Saturday, January 27, 2018

ధనస్సులోని శనికి అష్టమంలో చంద్ర గ్రహణం - భాగం 3

ప్రస్తుతం ధనుస్సు రాశిలో శని సంచారం చేస్తున్నాడు. శనికి అంతర్గత శత్రువుగా ఉన్న చంద్రుడికి అష్టమ స్థానంలో రాహు గ్రస్తంగా కర్కాటక రాశిలో అనగా చంద్రుని యొక్క క్షేత్రంలోనే సంపూర్ణ చంద్ర గ్రహణం జరుగుతున్నది.

చంద్రుడు మనః కారకుడు. ప్రతివారు తమ గతాన్ని గురించి చింతించటమో లేక భవిష్యత్ ను గురించి భయపడటమో చేస్తుంటారు. ప్రతీవారూ తమ తమ గత అంశాలను తిరిగి బాగుచేయలేరు. అటువంటప్పుడు వాటిని అధికంగా ఆలోచించి సమయాన్ని వృధా చేసుకుంటూ భవిష్య స్థితిగతులలో కూడా ఒక్కోసారి తప్పుగా నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇక్కడే మనం కర్మను గురించి చెప్పుకోవాలి. కర్మ అనేది మనం సృష్టించుకున్నదే,  మనం అనుభవిస్తున్నదే. అలాగే గతంలో కూడా కర్మను మనం సృష్టించుకున్నాం. అదే విధంగా భవిష్యత్ లో కూడా మనమే స్వయంగా నిర్ణయాల ద్వారానో, క్రియల ద్వారానో కర్మను సృష్టించుకుంటూ ఉంటుంటాం. కనుక ఈ విధమైన అనుకూలమైన కర్మను కాకుండా కొందరు ప్రతికూలమైన కర్మలను స్వాగతించిన కారణంగా సమస్యలకు లోనవుతుంటారు.

పై విషయం అందరికి తెలిసినటువంటిందే. అయితే ఈ అంశాన్ని ఇప్పుడు ఎందుకు విశ్లేషిస్తున్నానంటే... శని ఆయుష్కారకుడు. అట్టి శనికి అష్టమమనే ఆయుస్థానంలో మనః కారకుడైన చంద్రునికి రాహుగ్రస్తంగా సంపూర్ణ చంద్ర గ్రహణం జరుగుతున్న క్రమంలో మన మన ఆలోచనలు అనేక పరంపరలుగా ఉంటుంటాయి.

మనస్సుని ఎంత నిర్మలంగా ఉంచాలన్నా కూడా, సాధ్యం కానీ రీతిలో ఉండును. కానీ మన ఆలోచనలు చేయకుండా, క్రియలు చేయకుండా జీవించలేం కదా.. ఈ ఆలోచనలు క్రియలు మనల్ని కొన్ని సమయాలలో సమస్యలు తెచ్చేవిగా ఉంటుంటాయి. మనం చేసే క్రియలు అనివార్యం అయినప్పటికీ, అట్టి క్రియలను నైపుణ్యంగా చేయటం చాలా ముఖ్యం. కాబట్టి ప్రస్తుతం చంద్రునికి జరిగే సంపూర్ణ గ్రహణం 76 నిముషాల పాటు స్థిరంగా ఉంటుంది.

ఈ స్థిర చంద్ర గ్రహణబింబం కర్కాటక రాశిలో సంభవిస్తున్నది. దీని ప్రభావం కర్కాటక రాశి మీదనే ఉంటుందనుకోవటం పొరపాటు. ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క స్థానంలో ఈ గ్రహణం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు మేష రాశి వారికి 4వ స్థానంలో, వృషభ రాశి వారికి 3వ స్థానంలో, మిధున రాశివారికి 2వ స్థానంలో, కర్కాటక రాశి వారికి జన్మ రాశిలో, సింహ రాశి వారికి 12వ స్థానంలో, కన్యా రాశి వారికీ 11వ స్థానంలోనూ, తులా రాశి వారికి దశమ స్థానంలోనూ, వృశ్చిక జాతకులకు నవమ స్థానంలో, ధను రాశిలో జన్మించిన వారికి అష్టమ స్థానంలోనూ, మకర రాశి వారికీ సప్తమ స్థానంలో, కుంభ జాతకులకు ఆరవ  స్థానంలో, చివరిదైన మీన రాశివారికి పంచమ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తున్నది.

అంటే ప్రతి రాశి వారికీ ఒక్కో స్థానంలో ఈ గ్రహణం ఉన్నదని భావము. అంతమాత్రం చేత కంగారుపడి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరికొంత లోతులకి వెళితే ఒక్కో రాశిలో మూడు నక్షత్రాలు కూడా ఉంటుంటాయి. ఉదాహరణకు మేష రాశే ఉందనుకుందాం. ఇందులో అశ్విని, భరణి మరియు కృత్తికా నక్షత్ర 1వ పాదం వారు ఉంటారు. గ్రహణం సంభవించేది పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో జరుగుతున్నదన్నమాట. అప్పుడు అశ్విని వారికి ఆ నక్షత్రాలలో పట్టే గ్రహణం వలన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, భరణి జాతకులకు ఆ నక్షత్రాలలో ఉండే సంపూర్ణ గ్రహణం ఏ అంశాల మీద ప్రభావం ఉంటుందో, వాటి పైన జాగ్రత్తలు తీసుకోవటం.. అలాగే  మూడవ నక్షత్రం కూడా.

