దైవజ్ఞ శ్రీనివాస గార్గేయ 



Sunday, June 4, 2017

మహాసౌరయోగాలు - పరిహారాలు 2వ భాగం

భారతీయ సనాతన సంప్రదాయ ప్రకారంగా వైదికంగా పంచాయతన పూజను నిర్వహిస్తుంటారు.
 

ఆదిత్యామంబికా విష్ణుం గణనాధం మహేశ్వరం
పంచయజ్ఞో కరోన్నిత్యం గృహస్తః పంచ పూజయతే||


ఈ పంచాయతనంలో వైష్ణవం, శైవం, శాక్తేయం, గాణాపత్యం, సౌరం అనునవి ఐదు ప్రధాన అంశాలు. వైష్ణవంతో మహావిష్ణువును, శైవంతో పరమ శివుడిని, గాణాపత్యంతో గణపతిని, శాక్తేయంతో అమ్మవారిని, సౌరంతో సూర్య భగవానుడిని ప్రార్ధించి పూజించే విధానాన్నే పంచాయతనం అంటారు. ఈ పరంపరలో జగద్రక్షకుడైన సూర్య భగవానుని అనుగ్రహ ప్రాప్తికై మరికొన్ని ముఖ్య పర్వదినాలు కూడా భారతీయ సాంప్రదాయంలో ఉన్నాయి.

ప్రతినెలా సూర్య భగవానుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించే రోజును సంక్రమణం లేక సంక్రాంతి అంటారు. మకర రాశిలో ప్రవేశించే రోజున మకర సంక్రాంతిగా పిలుస్తూ సూర్య భగవానుని ప్రార్ధిస్తూ, పితరులకు తర్పణ పిండ ప్రదానాదులు ఆచరిస్తారు. అలాగే మాఘ శుక్ల సప్తమి రోజున (రధసప్తమి) సూర్య జయంతిగా ఆరాధన  జరుగును. వీటితో పాటు సప్తమి తిధి ఆదివారాలలో వస్తే భానుసప్తమిగా,  కృత్తికా నక్షత్రం ఆదివారాలలో వస్తే భాను కృత్తికగా సూర్య భగవానునికి పూజాధికాలు చేస్తుంటాం.

జాతక  లోపాలు ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో సూర్య నమస్కారాలు, అలాగే అరుణ పారాయణాలు చేయటం, ఆదిత్య హృదయ పఠనము కూడా సర్వ సాధారణంగా జరుగుతుంది. వాస్తవానికి  చెప్పాలంటే సూర్య నమస్కారాలు ఎవరైతే ఆచరిస్తారో, వారికి మాత్రమే ఫలితం ఉంటుంది గాని, మనము చేయలేక మరొకరి చేత సూర్య నమస్కారాలు చేయిస్తే ఫలితముండదు. వైదిక క్రియలలో అనేక పద్ధతులు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి.  ఇవి అందరికీ తెలిసినటువంటివి. ఇవి కాకుండా ప్రతి నెలలో కూడా మహా సౌరయోగాలు అంటూ ఉంటుంటాయి. ఈ యోగ దినాలలో కూడా సూర్య భగవానుడిని ప్రార్ధిస్తే ప్రారబ్ధ కర్మల ద్వారా వచ్చే వ్యతిరేక ఫలితాలు  కొంతమేర  తగ్గుముఖం పట్టునని పురాతన గ్రంధాలు చెప్తున్నాయి.

ఇంతకీ మహా సౌరయాగం అంటే ఏమిటో తెలుసుకుందాం. సూర్యుడు ఏ నక్షత్రంలో సంచారముండునో, ఆ నక్షత్రానికి 4,6,9,10,13,20  నక్షత్రాలలో చంద్రుడు కనుక సంచారంలో ఉంటే ఆ సమయాన్ని మహా సౌర యోగం అంటారు. ఈ సమయం ఒక్కోసారి రాత్రి, పగలు కూడా ఉంటుంది. రాత్రి సమయంలో సూర్య భగవానుని దర్శనం ఉండదు కనుక, దర్శనం ఇచ్చే పగటి సమయంలో తొలి 10 ఘడియలలోనే విధి విధానమును ఆచరించాలి. మొదటి 5 ఘడియలలో ఆచరించటం ఉత్తమోత్తమం. తదుపరి 3 ఘడియలు ఆచరించటం ఉత్తమం. చివరి రెండు ఘడియలలో ఆచరించటమనేది మధ్యమం. ఒక ఘడియ అనగా 24 నిముషాలు. 5 ఘడియలు అంటే రెండు గంటలన్నమాట.

దీనిని బట్టి సూర్యోదయం తర్వాత తొలి 2 గంటలు విశేష ప్రాధాన్యతతో ఉండును. వైద్య శాస్త్ర ప్రకారం కూడా తొలి రెండు గంటలలోనే సూర్య కిరణాలు ప్రసరించేలా సూర్య కాంతిలో నిలబడితే చక్కని ఆరోగ్యం ఉండునని, శరీరానికి డి విటమిన్ లభించునని వైద్య శాస్త్రం పేర్కొంటుంది. అదేవిధంగా జ్యోతిష శాస్త్రం ద్వారా తొలి రెండు గంటలలో పరిహారమును పాటించినట్లయితే చక్కని అనుకూలతలు పరోక్షంగా కల్గును. ఈ సౌరయోగాలు ప్రతి నెలలో 5 నుంచి 8 వరకు వస్తుంటాయి. ఆ వచ్చే దినాలను సరియైన పంచాంగం ద్వారా తెలుసుకుని పరిహారమును పాటించాలి.

ఈ పరిహారమును పాటించటానికి ముఖ్యముగా కావలసినవి గోధుమపిండి, మంచి కొబ్బరి నూనె, నీరు. గోధుమపిండి అనగానే మార్కెట్లో సిద్ధంగా ఉండే పిండిని తీసుకోవద్దు. ఎవరిపాటికి వారు ఒక కేజీ గోధుమలను తీసుకొని వాటిని పిండి చేయించేది. ఎట్టి పరిస్థితులలోను జల్లించవద్దు. అనగా పిండిలో పొట్టు కలిసి ఉండాలన్నమాట. ఈ సౌరయాగం వచ్చిన రోజులలో షుమారు 50 గ్రాముల పిండిని తీసుకుని అందులో 4,5 చెంచాలు కొబ్బరి నూనెను వేసి.. మరికొద్దిగా నీటిని వేస్తూ ముద్దగా కలపాలి. చిన్న చిన్న రొట్టెలుగా గుండ్రంగా ఉండేలా వత్తుకుని పెనముపై ఏ ఇతర నూనె లేకుండా రొట్టెలుగా కాల్చుకొనేది. ఈ పిండిలో ఉప్పు ఎలాంటి పరిస్థితులలో వేయవద్దు.

ఇలా తయారైన రొట్టెలను ఒక పళ్ళెరములో ఉంచుకొని సౌరయోగం జరిగే రోజున తొలి రెండు గంటలలో సూర్య కాంతి సోకేలా ఓ 5 నిముషాల పాటు పళ్ళెరమును సూర్య కాంతిలో ఉంచేది. పళ్ళెరమును చేతిలోనే పట్టుకొని ఉండవలసిన అవసరం లేదు. తదుపరి ఆయా రొట్టెలను కుటుంబంలో ఉన్నవారు మహా సౌర ప్రసాదంగా భావించి స్వీకరించేది. ఎట్టి పరిస్థితులలో ఆయా రొట్టెలను మిగల్చకుండా కుటుంబ వ్యక్తులే స్వీకరించాలి. చెత్తకుప్పలలో వేయవద్దు.