కనుక ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం వలన కొన్ని రాశుల వారికీ గండాలు ఉంటాయని.. కొన్ని రాశుల వారు కోటీశ్వరులు అయిపోతారని.. కొన్ని రాశుల వారు దరిద్రులైపోతారని చెప్పే వీడియోలలాంటివి సోషల్ మీడియా లో విపరీతం అయిపోతున్నాయి. వీటి వలన ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు. కనుక వీటిని గురించి దయచేసి నమ్మకండి. అదిగో పులి అంటే ఇదిగిదిగో తోక అన్న చందంగా ఉంటుంది వారి విశ్లేషణలు. కనుక దయచేసి నిర్భయంగా ఉండండి.

మరికొన్ని చోట్ల గ్రహణ ప్రభావం తొలగటానికి గాను శేరుంబావు బియ్యం దానం చేయండని, లేకపోతే సమస్యలు చుట్టు ముడతాయని చెప్పేవారు కూడా ప్రస్తుత రోజులలో అధికమయ్యారు. కనుక ఈ సంపూర్ణ చంద్ర గ్రహణ ప్రభావం దారుణాతి దారుణంగా ఉండనే ఉండదు. ద్వాదశ రాశులలో జన్మించిన వారు కొన్ని కొన్ని జాగ్రత్తలను, కొన్ని కొన్ని అంశాలలో కొన్ని కొన్ని రోజులలోనే తీసుకుంటే చాలు.

ఎందుకంటే మనం చేసే ఆలోచనల వలెనే ఆటంకాలు, అవరోధాలు ఏర్పడుతుంటాయి. ఆలోచనలు లేవనుకోండి... ఎట్టి అవరోధాలు ఉండవు. ఆటంకాలు అసలు కలగవు. మనం ఊహించినది ఊహించినట్లుగా జరగకపోతే ఆటంకాలు వస్తున్నాయి అని భావిస్తాం. .మన ఆలోచనలు అసలు సక్రమంగా ఉన్నాయా లేవా ఎలా చెప్పగలము. ప్రతి వ్యక్తి  తన ఇష్టాన్ని బట్టి, తనకి ఉన్నటువంటి అనుకూలతలని బట్టి, తనకి ఉండేటువంటి ప్రయోజనాలను బట్టి ఆలోచనలను చేస్తుంటాడు. ఇక్కడ ప్రతి ఆలోచనలోను వ్యక్తి ఒక్క స్వార్థ ప్రయోజనాలు దోగాడుతుంటాయి. స్వార్థం అనేది తొంగి చూస్తుంటుంది.

కనుక ఇలాంటి పరిస్థితులలో ప్రతి వ్యక్తి ఉంటున్నటువంటి సందర్భములోనే.. మనః కారకుడైన చంద్రుడికి గ్రహణం జరుగుతున్నది కనుక... మన ఆలోచనలు, మన విశ్లేషణలు, మన అంతరంగము అతిగా ఆశించటం జరుగుతుంటుంది. వీటి వలన విఫలాలు, వైఫల్యాలు కలగటం.. నిరాశకు లోను కావటము వెంట వెంటనే జరుగును. అందుచేత ఆటంకాలు రాకుండా మన ఆలోచనలు స్థాయిని దాటి పోకుండా సరియైన మోతాదులో ఉంటూ ఉండాలంటే ప్రత్యేక సమయాలలోనే 27 నక్షత్రాల వారు జాగ్రత్తలంటూ తీసుకోవాలి.

కనుక ఈ ధనుస్సు రాశిలో శని సంచారమున్న మొత్తం సమయంలో వరుసగా మూడు సంపూర్ణ చంద్ర గ్రహణాలు  వస్తున్నాయి కాబట్టి వీటి ప్రభావం 2018 జనవరి 31 నుంచి 2019 జులై 21 వరకు ఉండును. కాబట్టి ఒక్కోరాశి వారు ఏ ఏ అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.. జాగ్రత్తలు తీసుకోవాలంటే మన మనస్సు మన ఆధీనంలోనే ఉండాలి. మరి మన ఆధీనంలో ఉండాలంటే ఉండగలుగుతుందా ?.. .ఉండలేదు. కనుక గ్రహణ ప్రభావం 76 నిముషాల పాటు ఉంది కనుక 27 నక్షత్రాల వారి కొన్ని ప్రత్యేక సమయాలలో.. .కొన్ని ప్రత్యేక పదార్థాలను ఆహార రూపంలో తీసుకున్నప్పుడు మనస్సును నియంత్రించవచ్చును. కాబట్టి తదుపరి పోస్టింగ్ లో చంద్ర గ్రహణ సమయాలతో పాటు.. వరుసగా ఒక్కొక్క రాశి వారు ఏ ఏ రోజులలో ఎలాంటి అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలో లోతైన విశ్లేషణతో తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 


 - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.