ప్రతి నెలలో వచ్చే మహాసౌర యోగ రోజులలో పై విధి విధానంగా ఆచరించినచో ప్రారబ్ద దుష్కర్మల ఫలితాలు తగ్గుటకు అవకాశం వచ్చును. ఈ మహాసౌర యోగాలలో జరిగే రోజులలో ఒక్కో నక్షత్రం వస్తుంటుంది. ఆ నక్షత్రం ఎవరిదైనా జన్మ నక్షత్రమైనచో, ఆ రోజును విశేష శుభప్రద మహా సౌరయోగంగా స్వీకరించండి. అలాగే మహా సౌరయోగాలు వచ్చే రోజులలో ఆదివారాలు కలిసి వఛ్చిననూ విశేషంగా భావించాలి.

కృత్తికా, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాలతో కూడిన మహాసౌరయాగం ఉన్నటువంటి రోజులలో, తయారు చేసిన గోధుమ రొట్టెల దిగువన చిక్కుడు ఆకులను ఉంచి మరికొంత అధిక సమయం పాటు సూర్య కాంతిలో ఉంచటానికి ప్రయత్నం చేయండి. పై ప్రకారంగా వయస్సుతో నిమిత్తం లేకుండా బాలల నుంచి వృద్ధుల వరకు స్త్రీ, పురుషులెవరైననూ ఆచరించవచ్చు. స్త్రీలలో రుతుక్రమ అయిన 5వ రోజు తదుపరి మాత్రమే అర్హులు. గర్భవతులకు నియమమేమి లేదు.  జాతాశౌచ, మృతాశౌచ దినాలలో ఆచరించవద్దు. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వచ్చిన రోజులలో సౌర యోగం వచ్చినచో అది నిష్ఫలముగానే భావించి, పై విధి విధానమును ఆచరించవద్దు.

ఈ పరంపరలో 2017 జూన్ నెలలో భారతదేశంలో మహాసౌర యోగములు జూన్ 7 బుధవారం విశాఖ నక్షత్రంలోను, జూన్ 8 గురువారం అనురాధ నక్షత్రంలోను, జూన్ 16 శుక్రవారం శతభిషా నక్షత్రంలోను, జూన్ 27 మంగళవారం ఆశ్లేష నక్షత్రంలోను , జూన్ 29 గురువారం పుబ్బ నక్షత్రంలోను మహాసౌర యోగములున్నవి. కనుక ఈ రోజులలో భక్తి విశ్వాసాలతో రొట్టెలను తయారుచేసి కాలపురుషుని యొక్క దివ్య అనుగ్రహం ద్వారా పూర్వజన్మ కర్మల వ్యతిరేక ఫలితాలను కొంతమేర తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయండి. 


పూర్వ జన్మ ప్రారబ్ధ కర్మల ఫలితాలపై మరింత విశ్లేషణాత్మకంగా తదుపరి శీర్షికలో తెలియచేస్తూ 2017 సంవత్సరంలోని మిగిలిన మాసాలలో ఏయే రోజులలో మహాసౌర యోగాలు వస్తాయో తెలియచేస్తాను. అదేవిధంగా ఇతర దేశాలకు కూడా మహాసౌర యోగమున్న తేదీలను కూడా త్వరలో తెలుపగలను. 

- దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 

మహాసౌరయోగాలు - పరిహారాలు 1వ భాగం

కర్మ అనేది ఒక మతానికి సంబంధించిన అంశము కాదు. ఇది ఓ వ్యక్తికి సంబంధించినదిగా భావించాలి. కర్మను గురించి ఒకరు నమ్మినా నమ్మకపోయినా, కర్మ యొక్క నియమాలు, ఫలితాలు సర్వులకు వర్తిస్తుంటాయి. ప్రతివారు జన్మించిన తదుపరి బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, మరణము జరిగి తిరిగి జననం కొనసాగుతుంటుంది. ఇది క్రమ పద్ధతి. కాలం కూడా అంతే. పగటి తర్వాత రాత్రి, రాత్రి తరువాత పగలు. తిరిగి రాత్రి, తిరిగి పగలు.. ఇలా కాలచక్రం తిరుగుతూ ఉంటుంది.

ప్రతిరోజు మనం నీరు తాగుతూనే ఉంటాము. ఒకరోజు ఒక ప్రాంతంలో నీరు త్రాగవచ్చు, రేపు హైదరాబాద్ లో తాగవచ్చు, మరోరోజు మరో ప్రాంతంలో తాగవచ్చు. ఇంకో రోజు ఇంకో ప్రాంతంలో త్రాగవచ్చు. ఇలానే నిదురించటం కూడా.  అంటే జననం నుంచి మరణం వరకు ప్రతి రోజు ఏదో ఒక ఒక ప్రదేశంలో నీరు త్రాగటమో, ఏదో ఒక ప్రాంతంలో నిదురించటమో జరుగుతుంటుంది. దీనినే ప్రారబ్ద కర్మ అంటారు. ఇది రుణాన్ని బట్టి జరుగుతుంటుంది.

జీవి జన్మించగానే కొన్ని ఋణాలతో జన్మిస్తాడు. ఆ ఋణాలను ఈ జన్మలో తీర్చుకోవాలి. ఈ తీర్చటము అనేది గత జన్మలో చేసిన పాప పుణ్య కార్యాలను బట్టి ఈ జన్మలో శుభాశుభ  ఫలితాలనేవి ఉంటాయి. రామాయణంలోని యుద్ధ కాండలో మండోదరి రావణుడితో ఇలా చెప్పింది. 


శుభకృచ్చ్చుభమాప్నోతి పాపకృత్ పాపమశ్నుతే
విభీషణః సుఖం ప్రాప్తస్త్య ప్రాప్తః పాపమీదృశమ్ || 


ఉత్తమమైన పుణ్య కర్మలు చేసినవారికి ఉత్తమోత్తమ ఫలితాలు ఉంటాయి. పాప కర్మలు చేసిన వారికి దుఃఖం సంభవిస్తుంది, మరి విభీషణుడు తను చేసిన శుభ కర్మల వలన తనకు సుఖం లభించింది. నీవు (రావణుడు) పాపకర్మల చేసిన కారణంగా ఇలాంటి దుఃఖాన్ని అనుభవించాల్సివస్తున్నది అని మండోదరి రావణుడితో చెప్పింది.

కర్మల యొక్క ఫలితాలు అనుభవించేవాడు ఎవరు ? చేసినవాడే అనుభవించాలి. దుష్టమైనటువంటి కర్మలు చేసేవానికి తనకు తానే శత్రువవుతాడు. మంచికర్మలు చేసేవాడు తనకు తానే మిత్రుడవుతాడు. అంటే ప్రతి మనిషి తనకు తానే ఒక శత్రువుగా, మిత్రుడుగా, బంధువుగా, హితుడుగా, సన్నిహితుడుగా వివిధాలుగా ఉంటుంటాడు. వ్యక్తి చేసే శుభాశుభ కర్మలన్నింటికీ కూడా తానే సాక్షీభూతుడు. కాదంటారా ?

ప్రతివారు చేసే కర్మలకు (కార్యములకు) ఫలితాలు ఇలా ఉండాలి అని ఎవరు చెబుతున్నారు ? ఎవరు శాసిస్తున్నారు ? ఈ కర్మకి ఇలాంటి ఫలితం రావాలని ఎవరు ఏర్పాటు చేశారు? ప్రపంచంలో ఉన్న కోటానుకోట్ల మంది చేసే కర్మలన్నింటినీ... ఎవరు, ఎక్కడ నుంచి ఎలా, ఏవిధంగా పర్యవేక్షిస్తున్నారు ? దీనికి నిఘా కెమెరాలు వంటివి ఉన్నాయా ? ఉంటే ఎక్కడ ఉన్నాయి ? ఈ కెమెరాలు తీసే సారాంశమంత ఏ హార్డ్ డిస్క్లో సేవ్ అయింది ? ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా? ఉన్నాయి మరి. అలాంటి సమాధానాలను వేదంలోని చివరి భాగమైనటువంటి ఉపనిషత్తులు అందిస్తాయి. ఇట్టి ఉపనిషత్తే శ్వేతాశ్వతర ఉపనిషత్తు. అలాగే భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయంలోని 17 వ శ్లోకంలో గీతాచార్యులు ఏమన్నారంటే...


పితామహస్య జగతో మాతా ధాతా పితామహః
వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజుర్వేద చ ||


ఈ సమస్తమైన విశ్వాన్నంతటినీ నేనే ధరించి ఉన్నాను. ప్రాణులు చేసే కర్మలన్నింటికీ ఫలితాలను నేనే అందిస్తున్నాను. తల్లిని నేనే, తండ్రిని నేనే, తాతను కూడా నేనే. నేనొక పవిత్రుడని, నేను ఓంకారాన్ని, ఋగ్వేద, యజుర్వేద, సామవేద సమూహాన్ని కూడా నేనే అని పరమాత్ముడు తెలియచేశాడు.

మనం జీవితాలలో జరిగే అనేక మార్పులను ఒక్కోసారి ఆపలేమేమోనని పలుమార్లు అనుకుంటుంటాం. ఒక్కోసారి మనం చేసే ఆలోచనలు, నిర్ణయాలు, ఇతరములు అనుకోకుండా తారుమారైపోతుంటాయి. ఆ సమయంలో మన గమనానికి సరియైన నియంత్రణ లేదని భావిస్తుంటాం. అప్పుడు అనుకుంటాం.. ఏమనో తెలుసా ? కాలం కలిసిరాలేదని కొందరు అనుకుంటుంటే, టైం బాగలేదేమో మరికొందరు, బాడ్ లక్ అని ఇంకొందరు అనుకుంటుంటారు. నిజంగా కాలం కలిసి రాలేదా ? నిజమే! ఈ కాలమనేది ఒకరికి కలిసి రాలేదు, ఇంకొకరికి కలిసి వచ్చింది కదా.. మరి కాలాన్ని తప్పు ఎలా పడతాం? నిజం చెప్పాలంటే కాలం కలిసి రాకపోవటం కాదు... ఈ కాల గమనంలో మనం చేసిన కర్మ ఫలితాలు ఒక్కోసారి అనుకూలంగా ఉంటున్నాయి, ఒక్కోసారి ప్రతికూలంగా ఉంటున్నాయి. అంతేగాని కాలాన్ని నిందించకూడదు.

దీనిని బట్టి మన జీవన గమనములో అనేక రకాల ఆలోచనలతో ముందుకు వెళ్తుంటాం. విద్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వృత్తి కావచ్చు. ఇలా తమ తమ వ్యవహారాలతో పాటు గృహము, ఆరోగ్యము, వాహనము, తల్లి తండ్రులు, వివాహము, దాంపత్య జీవనము, సంతానము, సోదర సోదరీమణులు, స్నేహితులు, ఆర్ధిక లావాదేవీలు, శత్రువులు, ప్రమాదాలు, కీర్తి ప్రతిష్టలు, లాభ నష్టాలు ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిలో ఒడిదుడుకులు లేకుండా సాఫీగా వెళ్లే వారు ఉన్నారు. నిత్యం కుస్తీ పడుతూ సాగేవారున్నారు. ఒక్కోసారి మంచి చెడుగా వెళ్తున్నవారు ఉన్నారు.

మన జాతకాలలో ఏమున్నది ? ఏం రాసి ఉన్నది? భవిష్యత్ జీవనం ఎలా గడవనుంది ? సంప్రదించగలమా లేక దారుణంగా దెబ్బతింటామా అనే భయాలతో కుమిలిపోయే వారు కూడా ఉంటారు. జాతకాలలో పరిస్థితులన్నీ సక్రమంగా ఉండి కూడా బాధపడుతున్న వారు ఎందరెందరో. అలా కాకుండా జాతక లోపాలుండి విజయ కేతనం ఎగరేసేవారు కూడా ఉన్నారు. ఇప్పటిదాకా చదివిన తర్వాత మరి జాతకాలను నమ్మాలా, వద్దా అనే మీమాంసలో పడిపోతారు.

జాతకాలలో అంతర్గతంగా ఉన్న అంశాలను (అదృశ్యంగా ఉన్నవి ) తేటతెల్లం చేసి చెప్పే పండితులు ఉన్నప్పుడు మాత్రమే మీకు సరియైన అవగాహనతో ముందుకు వెళ్ళటానికి సలహాలను అందిస్తారు. అలాంటి పండితులు లేనప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఈ పరంపరలో జాతకాలలో ఎన్నో సమస్యలు, ఎన్నో లోపాలు, ఎన్నో దోషాలు ఉంటాయి. వీటిని చూసి కుమిలిపోరాదు. వీలైనంతవరకు చేతనైన రీతిలో పరిహారాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు మాత్రమే... లబ్ది పొందే అవకాశాలు వస్తుంటాయి.


మనం ఈ జన్మలో చేసే కర్యములన్నిటికి మనమే సాక్షిభూతుడుగా ఉన్నప్పటికీ... మనం గత జన్మలో చేసిన కార్యాల ఫలితాల ఆధారంగా ఈ జన్మలో ఓ టైం టేబుల్ లాగా నిత్యం  మనచేకర్మలను ఆచరింప చేస్తూ వాటి ఫలితాలను కూడా  అందించే ఓ పెద్ద మనిషి ఉన్నాడనే విషయాన్నీ మరువకూడదు. ఆ పెద్ద మనిషే కాలపురుషుడు. జగద్రక్షకుడు, ఈ విశాల విశ్వమంతటికీ వెలుగును ప్రసాదించి మన జీవితాలను పోషిస్తూ,  దైవంగా భాసిల్లే గ్రహారాజే శ్రీ సూర్యనారాయణుడు. 


అట్టి శ్రీ సూర్య భగవానుని గురించి తైత్తిరారణ్యకములోని ప్రధమ పాఠంలోనే ( వేదం ) 32 అనువాకలతో అరుణం అనే పేరుతో మంత్రభాగం ఉంటుంది.  దీనినే మహా సౌరం, నమస్కార ప్రశ్న అని కూడా అంటారు. నిత్యం భాసిల్లే సూర్య భగవానుని కిరణ ప్రసారంతో మన జీవిత గమ్యాలను ఓ క్రమబద్ధంగా మార్చుకోవటానికి మన మనస్సును , బుద్ధిని ప్రేరేపించాలి. ఈ విధంగా ప్రేరేపించటానికి అనేకానేక పద్ధతులు ఉన్నాయి. ఇందులో అందరూ సూక్ష్మంగా తెలుసుకొని పాటించటానికి జ్యోతిష శాస్త్ర రీత్యా మహాసౌర యోగాలు ఉపయోగపడతాయి.

ఈ మహాసౌర యోగాలు ప్రతినెలలో కొన్ని కొన్ని రోజులలో వస్తుంటాయి. ఆయా రోజులలో ఎలా ఎలా ఆచరిస్తే కొంతవరకు మనం విజయ బాటకు చేరువ కావటానికి అవకాశాలు ఉంటాయని పురాతన గ్రంధాలన్నీ చెబుతున్నాయి. ఈ పరంపరలో మహా సౌరయోగాలు - పరిహారాలు రెండవ భాగంలో మరికొంత వివరంగా పరిహారాలను తెలుసుకుందాం. (కొద్దిగంటలలో పోస్టింగ్ ఉండును) 

- దైవజ్ఞ శ్రీనివాస గార్గేయ